Travel industries
-
60+ సాహస యాత్ర!
అరవైల్లో పడ్డాక ఇక జీవితం అయిపోయిందనే రోజులు పోయాయ్! అమ్మమ్మలు.. తాతయ్యలు కూడా ఇప్పుడు అంటార్కిటికా నుంచి అగ్నిపర్వతాల దాకా... యూరప్ నుంచి జపాన్ దాకా.. ప్రపంచాన్ని చుట్టేసేందుకు సై అంటున్నారు. అంతేకాదు స్కైడైవింగ్ మొదలు స్కీయింగ్.. శాండ్ సర్ఫింగ్.. ఎలాంటి సాహసాలకైనా తగ్గేదేలే అంటున్నారు. అడ్వెంచర్ టూర్ల విషయంలో యువతతో పోటీ పడుతుండటంతో బేబీ బూమర్స్ (1946 నుంచి 1964 మధ్య పుట్టిన వారు) పర్యాటకం ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉంది. – సాక్షి, స్పెషల్ డెస్క్జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి వయసుతో పనేముందని నిరూపిస్తున్నారు బేబీ బూమర్స్. కుటుంబ బాధ్యతలతో తాము కోరుకున్న ఆనందాలను దూరం చేసుకున్న వారెందరో ఉంటారు. అయితే, అరవైల్లో మళ్లీ నలభై వచ్చింది.. అంటూ ప్రపంచ పర్యటనలకు సైతం సిద్ధమైపోతున్న వారు ఇటీవల బాగా పెరుగుతున్నారు. దీంతో ట్రావెల్ పరిశ్రమ కూడా ప్రత్యేక ప్యాకేజీలతో మరింత ప్రోత్సహిస్తోంది. సెగ్జాజెనేరియన్స్ (60–69 ఏళ్ల వయసు), సెప్టువాజెనేరియన్స్ (70–79 ఏళ్ల వయసు) ఆక్టాజెనేరియన్స్ (80–89 ఏళ్ల వయసు) ఇలా అన్ని వయసుల వారికీ ట్రావెల్ కంపెనీలు అనువైన ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఏ సాహసానికైనా రెడీకేవలం ప్రపంచ యాత్రలే కాదు అడ్వెంచర్ ట్రావెల్‌కు కూడా బేబీ బూమర్స్ ఎగిరి గంతేస్తున్నారు. బుకింగ్స్ డాట్ కామ్ ‘ట్రావెల్ ప్రిడిక్షన్స్–2025’ సర్వే ప్రకారం అత్యంత సాహసంతో కూడిన యాక్టివిటీలకు మొగ్గు చూపుతున్న బేబీ బూమర్స్ 30 శాతానికి ఎగబాకారు. 2024లో ఈ సంఖ్య 11 శాతం మాత్రమే. వయసు గురించి ఆలోచించకుండా ప్రతి నలుగురు బేబీ బూమర్స్‌లో ఒకరు ఇలాంటి అడ్వెంచర్లంటే మక్కువ చూపుతున్నట్లు సర్వేలో వెల్లడైంది.ప్రత్యేక డిస్కౌంట్లుసీనియర్ సిటిజన్స్ విదేశీ పర్యటన బుకింగ్స్‌లో ఏటా 20 శాతం వృద్ధి నమోదవుతున్నట్లు ట్రావెల్ పోర్టల్ ఈజ్‌మైట్రిప్ సీఈఓ రికాంత్ పిట్టీ పేర్కొన్నారు. 2021తో పోలిస్తే బుకింగ్స్ ఏకంగా మూడు రెట్లు పెరిగాయన్నారు. కాగా, 60 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేక డిస్కౌంట్లనూ ఈ సంస్థ అందిస్తోంది. రిలాక్స్ అయ్యేందుకు కేరళ బ్యాక్ వాటర్స్, గోవా బీచ్‌లను ఎంచుకుంటున్నారు. ఇక ప్రకృతిలో సేద తీరేందుకు ఈశాన్య భారతాన్ని ఎక్కువగా చుట్టేస్తున్నారు. చలో అంటార్కిటికా...