breaking news
Super Star Rajani kanth
-
బస్ డిపోలో రజనీకాంత్ సందడి.. ఫోటోలు వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినీ జీవితం గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి.. తనదైన నటన, స్టైల్‌తో సూపర్ స్టార్‌గా ఎదిగాడు. అంతకు ముందు కుటుంబ పోషణ కోసం బస్ కండక్టర్‌గా పని చేశాడు. కొన్నాళ్ల తర్వాత ఉద్యోగం వదిలేసి చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. కెరీర్ తొలినాళ్లలో చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆ తర్వాత విలన్‌గానూ నటించాడు. చాలా కాలం తర్వాత హీరోగా అవకాశం రావడం.. బాక్సాఫీస్ వద్ద అవి విజయవంతం కావడంతో రజనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఒకప్పుడు కేవలం తమిళనాడు వరకే పరిమితమైన అభిమాన దళం... ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించింది. డెభై ఏళ్ల వయసులో కూడా రజనీ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘జైలర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఆ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు రజనీకాంత్. The man who never forgets his roots despite earning in crores. ||#Rajinikanth | #Jailer | #600CrJailer|| pic.twitter.com/M9l4zcFTsJ — Manobala Vijayabalan (@ManobalaV) August 29, 2023 ఎంత ఎదిగినా..ఒదిగే సాధారణంగా ఏ హీరో అయినా తొలినాళ్లలో చాలా సింపుల్‌గా ఉంటాడు. ఒకటి రెండు హిట్లు పడితే చాలు.. మాట, యూటిట్యూడ్.. అన్నీ మారిపోతాయి. ఫ్యాన్స్‌కు దూరంగా ఉంటారు. కానీ రజనీకాంత్ అలా కాదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగే ఉంటారు. సైడ్ క్యారెక్టర్లు చేసే స్థాయి నుంచి సూపర్ స్టార్ స్థాయికి ఎదిగినా.. ఆయన మాట, ప్రవర్తనలో మార్పు రాలేదు. సూపర్‌స్టార్ అనే గర్వం కొంచెం కూడా ఉండదు. చాలా సింపుల్‌గా జీవితాన్ని గడిపేందుకే రజనీ ఇష్టపడతాడు. బస్ డిపోలో రజనీ సందడి సినిమాల్లోకి రాకముందు రజనీ బెంగళూరులోని బీఎంటీసీ బస్ డిపోలో కండక్టర్‌గా పనిచేశాడు. తాజాగా ఆయన ఆ బస్ డిపోకి వెళ్లి సందడి చేశాడు. కొద్ది సేపు బస్ స్టేషన్ అంతా తిరిగి.. పాత రోజులను గుర్తు చేసుకున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మికులతో ముచ్చటించారు. ఎలాంటి సమాచారం లేకుండా వచ్చిన సూపర్‌స్టార్ రజనీని చూసి అక్కడి సిబ్బంది ఆశ్యర్యపోయింది. అతనితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. రజనీ కూడా చాలా ఓపిగ్గా అందరితో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రజనీకాంత్ సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. Just IN: #Rajinikanth made a surprise visit today to Bengaluru, Jayanagar Bus🚌🚏 Depot where he started his career as conductor. SELF made superstar for a reason! ||#Jailer | #600CrJailer|| pic.twitter.com/iYNXDWZmDD — Manobala Vijayabalan (@ManobalaV) August 29, 2023 Thalaivar #Rajinikanth @ @BMTC_BENGALURU depot in Jayanagar. pic.twitter.com/i2g756Vynq — ChristinMathewPhilip (@ChristinMP_) August 29, 2023 -
