breaking news
Telangana Badminton Association
-
పాణీరావు కన్నుమూత.. బ్యాడ్మింటన్‌తో నాలుగు దశాబ్దాల అనుబంధం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం కోశాధికారి ఎస్. పాణీరావు శుక్రవారం మృతి చెందారు. హైదరాబాద్ బ్యాడ్మింటన్ సంఘానికి కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్న 72 ఏళ్ల పాణీరావు గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. సీనియర్ అడ్మినిస్ట్రేటర్‌గా దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఆయనకు బ్యాడ్మింటన్‌తో అనుబంధం ఉంది. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం రోజులనుంచి ప్రస్తుతం తెలంగాణ సంఘం వరకు వేర్వేరు హోదా ల్లో ఆయన పని చేశారు. ముఖ్యంగా వివిధ వయో విభాగాలకు సంబంధించిన టోర్నీల నిర్వహణలో ప్రత్యేక అనుభవం ఉన్న పాణీరావు వర్ధమాన ఆటగాళ్లను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించారు. చదవండి: సెమీఫైనల్లో సాత్విక్ జోడీ -
బ్యాడ్మింటన్ సంఘంలోకి గోపీచంద్
తెలంగాణ కార్యదర్శిగా ఎన్నిక ఆంధ్ర కార్యదర్శిగా పున్నయ్య చౌదరి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ బ్యాడ్మింటన్ సంఘం కూడా రెండుగా విడిపోయింది. ఆదివారం ఇక్కడ జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాల కోసం విడిగా సంఘాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ సంఘానికి వై. ఉపేందర్ రావు, డాక్టర్ రవీందర్ రావు ఉపాధ్యక్షులుగా, కె. పాణీరావు కోశాధికారిగా వ్యవహరిస్తారు. ఆంధ్ర బ్యాడ్మింటన్ సంఘానికి మాత్రం దాదాపుగా పాత ఏపీ కార్యవర్గమే కొనసాగనుంది. మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ ఈ సంఘానికి అధ్యక్ష, కేసీ పున్నయ్య చౌదరి కార్యదర్శి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏపీ సంఘానికి రాయపాటి రంగారావు ఉపాధ్యక్షుడిగా, సీహెచ్ రఘుకిరణ్ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తారు. ‘ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బ్యాడ్మింటన్ బాగా కేంద్రీకృతమై ఉంది. భవిష్యత్తులోనూ మంచి ఫలితాలు సాధించేందుకు నేను నేరుగా సంఘం కార్యకలాపాల్లో పాల్గొంటే బాగుంటుందని ‘బాయ్’ ఉన్నతాధికారులు సూచించారు. అందుకే కార్యదర్శి బాధ్యతలు తీసుకుంటున్నాను’ అని గోపీచంద్ స్పందించారు.