ఉత్తర ధ్రువం వద్ద నార్తర్న్ లైట్స్, అంటార్కిటికా క్రూజ్ యాత్రలకూ ఇటీవల ఆసక్తి పెరిగిందని సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ స్పెషలిస్ట్ సంస్థ ‘కరేవాయేజ్’ పేర్కొంది. సంప్రదాయేతర, సాహసోపేతమైన గమ్యస్థానాలకు మొగ్గు చూపేవారు 2021తో పోలిస్తే 2024లో మూడింతలు పెరిగారని చెప్పింది. ఏటా 10వేల మందికి పైగా డిమాండ్ ఉన్నప్పటికీ, మంచి పర్యాటక అనుభూతిని అందించే లక్ష్యంతో తాము అంతకు మించి బుకింగ్స్ అనుమతించడం లేదని కంపెనీ ఫౌండర్ షెఫాలీ జైన్ మిశ్రా తెలిపారు. గతేడాది ఈ సంస్థ 10 మంది సీనియర్ సిటిజన్స్ బృందంతో 10 రోజుల అంటార్కిటికా ట్రిప్ నిర్వహించింది. జపాన్ చెర్రీ బ్లోసమ్స్, ఫిన్లాండ్ వింటర్ ల్యాండ్‌స్కేప్స్, నార్వే నార్తర్న్ లైట్స్, ఐస్లాండ్స్ క్రూజ్ యాత్రలు, యూరప్ రివర్ సెయిలింగ్స్ వంటి ప్రత్యేక టూర్లనూ ఈ సంస్థ అందిస్తోంది. ఆర్థికంగా స్థిరపడటం ప్లస్ఖర్చులన్నీ పోను అదనంగా వెచ్చించగలిగే ఆదాయం దండిగా ఉండటం, కుటుంబ బాధ్యతలన్నీ తీరిపోవడంతో ప్రపంచాన్ని చుట్టిరావాలన్న తమ కోరికలను తీర్చుకోవడానికి సీనియర్ సిటిజన్స్ ప్రాధాన్యమిస్తున్నారని పిట్టీ చెప్పారు. ‘రిటైర్మెంట్ తర్వాత తగినంత సమయం దొరకడంతో కొత్త ప్రదేశాలను చుట్టొచ్చేందుకు వీలవుతోంది. 51 శాతం మంది బేబీ బూమర్స్, 39 శాతం మంది సైలెంట్ జెనరేషన్ (80 ఏళ్ల పైబడిన వారు) జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన టూర్లకు మొగ్గు చూపుతున్నారు’ అని వివరించారు. కాగా, విమానాలు, రైలు చార్జీల్లో డిస్కౌంట్లు.. ఎయిర్‌పోర్టుల్లో ర్యాంపులు, ఎలివేటర్ సదుపాయాలు ఉండటం వల్ల వారు పర్యటనలకు ముందుకొస్తున్నారని భారతీయ టూరిజం, హాస్పిటాలిటీ అసోసియేషన్ల ఫెడరేషన్ (ఎఫ్ఏఐటీహెచ్) బోర్డు సభ్యుడు, టూర్వాలా ఎండీ వేద్ ఖన్నా అభిప్రాయపడ్డారు. నిపుణులైన టూర్ గైడ్లు, జర్నీలో వైద్యుల తోడ్పాటు వంటి సదుపాయాలతో ప్రత్యేకంగా ప్యాకేజీలను తీర్చిదిద్దుతుండటం వల్ల కూడా డిమాండ్ పెరిగిందన్నారు.అవీ ఇవీసీనియర్స్ మక్కువ చూపుతున్న ప్రఖ్యాత ప్రపంచ నగరాలు: టోక్యో, సియోల్, సింగపూర్, లండన్ ప్రఖ్యాత పుణ్య క్షేత్రాలు: వారణాసి, అయోధ్య, హరిద్వార్, రిషికేష్, రామేశ్వరం, పూరి, తిరుపతిసీనియర్ సిటిజన్స్ ట్రావెల్ బుకింగ్స్‌లో వృద్ధి: 20%2023లో ప్రపంచవ్యాప్తంగా సీనియర్ సిటిజన్స్ ట్రావెల్ ఇన్సూరెన్స్ మార్కెట్ విలువ: 3.2 బిలియన్ డాలర్లు (రూ.27వేల కోట్లు) (2032 నాటికి ఇది 16.7 బిలియన్ డాలర్లకు చేరుతుందనేది అలైట్ మార్కెట్ రీసెర్చ్ అంచనా) -
