breaking news
siva rama krishna
-
‘కోడెల’ తనయుడి వీరంగం
నరసరావుపేట: రాష్ట్ర శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామకృష్ణ పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. తమ వర్గీయులను విడిచిపెట్టాలంటూ పోలీసుస్టేషన్లో హడావుడి చేశారు. మీకెంత ధైర్యం ఉంటే మా మనిషిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తారంటూ పోలీసులపై దూషణలకు దిగారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలంలోని ఎడ్వర్డుపేటలో సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. వినాయకుని నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులపై జరిగిన దాడి విషయంలో ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ కొలికొండ కొండలును పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న మండల టీడీపీ నాయకులు మంగళవారం సాయంత్రం స్టేషన్‌కు చేరుకుని తమ నాయకుడిని వెంటనే విడుదల చేయాలంటూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదే సమయంలో నరసరావుపేట నుంచి స్పీకర్ కోడెల తనయుడు శివరామకృష్ణ రొంపిచర్ల పోలీసుస్టేషన్‌కు వస్తూనే పోలీసులపై విరుచుకుపడ్డారు. డీఎస్పీ కె. నాగేశ్వరరావు కూడా అప్పుడే వచ్చారు. శివరామకృష్ణకు డీఎస్పీ మధ్యæ వాగ్వాదం జరిగింది. పోలీసులపై శివరామకృష్ణ గొడవకు దిగడంతో మండల టీడీపీ నేతలు మరింతగా రెచ్చిపోయి పోలీసులను తిడుతూ దౌర్జన్యం చేశారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇదే సమయంలో టీడీపీ నేతల దౌర్జన్యాన్ని వీడియో తీస్తున్న ఓ కానిస్టేబుల్‌ను కోడెల శివరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కెమెరాను లాక్కునే ప్రయత్నం చేశారు. అరెస్టయిన వ్యక్తిని తన వెంట పంపాల్సిందేనంటూ శివరామకృష్ణ పట్టుబట్టారు. ఒక దశలో టీడీపీ నేతలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు శివరామకృష్ణతో చర్చలు జరపగా రెండు గంటల అనంతరం ఆయన అక్కడి నుంచి తిరిగి వెళ్లారు. కొలికొండ కొండలును వదిలేస్తామని హామీ ఇచ్చిన మేరకే కోడెల శివరామకృష్ణ స్టేషన్ నుంచి వెళ్లినట్లు సమాచారం. -
కోడెలకు అసమ్మతి సెగ
నరసరావుపేట రూరల్: నరసరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు తీవ్రస్థాయికి చేరింది. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాదరావు, అతని కుమారుడు డాక్టర్ శివరామకృష్ణ తీరును నిరసిస్తూ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పులిమి వెంకటరామిరెడ్డి ఆమరణ దీక్షకు దిగారు. నియోజకవర్గానికి ఇన్చార్జ్ని ప్రకటించి పార్టీని బతికించాలంటూ ఆయన పాలపాడులోని స్వగృహంలో ఆదివారం భార్య, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు కోటేశ్వరమ్మతో కలసి ఆమరణ దీక్షను ప్రారంభించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. కోడెల శివప్రసాదరావు కుమారుడు నరసరావుపేటలో దందా లు చేస్తూ పార్టీ పరువును బజారుకీడుస్తున్నాడని ఆరోపించారు. దీనిపై గతంలో ఎన్నోమార్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆంజనేయలు, పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, జిల్లా మంత్రి పత్తిపాటి పుల్లారావుకు విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. స్పీకర్ కోడెలకు భయపడి