కండక్టర్ టు కథానాయకుడు ఒరు నల్ల ప్రయాణం
‘‘బాబాయ్... జీవితంలో ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. కష్టపడందే ఏదీ రాదు. కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు.’’ ‘నరసింహా’ సినిమాలో రజనీకాంత్ చెప్పిన డైలాగ్ ఇది. ఈ డైలాగ్ రజనీ జీవితానికి అద్దం పడుతుంది. అనుకున్నది సాధించడానికి రజనీ చాలా కష్టపడ్డారు. సాధించినదాన్ని నిలుపుకోవడానికి ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. కష్టం... రజనీ... వేరు వేరు కాదు. అలవాటైపోయిన కష్టం రజనీకి ఎంతో ఇష్టమైపోయింది. సాదాసీదా కండక్టర్ నుంచి సూపర్‌స్టార్ వరకు... రజనీది ఒక మంచి ప్రయాణం. ఎన్నో అవార్డులూ, రివార్డులు... ఇప్పుడు ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం. ఇదు ఒరు నల్ల ప్రయాణం! అంటే.. ఇది ఒక మంచి ప్రయాణం!! అమ్మానాన్న.. అక్క.. ఇద్దరు అన్నయ్యలు.. చిన్నప్పుడు రజనీకాంత్ జీవితం వీళ్ల చుట్టూనే. అమ్మానాన్న పెట్టిన పేరు శివాజీరావ్ గైక్వాడ్. మైసూరులో మరాఠీ కుటుంబంలో పుట్టాడు శివాజీ. తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్. శివాజీకి తొమ్మిదేళ్ల వయసున్నప్పుడే తల్లి చనిపోయారు. అలాగే ఒక అన్నయ్య కూడా తిరిగి రాని లోకాలకు వెళ్లారు. ఇక నాన్న, అన్నయ్య సత్యనారాయణలే శివాజీ లోకం. శివాజీ చురుకైనవాడు. ఫుట్‌బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్ అంటే ఇష్టం. ఈ మూడేనా? యాక్టింగ్ అంటే కూడా చాలా ఇష్టం. ఆ ఇష్టం పెరిగిపోవడానికి ఒక కారణం ‘రామకృష్ణ మఠం’. స్కూల్ అయిపోగానే అన్నయ్యతో కలిసి శివాజీ ఆ మఠానికి వెళ్లేవాడు. వేద మంత్రాలు నేర్చుకున్నాడు. బోలెడన్ని సేవలు చేసేవాడు. భవిష్యత్తులో రజనీ దారి ఆధ్యాత్మిక దారి అని రాసిపెట్టి ఉందనడానికి ఇదొక నిదర్శనం. అలాగే భవిష్యత్తులో నటుడు కావడానికి ఓ దారి రామకృష్ణ మఠం. అక్కడ ఏడాదికోసారి డ్రామాలు వేసేవారు. వాటిలో శివాజీ ఉత్సాహంగా పాల్గొనేవాడు. మెల్లిగా నటన మీద ఆసక్తి పెరిగిపోయింది. మఠంలోనే కాకుండా విడిగా స్టేజ్ నాటకాల్లో నటించడం మొదలుపెట్టాడు. చదువు బ్యాక్ సీట్ తీసుకుంది... నటన ఫ్రంట్ సీట్కొచ్చేసింది. మనసును పూర్తిగా నటన ఆక్రమించేసింది. కాలేజీకి వెళ్లి, బుద్ధిగా చదువుకుందామంటే మనసు కుదురుగా ఉండనివ్వలేదు. ఆలోచనలన్నీ నటనవైపే! ఇక లాభం లేదనుకుని, తెలిసినవాళ్ల ద్వారా శివాజీని కండక్టర్‌గా