breaking news
Stadium construction
-
చైనాలో అతి పెద్ద స్టేడియం
గ్వాంగ్జూ: ప్రపంచంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణానికి చైనా శ్రీకారం చుట్టింది. ‘ఫ్లవర్ సిటీ’గా పేరున్న గ్వాంగ్జూ నగరంలో కమలం ఆకారంలో ఈ స్టేడియం నిర్మిస్తున్నారు. చైనా జాతీయ ఫుట్‌బాల్ లీగ్ చాంపియన్ అయిన ‘గ్వాంగ్జూ ఎవర్‌గ్రాండ్’ టీమ్ యాజమాన్యం దీని రూపకర్త. ఈ జట్టు 2022లోగా దీనిని పూర్తి చేసి తమ హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగించుకోనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్దదైన బార్సిలోనా ఎఫ్‌సీ ‘క్యాంప్ నూ’ స్టేడియంకు మించి దాదాపు లక్షకు పైగా సామర్థ్యంతో కొత్త స్టేడియం నిర్మితమవుతోంది. గురువారం దీని పనులు ప్రారంభం కాగా మొత్తం బడ్జెట్ 1.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 13 వేల కోట్లు). -
ఆశలు చిగురించేనా..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో నిర్మితమౌతున్న క్రీడా వికాస కేంద్రాల(కేవీకే) పనులు రెండు అడుగులు ముందుకు.. నాలుగు అడుగులు వెనుక్కి అన్న చందంగా తయారయ్యాయి. క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని చెప్పిన గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో క్రీడాకారులకు అవసరమైన కనీస సౌకర్యాలను కల్పించలేదు. లక్షల కోట్ల వ్యయంతో కూడుకున్న ఒలింపిక్స్‌ను రాష్ట్రంలో నిర్వహించేస్తామని డాబులు కొట్టిన చంద్రబాబు అండ్ కో.. కనీసం రెండు కోట్ల విలువచేసే కేవీకేల నిర్మాణాలను కూడా పూర్తిచేయకపోయింది. తమ తప్పులను, మాయమాటలను ఎన్నికల ముందు కాంట్రాక్టర్లపై నెట్టేశారు. వారికి కనీస చెల్లింపులు జరపకుండా పనులను పాతరేశారు. ఇలా పాలకులు, అధికారుల నిర్లక్ష్యాలకు క్రీడాకారులు తీవ్రంగా నష్టపోయారు. తొలుత మినీ స్టేడియాలు.. తర్వాత కేవీకేలు రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2014 ఎన్నికలకు ఐదు నెలల ముందు మినీ (గ్రీన్‌ఫీల్డ్) స్టేడియాలను తెరపైకి తీసుకొచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక్కొక్క స్టేడియానికి రూ.2.10 కోట్ల నిధులను కేటాయించారు. ఎన్నికలకు ముందే చాలా చోట్ల ప్రభుత్వ స్థలాల్లో టెండర్ల ప్రక్రియను పూర్తిచేసి స్టేడియం నిర్మాణ పనులకు అప్పటి ప్రజాప్రతినిధుల చేతులమీదుగా శంకుస్థాపన చేశారు. మరికొన్ని చోట్ల విశాలమైన స్థలం, అనుకూలమైన ప్రదేశాలు లేక అధికారులు మిన్నకుండిపోయారు. అనంతరం చంద్రబాబు సర్కారు అధికారంలోకి రావడంతో సీన్ మారిపోయింది. 2017లో మినీ స్టేడియాల స్థానంలో క్రీడావికాస కేంద్రాల పేరు మార్చి తెరపైకి తీసుకొచ్చారు. జిల్లాలో శ్రీకాకుళం తప్పిస్తే.. ఆమదాలవలస, పాతపట్నం, పాలకొండ (సీతంపేట), టెక్కలి నియోకజకవర్గాల పరిధిలో మినీ స్టేడియం పనులు గత ఏడాది ప్రారంభమయ్యాయి. ఆమదాలవలసలోని ఎన్టీఆర్ గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం మాత్రం 2016 నవంబర్ 12న ప్రారంభమైంది. మినీ స్టేడియాలను నిర్మించి వదిలేశారు తప్పిస్తే.. అధికారుల పర్యవేక్షణ లోపిస్తుండటంతో నిరుపయోగంగా తయారయ్యాయి. పూర్తిస్థాయిలో ఇన్చార్జిలను నియమించలేదు. కొన్నిచోట్ల నియమించినా కాగితాలకే పరిమితం అవుతున్నారు. వారు స్థానికంగా ఉండకపోతుండటంతో ఎక్కడ గొంగళి అక్కడే చందంగా మారింది. ప్రస్తుతం మినీ స్టేడియాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. రూ.2 కోట్లతో కేవీకేలు.. 