Traffic Conditions
-
ట్రాఫిక్ నేరాలపై కొరడా!
మోటారు వాహనాల బిల్లులో మార్పులకు కేబినెట్ ఓకే న్యూఢిల్లీ: మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2016కు ప్రతిపాదించిన కీలక సవర ణలకు కేంద్ర కేబినెట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్‌కు ఆధార్ అనుసంధానం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా, బాధితులకు పరిహారం పెంపు తదితర ప్రతి పాదనలూ ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిని, హెల్మెట్, సీటు బెల్టు వాడని వారిని కఠినంగా శిక్షించాలని ప్రతి పాదించారు. పార్లమెంటరీ సంఘం చేసిన దాదాపు అన్ని సూచనలను ప్రధాని అధ్యక్షత సమావేశమైన కేబినెట్ ఆమోదించిందని రవాణా మంత్రి నితిన్ గడ్కారీ విలేకర్లకు తెలిపారు. బిల్లు్ల వచ్చేవారం పార్లమెంటు ముందుకొస్తుందన్నారు. ఆన్లైన్ సేవల కోసం ఆధార్ ఆధారిత తనిఖీని బిల్లులో ప్రతిపాదించారని, తద్వారా లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్సునూ రవాణా కార్యాలయానికి వెళ్లకుండానే పొందొచ్చని పేర్కొన్నారు. దీనివల్ల ఒకే పేరుతో పలు లైసెన్సులు తీసుకోవడం కదురదన్నారు. వాహనాలను ఆర్టీఓ ద్వారానే రిజిస్టర్ చేయాలన్న స్థాయీ సంఘం సూచనను ప్రభుత్వం తిరస్కరిచిందని వెల్లడించారు. 1989 నాటి మోటారు వాహనాల చట్టాన్ని సవరించేందుకు ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే.. ఆలిండియా ఎలక్ట్రానిక్ రిజిస్టర్ ద్వారా వాహనాల డీలర్లు నంబర్లు కేటాయించి, రిజిస్టర్ చేస్తారని వివరించారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి నాలుగు నెలల్లోగా రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు. గత ఏడాది ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును పరిశీలన కోసం రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటైన స్థాయీ సంఘానికి పంపారు. మరికొన్ని నిర్ణయాలు యూరియా ఉత్పత్తి పెంచేందుకు జాతీయ యూరియా విధానం–2015కు చేసిన సవ రణలకు ఆమోదం. పునఃఅంచనా సామర్థ్యానికి(ఆర్ఏసీ) మించి ఉత్పత్తి చేసేందుకు తయారీదారులకు వెలుసు బాటు. ఫాస్పేట్, పోటాస్ ఎరువులకు సంబంధించి 2017–18కుగాను పోషక ఆధారిత సబ్సిడీ(ఎన్బీఎస్) రేట్ల నిర్ధారణ విధానానికి ఆమోదం. ఫాస్పరస్‌పై సబ్సిడీ కేజీకి రూ.11.99(గత ఏడాది కంటే రూ.1.24 తగ్గింపు), పోటాస్‌పై రూ. 12.39(గత ఏడాదికంటే రూ. 3.07 తగ్గింపు), నత్రజనిపై రూ. 18.98(గత ఏడాదికంటే రూ. 3.13 పెంపు), సల్ఫర్పై రూ. 2.24(గత ఏడాది కంటే 19పైసల పెంపు)గా నిర్ణయం. -
హాలిడేస్ ఎఫెక్ట్: భారీగా ట్రాఫిక్ జామ్
-
హాలిడేస్ ఎఫెక్ట్: భారీగా ట్రాఫిక్ జామ్
బీజింగ్: చైనాలో సెలవుల సందర్భంగా నగరాల్లోని జనభా ఒక్కసారిగా సొంత ఊర్లకి తరలి వెళ్లింది. అక్టోబర్ 1 నుంచి 7 వరకు చైనా నేషనల్ హాలిడే కావడంతో నగరాల్లో నివసించే వారు ఒక్కసారిగా తమ సొంత ఊర్లకి బయలు దేరడంతో రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. దీంతో సొంతవాహనాల్లో సొంత ఊర్లకు బయలు దేరిన వారికి ట్రాఫిక్ ఇబ్బందులు చుక్కలు చూపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో వాహనాలు ఏకకాలంలో నగరాల నుంచి బయటకు బయలు దేరడంతో పెద్ద మొత్తంలో ట్రాఫిక్ జాం అయింది. చైనాలో సాధారణ సెలవురోజుల్లో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా టోల్ టాక్స్ నుంచి మినహాయింపు కూడా ఇస్తారు. విశాలమైన రోడ్లు ఉండి, టోల్ టాక్స్ కట్టాల్సిన అవసరం లేకపోయినా టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయిందంటే రద్దీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవొచ్చు. అయితే నగరం వైపు మాత్రం వాహనాలు లేక రోడ్లు వెలవెల పోతున్నాయి. రద్దీ దృష్ట్యా 11 కోట్ల రైలు ట్రిప్పులు సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం కోసం 11 కోట్ల రైలు ట్రిప్పులు అవసరమౌతుందని చైనా రైల్వే కార్పొరేషన్ అంచనా వేస్తోంది. గత ఏడాది చైనా నేషనల్ హాలిడే సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రిప్పులతో పోల్చితే ఈ సారి అంచనా వేస్తున్న ట్రిప్పులు 11.3 శాతం అధికం. తూర్పు చైనాలోని జియాంగ్సూ ప్రావిన్స్‌లో నాన్జింగ్ యాంగ్జి బ్రిడ్జ్ సమీపంలో రద్దీ దృశ్యాలు: -
ఏడాదిన్నరలో రూ.169.86 కోట్లు
⇒ వాహనదారుల నుంచి వసూలు చేసిన జరిమానా సొమ్ము ఇది ⇒ 2015లో రూ.100.90 కోట్లు.. 2016 మే 31 నాటికి రూ.68.95 కోట్లు ⇒ ఈ ఏడాది మొత్తంగా రూ.150 కోట్లకు చేరే అవకాశం ⇒ రోడ్డు ప్రమాదాల నివారణకు డీటీఆర్‌ఎస్ పేరుతో ప్రత్యేక విభాగం ⇒ 50 హైవే ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల ఏర్పాటు ⇒ హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వివరణ ⇒ ఇదే తరహాలో వివరాలివ్వాలని ఏపీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మోటారు వాహనాల చట్టం నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గత ఏడాదిన్నరలో రాష్ట్ర పోలీసులు వాహనదారుల నుంచి ఏకంగా రూ. 169.86 కోట్లు జరిమానాగా వసూలు చేశారు. ఇందులో 2015 సంవత్సరం మొత్తంలో రూ.100.9 కోట్లుకాగా.. ఈ ఏడాది మే 31వ తేదీ నాటికి రూ. 68.9 కోట్లు వసూలు చేశారు. ఈ లెక్కన ఈ ఏడాది జరిమానాల సొమ్ము రూ.150 కోట్లకు చేరే అవకాశముంది. సుమోటోగా విచారణ చేపట్టిన హైకోర్టు ఈ ఏడాది మార్చి 14న జరిగిన ఓ బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాల నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలంటూ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఇంతకుముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను ఆదేశించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున రైల్వేలు, రోడ్డు భద్రత అదనపు డెరైక్టర్ జనరల్ టి.కృష్ణప్రసాద్ రెండు రోజుల కింద ఓ అఫిడవిట్‌ను సమర్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, రోడ్డు భద్రతకు తీసుకుంటున్న చర్యలను అందులో వివరించారు. రాష్ట్రంలోని మొత్తం రహదారుల్లో జాతీయ, రాష్ట్ర రహదారుల పొడవు 22 శాతమని.. అవి 43 శాతం ప్రమాదాలకు, 48 శాతం మరణాలకు కారణమవుతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్‌కుమార్ ధర్మాసనానికి వివరించారు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నాం రోడ్డు ప్రమాదాల తీవ్రతను దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం భద్రత, ట్రాఫిక్ ప్రణాళికల నిమిత్తం ప్రత్యేకంగా అదనపు డీజీ స్థాయి అధికారిని నియమించిందని సంజీవ్ కుమార్ కోర్టుకు నివేదించారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ అండ్ రోడ్‌సేఫ్టీ (డీటీఆర్‌ఎస్)’ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని తెలిపారు. జాతీయ రహదారులపై 50 హైవే ట్రాఫిక్ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యల విషయంలో పోలీస్ కమిషనర్లు, ఎస్పీలకు తగిన సూచనలు, మార్గదర్శకాలు జారీ చేశామని తెలిపారు. హైవేలపై ఆటోలను అనుమతించడం లేదని, దాబాల్లో మద్యం అమ్మకాలను నిషేధించడమే కాక ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. వాహనం నడిపే వ్యక్తి, వెనుక కూర్చొన్న వ్యక్తి ఇద్దరూ హెల్మెట్ ధరించాలన్న నిబంధన కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించామన్నారు. జాతీయ రహదారులపై మద్యం షాపులను తొలగించడంతో పాటు పర్మిట్లు రద్దు చేయాలని ఎక్సైజ్ అధికారులకు లేఖలు రాశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపేవారి లెసైన్స్ రద్దు కోసం రవాణాశాఖ అధికారులకు సిఫారసు చేస్తున్నామన్నారు. గత ఏడాదిన్నర కాలంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై నమోదు చేసిన కేసులు, జరిమానాగా వసూలు చేసిన మొత్తం వివరాలను ధర్మాసనం ముందుం చారు. ఈ మొత్తం వ్యవహారంలో హైకోర్టు తదుపరి ఏ ఆదేశాలు ఇచ్చినా అమలు చేస్తామన్నారు. ఈ వాదనలను పరిశీలించిన ధర్మాసనం... రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరించాలని ఏపీ సర్కారును ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం తరహాలో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలంటూ.. విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. -
‘ట్రాఫిక్’ ఆదాయం అక్షరాలా వందకోట్లు!
సాక్షి, హైదరాబాద్: మోటారు వాహన చట్ట నిబంధనలు.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు 2015 సంవత్సరానికి వాహనదారుల నుంచి జరిమానా కింద తెలంగాణ పోలీసులు ఎంత మొత్తం వసూలు చేశారో తెలుసా.. అక్షరాల రూ.100 కోట్ల 90లక్షలు. ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు నమోదు చేసిన కేసులు 56, 25, 277. ఇక 2016 సంవత్సరానికి ఈ మొత్తం కనీసంగా రూ.150 కోట్లకు చేరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఏడాది మే 31వ తేదీ నాటికే పోలీసులు దాదాపు రూ.69 కోట్లు జరిమానా కింద వసూలు చేశారు. ఇందులో భాగంగా 38,31,896 కేసులు నమోదు చేశారు. 2015 సంవత్సరంలో తాగి వాహనం నడిపినందుకు మోటారు వాహన చట్టం 1988 కింద 55,545 మందిపై కేసు నమోదు చేయగా, అందులో 43,964 మందిని కోర్టులో ప్రాసిక్యూట్ చేశారు. ఇందులో 5424 మందికి కోర్టు శిక్ష విధించింది. ఇక 2016 విషయానికి వస్తే ఫిబ్రవరి 29వ తేదీ వరకు 9916 మందిని ప్రాసిక్యూట్ చేశారు. -
నేడు రాజ్‌భవన్‌లో రాష్ట్రపతికి గవర్నర్ విందు
హైదరాబాద్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం రాజ్‌భవన్‌ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి గౌరవార్ధం గవర్నర్ నరసింహన్ విందు ఇవ్వనున్నారు. ఈ విందులో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు పాల్గొనే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే ప్రణబ్ రాకతో రాత్రి 7.30 నుంచి 8.30 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, రాష్ట్రపతి ప్రణబ్ శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. -
చిరునవ్వులతో బతకాలి...
