breaking news
Shelby Rogers
-
హాలెప్ కు షాక్
మెల్బోర్న్:ఈ సీజన్ ఆరంభపు టెన్నిస్ గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాల్గో సీడ్ క్రీడాకారిణి సిమోనా హాలెప్(రొమేనియా)కు ఆదిలోనే షాక్ తగిలింది. మహిళల సింగిల్స్ లో హాలెప్ తొలి రౌండ్లోనే ఓటమి పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. సోమవారం జరిగిన పోరులో హాలెప్ 3-6, 1-6 తేడాతో అమెరికా క్రీడాకారిణి షెల్బీ రోజర్స్ చేతిలో ఓటమి పాలైంది. గంటా 15 నిమిషాలు పాటు జరిగిన పోరులో షెల్బీ రోజర్స్ కు హాలెప్ ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఏకపక్షంగా సాగిన రెండు సెట్లను రోజర్స్ తిరుగులేని ఆధిక్యాన్ని చెలాయించి రెండో రౌండ్ లోకి ప్రవేశించింది. రెండు వారాల క్రితం జరిగిన బ్రిస్బేన్ టోర్నీలో టాప్-10 క్రీడాకారిణి బౌచర్డ్‌పై రోజర్స్ సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంచితే గతేడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో కూడా హాలెప్ తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టడం ఇక్కడ గమనార్హం. మరొకవైపు బ్రిటన్ స్టార్ ఆటగాడు, ప్రపంచ నంబర్ వన్ ఆండీ ముర్రే రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ముర్రే 7-5,7-6(7/5),6-2 తేడాతో మార్చెన్కోపై విజయం సాధించి శుభారంభం చేశాడు. -
గట్టెక్కిన వావ్రింకా
ఐదు సెట్ల పోరులో నెగ్గిన డిఫెండింగ్ చాంపియన్ ఫ్రెంచ్ ఓపెన్ పారిస్: కాస్త అటు ఇటు అయి ఉంటే... మూడో సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా ఫ్రెంచ్ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే నిష్ర్కమించిన మొదటి డిఫెండింగ్ చాంపియన్ క్రీడాకారుడిగా అపప్రథను మూటగట్టుకునేవాడు. అయితే తన అనుభవాన్నంతా రంగరించి పోరాడిన ఈ స్విట్జర్లాండ్ స్టార్ ప్లేయర్ తొలి రౌండ్ అడ్డంకిని అధిగమించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో వావ్రింకా 4-6, 6-1, 3-6, 6-3, 6-4తో లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్)పై కష్టపడి గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో 46 అనవసర తప్పిదాలు చేసిన వావ్రింకా తన సర్వీస్‌లో ఎనిమిదిసార్లు బ్రేక్ పాయింట్ల ను కాపాడుకున్నాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదో సీడ్ కీ నిషికోరి (జపాన్) 6-1, 7-5, 6-3తో సిమోన్ బొలెలీ (ఇటలీ)పై, ఎనిమిదో సీడ్ మిలోస్ రావ్‌నిచ్ (కెనడా) 6-3, 6-2, 7-6 (7/5)తో టిప్సరెవిచ్ (సెర్బియా)పై, 22వ సీడ్ విక్టర్ ట్రయెస్కీ (సెర్బియా) 2-6, 6-3, 5-7, 7-5, 6-3తో దిమిత్రోవ్ (బల్గేరియా)పై విజయం సాధించారు. 23వ సీడ్ జాక్ సోక్ (అమెరికా), 27వ సీడ్ ఇవో కార్లోవిచ్ (క్రొయేషియా), 30వ సీడ్ జెరెమి చార్డీ (ఫ్రాన్స్) కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించారు. ఏడో సీడ్ విన్సీ ఓటమి మహిళల సింగిల్స్ విభాగంలో ఏడో సీడ్ రొబెర్టా విన్సీ (ఇటలీ) తొలి రౌండ్లోనే ఓడిపోయింది. కాటరీనా బొండారెంకో (ఉక్రెయిన్) 6-1, 6-3తో విన్సీపై సంచలన విజయం సాధించింది. మరోవైపు నాలుగో సీడ్ గార్బిన్ ముగురుజా (స్పెయిన్) మూడు సెట్ల పోరులో గట్టెక్కగా... 16వ సీడ్ సారా ఎరాని (ఇటలీ), 17వ సీడ్ ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టారు. ముగురుజా 3-6, 6-3, 6-3తో షిమిడ్లోవా (స్లొవేకియా)పై గెలుపొందగా... సారా ఎరాని 3-6, 2-6తో పిరొన్కోవా (బల్గేరియా) చేతిలో, ప్లిస్కోవా 6-3, 4-6, 3-6తో షెల్బీ రోజర్స్ (అమెరికా) చేతిలో ఓడిపోయారు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ అగ్నెస్కా రద్వాన్‌స్కా (పోలండ్) 6-0, 6-2తో జొవనోవ్స్కీ (సెర్బియా)పై విజయం సాధించింది.