breaking news
TTDP president L Ramana
-
టీఆర్ఎస్లో చేరిన ఎల్. రమణ
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్లోకి చేరారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం అందజేశారు. కాగా, టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు. -
ఎల్ రమణ టీఆర్ఎస్లో చేరికకు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు ముహుర్తం ఖరారైంది. రేపు టీఆర్ఎస్ సభ్యత్వాన్ని ఎల్. రమణ తీసుకోనున్నారు. రమణకు టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవ్వనున్నారు. ఈ నెల 16న సీఎం కేసీఆర్ సమక్షంలో టీటీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్లో చేరనున్నారు. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పార్టీకి గుడ్‌బై చెప్తూ టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను జూలై 9 న శుక్రవారం మీడియాకు విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువగా రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే భావనతో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నానని లేఖలో పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా నా ఎదుగుదలకు సహకరించిన హృదయపూర్వక ధన్యవాదాలు’అని చంద్రబాబుకు పంపిన ఆ లేఖలో ఎల్.రమణ తెలిపారు. -
కేసీఆర్.. ద్రోహానికి ప్రతిరూపం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నయా నిజాంగా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్. రమణ అన్నారు. ఉద్యమవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో కేవలం కేసీఆర్ కుటుంబ పెత్తనమే నడుస్తోం దని ప్రజలకు అర్థమయిందని, అందుకే టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం కోసం ఎక్కడకు వెళ్లినా ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సీపీఐలతో కలసి తాము ఏర్పాటు చేస్తున్న మహాకూటమి పవర్, పైసలు, పదవుల కోసం కాదని, ఉద్యమ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చి రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించడమే తమ ప్రధాన ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై రమణ మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ వివరాలివి... సాక్షి: తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణ వ్యతిరేక పార్టీ అనే భావన గత ఎన్నికల సందర్భంలో కనిపించింది. ఇప్పుడు మీ పార్టీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? రమణ: తెలుగుదేశం పార్టీ... తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదల గుండెల్లో ఉన్న పార్టీ. గత ఎన్నికల సందర్భంగా టీడీపీ నాయకత్వాన్ని బలహీనపర్చాలనే దురుద్దేశ, దుర్మార్గపు ఆలోచనతో కేసీఆర్ కావాలని విష ప్రచారం చేశారు. తెలంగాణ వచ్చాక జరిగిన ఎన్నికల్లోనే టీడీపీ–బీజేపీ కూటమికి 20 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో ప్రజలు విజయం కట్టబెట్టారు. కులమతాలు, ప్రాంతాలను అడ్డుపెట్టుకొని కేసీఆర్ చేసిన కుట్రలను తిప్పికొట్టారు. మాపట్ల తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ సదభిప్రాయం ఉంది. టీడీపీకి ఓటేస్తే అమరావతికి వెళ్తుందని టీఆర్ఎస్ నేతలంటున్నారు కదా? తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడమే కేసీఆర్ పని. పబ్బం గడుపుకుని ద్రోహం చేయడానికి ప్రతిరూపం కేసీఆర్, ఆయన కుటుంబం. ఇద్దరు ఎంపీలను పెట్టుకుని తామే తెలంగాణను తెచ్చినట్లు అభూతకల్పనలు సృష్టించారు. ఉద్యమ అమరవీరుల త్యాగాలను తన ఖాతాలో వేసుకున్నారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్కు అధికారమిస్తే దాన్ని కుటుంబానికి అన్వయించుకున్నారు. ఈ నయా నిజాం కేసీఆర్‌కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు 60 నెలల అధికారమిస్తే తన తరఫున గెలిచిన 63 మందితోపాటు మరో 30 మంది దొంగలను కలుపుకొని దొంగల ముఠానాయకుడిగా వ్యవహరించిన కేసీఆర్ ఇప్పుడు కాడి ఎత్తేయగానే జనం తిరగబడుతున్నారు. ఇవన్నీ జీర్ణించుకోలేకే వాళ్లకి ఓటేస్తే అమరావతికి, వీళ్లకి ఓటేస్తే ఢిల్లీకి అంటూ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. మమ్మల్ని చూస్తే ఆయనకు లాగులు తడుస్తున్నాయి. ప్రతిపక్షాలు పనికిరావనే టీఆర్ఎస్ విమర్శలకు మీ సమాధానం? తెలంగాణను ఈ దేశంలో అంతర్భాగంగా కేసీఆర్ భావించట్లేదు. ఇదో ఫెడరల్ వ్యవస్థ అని, దేశంలో రాజ్యాంగం ఉందని అనుకోవట్లేదు. అందుకే తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలనుకుంటున్నారు. ఇది భారత రాజ్యాంగం. ప్రతిపక్షం పనికిరానిదో, పనికి వచ్చేదో ప్రజలే నిర్ణయిస్తారు. ఇప్పుడు పెనం చల్లారిపోయింది. కేసీఆర్ రొట్టె కాలే పరిస్థితి లేదు. తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు. పెన్నుల మీద మట్టి కప్పితే గన్నులై మొలకెత్తిన సమాజం ఇది. ఇక్కడ కేసీఆర్ పీట పునాదులు కదులుతున్నాయి. కేసీఆర్ రూపంలో పట్టిన శని పోగొట్టే రోజులు వస్తున్నాయి. కూటమిలో భాగంగా టీడీపీ ఎన్ని స్థానాల్లో పోటీచేయనుంది? మేము సీట్లు, పదవుల కోసం పాకులాడట్లేదు. 0.02 శాతమే టీడీపీ ఉందని హేళనగా మాట్లాడిన వ్యక్తికి కుక్కకాటుకు చెప్పుదెబ్బ కొట్టాలనే వ్యూహంతోనే ముందుకెళుతున్నాం. సీట్ల కేటాయింపుల్లో పట్టువిడుపులుంటాయి. ఈసారి ఎన్నికల్లో మీరు పోటీ చేస్తారా? 1994 నుంచి 2014 ఎన్నికలకు 9 ఎన్నికల్లో పోటీ చేశా. జీవన్‌రెడ్డి, చొక్కారావు, ఎమ్మెస్సార్, విద్యాసాగర్‌రావు, కేసీఆర్ లాంటి నాయకులను ఎన్నికల్లో ఎదుర్కొన్నా. నేను పోటీ చేయాలా వద్దా... చేస్తే ఎక్కడి నుంచి అనేది పార్టీ నిర్ణయిస్తుంది. త్యాగాలకు ఎప్పుడూ మొదలు నిల్చునే వ్యక్తిని నేను. కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో చేరతారా? రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసే కూటములన్నీ విజయవంతం కావు. ఇది దేశ రాజకీయ చరిత్ర చెబుతోంది. కానీ మా కూటమి శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాం. గత 45 రోజులుగా ఇబ్బందుల్లేకుండానే చర్చలు జరుపుకుంటున్నాం. మేం ప్రభుత్వంలోకి రావాలి. కేంద్ర ప్రభుత్వ పునాదులు కదలాలి. గ్రామ సర్పంచ్ నుంచి లోక్‌సభ స్పీకర్ వరకు పదవులను నిర్వహించిన చరిత్ర టీడీపీది. మాకు అవకాశమిస్తే సమర్థత నిరూపించుకున్నాం. బాధ్యతలు తీసుకునే సందర్భం వస్తే వెనుకాడాల్సిన పరిస్థితి ఉండదు. కూటమి కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రాధాన్యాంశాలేంటి? తెలంగాణ ఉద్యమం స్వయం పాలన, సబ్బండ వర్ణాల సంక్షేమం, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడ్డాక అవేమీ కనిపించట్లేదు. కేసీఆర్ కుటుంబంలోనే ఒకరు ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు, ఒక ఎంపీ, ఆయన బంధువులకు పదవులు వచ్చాయి. అందుకే పారదర్శకతో కూడిన సమాజ సమతౌల్యత కోసం పీపుల్స్ ఎజెండా రూపొందిస్తున్నాం. ప్రతి రైతుకు రూ. 