బ్రహ్మాస్త్రం సిద్ధం!
అమెరికాతో రెండో విడత చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. అమెరికాకు గుండెపోటు తెప్పించే రహస్య అస్త్రం సిద్ధంగా ఉందని తేల్చిచెప్పింది. దాని గురించి తెలిస్తే శత్రువులు భయకంపితులు కావడం తథ్యమని పేర్కొంది. ఇదొక ‘సూపర్ వెపన్’అని ఇరాన్ నేవీ కమాండర్ షహ్రామ్ ఇరానీ తేల్చిచెప్పారు. శత్రువుపై త్వరలోనే ఈ కొత్త అస్త్రం ప్రయోగిస్తామని అన్నారు. రహస్య అస్త్రం ప్రస్తుతం శత్రువు పక్కనే ఉందని వెల్లడించారు. అది చూసి వారి(అమెరికా) గుండె పేలిపోదనే ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇరాన్ చెబుతున్న రహస్య ఆయుధం ‘హూట్ రాకెట్ టార్పెడో’కావొచ్చని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సముద్ర గర్భంలో తుపాకీ తూటాలాగా శరవేగంగా ప్రయాణిస్తూ శత్రు దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాములను తుత్తునియలు చేసే ఆయుధం. అనుకూలతలే కాకుండా కొన్ని ప్రతికూలతలు కూడా ఉన్నాయని అంటున్నారు. అసలేమిటి హూట్ టార్పెడో? ఈ ఆయుధాన్ని తొలిసారిగా 2006లో ఇరాన్ రహస్యంగా పరీక్షించింది. అత్యంత వేగంగా ప్రయాణించడం ఈ టార్పెడో ప్రత్యేకత. శత్రుదేశాలు ప్రతిస్పందించేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. దీని గురించి బయటి ప్రపంచానికి అంతగా తెలియదు. హూట్ అంటే పర్షియన్ భాషలో భారీ తిమింగలం. నీటి అడుగున అత్యంత వేగంగా దూసుకెళ్లే ఆయుధాల్లో హూట్ సైతం ఉన్నట్లు ఇరాన్ చెబుతోంది. కానీ, రష్యా వద్ద ఇంతకంటే మెరుగైన సూపర్–కావిటేటింగ్ టార్పెడో ఉంది. ఇది 1990వ దశకంలోనే రష్యా నావికాదళంలోకి ప్రవేశించింది. సంప్రదాయ టార్పెడోల కంటే సూపర్ టార్పెడోలు కొంత భిన్నమైనవి. ఇవి అండర్వాటర్ గైడెడ్ క్షిపణుల్లాంటివి. సముద్ర గర్భంలో గంటకు 60 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. కానీ, హూట్ టార్పెడో 360 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని ఇరాన్ చెప్పుకుంటోంది. అదే నిజమైతే మాత్రం ఇదొక గొప్ప ముందడుగు అవుతుంది. నీరు అత్యంత శక్తివంతమైన నిరోధకం. గాలి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ సాంద్రత కలిగి ఉండటం వల్ల నీటి అడుగున ప్రయోగించిన ఆయుధాలు వాటి వేగాన్ని చాలావరకు కోల్పోతాయి. నీటిలో గంటకు 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఆయుధాన్ని అభివృద్ధి చేయడం సామాన్యమైన విషయం కాదు. నీటి అడుగున హూట్ చుట్టూ గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. అది నీటి నిరోధకతను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో హూట్ వేగంగా ముందుకు సాగుతుంది. → హూట్ రాకెట్ టార్పెడో 200 కిలోలకుపైగా వార్హెడ్లను(శక్తివంతమైన పేలుడు పదార్థాలు) మోసుకెళ్లగలదు. → హూట్ వేగమే దాని ప్రతికూలతగా చెప్పొచ్చు. అధిక వేగం కారణంగా ఇంధనం అత్యంత వేగంగా దహనమవుతుంది. దీనివల్ల టార్పెడో కేవలం 15 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. అంటే ప్రయోగించిన చోటునుంచి 15 కిలోమీటర్ల పరిధిలోని యుద్ధనౌకలు, జలాంతర్గాములను మాత్రమే ధ్వంసం చేయగలదు. → సంప్రదాయ టార్పెడోలు సాధారణంగా 30 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి. → హూట్ అ్రస్తాన్ని విజయవంతంగా పరీక్షించారే తప్ప ఏనాడూ యుద్ధక్షేత్రంలో ప్రయోగించలేదు. ఒకవేళ అమెరికా యుద్ధనౌకలు, విమాన వాహన నౌకలు, సబ్మెరైన్లను లక్ష్యంగా చేసుకొని ప్రయోగిస్తే ఎంతవరకు ఆశించిన ఫలితాలు వస్తాయో ఇరాన్ సైనికాధికారులు చెప్పలేకపోతున్నారు. ఇలాంటి సూపర్ టార్పెడోల వేగం, శబ్దం చాలా ఎక్కువ. కచి్చతంగా లక్ష్యాన్ని ఛేదించడం కష్టమని అంటున్నారు. → అమెరికాకు చెందిన భారీ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ అబ్రహం లింకన్’ప్రస్తుతం ఇరాన్ సమీపంలోనే మోహరించి ఉంది. దీనికి అనేక అంచెల్లో బలమైన రక్షణ వ్యవస్థ ఉంది. హూట్ టార్పెడోతో ఢీకొట్టడం అంత సులువు కాదని అమెరికా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. → హూట్ టార్పెడోను సబ్మెరైన్లు, నౌకలు, స్పీడ్బోట్ల నుంచి ప్రయోగించవచ్చు. → హూట్ రేంజ్ 15 కిలోమీటర్లే కాబట్టి దగ్గరగా వచి్చనప్పుడు శత్రుసైన్యం ముందుగానే కనిపెట్టి ప్రతిదాడి చేసేందుకు ఆస్కారం ఉంది. → ఇరాన్ తన హూట్ సూపర్ టార్పెడోను ప్రయోగించగల ఏకైక ప్రదేశం హార్మూజ్ జలసంధి వంటి పరిమిత జలాల్లో మాత్రమే. → ఇరాన్ చేతిలో ఆకస్మిక దాడికి గురవుతామన్న అంచనాతో అమెరికా విమాన వాహక నౌకలు హార్మూజ్కు దూరంగా ఉంటూ, సురక్షితమైన దూరాల నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. → ఒకవేళ హూట్ టార్పెడో అద్భుతంగా పనిచేసి అమెరికా విమాన వాహక నౌకను తాకితే, అది గణనీయమైన నష్టాన్ని కలిగించగలదు. కానీ, అందుకు అవకాశాలు తక్కువేనని నిపుణులు పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్