దేశీ ఎయిర్‌లైన్స్‌లో అవకాశాలపై ఐబీఎస్ ఫోకస్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ట్రావెల్ పరిశ్రమకు సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్విస్ (సాస్) సేవలు అందించే ఐబీఎస్ సాఫ్ట్వేర్ .. భారత ఎయిర్‌లైన్స్ రంగంలో, లాయల్టీ ప్రోగ్రామ్స్ విభాగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంపై దృష్టి పెడుతోంది. తాము ప్రస్తుతం భారత్‌లో ఎయిర్ కార్గో నిర్వహణ విభాగంలో, అలాగే ఎయిరిండియాకి స్టాఫ్ ట్రావెల్ మేనేజ్మెంట్కి సంబంధించి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందిస్తున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు, చైర్మన్ వీకే మాథ్యూస్ తెలిపారు. మిగతా పోటీ సంస్థలతో పోలిస్తే తమ ఉత్పత్తులు కాస్త ఖరీదైనవిగానే ఉంటాయి కాబట్టి తగిన భాగస్వామిని ఎంచుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ధరకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే భారత మార్కెట్లో ఐటీని విలువను చేకూర్చేదిగా కాకుండా ఖర్చుగానే పరిగణిస్తారని, కానీ ప్రస్తుతం ఆ ధోరణి క్రమంగా మారుతోందని మాథ్యూస్ చెప్పారు. ఇప్పుడు ధరే ప్రాతిపదికగా ఉంటున్నప్పటికీ ఎకానమీ పురోగమించే కొద్దీ విలువకు ప్రాధాన్యత పెరుగుతుందన్నారు. మిగతా మార్కెట్లలోలాగా భారత్, చైనా మార్కెట్లలో తాము అంత విజయం సాధించలేకపోయామని అంగీకరించిన మాథ్యూస్ భారత మార్కెట్‌కి గణనీయంగా వృద్ధి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు వృద్ధి బాటలో కొనసాగుతుందన్నారు. కస్టమర్లతో మెరుగైన సంబంధాలు, అత్యుత్తమ టెక్నాలజీ సిస్టంలు, ట్రావెల్ కామర్స్ మొదలైనవి పరిశ్రమలో కీలక ట్రెండ్స్‌గా ఉంటున్నాయన్నారు. -
పర్యాటకుల ‘రివెంజ్ టూరిజం’
సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో కొత్త ప్రయాణ ఒరవడులు కనిపిస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి సమయంలో విధించిన నిబంధనలు, పరిమితుల సడలింపులతో ప్రయాణాలకు డిమాండ్ పెరుగుతోంది. ఎక్కువ మంది విదేశీ టూర్ల వైపు చూస్తుంటే..