చేర్పించారు సత్యనారాయణ. బస్సు టికెట్లు తెంచుతున్నప్పటికీ సినిమా టికెట్ల మీదే ధ్యాస. టికెట్లు కొనాలని కాదు... తన సినిమా టికెట్ అందరూ కొనాలని! ఇలాంటి కలల్లో ఉన్న శివాజీని ‘నీ ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి.. సినిమాల్లోకి వెళ్లొచ్చుగా’ అన్నారు స్నేహితులు. రెండంటే రెండేళ్లు కండక్టర్‌గా చేసి, కలను నెరవేర్చుకోవడానికి మైసూర్ టు మద్రాస్ ప్రయాణం అయ్యాడు శివాజీ. మద్రాసులో ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఈ ప్రయాణానికి సహాయపడిన ఎవరినీ శివాజీ మరచిపోలేదు. ‘‘నేను కండక్టర్‌గా పనిచేసే రోజుల్లోనే నాలో నటుడున్నాడని గుర్తించిన ఆ బస్సు డ్రైవర్, నాకు అండగా నిలిచిన నా స్నేహితుడు రాజ బహుదూర్, నన్ను నటుణ్ణి చేయడానికి ఎన్నో త్యాగాలు చేసిన మా అన్నయ్య సత్యనారాయణ... వీళ్లందరికీ నా కృతజ్ఞతలు’’ అన్నారు రజనీకాంత్‌గా మారిన శివాజీ. దాదాసాహెబ్ ఫాల్కే ప్రకటన వచ్చిన తర్వాత రజనీ విడుదల చేసిన ప్రకటనలో ఈ ముగ్గురి ప్రస్తావన ఉంది. ఈ ముగ్గురేనా? ఊహూ.. ఈ సందర్భంగా రజనీ చాలామందిని గుర్తు చేసుకున్నారు. ‘రజనీకాంత్’ అని నామకరణం చేసి, ‘అపూర్వ రాగంగళ్’ (1975) చిత్రం ద్వారా నటుణ్ణి చేసిన దర్శకుడు కె. బాలచందర్ పేరుని, హీరో నుంచి సూపర్ స్టార్‌గా ఎదగడానికి అవకాశం ఇచ్చిన ఇతర దర్శక–నిర్మాతలు, టెక్నీషియన్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, చివరకు తన స్నేహితుడు కమలహాసన్ – ఇలా అందరికీ కృతజ్ఞతలు తెలిపి, తనను ఇంతటివాడిని చేసిన ప్రజాదేవుళ్లు, అభిమానులు... అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎందుకంటే.. నేను శివాజీని..! సినిమా హీరో అంటే తెల్లగా ఉండాలా? అక్కర్లేదు.. నల్లగా ఉన్నా ‘నల్ల (మంచి) కథానాయకుడు’ అవగలుగుతారు. అందుకు మంచి ఉదాహరణ రజనీకాంత్. ఇంతకీ తనలో ఏం నచ్చి బాలచందర్ నటుణ్ణి చేయాలనుకున్నారంటే... నడకలో వేగం, కళ్లల్లో తీక్షణత, స్టయిల్ చూసి! నిజానికి బాలచందర్ కళ్లల్లో శివాజీ పడినప్పుడు అతను వేరే నటుణ్ణి అనుకరించే పని మీద ఉన్నాడు. ఎవరా నటుడంటే ప్రముఖ నటుడు శివాజీ గణేశన్. ‘అబ్బాయ్! నువ్వెందుకు శివాజీలా నటిస్తున్నావ్’ అని బాలచందర్ అడిగితే, ‘ఎందుకంటే నేను కూడా శివాజీనే కదా’ అని తడుముకోకుండా బదులిచ్చాడు శివాజీ. ‘చురుకైనవాడివే’ అన్నారు బాలచందర్. ‘అపూర్వ రాగంగళ్’లో రజనీకి ఆయన ఇచ్చినది చిన్న పాత్రే అయినా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కన్నడంలో రజనీ నటించిన ‘కథా సంగమ’ విడుదలైంది. అదే ఏడాది (1976) తెలుగుకి పరిచయం అయ్యారు రజనీ. తమిళంలో తాను తెరకెక్కించిన ‘అవళ్ ఒరు తొడర్ కదై’ సినిమాను తెలుగులో ‘అంతులేని కథ’గా రీమేక్ చేస్తూ, కీలక పాత్రకు రజనీని తీసుకున్నారు బాలచందర్. అందులో తాగుబోతు అన్నయ్యగా రజనీ అద్భుతంగా నటించారు. నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ నటనకు పాజిటివ్ రివ్యూ వచ్చింది. రజనీలోని పూర్తి స్టయిల్ని చూపించిన చిత్రం ‘మూండ్రు ముడిచ్చు’ (1976). ఈ సినిమాలో రజనీ స్టయిల్‌గా సిగరెట్ ఎగరేసి, పట్టుకోవడం అందరికీ నచ్చేసింది. ‘ఏం స్టయిల్..’ అంటూ అభిమానులు చప్పట్లు కొట్టారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో ఆకట్టుకుంటూ, దూసుకెళుతున్న రజనీకి వెనక్కి తిరిగి చూసుకునే పనిలేకుండాపోయింది. 1978లో చేసిన ‘భైరవి’ ద్వారా హీరోగా మారారు. ఒక్క 1977లోనే ఆయనవి దాదాపు 15 సినిమాలు విడుదలయ్యాయి. వాటిలో తెలుగులో లీడ్ యాక్టర్‌గా చేసిన తొలి సినిమా ‘చిలకమ్మ చెప్పింది’ ఒకటి. తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం... ఇలా దక్షిణాదిన నాలుగు భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న రజనీకాంత్ హిందీలో చేసిన తొలి చిత్రం ‘అంధా కానూన్’ (1983). ఇందులో అమితాబ్ అతిథి పాత్ర చేశారు. అది సూపర్ డూపర్ హిట్. పదేళ్లల్లో వంద సినిమాలు 1975 నుంచి 1985 వరకూ రజనీ 100 సినిమాల్లో నటించారు. వందో సినిమాగా ‘శ్రీరాఘవేంద్ర’ (1985) చేశారు. నిజజీవితంలో రజనీకాంత్ రాఘవేంద్ర స్వామి భక్తుడు. ఇందులో రాఘవేంద్ర స్వామిగా నటించారు. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించకపోయినా అప్పటివరకూ మాస్ క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చిన రజనీ... దేవుడి పాత్రలో ఒదిగిపోయిన వైనం భేష్ అనిపించుకుంది. మళ్లీ రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన రజనీ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘దళపతి’ (’91) ఒకటి. ఆ తర్వాత రజనీ స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన చిత్రం సురేష్ కృష్ణ ‘బాషా’ (1995). సాదాసీదా జీవితం గడిపే ఆటో డ్రైవర్ బాషా నిజానికి డాన్ అనే కథతో తెరకెక్కిన ఈ చిత్రం ఆ తర్వాత ఎన్నో చిత్రాలకు కథావస్తువుగా ఉపయోగపడింది. ‘నేను ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ అని ఆ సినిమాలో రజనీ చెప్పిన డైలాగ్, ఆయన స్టయిల్‌కు తగ్గట్లు ‘స్టయిలు స్టయిలులే..’ పాట – మొత్తంగా సినిమా అంతా చాలా బాగుంటుంది. ఆ తర్వాత చేసిన ‘ముత్తు’, ‘అరుణాచలం’, ‘నరసింహా’.. వంటివన్నీ హిట్ బాటలో వెళ్లాయి. ‘లకలకలక...’ అంటూ ‘చంద్రముఖి’లో చేసిన సందడిని సూపర్ అన్నారు ఫ్యాన్స్. ‘నాన్నా.. పందులే గుంపు గా వస్తాయి. సింహం సింగిల్‌గా వస్తుంది’ అని ‘శివాజీ’లో చెప్పిన డైలాగ్, అదే సినిమాలో ఆయన తెల్లబడడానికి చేసే ప్రయత్నాలు, విలన్ని ఎదుర్కొనే సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ‘రోబో’ది ఓ డిఫరెంట్ రూట్. కొంచెం వయసు మీద పడ్డ ‘కబాలీ’గా, ‘కాలా’గా రజనీ మెరిశారు. ప్రస్తుతం ‘అన్నాత్తే’లో నటిస్తున్నారు. సినిమాలకు తమ అభిమాన హీరో ఫుల్స్టాప్ పెడితే? ఈ భయం ఫ్యాన్స్కెప్పుడూ ఉంటుంది. రజనీకాంత్ రిటైర్మెంట్ ప్రకటిస్తే తట్టుకోగలరా? ఊహూ... రజనీకి ఇప్పట్లో ఆ ఆలోచన లేదు. రజనీ ‘నల్ల’ (మంచి) నటుడు. వివాదాలు లేని ‘నల్ల’ మనిషి. ‘కబాలీ’లో రజనీ... ‘మంచిది’ అని తనదైన స్టయిల్లో డైలాగ్ చెబుతారు. కండక్టర్ టు కథానాయకుడు... రజనీది ఒక మంచి ప్రయాణం. మంచిది. ఇప్పుడు... రజనీ ‘దాదా’. మరీ మంచిది. ఆయన భవిష్యత్తులో మరెన్నో విజయాలు చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరీ మరీ మంచిది. తమిళ... అమితాబ్ రజనీకాంత్‌కి అమితాబ్ బచ్చన్ అంటే ఇష్టం. ప్లాన్ చేసింది కాదు కానీ అమితాబ్ నటించిన పలు హిందీ చిత్రాల తమిళ రీమేక్స్‌లో నటించారు రజనీ. హిందీలో అమితాబ్ చేసిన ‘అమర్ –అక్బర్ –ఆంథోనీ’ తమిళ రీమేక్ ‘శంకర్ –సలీమ్ –సైమన్’లో రజనీ నటించారు. అలాగే ‘మజ్బూర్’ (నాన్ వాళవైప్పేన్), ‘డాన్’ (బిల్లా), ‘త్రిశూల్’ (మిస్టర్ భారత్), ‘దీవార్’ (తీ) వంటి రీమేక్స్‌లోనూ చేశారు. చూపులు కలిసిన శుభవేళ 1981 ఫిబ్రవరి 26న లతను పెళ్లాడారు రజనీకాంత్. చెన్నైలోని ప్రసిద్ధ యతిరాజ్ కాలేజీ స్టూడెంట్ లత. క్యాలేజీ మ్యాగజైన్‌కి సంబంధించిన ఇంటర్వ్యూ కోసం రజనీని కలిశారు లత. ఆ ఇంటర్వ్యూ కలిపింది ఇద్దర్నీ అనాలి. పెద్దల సమక్షంలో తిరుపతిలో లత మెడలో మూడు ముడులు వేశారు రజనీ. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఐశ్వర్య, సౌందర్య. ధనుష్, శ్రుతీహాసన్‌తో తెరకెక్కించిన ‘3’ చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు ఐశ్వర్య. తండ్రితో ‘కొచ్చాడయాన్’ (తెలుగులో ‘విక్రమసింహ’) సినిమా తెరకెక్కించారు సౌందర్య. తమిళ హీరో ధనుష్‌తో ఐశ్వర్య పెళ్లయింది. వీరికి ఇద్దరు కుమారులు. అశ్విన్‌కుమార్‌తో సౌందర్య వివాహం అయింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అశ్విన్ నుంచి సౌందర్య విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత వ్యాపారవేత్త విశాగన్ వనంగాముడిని పెళ్లాడారామె. ఎదిగినా... ఒదిగే! సినిమాల్లో ఆర్భాటంగా కనిపించే రజనీ నిజజీవితంలో మాత్రం సింపుల్ లైఫ్‌ని ఇష్టపడతారు. చిన్నప్పుడు రామకృష్ణ మఠంలో సేవలు చేసిన రజనీ కొన్నేళ్లుగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారు. హిమాలయాలకు వెళతారు. ధ్యానంలో మునిగిపోతారు. ఒక గుడికి రజనీ సాధారణ బట్టల్లో చాలా సాదాసీదాగా వెళ్లారు. దర్శనం అయ్యాక ఒక పిల్లర్ దగ్గర కూర్చుని ఉన్న ఆయనను బిచ్చ గాడు అనుకున్న ఒకావిడ పది రూపాయలు ఇచ్చింది. ఆ తర్వాత గుర్తుపట్టి రజనీని క్షమించమని కోరింది. ‘‘ఇదంతా ఆ దేవుడి లీల. ‘నువ్వు సూపర్స్టార్వి కాదు... ఇది శాశ్వతం కాదు’ అని చెప్పడానికే దేవుడు ఇలా చేస్తుంటాడు’’ అని ఆమెతో రజనీకాంత్ అన్నారు. ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగే ఉండాలనే విషయానికి రజనీకాంత్ ఓ ప్రతీక. 51వ దాదాసాహెబ్ పురస్కారాన్ని 2019వ సంవత్సరానికి గాను ఐదుగురు సభ్యులు గల జ్యూరీ రజనీకాంత్‌కు సిఫారసు చేయగా కేంద్రం ఆమోదించినట్టు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జావడేకర్ వెల్లడించారు. ‘‘ఆశాభోంస్లే, మోహన్ లాల్, విశ్వజిత్ ఛటర్జీ, శంకర్ మహదేవన్, సుభాష్ ఘయ్‌లతో కూడిన జ్యూరీ ఈ పురస్కారం ఎంపికలో ఏకగ్రీవంగా రజనీ పేరును ప్రతిపాదించింది. కేంద్రం ఆమోదించింది. రజనీ 50 ఏళ్లుగా సినీరంగంలో బాద్షాగా నిలిచారు. వచ్చే మే 3న జాతీయ చలనచిత్ర అవార్డు ల ప్రదానోత్సవంలో ఈ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది’’ అని పేర్కొన్నారు. అనేక తరాల ఆదరణకు పాత్రుడైన, చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమయ్యే కృషి చేసిన, వైవిధ్యభరితమైన పాత్రలను పోషించిన, సమ్మోహితులను చేసే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి రజనీకాంత్. ‘తలైవా’కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం వరించడం అంతులేని ఆనందాన్ని అందించే విషయం. – ప్రధాని నరేంద్ర మోదీ 40ఏళ్లుగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలకు జీవం పోసిన రజనీకాంత్‌కు ఈ పురస్కారం ద్వారా తగిన గుర్తింపు లభించింది. – ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సినీరంగానికి రజనీకాంత్ చేసిన సేవలకు తగిన గుర్తింపు లభించింది. కర్నాటకలో జన్మించిన మరాఠా వ్యక్తి.. స్టైలిష్ తమిళ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన శివాజీరావు గైక్వాడ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన మేనరిజం, ప్రతిభతో వెండితెరపై గణనీయమైన ప్రభావాన్ని చూపారు. – ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నటుడిగా దశాబ్దాలపాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్‌కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం. – తెలంగాణ సీఎం కేసీఆర్ నా మిత్రుడు రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినందుకు సంతోషంగా, గర్వంగా ఉంది. ఇలాంటి పురస్కారాలు మరెన్నో రజనీకాంత్‌కు రావాలి. – మోహన్‌బాబు రజనీకాంత్‌గారిని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా శుభాకాంక్షలు. ఆయనకు మంచి గుర్తింపు లభించింది. – మోహన్‌లాల్ నా స్నేహితుడు రజనీకాంత్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డుకు రజనీకాంత్ నిజంగా అర్హత కలిగినవాడు. ఫిల్మ్ ఇండస్ట్రీకి రజనీ చాలా కంట్రిబ్యూట్ చేశారు. నీకు (రజనీ) నా హృదయపూర్వక శుభాకాంక్షలు. – చిరంజీవి -డి.జి. భవాని -
తలైవాకి ఆశ ఉంది.. కానీ ఓపిక పట్టాల్సిందే..!
