Subham Review: సమంత ‘శుభం’ మూవీ రివ్యూ
స్టార్ హీరోయిన్ సమంత నిర్మించిన తొలి సినిమా ‘శుభం’. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు సినిమా ప్రమోషన్స్‌లో సమంత పాల్గొనడం..వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ఆసక్తికర విషయాలు చెప్పడంతో ‘శుభం’పై బజ్ క్రియేట్ అయింది. ఓ మోస్తరు అంచనాల మధ్య నేడు(మే 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌లోని భీమిలీపట్నంలో నివసించే ముగ్గురు యువజంటల కథ ఇది. శ్రీను(హర్షిత్‌రెడ్డి)‘మన టౌన్ కేబుల్ టీవీ’ ఆపరేటర్. అతని స్నేహితులు(గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ)లకు అల్రేడీ పెళ్లి అయిపోతుంది. భార్యలను ఫరిదా, గాయత్రి(శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి) చెప్పుచేతల్లో పెట్టుకోవడమే కాకుండా.. బ్యాచిలర్ అయిన శ్రీనుకి కూడా అదే విషయాన్ని ఎక్కిస్తారు. శ్రీనుకి అదే ప్రాంతానికి చెందిన శ్రీవల్లీ(శ్రియ కొంతం)తో పెళ్లి జరుగుతుంది. స్నేహితులు చెప్పిన మాటలతో పెళ్లాన్ని హద్దుల్లో పెట్టుకోవాలని శ్రీను కూడా డిసైడ్ అయిపోతాడు. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ శోభనం గదిలోకి రాగానే అసలు ట్విస్ట్ మెదలవుతుంది. రాత్రి 9గంటలు కాగనే శ్రీవల్లి టీవీ ఆన్ చేసి ‘జన్మజన్మల బంధం’ సీరియల్ చూస్తుంది. ఈ టైంలో సీరియల్ చూడడం ఏంటని శ్రీను అడిగితే..దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. మరుసటి రోజు కూడా ఇలానే వింతగా ప్రవర్తిసుంది. ఇది తన ఒక్కడి సమస్యే అనుకుంటాడు. కానీ తన స్నేహితులిద్దరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లు తర్వాత తెలుసుకుంటాడు. ఈ ముగ్గురు మాత్రమే కాదు.. ఊరు మొత్తం ఇదే సమస్య ఉందనే విషయం బయటపడుతుంది. అసలు ఆ సీరియల్‌కి ఊర్లోని ఆడవాళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? సీరియల్ టైం కాగానే ఎందుకు వాళ్లు దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారు? మాతాజీ మాయ(సమంత) వాళ్ల సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపింది? అనేది తెలియాలంటే ‘శుభం’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..సందేశం ఇవ్వాలంటే కథను సీరియస్‌గానే చెప్పాలా? లేదంటే ఇదిగో మేం ఈ మంచి మేసేజ్ ఇస్తున్నాం అని తెలిసేలా సన్నివేశాలను తీర్చిదిద్దాలా? అలా చేయకుండా, నవ్విస్తూ కూడా ఓ మంచి విషయం చెప్పొచ్చు అనేది ‘శుభం’ సినిమా ద్వారా తెలియజేశాడు దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల. సీరియల్ పిచ్చి అనే కాన్సెప్ట్‌ని తీసుకొని.. అందులోనే పురుషాధిక్యత ఎత్తిచూపుతూ మహిళల అణచివేత, ఆత్మాభిమానం లాంటి సున్నితమైన అంశాలను జోడించి, కథను నడిపించిన తీరు చాలా బాగుంది. చిన్న చిన్న సన్నివేశాలతోనే మంచి సందేశం ఇచ్చాడు. ఓ హారర్-కామెడీ చిత్రంలో ఇలాంటి మంచి విషయం చెప్పడం ‘శుభ’ పరిణామం. అయితే ఇదంతా ఒకవైపు మాత్రమే. రెండోవైపు చూస్తే కామెడీ-హారర్ జానర్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హారర్ నేపథ్యం అంతగా ఆకట్టుకోలేదు. కామెడీ కొన్ని చోట్ల మాత్రమే నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ హారర్ కానీ, కామెడీ కానీ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాదు. ఇంతకు మంచి కామెడీ-హారర్ కథలను మనం చూశాం. ఉన్నంతలో కొత్తదనం ఏదైన ఉందంటే.. సీరియల్‌కి ముడిపెడుతూ నిజ జీవిత వ్యక్తులను హారర్ యాంగిల్లో చూపించడమే. అసలు కథను ప్రారంభించడానికి దర్శకుడు చాలా సమయమే తీసుకున్నాడు. పెళ్లి చూపులు, పెళ్లి, ఫస్ట్‌నైట్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఫస్ట్‌నైట్ రోజు శ్రీవల్లీ ఇచ్చే ట్విస్ట్‌తో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆ ఆసక్తిని మరింత పెంచుతుంది. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి మాత్రం కథనం కాస్త గాడి తప్పుతుంది. సమస్యను పరిష్కరించుకునేందుకు శ్రీనుబృందం చేసే ప్రయత్నం సాగదీతగా అనిపిస్తుంది. ఇక లాజిక్ గురించి ప్రస్తావించకపోవడమే మంచింది. దర్శఖుడు తన ‘సినిమా బండి ’టీమ్‌ని ఈ కథకు వాడుకున్న విధానం బాగుంది. అయితే సీరియల్ సమస్యను క్లోజ్ చేసే సన్నివేశాలు కూడా సీరియల్‌గా సా..గడంతో కథ అక్కడడక్కడే తిరిగినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ బాగుంటుంది. ఎలాంటి వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేలా కథను తీర్చిదిద్దారు. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమా మొత్తం కొత్త నటీనటులతోనే తెరకెక్కించారు. అయినా కూడా ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. కేబుల్ ఆపరేటర్‌గా హర్షిత్ రెడ్డి, అతని స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరీ బాగా నటించారు. ఇక ఈ ముగ్గురి భార్యలుగా శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి, శాలిని కొండెపూడి తమదైన నటనతో కొన్ని చోట్ల భయపెడుతూనే నవ్వించారు. ముఖ్యంగా శ్రీవల్లీగా శ్రీయ కొంతం తనదైన నటనతో ఆకట్టుకుంది..సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అన్ని కథకు తగ్గట్లుగా ఉంది. సమంత నిర్మించిన తొలి చిత్రం కాబట్టి నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయని చెప్పలేం కానీ.. సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.