వీలుపడని వారు దేశీయ పర్యటనలపై ఆసక్తి కనబరుస్తున్నారు. ట్రావెల్ పరిశ్రమలో సుదీర్ఘ విరామం తర్వాత ఇంతటి స్థాయిలో ప్రయాణాల పెరుగుదలను మార్కెట్ నిపుణులు ‘రివెంజ్ ట్రావెల్’గా అభివర్ణిస్తున్నారు. పక్కా గైడెన్స్‌తో.. కోవిడ్ వల్ల ఎదురైన అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి సరైన గైడెన్స్‌లోనే తమ ప్రయాణాలు కొనసాగించాలని చాలా మంది భావిస్తున్నారు. ముఖ్యంగా ట్రావెల్ ఏజెంట్ల సాయం తీసుకోవడానికి ప్రయత్నిస్తుండటం ట్రావెల్ కంపెనీలకు ఊతం ఇస్తోంది. ఈ క్రమంలోనే 80 శాతం మంది టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు ద్వారా ఆర్గనైజ్డ్ ట్రిప్‌లు నడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వినియోగదారుల మద్దతు సమకూర్చుకునేందుకు అనేక కంపెనీలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. రేటు ఎంతైనా పర్వాలేదు ప్రముఖ ట్రావెల్ సర్వే ప్రకారం భారత్‌లో 86 శాతం మంది కరోనాకు మందుతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ ఖర్చు చేసైనా తాము కోల్పోయిన ప్రయాణ అనుభూతిని తిరిగి పొందాలనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తున్న మెజార్టీ ఎయిర్‌లైన్స్, ట్రావెల్ ఏజెంట్లు భవిష్యత్తులో తమ పరిశ్రమ భారీ వృద్ధిని నమోదు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విహారం కోసం.. పర్యావరణ అనుకూల పర్యటనల వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. 87 శాతం మంది తాము ప్రశాంత వాతావరణంలో గడపాలని కోరుకుంటున్నారు. కార్పొరేట్ ప్రయాణికులు సైతం సహోద్యోగులతో మళ్లీ కలిసి ప్రయాణాల్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తేలింది. ఏమిటీ రివెంజ్ ట్రావెల్ నిబంధనల నుంచి ఉపశమనం కోసం ప్రజలు జాగ్రత్తలు విస్మరించి కరోనాను మళ్లీ విజృంభించేలా చేసే ప్రక్రియను రివెంజ్ ట్రావెల్ లేదా రివెంజ్ టూరిజం అంటారు. లాక్డౌన్లు, వర్క్‌ఫ్రమ్ హోమ్‌ల కారణంగా ఇంట్లోనే ఉండి విసిగిపోయిన ప్రజలు సాధారణంగా సాగుతున్న జీవితంలో మార్పు కోరుకొని బయటికి వస్తున్నారు. కరోనా భయం కూడా వారిని ఆపలేకపోతోంది. అందుకే వారు టూర్లకు వెళుతున్నారు. ఇదే రివెంజ్ ట్రావెల్ పూర్తి కాన్సెప్ట్. పర్యాటకులు నిబంధనలను విస్మరించడాన్ని చూసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘‘రివెంజ్ ట్రావెల్’’అన్న పదాన్ని ఇటీవల వాడింది. ఇది చాలా ప్రమాదకరమని ప్రజలను హెచ్చరించింది. -
టూరెత్తుతున్న ఎన్నికలు...