2 లక్షల ఏకకాల రుణమాఫీ, తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు, 3 నెలల్లోనే 20 వేల పోస్టులతో మెగా డీఎస్సీ, రూ. లక్షకు తగ్గకుండా మహిళా సంఘాలకు రుణాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, విద్యావకాశాలను మెరుగుపర్చడం, కార్మిక, కర్షక, విద్యార్థి, నిరుద్యోగులు, అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు అందేలా కార్యాచరణ రూపొందించడం మా కనీస ఉమ్మడి ప్రణాళికలో భాగం. టీఆర్ఎస్కు ఎందుకు ఓటేయకూడదు.. కూటమికే ఎందుకు ఓటేయాలంటే మీరేం చెప్తారు? దళితుడిని సీఎం చేస్తానని ద్రోహం చేసిన వ్యక్తి కేసీఆర్. ఆయన కుటుంబమే పెత్తనం చేస్తుందని ప్రజలకు అర్థమైపోయింది. రూ. 8 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం చేశారో అర్థం కావట్లేదు. కోటి ఎకరాలకు నీరన్నారు. లక్ష ఎకరాలకూ రాలేదు. భగీరథ నీళ్ల ఆనవాళ్లు లేవు. లక్ష ఉద్యోగాలన్నారు. ఇంకో లక్ష ఖాళీ అయ్యాయి. దళితులకు మూడెకరాల భూ పంపిణీ చేయలేదు. డబుల్ బెడ్రూం ఇళ్లు, కేజీ టు పీజీ విద్య, మైనారిటీ, గిరిజనులకు రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఇవన్నీ చెప్పి చేయని మోసగాడు కేసీఆర్. ఆయనకు మళ్లీ అధికారమిస్తే మోసం చేస్తారే తప్ప న్యాయం చేయడు. మేం మెరుగైన పాలన అందిస్తాం. అందుకే మాకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నాం. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై ఏర్పడ్డ టీడీపీ ఇప్పుడు అదే పార్టీతో కలసి కూటమిని ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఎలా సమర్థించుకుంటారు? నాడు జాతీయ కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని ఎదుర్కొని రాజకీయాల్లో సమన్యాయం కావాలనే ఆలోచనతో ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం. ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్లలోని మెజారిటీ నేతలు టీడీపీలో పుట్టినవారే. 0.02 శాతం ఉన్నామని తెలుగుదేశం నేతలను కేసీఆర్ హేళన చేశాడు. కోదండరాం సభలకు 500 మంది వస్తారా అని ఎద్దేవా చేశాడు. కమ్యూనిస్టులెక్కడున్నారని ప్రశ్నించాడు. అందుకే వారితో కలసి ఫ్రంట్ ఏర్పాటు చేసి ముందుకెళ్లాలనుకుని మేమే చొరవ తీసుకున్నాం. మా మూడు పార్టీలతో కలసి పనిచేసేందుకు కాంగ్రెస్ ముందుకొచ్చింది. మేం కాంగ్రెస్‌ను అడగలేదు. కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతమొందించి పీడిత ప్రజల గొంతుక కావాలని, వారి అరణ్య రోదనకు వేదిక కావాలనే మహాకూటమిని ఏర్పాటు చేశాం. ఎన్నికల ప్రచారాన్ని మీరెప్పుడు మొదలుపెడతారు? ఎన్నికల కమిషన్ చెప్పాల్సిన విషయాలను, పోలింగ్ జరిగే తేదీలను కూడా చెప్పి చీవాట్లు తిన్న మొదటి సీఎంగా కేసీఆర్ చరిత్ర సృష్టించారు. ఆయన వేసే ట్రాప్‌లో పడే పిచ్చోళ్లం కాదు. ఆయనే ఈసారి మా ట్రాప్‌లో పడ్డారు. ఎప్పుడు అభ్యర్థులను ప్రకటించాలి... ఎప్పుడు ప్రచారానికి వెళ్లాలన్నది మాకు బాగా తెలుసు. మా ఎన్నికల ప్రచారాన్ని ఖమ్మంలో ఇప్పటికే బాలకృష్ణ ప్రారంభించారు. పార్టీ అధినేత హోదాలో చంద్రబాబు కూడా ప్రచారానికి వస్తారు. ఎలక్షన్, పోల్ మేనేజ్మెంట్లో మేమే నంబర్‌వన్. -
‘ప్రగతిభవన్‌ను ప్రజా ఆస్పత్రిగా మారుస్తాం’
సాక్షి, జగిత్యాల : అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్‌ను ప్రజా ఆసుపత్రిగా మారుస్తామని టీడీపీ తెలంగాణ ప్రెసిడెంట్ ఎల్.రమణ అన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబ పాలన నుంచి కాపాడేందుకే ‘మహా కూటమి’ ఏర్పడిందని చెప్పారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ నియంతృత్వ పాలన విముక్తికై పడిన తొలి అడుగే మహా కూటమి అని వ్యాఖానించారు. ‘జగిత్యాల అంటేనే జీవన్.. జీవన్ అంటేనే జగిత్యాల’అని జీవన్‌రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. జగిత్యాల పేరును తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు తెలిసేలా జీవన్‌రెడ్డి పనిచేశారని అన్నారు. -
ప్రజలకు ఒరిగిందేమి లేదు..
