breaking news
Smart Education
-
Telangana: 'స్మార్ట్'గా సర్కారీ స్కూల్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నెట్ సదుపాయం, ఆధునిక కంప్యూటర్ వ్యవస్థ, డిజిటల్ లైబ్రరీ, అన్నిటికీ మించి డిజిటల్ విద్యాబోధనకు అనుగుణంగా డిజిటల్ స్క్రీన్లు..తదితర ఏర్పాట్లతో రాష్ట్రంలోని స్కూళ్లను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని విద్యా కమిషన్ భావిస్తోంది. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత పెరగాలంటే పెద్ద స్కూళ్ళ ఏర్పాటే మార్గమని స్పష్టం చేస్తోంది. ఈ విధానంతో ప్రైవేటు స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థలను ముందుకు తీసుకెళ్ళొచ్చని అభిప్రాయపడుతోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి మండలానికి 2 లేదా 3 స్కూళ్ళు ఉంటే సరిపోతుందని సూచిస్తోంది. విద్యా రంగం సంస్కరణలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ వంద రోజులు స్కూళ్ళ నాణ్యతపై అధ్యయనం చేసింది. ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, స్థానిక ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను తెలుసుకుంది. తక్షణమే తీసుకోవాల్సిన దిద్దుబాటు చర్యలకు సంబంధించిన కొన్ని సిఫారసులతో త్వరలోనే నివేదిక సమర్పించనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు నివేదికలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. స్మార్ట్ విద్యా విధానంతో నాణ్యత: పాఠశాలల్లో ప్రతి సబ్జెక్టుకు సరిపడా టీచర్లు, ప్రయోగశాలలు, విశాలమైన తరగతులు, స్మార్ట్ కిచెన్, మౌలిక వసతులు, ఆట స్థలం ఉండేలా చూడాలి. విద్యార్థులు ప్రత్యక్షంగా చూసి వివిధ అంశాలు నేర్చుకునేందుకు వీలుగా స్టడీ టూర్లు నిర్వహించాలి. తొలిదశలో 3,673 పాఠశాలల్లోని 7,346 తరగతుల్లో తక్షణమే డిజిటల్ స్క్రీన్ ద్వారా బోధన జరగాలి. స్మార్ట్ విద్యా విధానం నాణ్యతను పెంచుతుంది. ఇందుకు కనీసం రూ.300 కోట్లు ఖర్చవుతుంది. ఒక్కో స్కూల్లో 100కు పైగా విద్యార్థులుండాలి పెద్ద స్కూళ్ల నిర్ణయం తీసుకునే ముందు ముఖ్యమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 41,628 ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లున్నాయి. ఇందులో 59 లక్షల మంది చదువుతున్నారు. ప్రభుత్వ స్కూళ్ళు 26,337 ఉంటే, వాటిల్లో 22.63 లక్షల మంది విద్యార్థులున్నారు. 11 వేల ప్రైవేటు స్కూళ్ళల్లో 34 లక్షల మందికి పైగా ఉన్నారు. ప్రైవేటు స్కూళ్ళు కూడా ఊరూరా లేవు. మండలంలోనూ ఒకటికి మించి ఉండటం లేదు. వీటిల్లో కనిష్టంగా 500, గరిష్టంగా 4 వేల మంది విద్యార్థులుంటున్నారు. కానీ రాష్ట్రంలోని 1,800 ప్రభుత్వ స్కూళ్ళల్లో అసలు అడ్మిషన్లే లేవు. 8,782 స్కూళ్ళల్లో 30కి మించి విద్యార్థులు లేరు. ఇందులో ప్రాథమిక పాఠశాలలే 8 వేలకుపైగా ఉన్నాయి. 10 వేల స్కూళ్ళల్లో 100 మందికి మించి లేరు. 5,800 స్కూళ్ళల్లో ఒకే ఉపాధ్యాయుడు ఐదు తరగతులకు బోధించే పరిస్థితి ఉంది. నిబంధనల ప్రకారం ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి. కానీ ఇటీవల బదిలీలు, పదోన్నతుల నేపథ్యంలో 20 మందికి ఒక టీచర్ ఉండాలనే నిబంధన తెచ్చారు. అయినప్పటికీ గత ఏడాది కన్నా ఈ సంవత్సరం 1.62 లక్షల ప్రవేశాలు తగ్గాయి. ఈ నేపథ్యంలో ఒక్కో స్కూల్లో కనీసం వందకు పైగా విద్యార్థులు ఉండేలా చూడాలనేది మెజారిటీ అభిప్రాయంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటే రాష్ట్రంలో