* ప్యాకేజీ టూర్లు అందిస్తున్న ట్రావెల్ సంస్థలు * పోటెత్తుతున్న విదేశీ పర్యాటకులు పన్యాల జగన్నాథ దాసు: కుంభమేళాలు, పుష్కరాలు వంటి వాటికి పర్యాటకులు పోటెత్తడం మామూలే. చారిత్రక ప్రదేశాలను, పుణ్యక్షేత్రాలను తిలకించేందుకు ట్రావెల్ సంస్థలు ప్యాకేజీ టూర్లు నిర్వహించడమూ మామూలే. ప్రస్తుత ఎన్నికల సీజన్లో కాస్త కొత్తగా ఆలోచించిన ట్రావెల్ సంస్థలు ఎన్నికల పర్యాటకం కోసం ప్యాకేజీ టూర్లు అందిస్తున్నాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఎన్నికల ప్రహసనాన్ని తిలకించేందుకు విదేశీ పర్యాటకులు పోటెత్తుతుండటంతో ట్రావెల్ సంస్థలకు కాసుల పంట పండుతోంది. రాజకీయ దిగ్గజాలు తలపడే నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారసభలు చూపించడంతో పాటు రాజకీయ నేతలను, ఎన్నికల కమిషన్ అధికారులను కలుసుకునే అవకాశం కల్పిస్తుండటంతో విదేశీ పర్యాటకులు ఈ ప్యాకేజీ టూర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఏడు పగళ్లు, ఆరు రాత్రులు సాగే ఈ ప్యాకేజీ టూర్లకు ట్రావెల్ సంస్థలు కేవలం 1200 డాలర్లు (రూ.72,131) మాత్రమే వసూలు చేస్తున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, నైజీరియా, యూఏఈ వంటి దేశాల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు ఎన్నికల పర్యటన కోసం వస్తున్నారు. గుజరాత్లో 2012 అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఎన్నికల పర్యాటకం విజయవంతం కావడంతో ఈ సార్వత్రిక ఎన్నికల్లో మరిన్ని ట్రావెల్ సంస్థలు ప్యాకేజీ టూర్లు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. అంచనాలకు మించి పర్యాటకులు వస్తుండటంతో ట్రావెల్ సంస్థల నిర్వాహకులు సంబరపడుతున్నారు. ఎన్నికల పర్యాటకానికి ఇక్కడకు వచ్చే విదేశీ పర్యాటకులు దేశం నలుమూలల్లోని కీలక ప్రాంతాలన్నింటినీ చూసేందుకు ఆసక్తి చూపుతుంటే, గుజరాత్‌కు చెందిన ఎన్ఆర్ఐలు మాత్రం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, ‘ఆప్’ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తలపడుతున్న వారణాసిపైనే ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖుల నియోజకవర్గాలపై విదేశీయుల ఆసక్తి.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేస్తున్న రాయ్‌బరేలీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేథీ, మోడీ పోటీ చేస్తున్న వారణాసి, వడోదర నియోజకవర్గాలతో పాటు ఇతర ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాలపై విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. భారత్‌లో ఎన్నికల ప్రచారం జరిగే తీరును తిలకించేందుకు విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని గుజరాత్‌కు చెందిన అక్షర్ ట్రావెల్స్ నిర్వాహకుడు లవ్ శర్మ చెప్పారు. బ్రిటన్, జర్మనీ, దుబాయిల నుంచి ఇప్పటికే నాలుగు బృందాల పర్యాటకులు తమ వద్ద ముందుగానే ప్యాకేజీ టూర్లు బుక్ చేసుకున్నారని, ఒక్కో బృందంలో 90 మంది చొప్పున పర్యాటకులు ఉంటారని ఆయన తెలిపారు. ఇక్కడి ఎన్నికల తతంగాన్ని తిలకించేందుకు వస్తున్న విదేశీ పర్యాటకుల్లో ఎక్కువ మంది అక్కడి రాజకీయ పార్టీల కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు ఉంటున్నారని ‘కాక్స్ అండ్ కింగ్స్’ ఉపాధ్యక్షుడు సంజీవ్ ఛజేర్ తెలిపారు. సాధారణంగా వేసవిలో విదేశీ పర్యాటకుల రాక తక్కువగా ఉంటుందని, అయితే, ఈ ఎన్నికల సీజన్లో 25 వేల నుంచి 30 వేల మంది విదేశీ పర్యాటకులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ అధ్యక్షుడు సుభాష్ గోయల్ చెప్పారు. విదేశీ పర్యాటకుల కారణంగా హోటళ్ల బుకింగ్‌లూ గణనీయంగా పెరిగాయి. కేవలం అహ్మదాబాద్‌లోనే హోటళ్ల బుకింగ్‌లు ఏకంగా 60 శాతం మేరకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.