అతని కుమారుడి ఆగడాలను ప్రశ్నించలేక పోతున్నారని తెలిపారు. ఇలాగే కొనసాగితే దీని ప్రభావం రానున్న ఎన్నికల్లో పార్లమెంట్ నియోజక వర్గంపై పడుతుందని తెలిపారు. పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న కోడెల కుమారుడిని నరసరావుపేట నియోజకవర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే మూడుసార్లు పార్టీ ఓటమి పాలయిందని, ఇప్పటి కైనా మేల్కొనకపోతే తీవ్రంగా నష్టం పోవాల్సి వస్తుందని తెలిపారు. 30 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకున్న వారు కూడా యువ నాయకుడి వల్ల దూరంగా వెళుతున్నారని పేర్కొన్నారు. రెండు రోజుల్లో పార్టీ అధిష్టానం దీనిపై స్పందించకుంటే తన ఇద్దరు కుమారులు, కోడళ్లతో దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దివ్యాంగుల జేఏసీ మద్దతు దీక్షకు రాజధాని దివ్యాంగుల జేఏసీ నాయకులు మద్దతు పలికారు. రొంపిచర్ల మండలం తుంగపాడుకు చెందిన ఏనుగంటి వెంకట కృష్ణారావు ఆమరణ దీక్షలో పాల్గొంటున్నట్లు ప్రకటించారు. జేఏసీ నాయకులు గొట్టిపాటి లక్ష్మణ్ మాట్లాడుతూ నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని తెలిపారు. రెండు కాళ్లులేని వికలాంగుడైన కృష్ణారావు మీద చోరీ కేసు పెట్టి వేధింపులకు గురి చేశారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా పలువురి దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని వాపోయారు. పాము తన పిల్లలను తానే తింటున్నట్టుగా నియోజకవర్గంలో పరిస్థితి ఉందని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ అసమ్మతి నాయకులు కొల్లి బ్రహ్మయ్య, చల్లా సుబ్బారావు, జాలాది సత్యం, వాసిరెడ్డి రవి, వడ్లమూడి శివరామయ్య పాల్గొన్నారు. దీక్షకు మద్దతుగా గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీపీ ప్రభాకరరావు పోటీ దీక్ష నియోజకవర్గ అసమ్మతి నాయకులు దీక్షకు దిగడంతో ఆ పార్టీలోని మరో వర్గం గ్రామంలో పోటీ దీక్షను ప్రారంభించారు. గ్రామానికి ఎంపీపీ కె.ప్రభాకరరావు, టీడీపీ నాయకులు అలవాల సాంబిరెడ్డి, అడపా వెంకటరెడ్డి, కొమ్ముల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. స్పీకర్ కోడెల ఆశీస్సులతో పదవులు పొందిన నాయకులు ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎంపీపీ కె.ప్రభాకరరావు తెలిపారు. గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందనేది అవాస్తవం అన్నారు. ఇరు వర్గాల దీక్షలతో పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించారు. -
ఎమ్మెల్యే కమలమ్మ-శివరామకృష్ణ వర్గీయుల మధ్య దాడి
వైఎస్సార్ జిల్లా:ఓ స్థల వివాదానాకి సంబంధించి ఎమ్మెల్యే కమలమ్మ, శివరామకృష్ణ అనుచరులు పరస్పరం దాడికి దిగిన ఘటన పోరుమామిళ్లలో మంగళవారం చోటు చేసుకుంది. ఓ స్థల వివాదం ఎంతకీ పరిష్కారానికి రాకపోవడంతో శివరామకృష్ణ వర్గీయులు ఆగ్రహానికి లోనయ్యారు. దీంతో వారు కడప నుంచి రెండు లారీలలో పోరుమామిళ్లకు బయలుదేరారు. అనంతరం వివాదం పరిష్కారంలో తొలుత వాగ్వియుద్ధం చోటు చేసుకుంది. అక్కడ ఎమ్మెల్యే కమలమ్మ అనుచరులు కూడా వారితో వాగ్విదానికి దిగడంతో ఘర్షణ మరింత రాజుకుంది. దీంతో ఇరువర్గాల అనుచరులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈఘటనలో కడప నుంచి వెళ్లిన నలుగురికి తీవ్ర గాయాలైయ్యాయి.