♦ మద్యం తాగి వాహనాలు నడపొద్దు ♦ అంబులెన్స్‌లకు దారి ఇవ్వండి ♦ ‘మా’ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ సాక్షి, సిటీబ్యూరో : ‘బతికినప్పుడు నలుగురికీ మనం ఎంత మంచి చేశామన్నదే ముఖ్యం. మద్యం తాగి.. బండి నడుపుతూ చచ్చాడురా అనే మాటల కంటే... ఉన్నన్ని రోజులు మంచి కోసం ఆరాట పడ్డాడురా అనే ఒక చిన్న మాట కనీసం ఒక్కరి నుంచి వచ్చినా ఆ జన్మ ధన్యమైనట్టే. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే మీతో పాటు ఎదుటి వారి ప్రాణాలనూ నిలబెట్టిన వారవుతారు’ ...అంటున్నారు ప్రముఖ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్. సోమవారం గోషా మహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రాఫిక్ నిబం ధనల ఉల్లంఘనులకు ఆయన అవగాహన కల్పిం చే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ ఏవీ రంగనాథ్, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజేంద్రప్రసాద్ సూచనలు...ఆయనమాటల్లోనే... తేడా 5 నిమిషాలే... వేగంగా వెళ్లే వారిని తిట్టని వారు ఉండరు. సిగ్నళ్ల వద్ద పసుపు రంగు లైట్ పడినా... ఎర్ర రంగు లైట్ వస్తుందని తెలిసినా... కొందరు వేగంగా ముందుకెళతారు. ఇలా వేగంగా వెళ్లిన వారికీ... ట్రాఫిక్ నిబంధనలు పాటించిన వారికీ మధ్య గమ్యస్థానాలకు చేరుకోవడానికి తేడా ఐదు నిమిషాలే. అవి నిజం కాదు... స్పీడ్ యమ థ్రిల్‌గా అనిపిస్తుంది. అదే ప్రాణాలనూ తీస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో జాకీచాన్ చేసిన స్టంట్లు చూసి మనం అలా చేద్దామనుకోవడం అజ్ఞానంతో కూడిన అమాయకత్వమే. సినిమా దృశ్యాలు నిజమనుకోవద్దు. వాటిని అనుకరించొద్దు. అంబులెన్స్‌లకు దారి ఇవ్వండి... ‘ప్రాణాన్ని రక్షించడానికి వెళుతున్నాం. తోవ ఇవ్వండి’ అంటూ.... సౌండ్ చేస్తూ అంబులెన్స్‌లు రోడ్లపై వెళుతుంటాయి. చాలామంది వాటికి దారి ఇవ్వరు. అదే అంబులెన్స్‌లో మన అమ్మానాన్న ఉంటే... అమ్మో నాయినా... మా నాన్న ప్రాణం...తప్పుకోండి’ అంటూ అరుస్తాం. అందులో ఉన్నది ఎవరైనా మన బంధువులతో సమానం. అంబులెన్స్‌కు దారి ఇవ్వడం ద్వారా మనమూ ఆ ప్రాణాలను కాపాడినవారమవుతాం. అది ‘హెల్’ఫోన్ వాహనం నడుపుతూ అనవసర విషయాలను ‘సెల్’లో మాట్లాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గాయాల పాలవుతున్నారు. కుటుంబ సభ్యులకు శోకం మిగులుస్తున్నారు. ఏకాగ్రతతో డ్రైవింగ్ చేస్తే గమ్యస్థానానికి చేరుకుంటాం. కసితో ఉన్నత స్థాయికి.. నాకు 24 ఏళ్లు ఉన్నప్పుడు ‘లేడీస్ టైలర్’ సినిమా చేశా. హిట్టయితే కెరీర్ ఉంటుంది. లేదంటే ఢమాల్. ఆ కసితోనే సినిమా చేశాను. ఇట్లా కసితో జీవితంలో మంచి కోసం ఏదో ఒకటి చేయాలి. అప్పుడే ఉన్నత స్థాయికి చేరుకోగలం. పోలీసులంటే ఎంతో గౌరవం మిలటరీ కంటే పోలీసులంటే నాకు గౌరవం ఎక్కువ. పోలీసు..సైనికుడి కన్నా గొప్పవాడు. దేశ సరిహద్దుల్లో ఆయుధాలతో సంసిద్ధంగా ఉండే సైనికులు శత్రువులు వచ్చారని తెలియగానే కాల్పులు జరుపుతారు. పోలీసులు అలా కాదు. చుట్టూ ఉన్న సమాజంలో ఎవరు ఏంటో తెలియదు. ఎవరు ఎటు నుంచి ఏం చేస్తారో తెలియదు. మంచికి మంచి, చెడుకు చెడుగా చూసేవాడే పోలీసు. అమెరికాలో ట్రాఫిక్ ఉల్లంఘనుల వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఇదే తరహాలో సిటీ పోలీసులు కూడా నూతన టెక్నాలజీ వాడుతుండటం