2016 డిసెంబర్ 17న శ్రీకాకుళం నగరంలో జరిగిన జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీల ప్రారంభోత్సవానికి హాజరైన అచ్చెన్నాయుడు.. అప్పటి క్రీడల మంత్రి హోదాలో జిల్లాకు ఐదు క్రీడా వికాస కేంద్రాల(కేవీకే)ను కేటాయిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారు. మినీ స్టేడియాల స్థానంలో నిర్మించే కేవీకేలను జిల్లాలో రాజాం, ఎచ్చెర్ల, నరసన్నపేట, ఇచ్ఛాపురం, పలాస నియోజకవర్గాల్లో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో కేవీకేకు రూ.2 కోట్లు చొప్పున కేటాయించారు. ఇది జరిగి ఏడాదిన్నర ముగిసిన తర్వాత టెండర్లు పిలిచి కాంట్రాక్ట్ పనులు కట్టబెట్టారు. ఇప్పటికీ పునాది స్థాయిలోనే.. ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలో రణస్థలం మండలం కొండములగాం వద్ద, రాజాం నియోజకవర్గ పరిధిలో కంచరాం వద్ద, ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట నియోజకవర్గాల్లో మాత్రం మండల కేంద్రాల్లోనే నిర్మితమవుతున్నాయి. రణస్థలంలో మినహా మిగిలిన చోట్ల పనులు ఇప్పటికీ పునాదిస్థాయి/పిల్లర్ల దశను దాటకపోవడం శోచనీయం. రాజాంలో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చెల్లింపులు చేయకపోవడం, అధికారుల హోదాల్లో మార్పులు చోటుచేసుకోవడం, అధికారులు పర్యవేక్షణ లోపించడం తదితర కారణాల వల్ల పనులు ముందుకు సాగడంలేదు. ఇక శ్రీకాకళం నియోజకవర్గానికి సంబంధించి కోడిరామ్మూర్తి స్టేడియం ఆధునికీకరణ పనులు జరుగుతుండటంతో గార మండల పరిధిలోని కళింగపట్నం పోర్టు సమీపంలో క్రీడామైదానంలో కేవీకే నిర్మాణం చేపట్టేందుకు శాప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులకు టెండర్లు ఇంకా ఖరారుకాలేదని అధికారులు చెబుతున్నారు. కొత్త సర్కారుపై కోటి ఆశలు గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా పాతరేసింది. జిల్లా కేంద్రంలో కోడిరామ్మూర్తి స్టేడియాన్ని చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. జిల్లా కేంద్రంలో క్రీడామైదానాలను నాశనం చేసేశారు. మినీ స్టేడియాలపై పర్యవేక్షణ లేదు. దీంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. సిబ్బంది పూర్తిస్థాయిలో లేరు. ఉన్న సిబ్బందికి, కోచ్‌లకు సకాలంలో జీతాలు చెల్లింపులు చేయడంలేదు. క్రీడల ఖిల్లాగా పేరుగాంచిన శ్రీకాకుళం జిల్లాపై ప్రజాప్రతినిధులు, అధికారులు శీతకన్నేయడంతో క్రీడాకారులు కీలక పోటీల్లో వెనుకంజ వేస్తున్నారు. సరైన ప్రోత్సాహం, మౌలిక సదుపాయాలు లేకపోవడమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రీడాలోకమంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకుంది. జగనన్న న్యాయం చేస్తారని క్రీడాకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. త్వరలో పనులు పూర్తిచేస్తాం ఆమదాలవలస, సీతంపేట, పాతపట్నం, టెక్కలి గ్రీన్ఫీల్డ్లను ఇదివరకే ప్రారంభించేశాం. ఇక జిల్లాలో ఇచ్ఛాపురం, పలాస, నరసన్నపేట, ఎచ్చెర్ల, రాజాం క్రీడా వికాస కేంద్రాలు గత ఏడాదే కేటాయింపు జరిగాయి. ఇటీవలి కళింగపట్నంలో కూడా అనుమతులు మంజూరు జరిగాయి. టెండర్లు పిలవాల్సి ఉంది. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం అన్ని చోట్లా పనులు జరుగుతున్నాయి. త్వరలో పనులు పూర్తిచేసి క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తాం. – బి.శ్రీనివాస్‌కుమార్, డీఎస్డీఓ/చీఫ్ కోచ్, శ్రీకాకుళం -
ఆటాడుకుందామా...!