సాక్షి, చెన్నై: దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ మంగళవారం 68వ వసంతంలోకి అడుగు పెట్టారు. తలైవాకు శుభాకాంక్షలు తెలుపుకునేందుకు పోయెస్ గార్డెన్ వైపుగా అభిమాన లోకం పోటెత్తింది. అక్కడ ఆయన లేకపోవడం నిరాశను మిగిల్చినా, అభిమానం ఏమాత్రం తగ్గలేదు. తమకు కథానాయకుడు దూరంగా ఉన్నా, సంబరాల్లో అభిమాన లోకం తగ్గలేదు. దక్షిణ భారత చలన చిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి లాగేందుకు ఆయన అభిమాన లోకం తీవ్రంగానే ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బర్త్‌డే సందర్భంగా ఏదేని ప్రకటన చేస్తారా అన్న ఆశతో ప్రతి ఏటా బర్త్‌డే వేళ అభిమానులు ఎదురు చూడడం పరిపాటే. అయితే, ఈ ఏడాది బర్త్‌డేకు రాజకీయ ప్రాధాన్యతను అభిమాన లోకం పెంచింది. ఇందుకు కారణం అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలే. దీంతో తలై‘వా’ అన్న పిలుపు మిన్నంటుతోంది. కథానాయకుడు రాజకీయాల్లో వచ్చేసినట్టే అన్న ప్రచారాలు సైతం ఈ సమయంలో ఊపందుకున్నాయి. అయితే, ఎక్కడా రజనీ చిక్కలేదు. ఈ నేపథ్యంలో బర్త్‌డే వేళ తమ హీరో, రాజకీయ నేతగా అవతరించేనా అన్న ఆత్రుతతో అభిమాన లోకం మంగళవారం చెన్నైకు పోటెత్తింది. అభిమానులకు దూరంగా : ప్రతి ఏటా రజనీ బర్త్‌డే సందర్భంగా అభిమానులు పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసం వద్దకు తరలి రావడం జరుగుతూ వస్తున్నది. ఈ సమయంలో అభిమానుల్ని పలకరించే వారు. అయితే, గత ఏడాది అమ్మ జయలలిత మరణంతో బర్త్‌డేకు రజనీ దూరంగానే ఉన్నారు. ఈ సారి మాత్రం ఆయన్ను రాజకీయాల్లోకి లాగడం లక్ష్యం అన్న నినాదంతో అభిమానులు తరలి వచ్చేందుకు సిద్ధ పడ్డారు. దీనిని పసిగట్టినట్టుంది...అందుకే కాబోలు ఈ సారి పోయెస్ గార్డెన్లో అభిమానులకు రజనీ దర్శనం ఇవ్వలేదు. అçసలు ఆయన ఇంట్లోనే లేదన్న సమాచారం అభిమానులకు నిరాశే. తగ్గని అభిమానం : రజనీకాంత్‌ను చూడడానికి, ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు అభిమానులు రాష్ట్రం నలు మూలల నుంచి తండోప తండాలుగా పోయెస్ గార్డెన్‌కు ఉదయాన్నే పోటెత్తారు. గతంలో జయలలిత బతికి ఉన్నప్పుడు పోయెస్ గార్డెన్‌లోని రోడ్లన్నీ పోలీసు నిఘా వలయంలో ఉండేది. ఈ దృష్ట్యా, అటు వైపుగా ఎవ్వరు వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం అమ్మ లేని దృష్ట్యా, భద్రత కూడా లేదు. దీంతో తండోప తండాలుగా తరలి వచ్చిన వారితో ఆ పరిసరాలు కిటకిట లాడాయి. ఎక్కడికక్కడ అభిమానులు రజనీ ఫొటోలను, నీలం, తెలుపు, ఎరుపు రంగుతో కూడిన జెండాల్ని చేత బట్టి తలైవా నినాదాన్ని మిన్నంటేలా చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అభిమానుల్ని అడ్డుకున్నారు. రజనీ ఇక్కడ లేదని, ప్రజలకు ఇబ్బంది కల్గించ వద్దని హెచ్చరించారు. దీంతో కొందరు అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మరి కొందరు తాము తీసుకొచ్చిన కేక్‌లను అక్కడే కత్తిరించి సంబరాలు చేసుకుని ముందుకు సాగారు. ఆ తదుపరి అభిమానులు మళ్లీ తరలి రాకుండా పోయెస్‌గార్డెన్‌లోని అన్ని మార్గాల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక, రజనీకాంత్ ఎక్కడ అన్న ప్రశ్న బయలు దేరింది. ఆయన బెంగళూరులో ఉన్నట్టు కొందరు, కాదు..కాదు చెన్నై శివార్లలోని కేలంబాక్కంలోని ఓ రిసార్ట్‌లో ఉన్నట్టు మరికొందరు వ్యాఖ్యానించారు. పోస్టర్ల హోరు...