శుభపరిణామం. ప్రాణం నిలిపిన తీరు అద్భుతం హ్యట్సాఫ్ టూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్. ఇటీవల బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి అవయవాలను హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టుకు... అక్కడి నుంచి చెన్నై తీసుకెళ్లి ఓ అమ్మాయికి అమర్చి ప్రాణాలు పోసిన తీరు చూస్తే ఇప్పటికీ నా కళ్లలో నీళ్లు తిరుగుతుంటాయి. అంబులెన్స్ ఎక్కడాఆగకుండా ఆ అవయవాలను బాధితులకు సకాలంలో చేరేలా చేయడంలో ట్రాఫిక్ పోలీసులు సఫలీకృతులయ్యారు. వారు చెబుతున్న నిబంధనలు పాటించి మీ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కాపాడుకోవాలి. మీరుదేశానికి అవసరం. అబ్దుల్ కలాం అవుతారో... రాజేంద్రప్రసాద్ అవుతారో...మీ చేతుల్లోనే ఉంది. ప్రాణాలు తీసే ‘మందు’ మన డబ్బులు పెట్టుకుని... మద్యం తాగి... ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం. అది పేరుకే ‘మందు’. కానీ ప్రాణాలను హరిస్తుంది. మద్యం తాగి బండి నడుపుతూ చచ్చిపోయాడన్న అపవాదు తెచ్చుకోవద్దు. సినిమాల్లో మద్యం తాగుతూ మేం నటించే సీన్లన్నీ ప్రేక్షకులను రంజింపజేసేందుకే. వాటిని అనుసరించడం కరెక్ట్ కాదు. శ్రీమంతులవుదామని... ‘శ్రీమంతుడు’లో హీరో మహేశ్‌బాబు ‘గ్రామాన్ని దత్తత తీసుకుంటాను’ అన్న డైలాగ్ నాలో ఎనర్జీని తెచ్చిపెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏఏ గ్రామాలు వెనకబడి ఉన్నాయో తెలుసుకునేందుకు సర్వే చేపట్టాం. తోటి హీరోలను ఒప్పించి... ఆ గ్రామాలను అప్పగించేలా ప్లాన్ చేస్తున్నాం. ఉన్నన్ని రోజులు ఎంత డబ్బు సంపాదించినా వెంట తీసుకెళ్లలేం. మనం పోయినా మంచి పేరు ఉండేలా నలుగురికీపనికొచ్చే పని చేయడం మేలు. మంచి పేరు రావాలన్న స్వార్థం అందరిలో ఉండాలి. -
నగరంపై నిఘా నేత్రం
ఆల్కాట్‌తోట(రాజమండ్రి), న్యూస్‌లైన్ :రాజమండ్రి పోలీసు అర్బన్ జిల్లాలో ట్రాఫిక్ వ్యవస్థను మరింత మెరుగు పరిచేందుకు అర్బన్‌జిల్లా ఎస్పీ రవికుమార్‌మూర్తి ఆధ్వర్యంలో ట్రాఫిక్ డీఎస్పీ అనిల్‌కుమార్ నడుం బిగించారు. దీనిలో భాగంగా నగరంలోని ట్రాఫిక్ జంక్షన్లలో సీసీ కెమేరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 21 ట్రాఫిక్ జంక్షన్లకు గాను 15చోట్ల సీసీ కెమేరాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమేరాల్లో నిక్షిప్తమైన దృశ్యాలను పరిశీలించేందుకు పోలీసు అతిథిగృహం వద్ద ఒక ప్రత్యేక మాస్టర్ కంట్రోలు రూమ్‌ను ఏర్పాటు చేశారు. కంట్రోలు రూమ్‌లో సిబ్బంది ఎప్పటికప్పుడు సీసీ కెమేరాలోని దృశ్యాలను పరిశీలిస్తారు. ఏదైనా ప్రమాదం జరిగినా, చోరీలు జరిగినా, సిగ్నల్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయినా, లేక ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా ఈ సీసీ కెమేరాల ఆధారంగా కనుగొని పోలీసులు తగిన చర్యలు తీసుకుంటారు. మలిదశలో ఈ-చలానా విధానాన్ని కూడా ప్రవేశపెడ తారు. ఈ పద్ధతిలో నిబంధనలు ఉల్లం ఘించిన వాహనదారుని ఇంటికే నేరుగా జరిమానా చలానా పంపించే అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ిసీసీ కెమేరా ఏర్పాటును రెండురోజులలో పూర్తి చేసి, పరిశీలించిన తరువాత ప్రారంభిస్తా మని ట్రాఫిక్ డిఎస్పీ అనిల్‌కుమార్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. -