భద్రాచలం : క్రీడారంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో అధునాతన స్టేడియాల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఇప్పటికే పినపాక నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భద్రాచలం, మధిర, ఇల్లెందు, పాల్వంచ నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాల నిర్మాణానికి అవసర మైన భూమిని గుర్తించిన అధికారులు.. ఈ నెలాఖరు నాటికి పనులకు టెండర్లు పిలిచేం దుకు రంగం సిద్ధం చేశారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని చోట్ల స్టేడియాలు ఉన్నప్పటికీ, వాటిలో క్రీడాకారులకు తగిన సౌకర్యాలు లేవు. అందుబాటులో ఉన్న గ్రౌండ్ల్లోనూ వసతులు లేక కొన్ని ఆటలకే పరిమితం చేయాల్సి వస్తోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల క్రీడాకారుల్లోని ప్రతిభను, ఆసక్తిని వెలికితీసే అవకాశం రావడం లేదు. ఈ నే పథ్యంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారులు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఐదెకరాల స్థలంలో అధునాతన హంగులతో స్డేడియాల నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించింది. ‘గ్రీన్ ఫీల్డ్ స్డేడియాస్’ అనే ప్రత్యేక ప్రాజెక్టులో భాగంగా ఒక్కో స్టేడియానికి రూ.2.50 కోట్లు మంజూరు చేసింది. ఇప్పటికే ఈ నిధులు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఖాతాలో జమ కావడంతో త్వరతగతిన పనులు పూర్తి చేసేందుకు సదరు అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అందరికీ అందుబాటులో ఉండేలా నియోజకవర్గ కేంద్రాల్లోనూ వీటిని నిర్మించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఐదెకరాల స్థల సేకరణ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లటంతో ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే భద్రాచలం, మధిర, ఇల్లెందు, పాల్వంచలో భూమిని గుర్తించారు. మిగతా చోట్ల కూడా సాధ్యమైనంత త్వరగా భూమిని అప్పగించేందుకు రెవెన్యూ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆటలన్నీ ఒకే ప్రాంగణంలో... గ్రీన్ ఫీల్డ్ స్డేడియాస్ ప్రాజెక్టులో భాగంగా చేపడుతున్న స్టేడియంలో అన్ని రకాల ఆటలకు అనువుగా ఉండేలా రూపకల్పన చేశారు. ఇండోర్ స్టేడియంతో పాటు, టేబుల్ టె న్నిస్, మినీ స్విమ్మింగ్ పూల్, షటిల్, టేబుల్ టెన్నిస్, జిమ్నాస్టిక్, క్రికెట్ వంటి క్రీడలు ఆడుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించనున్నారు. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలో స్టేడియం నిర్వహణ చూసుకునేందుకు అనువుగా కార్యాలయ భవనాన్ని కూడా నిర్మించనున్నారు. భద్రాచలం వంటి ప్రాంతంలో అధునాతన స్టేడియం నిర్మాణం ద్వారా గిరిజన క్రీడాకారులకు ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. వివిధ క్రీడల్లో ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించేందుకు, వాటిలో క్రీడాకారులకు తర్ఫీదు ఇచ్చేందుకు ఈ క్రీడా మైదానాలు ఉపకరిస్తాయని పలువురు అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తాం : కబీర్ దాస్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి క్రీడా మైదానాల నిర్మాణాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. ఇందుకు అవసరమైన స్థలాలను కేటాయించే విషయంలో రెవెన్యూ అధికారుల సహకారం బాగుంది. నాలుగు చోట్ల స్థలం గుర్తించినందున ఈ నెలాఖరు నాటికి టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా రంగానికి సంబంధించి భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని స్టేడియంలలో తగిన ఏర్పాట్లు చేస్తున్నాము.