breaking news
State Civil Supplies Department
-
క్యారీ బ్యాగ్‌కు రూ.5 వసూలు.. షాపింగ్ మాల్‌కు జరిమానా
సాక్షి, హైదరాబాద్: షాపింగ్‌మాల్స్ తమ సంస్థ లోగోతో ముద్రించిన క్యారీబ్యాగ్‌లను వినియోగదారుడికి ఉచితంగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాలశాఖ వినియోగదారుల వివాదాల పరిష్కార కేంద్రం ఆదేశించింది. షాపర్స్ స్టాప్ లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను రూ.5కు విక్రయించడంపై హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఉచితంగా ఇవ్వాలని, లేదంటే అది విక్రయించడం ద్వారా వినియోగదారుని డబ్బుతో సంస్థ ప్రచారం చేసుకోవడం అవుతుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంస్థ లోగో ఉన్న బ్యాగులను ఉచితంగా ఇవ్వాలని గతంలో చండీగఢ్ వినియోగదారుల ఫోరం తీర్పునిచ్చింది. దీని ఆధారంగా అధికారులు షాపర్స్ స్టాప్‌కు నోటీసులు జారీ చేసి రూ.7 వేలు జరిమానా విధించారు. దుకాణదారులతో ఎటువంటి వివాదాలు తలెత్తినా, వినియోగదారులు అన్ని ప్రభుత్వ పనిదినాల్లోనూ ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తమ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వినియోగ వ్యవహారాల కమిషనర్ తెలిపారు. ఎర్రమంజిల్‌లోని కార్యాలయంలో నేరుగా లేదా 1800425 00333 టోల్‌ఫ్రీ నంబరుకు సంప్రదించి సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. -
రాష్ట్రవ్యాప్తంగా రేషన్ ‘పోర్టబిలిటీ’
- ఇప్పటికే ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లో అమలు - ఆధార్ అనుసంధానం తర్వాత రాష్ట్రమంతా అమలు సాక్షి, హైదరాబాద్: రేషన్ వినియోగదారుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. తమకు కేటాయించిన రేషన్ దుకాణంలోనే కాకుండా, ఎక్కడ వీల యితే అక్కడ రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ‘రేషన్ పోర్టబిలిటీ’ విధానంపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. హైదరాబాద్ పరిధిలోని 1,545 రేషన్ దుకాణాల్లో ప్రయోగాత్మకంగా ఈ నెల ఒకటో తేదీ నుంచి రేషన్ పోర్టబిలిటీ విధానం అమల్లోకి రాగా, ఇప్పటివరకు సుమారు 70 వేల లావాదేవీలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయిం చారు. రెండు నెలల్లోగా రేషన్ పోర్టబిలిటీని పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని సివిల్ సప్లైస్ అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం వినియోగదారుల ఆధార్ కార్డుల అనుసంధానాన్ని వేగవంతంగా పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ–పాస్ అమలులో ఉన్న అన్ని రేషన్ షాపుల్లో పోర్టబిలిటీ సాధ్యమవుతుందని, దీంతో ఈ–పాస్‌లో వినియోగదారుల ఆధార్ కార్డు వివరాలను నమోదు చేయడమేనని అంటున్నారు. శరవేగంగా ఈ–పాస్: రాష్ట్రవ్యాప్తంగా ఈ–పాస్ యంత్రాలను అమర్చే కార్యక్రమం శరవేగంగా జరుగుతోందని ఆ శాఖ అధికార వర్గాలు చెప్పాయి. హైదరాబాద్‌లోని రేషన్ దుకాణాల్లో ఈ–పాస్ యంత్రాలను వినియోగించడం వల్ల 14 నెలల కాలంలో రూ.280 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17,200 రేషన్ దుకాణాల్లో ఈ–పాస్‌ను అమలు చేస్తే ఏటా రూ.800 కోట్లు ఆదా అవుతుందని అంచనా వేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని రేషన్ దుకా ణాలను ఈ–పాస్ పరిధిలోకి తెస్తున్నారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో పూర్తికాగా, ఈ జిల్లాలోని 800 రేషన్ దుకాణల పరిధిలో రూ.3.39 కోట్లు ఆదా అయినట్లు చెబుతున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ముగింపు దశలో ఉందని, మిగిలిన అన్ని జిల్లాల్లో 2 నెలల వ్యవధిలో పూర్తిస్థాయిలో యంత్రాలను అమర్చే పని పూర్తవుతుందని అధికార వర్గాల సమాచారం. ఈ–పాస్‌తో అక్రమాలకు చెక్ ఈ–పాస్ విధానాన్ని అమల్లోకి తెచ్చాక రేషన్ అక్రమాలకు తెరపడిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్‌లోని రేషన్ దుకాణల్లో ఈ–పాస్ యంత్రాలు వేలిముద్రలపై ఆధారపడినవి కాగా, కొత్త యంత్రాల్లో ఐరిష్ ఏర్పాట్లు చేశారు. వేలిముద్రల వల్ల కూడా అక్రమాలకు అవకాశం ఏర్పడిందని, వేలిముద్రలు అరిగిపోయిన వినియోగదారులు సరుకులు తీసుకునేందుకు వీలుగా ఆయా ప్రాంతాల సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్లకు అవకాశం కల్పించారు. దీంతో ఇది దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. ఈ కారణంగానే కొత్త ఈ–పాస్ యంత్రాల్లో ఐరిష్ సౌకర్యం కల్పించారు. కొత్త ఈ–పాస్ అమలులోకి వచ్చిన వెంటనే ‘రేషన్ పోర్టబిలిటీ’ అందుబాటులోకి వస్తుందని పౌరసరఫరాల శాఖ వర్గాలు చెప్పాయి. -
ఎన్నికల ఖర్చుపై పక్కా నిఘా ఉంచాలి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చుపై పక్కా నిఘా ఉంచాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు ఢిల్లీలోని నిర్వచన్ సదన్‌లో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎన్నికల విధులు నిర్వహించే నిఘా బృందాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ల వాహనాల న్నింటికీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) పరికరాలు అమర్చాలని అన్నారు. ఈ పరికరా లన్నింటినీ పరిశీలించడానికి ఉమ్మడి కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని, అనుమానిత బ్యాంకు ఖాతాలు, ఏటీఎంల ద్వారా జరిగే లావాదేవీలు, నగదు బదిలీలపై నిఘాను మరింత కట్టు దిట్టం చేయాలని పేర్కొన్నారు. బంగారు తనఖా రుణాల వేలం, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సేవా సంస్థల ఖాతాలపైనా నిఘా పెట్టాలని చెప్పారు. రహస్య సమాచార సేకరణ వ్యూహాలు, మత్తుపానీయాల తయారీ, అమ్మ కాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఇలా ఎన్నికల్లో వీటన్నింటిపై పక్కా నిఘా ఉంటే ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరగకుండా పూర్తి స్థాయిలో కళ్లెం వేసే వీలుం టుందని ఆయన అన్నారు.