జాగ్రత్తలతో ప్రమాదాలు దూరం
ఆదిలాబాద్ కల్చరల్, న్యూస్‌లైన్: డ్రైవర్ల అప్రమత్తతతోనే చాలావరకు రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని ఆదిలాబాద్ డీఎస్పీ లతామాధురి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపోలో 25వ రోడ్డు భద్రతా వారోత్సవాలను సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హా జరై వారోత్సవాల ప్రారంభ సభలో ప్రసంగిం చారు. ప్రమాదాలు నివారించడం అందరి బా ధ్యత అని వివరించారు. పూర్తిస్థాయిలో ప్రమాదాలను నివారించాల్సిన అవసరం ఉందని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించా రు. ప్రమాదాలు జరగడానికి ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే కారణమని, వాహనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి నడపాలని వివరించారు. 25వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. ఆర్టీసీ డీఎం శివకేశవ్‌యాదవ్, అసిస్టెంట్ మేనేజర్ జాకుబ్, ఎంఎఫ్ ఎస్.వి.రావు, నాయకులు పాల్గొన్నారు. నామమాత్రంగా వారోత్సవాలు ఆర్టీసీలో రోడ్డు భద్రతా వారోత్సవాలను నామమాత్రంగా నిర్వహించారు. ఏమాత్రం ప్రచారం లేకుండా ఆదిలాబాద్ డిపో మేనేజర్ ఏకంగా వారోత్సవాలు ప్రారంభించడంతో ఆర్టీసీ కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు. డ్రైవర్లు, కండక్టర్లకు వీటిపై ఎలాంటి అవగాహన కల్పించలేదు. గేట్ మీటింగ్‌లు పెట్టి ప్రమాదాలు నివారించే కార్యక్రమాలు నిత్యం చేయాల్సి ఉంటుంది. కానీ వారోత్సవాల మొదటి రోజు కూడా కార్మికులకు, కార్మిక సంఘ నాయకులు ఏమాత్రం సమాచారం అందించలేదు. దీనిపై డిపో మేనేజర్‌ను వివరణ కోరేందుకు ‘న్యూస్‌లైన్’ ఫోన్ చేయగా ఆయన స్పందించలేదు. ప్రతీ ఒక్కరి బాధ్యత - ఆర్టీవో గౌరీశంకర్ వేంపల్లి(మంచిర్యాల రూరల్) : రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మంచిర్యాల ఆర్టీవో గౌరీశంకర్ కోరారు. రోడ్డు భద్రత వారోత్సవాలను ఆర్టీఏ కార్యాలయంలో సోమవారం ఆర్టీవో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడిపితే మనసు మాటలపై ఉంటుందని, దీంతో ఎదురుగా వచ్చే వాహనాలపై దృష్టి ఉండదని, ఇలా 80 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. మద్యం సేవిస్తే వాహనం నడపవద్దని, అతివేగం, అజాగ్రతలతో మనతో పాటు, ఎదురుగా వస్తున్న వాహనాలకు ప్రమాదమేనని గుర్తించాలని పేర్కొన్నారు. వాహనం తీసుకుని వెళ్లిన వారు, తమ కుటుంబం గురించి ఒక్క క్షణం ఆలోచిస్తే, సగానికి పైగా ప్రమాదాలు నివారించవచ్చని చెప్పారు. మానసిక ఆందోళన, కోపం, ఆవేశం ఉన్నప్పుడు వాహనం నడపడం మానుకుంటే మంచిదని సూచించారు. 2013 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లాలో 1200ల ప్రమాదాలు జరిగితే 1,554 మంది మృతిచెందారని, 2,134 మంది గాయాలతో క్షతగాత్రులుగా మారారని, ఈ ఏడాది ప్రమాదాలు లేకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. అనంతరం ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన కరపత్రాలను, సీడీలను ఆర్టీవో ఆవిష్కరించారు. మంచిర్యాల రూరల్ సీఐ కరుణాకర్, పట్టణ సీఐ రవీంద్రారెడ్డి, ఓరియంట్ సిమెంట్ కంపెనీ మేనేజర్ మనూల్లయ్య, ఏవో లక్ష్మీనారాయణ, ఎంవీఐలు ఉమామహేశ్వర్రావు, శ్యాంనాయక్, ఏంవీఐ సిరాజ్ సిబ్బంది పాల్గొన్నారు.