పది వేల స్కూళ్ళను ఆయా మండలాల పరిధిలో విలీనం చేయవచ్చు. ఉచిత రవాణా వ్యవస్థ అవసరం గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను ప్రైవేటు యాజమాన్యాలు సులభంగా దూరంలో ఉన్న తమ స్కూళ్ళకు తీసుకెళ్తున్నాయి. ఇందుకోసం బస్సులు, ఆటోలు, వ్యాన్లు ఉపయోగిస్తున్నాయి. ఇదే తరహాలో ప్రభుత్వ స్కూళ్ళకు ఉచిత రవాణా వ్యవస్థ ఉండాలి. సూదూర ప్రాంతాలకు విద్యార్థులను పంపేందుకు 92 శాతం గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నట్టు మా అభిప్రాయ సేకరణలో తేలింది. అయితే రవాణా సౌకర్యం కోసం ఖర్చు పెట్టేందుకు వాళ్ళు సిద్ధంగా లేరు. అందువల్ల ప్రభుత్వం ఉచితంగా ఈ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వ స్కూళ్ళ వైపే మొగ్గు చూపుతారు. -
ఇక స్మార్ట్ విద్య
ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే ఉన్నత విద్యాశాఖలో స్మార్ట్ క్లాస్, వర్చువల్ క్లాస్ వ్యవస్థ వీడియో, ఆడియో రూపంలో తరగతులు కళాశాల చుట్టపక్కల ఉచితంగా ‘వైఫై’ ప్రత్యేక వెబ్సైట్లో కళాశాలల వివరాలు త్వరలోనే 1,298 మంది లెక్చరర్ల నియామకం ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే బెంగళూరు : రాష్ట్ర ఉన్నత విద్యాశాఖలో మానవ వనరుల సమస్య పరిష్కారం, విద్యార్థులకు అవసరమైన సమాచారం అందించడానికి వీలుగా త్వరలో స్మార్ట్‌క్లాస్, వర్చువల్ క్లాస్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తామని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్వీ దేశ్‌పాండే తెలిపారు. విధాన సౌధాలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్‌క్లాస్ విధానంలో మొదటిగానే రికార్డు చేసిన లెక్షరర్ల పాఠశాలను ఆయా విషయాల (సబ్జెక్ట్స్) లెక్చరర్లు లేని కళాశాలల్లో వీడియో రూపం లో ప్రదర్శిస్తారన్నారు. ఈ విధానాన్ని మొదట గుల్బ ర్గా డివిజన్లో 50 కళాశాలల్లో అమలు చేస్తామని తెలిపారు. విద్యార్థులకు పుస్తకాలు (టెక్ట్స్‌బుక్స్), వ్యక్తిత్వ వికాస పుస్తకాలను వర్చువల్ క్లాస్ విధానంలో ఆడియో రూపంలో అందజేస్తామన్నారు. ఇందుకోసం ప్రతి కళాశాల చుట్టపక్కల 100 మీటర్ల వరకు ఉచిత వైఫై వ్యవస్థను కల్పించబోతున్నామని తెలిపారు. మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఈ పుస్తకాలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవడానికి వీలవుతుం దన్నారు. రాష్ట్రంలోని ప్రతి డిగ్రీ కళాశాల వివరాలను తెలుసుకోవడానికి వీలుగా ప్రత్యేక వెబ్సైట్ వ్యవస్థను రూపొందిస్తామన్నారు. దీని వల్ల ఏఏ కళాశాల లో ఏఏ సదుపాయాలు ఉన్నయో తెలుసుకుని విద్యార్థులు కళాశాలను ఎంపిక చేసుకోవడానికి వీలవుతుందన్నారు. ఐదు వేల మంది డిగ్రీ విద్యార్థులకు స్కిల్డెవెల్మెంట్ ప్రోగ్రాం ద్వారా శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇందుకు సంబంధించిన పట్టాలను కూడా అందజేస్తామని తెలిపారు. దీని వల్ల వారికి ఉద్యోగ అవకాశాలు పెరగడానికి ఆస్కారముంటుం దని ఆశాభావం వ్యక్తం చేశారు. పాలిటెక్కిక్ కళాశాలల్లో విద్యా ర్థి, విద్యార్థినులకు వేర్వేరుగా 44 హాస్టల్స్‌ను నిర్మించనున్నామని తెలిపారు. త్వరలోనే 1,298 మంది లెక్చరర్ల నియామక ప్రక్రియను రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామన్నారు. అంతేకాకుండా వీటికి అదనంగా 850 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతి పూర్తయిందని, వీటి నియామక ప్రక్రియను కూడా త్వరలోనే ప్రారంభిస్తామని వివరించారు.