టవర్‌సర్కిల్: తెలంగాణ ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా నాలుగేళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ టీడీపీ నియోజకవర్గ శాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మొదటగా కలెక్టరేట్ క్రాసింగ్ నుంచి ర్యాలీగా తరలివచ్చి కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సుమారు గంటపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అద్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన హామీలు నాలుగేళ్లు దాటినా అమలుకు నోచుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. లక్ష ఉద్యోగాల భర్తీ మిథ్యగా మారిందని, డీఎస్సీ ప్రకటనలకే పరిమితమైందన్నారు. పరిశ్రమల మూసివేత, అసంఘటిత రంగాలపై నిర్లక్ష్యం, ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపివేతతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక నాల్గుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీగానే ఉందన్నారు. వేల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. చేనేత కార్మికుల కోసం ఇవ్వాల్సిన మూలధనం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుల మూడెకరాల భూపంపిణీ బూటకంగా మారిందని విమర్శించారు. డబుల్‌బెడ్‌రూమ్‌కు మోక్షం లేకుండా పోయిందని, 22 లక్షల కుటుంబాలకు ఎప్పుడు ఇండ్లు నిర్మిస్తారని ప్రశ్నించారు. భూప్రక్షాళన పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాసుపుస్తకాల్లో తప్పులు, అన్నదమ్ముల మధ్య కీచులాటలు తప్ప ఒరిగిందేమీ లేదన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన నడుస్తోందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు ఒక్కని నర్సింహులు, అంబటి జోజిరెడ్డి, కళ్యాడపు ఆగయ్య, ఐల్నేని సాగర్‌రావు, అక్కపాక తిరుపతి, నసీర్, గుర్రం వెంకటేశ్వర్లు, మాదాడి శ్రీనివాస్‌రెడ్డి, కాశీనాథం, షకీల్‌అహ్మద్, ఆడెపు కమలాకర్, దామెర సత్యం, కరుణాకర్‌రెడ్డి, శివరామకృష్ణ, దాసరి ప్రవీణ్, శంకర్, పుల్లాచారి, కిషోర్, రాజేశం, సలీం, రమేశ్, వాణి, ఈశ్వరి, అనసూర్యనాయక్, తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ నిజ స్వరూపం చూపిస్తున్నారు..
సాక్షి, జగిత్యాల : అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్ నిజస్వరూపం చూపుతున్నారని తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ విమర్శించారు. అసెంబ్లీలో జరుగుతున్నపరిణామాలపై ఆయన జగిత్యాలలో గురువారం మీడియాతో మాట్లాడుతూ...‘ కేసీఆర్ దళితులను దగా చేస్తున్నారు. టీఆర్ఎస్ అనుచరుల కోసమే ప్రాజెక్టుల అంచనాలు పెంచారు. అడ్డగోలు భూసేకరణ చేసి రైతులను మోసం చేశారు. ప్రగతి భవన్ పైరవీ కారులకు అడ్డాగా మారింది. మంత్రులకు అపాయింట్మెంట్ దొరకదు కానీ, దొంగలకు మాత్రం దొరుకుతుంది’ అన్నారు. -
టీటీడీపీ అడ్‌హక్ కమిటీ కన్వీనర్ల నియామకం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 29 జిల్లాలకు అడ్‌హక్ కమిటీ కన్వీనర్లను నియమించినట్లు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఓ ప్రకటనలో తెలియజేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకాలు జరిపినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా కన్వీనర్ల వివరాలు.... ఆదిలాబాద్ - యూసుఫ్ అద్వానీ నిర్మల్ - లోలం శ్యాం సుందర్ మంచిర్యాల - బోడ జనార్దన్ కుమ్రుబీం ఆసిఫాబాద్ - అబ్దుల్ కలాం పెద్దపల్లి - విజయ రమణారావు కరీంనగర్ - కల్వంపల్లి సత్యనారాయణ. సిరిసిల్ల - నర్సింగ్ రావు జగిత్యాల - సాగర్ రావు నిజామాబాద్ - అరికెల నర్సారెడ్డి కామారెడ్డి - శుభాష్ రెడ్డి సంగారెడ్డి - శశికళ సిద్ధిపేట - ప్రతాప్ రెడ్డి మెదక్ - బట్టిజగపతి రంగారెడ్డి - సామా రంగారెడ్డి మేడ్చల్ - జంగయ్య యాదవ్ వికారాబాద్ - శుభాష్ యాదవ్ మహబూబ్ నగర్- నర్సింహులు వనపర్తి - బి రాములు గద్వాల- రామచంద్రారెడ్డి నాగర్ కర్నూల్- శ్రీనివాస రెడ్డి నల్గొండ - బిల్యా నాయక్ స్యూర్యాపేట- రమేష్ రెడ్డి యాదాద్రి- సందీప్ రెడ్డి ఎలిమినేటి జనగాం - మధుసుదన్ రెడ్డి వరంగల్ అర్బన్ - ఈగ మల్లేషం వరంగల్ రూరల్ - శ్రీనివాస చారీ భూపాలపల్లి - గండ్ర సత్యనారాయణ హైదరాబాద్ - ఎంఎన్ శ్రీనివాస్ మహబూబాబాద్- ఉదయ్ చందర్.