breaking news
united heat
-
చిరంజీవికి రాజమండ్రిలో సమైక్యసెగ
-
చిరంజీవికి రాజమండ్రిలో సమైక్యసెగ
రాష్ట్ర విభజనను అడ్డుకునే ప్రయత్నాలు చేయకుండా, కాంగ్రెస్ అధిష్ఠానం అడుగులకు మడుగులొత్తుతున్న కేంద్ర మంత్రి చిరంజీవికి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో సమైక్య సెగ గట్టిగా తగిలింది. రాజమండ్రిలోని కంబాల చెరువు ప్రాంతంలో చిరంజీవి కాన్వాయ్‌ని న్యాయవాద జేఏసీ సభ్యులు అడ్డుకున్నారు. జై సమైక్యాంధ్ర అని నినాదాలు చేసుకుంటూ వాహనంపైకి న్యాయవాదులు దూసుకెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకుని, చిరంజీవి కాన్వాయ్ వెళ్లేందుకు మార్గం సుగమం చేశారు. దాంతో గోదావరి గట్టు మీద దివంగత నటుడు ఎస్వీ రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు చిరంజీవి వెళ్లారు. సినీ రంగానికి ఎస్వీ రంగారావు చేసిన సేవలు మరువలేనివని ఆ సందర్భంగా చిరంజీవి చెప్పారు. అంతకుముందు ఆయన ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకుళపు శివరామ సుబ్రహ్మణ్యాన్ని పరామర్శించారు. తర్వాత కడియం వెళ్లి, అక్కడ ఎకో టూరిజం పార్కును ప్రారంభించారు. అక్కడి నుంచి కోటిపల్లిలో టూరిజం మెగా సర్కిల్ ప్రారంభానికి వెళ్లారు. చివరి క్షణం వరకు సమైక్యాంధ్ర కోసం పోరాడతానని చిరంజీవి చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి కేంద్ర మంత్రి పదవిలో ఉండి మీరు చేసిందేమిటని ఈ సందర్భంగా న్యాయవాదులు చిరంజీవిని నిలదీశారు. అక్కడుండి ఏమీ చేయకుండా ఇక్కడికొచ్చి ప్రజలకు ఏం చెబుతారంటూ మండిపడ్డారు. రాష్ట్ర విభజన ప్రక్రియపై కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండటంతో సీమాంధ్ర ప్రాంతం అట్టుడుకుతోంది. ఇప్పటికే ప్రభుత్వోద్యోగులు సమ్మెలో ఉండగా జాతీయ రహదారుల దిగ్బంధానికి సైతం వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. -
కేంద్ర మంత్రి జేడీ శీలంకు సమైక్య సెగ
తెనాలిఅర్బన్/రూరల్, న్యూస్‌లైన్: సమైక్య సెగ కేంద్ర మంత్రి జేడీ శీలంను తాకింది. సమైక్యవాదులు ఆయనతో గంటసేపు వాగ్వాదానికి దిగారు. సమైక్యవాదివైతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. క్యాబినెట్లో ఉండి కేంద్రానికి సమైక్యవాదుల మనోభావాలను వివరిస్తానని మంత్రి చెప్పారు. అయినా శాంతించని సమైక్యవాదులు ఆయనను ఘెరావ్ చేశారు. స్థానిక జేఎంజే మహిళా కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి జేడీ శీలం శనివారం తెనాలి వచ్చారు. మంత్రి కళాశాలలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న సమైక్యవాదులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళనకారులను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు గేటు ముందు బైటాయించారు. జేడీ శీలం రాజీనామా చేయాలి.. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతు పలకాలంటూ నినాదాలు చేశారు. అక్కడే కబడ్డీ ఆడుతూ రాస్తారోకో చేశారు. మధ్యాహ్నం 12గంటల నుంచి ఆందోళన ప్రారంభంకాగా, 1.15 గంటల సమయంలో బయటకు వచ్చిన మంత్రిని దాదాపు గంటసేపు సమైక్యవాదులు నిలువరించారు. కేంద్రంలో జరిగే పరిణామాలు తెలియవా? రాష్ట్రం అగ్నిగుండంగా మారుతున్నా చలనం లేదా? ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు చేస్తున్న ఆందోళనలు పట్టవా అంటూ నిలదీశారు. రాష్ట్రం నష్టపోయే తీరును అధిష్టానానికి వివరించలేరా? అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. రాష్ట్రవిభజనపై నిర్ణయం చెప్పాలని, సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటించాలని పట్టుబట్టారు. సమైక్యాంధ్ర జేఏసీ డివిజన్ కన్వీనర్ అన్నాబత్తుని సదాశివరావు, కోఆర్డినేటర్ షేక్ జానీబాషా, కో కన్వీనర్ గళ్లా చందు, ఏపీఎన్జీవో అసోసిసియేషన్ అధ్యక్షుడు బి.కృష్ణమోహన్ వాదనలను పూర్తిగా విన్నారు. మిన్నంటిన సమైక్య నినాదాలు..అనంతరం కేంద్రమంత్రి జేడీ శీలం మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలు కోరేటపుడు, ఉద్యమంలో పాల్గొనే ఉద్యోగులు ఎందుకు రాజీనామా చేయరని ప్రశ్నించండంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉద్యోగులు 60 ఏళ్ల పదవీకాలానికి రాజీనామా చేస్తే, కేవలం ఆరునెలలు కేంద్రంలో కొనసాగే మీరు వారి జీవితాలకు భరోసా ఇవ్వగలరా అంటూ గళ్లా చందు నిలదీశారు. ఈ సమయంలో సమైక్యాంధ్ర నినాదాలు మిన్నంటాయి. అనంతరం జేడీ శీలం మాట్లాడుతూ మంత్రుల రాజీనామాలతో ఒరిగేదేమీ లేదన్నారు. రాజీనామా చేస్తే క్యాబినెట్లో జరిగే విషయాలు తెలియవని, కేంద్రంలో ఉండి, సమైక్యవాదుల ప్రతినిధిగా ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని చెప్పి, కళాశాలలోకి వె ళ్లిపోయారు. కేంద్రమంత్రి వెంట వచ్చిన సీమాంధ్ర జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ ఎన్.శామ్యుల్ మౌనంగా ఉండడాన్ని ఆక్షేపించారు. మంత్రిని మీరెందుకు నిలదీయరంటూ శామ్యుల్పై ప్రశ్నలవర్షం కురిపించారు. మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని నాయకులు ఆయనను ఘెరావ్ చేసి వెనుదిరిగారు. ఆందోళనలో ఏపీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు కేవీ గోపాలకృష్ణ, హరిప్రసాద్, సుబ్రహ్మణ్యం, వ్యాపార జేఏసీ నాయకులు నంబూరు నరేంద్ర, అబ్దుల్ వహీద్, కె.శ్రీనివాస్, పసుమర్తి రఘు, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.