సేవల జోరు : రజనీ అభిమాన సంఘాల నేతృత్వంలో రాష్ట్రంలో అనేక చోట్ల సేవా కార్యక్రమాలు జరిగాయి. రక్తదానం, అన్నదానం , వైద్య శిబిరాలతో ముందుకు సాగారు. రజనీ బ్యానర్లు, ఫ్లెక్సీలను తమ తమ ప్రాంతాల్లో హోరెత్తించారు. అలాగే, దివంగత సీఎంలు కామరాజర్, అన్నాదురై చిత్ర పటాల మధ్యలో రజనీ ఫొటోతో పోస్టర్లు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఇందులో మూడో కరుప్పు తమిళన్(నలుపు తమిళుడు), ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, నీతోనే ఈ తమిళనాడుకు న్యాయం అన్న నినాదాల్సి అభిమాన లోకం పొందుపరిచారు. ఇక, రజనీ కాంత్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తిన అభిమానులు, రాజకీయ, సినీ ప్రముఖులు ఎక్కువే. ఇందులో డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ కూడా ఉన్నారు. ఆశ ఉంది...ఓపిక పట్టాల్సిందే : రజనీ రాజకీయాల్లోకి రావాలన్న ఆశ అందరిలోనూ ఉందని, అయితే, ఇందుకు మరింతగా ఓపిక పట్టాల్సి ఉందని ఆయన సోదరుడు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కృష్ణగిరిలో జరిగిన రజని బర్త్‌డే వేడుకలో ఆయన పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు సహాయకాలను అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలనే ఆశ రజనీకి ఉందన్నారు. అయితే, ఆ సమయం ఇంకా రాలేదన్నారు. ఆయన రాజకీయాల్లోకి రావడం సంతోషకరమని, అది ఎప్పుడు అనేది ఆయనే ప్రకటిస్తారన్నారు. అంత వరకు ఓపికగా ఉండాలని అభిమానులకు సూచించారు. తమ తల్లిదండ్రుల పూర్వికం కృష్ణగిరిలోని నాచ్చికుప్పం గ్రామం అని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపం వద్దకు సైతం రజనీ కోసం అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆయన అక్కడ కూడా లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అయితే టీనగర్‌లోని రాఘవేంద్రస్వామి ఆలయాన్ని దర్శించి రజనీ ఆయురారోగ్యాలను కాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. సీఎం పళని స్వామి రజనీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు. -
కలెక్టర్ బంఫర్ ఆఫర్.. కానుకగా ‘కబాలి’ టికెట్లు!
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న అభిమానగణం గురించే అందరికీ తెలిసిందే. ఆయన సినిమాలంటే అభిమానులు పడి చస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పుదుచ్చేరి కలెక్టర్ తాజాగా అభిమానులకు ఓ ఆఫర్ ఇచ్చారు. స్వచ్ఛభారత్ లాంటి ప్రజాసేవల్లో పాల్గొన్నవారికి రజనీ తాజా సినిమా ‘కబాలి’ టికెట్లు కానుకగా ఇస్తామని ప్రకటించారు. ఊహించినట్టే ఈ ప్రకటనకు అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది. ఈ విషయాన్ని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ట్విట్టర్లో తెలిపారు. ఈ నేపథ్యంలో రజనీకి కిరణ్ బేడి ఓ విజ్ఞప్తి చేశారు. పుదుచ్చేరి అభివృద్ధి కోసం ఆయన ఈ కేంద్రపాలిత ప్రాంతం బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండాలని కోరారు. Request Super Star Rajani to b Brand Ambassador of #prosperouspuducherry to be #OpenDeficationFree #ODF @PMOIndia https://t.co/fbCXLCTKuF — Kiran Bedi (@thekiranbedi) 30 June 2016