స్టూడియోలో నాపై లైంగిక దాడి.. సీసీటీవీ వీడియోలతో బ్లాక్మెయిల్
మహిళా గాయని స్వాగత కృష్ణన్.. తమిళ ప్రముఖ సంగీత దర్శకుడిపై సంచలన ఆరోపణలు చేసింది. తనపై లైంగిక దాడి చేశాడని, చేసిన పనికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడని తన బాధ చెప్పుకొంది. పైగా అప్పుల్లో ఉన్నానని చెప్పి తన దగ్గరే పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఎగ్గొట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటన వల్లే ఇండస్ట్రీని తాను వదిలేశానని, సదరు మ్యూజిక్ డైరెక్టర్ని 'ఎప్స్టీన్ ఆఫ్ మద్రాస్' అని పేరు పెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సంగతులు చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ‘స్పిరిట్’ సినిమా కోసం గొర్రెలు అమ్ముకున్నాం.. చాలా కష్టపడ్డాం)'ఏడేళ్ల క్రితం చెన్నై వదిలిపెట్టి రిషికేష్ వెళ్లిపోవడం వెనక కారణం ఇప్పుడు బయటపెడుతున్నా. బ్రేకప్ అయిపోయి డిప్రెషన్లో ఉన్నప్పుడు నా జీవితంలోకి ఆ సంగీత దర్శకుడు వచ్చాడు. నా పరిస్థితిని తనకు అనుకూలంగా ఉపయోగించుకున్నాడు. మాయమాటలు చెప్పి తనపై నమ్మకం పెరిగేలా చేసి, గురువుగా నటిస్తూ దగ్గరయ్యాడు. కొన్నాళ్లకు అసలు రంగు బయటపెట్టాడు. కోరస్ కంపోజిషన్, మిక్సింగ్ లాంటివి చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. కానీ నాకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వకుండా మోసం చేశాడు. మళ్లీ అప్పుల్లో ఉన్నానని చెప్పి నా దగ్గరే చాలా డబ్బులు తీసుకున్నాడు. వాటిని తిరిగివ్వలేదు''ఆయన స్టూడియో సౌండ్ప్రూఫ్గా ఉండేది. ఆ గది తలుపులు లాక్ చేసి బలవంతంగా నాపై లైంగిక దాడి చేశాడు. అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలతో ఇదంతా రికార్డ్ చేసి తర్వాత నన్ను బెదిరించాడు. ఈ ఘటన తర్వాత తిరిగి నాపైనే అబద్దాలు చెప్పడం, దొంగతనం లాంటి తప్పుడు ఆరోపణలు చేశాడు. ఇండస్ట్రీలో నా పేరు చెడగొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్రంగా మానసిక ఒత్తిడికి గురయ్యాను. కొంతకాలం ఒంటరిగా ఉండాల్సి వచ్చింది. చికిత్స కూడా తీసుకున్నా. అందుకే చెన్నై వదిలేసి రిషికేష్ వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటున్నా''ఈ మధ్యే మరో యువతి తనకు ఇలానే జరిగిందని నాతో చెప్పడంతోనే ఈ విషయం బయటపెట్టాలని నిర్ణయించుకున్నా. నేనే కాదు చాలామంది అమ్మాయిలు అతడి బాధితులే. భయం, ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు న్యాయపరంగా ముందుకెళ్తా. అయితే ఇది ఆయనపై ప్రతీకారం కాదు. ఇకపై నాలాగా మరెవరూ మానసిక వేదన అనుభవించకూడదనే ఉద్దేశంతోనే చేస్తున్నాను' అని సింగర్ స్వాగత కృష్ణన్ చెప్పుకొచ్చింది.'యెనో పెన్నే', 'కాదల్ కన్మణి' లాంటి పాటలు పాడిన ఈమె.. సదరు సంగీత దర్శకుడి పేరు మాత్రం బయటపెట్టలేదు. ఈమె సోదరి మాయ కృష్ణన్.. విక్రమ్, లియో సినిమాల్లో సహాయ పాత్రలు చేసింది తమిళ బిగ్బాస్ షోలోనూ పాల్గొంది.(ఇదీ చదవండి: అషుపై కేసు పెట్టాలనుకోలేదు.. కానీ ఆమె అలా చేసేసరికి: ధర్మేంద్ర)