breaking news
she-box
-
మహిళా మేలుకో.. ‘షీబాక్స్’కు చెప్పుకో!
సాక్షి, హైదరాబాద్: మహిళా భద్రత కోసం అందుబాటులో ఉన్న మరో అస్త్రం షీ–బాక్స్. పని ప్రాంతాల్లో లైంగిక వేధింపులను అరికట్టే లక్ష్యంతో కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2017లో ప్రారంభించిన ఆన్లైన్ పోర్టలే ఈ షీ–బాక్స్ (సెక్స్‌వల్ హెరాసె్మంట్ ఎల్రక్టానిక్ బాక్స్). దేశంలో ఎక్కడ పనిచేసే మహిళలైనా, ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా దీన్ని రూపొందించారు.కాగా, 2024, ఆగస్టు 29న ఈ పోర్టల్‌ను మరింతగా ఆధునీకరించారు. బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతూనే, నిందితులను శిక్షించేలా ఇందుకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది.ప్రభుత్వ, ప్రైవేటు, వ్యవస్థీకృత లేదా అవ్యవస్థీకృత రంగాల్లో పనిచేసే మహిళలెవరైనా లైంగిక వేధింపులపై ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. దేశంలో కార్యాలయాల్లో మహిళలపై వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, బాధితులు భయపడకుండా నేరుగా ఫిర్యాదు చేయడానికి ఈ వ్యవస్థను రూపొందించారు. 2013లో అమల్లోకి వచి్చన పోష్ యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాసె్మంట్)ను సక్రమంగా అమలు చేయడంలో ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది.బాధితులు బయటికి రావాల్సిన పనిలేకుండా ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయడంతోపాటు వారి ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్ చేసే వీలుంటుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతీ సంస్థ ఇంటర్నల్ కంప్లైట్స్ కమిటీ ఏర్పాటు చేయడంతోపాటు ఆ వివరాలను షీ–బాక్స్ పోర్టల్‌లో నమోదు చేయడం తప్పనిసరి. కాగా, అధికారిక గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ పోర్టల్‌లో ఫిబ్రవరి వరకు 1,008 ఫిర్యాదులు నమోదవగా, అందులో 105 ఫిర్యాదులు పరిష్కరించారు. షీ–బాక్స్ అంటే ఏమిటి? షీ–బాక్స్ అనేది మహిళలు ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు రూపొందించిన డిజిటల్ ప్లాట్‌ఫాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే మహిళలు ఈ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎలా ఫిర్యాదు చేయాలి? ⇒ షీ–బాక్స్ పోర్టల్ https:// shebox.wcd. gov. in/ లోకి వెళ్లాలి. ⇒ కుడిచేతి వైపు ఉన్న రిజిస్టర్ యువర్ కంప్లైంట్‌పై క్లిక్ చేయాలి. ⇒ అందులో సూచించిన విధంగా వివరాలు నమోదు చేయాలి. ⇒ అవసరమైతే ఆధారాలు అప్లోడ్ చేయాలి. ⇒ ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత అది సంబంధిత సంస్థలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ (ఐసీ సీ) లేదా సంబంధిత అధికారులకు పంపిస్తారు. ఫిర్యాదు చేసిన తర్వాత ఏమవుతుంది? ⇒ ఫిర్యాదు సంబంధిత శాఖకు, ప్రైవేటు కార్యాల యం అయితే సంబంధిత కార్యాలయంలోని ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి లేదా జిల్లా స్థాయి లోని లోకల్ కమిటీ (ఎల్సీ)కి పంపిస్తారు. ⇒ అనంతరం విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ⇒ విచారణ ప్రారంభమైన తర్వాత గరిష్టంగా 90 రోజుల్లో విచారణ ప్రక్రియ పూర్తి చేసి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ⇒ బాధితురాలికి ఫిర్యాదు స్థితి గురించి సమాచారం అందుతుంది. పోర్టల్‌లోకి వెళ్లి తమ ఫిర్యాదు ఏ స్థితిలో ఉందో తెలుసుకునేందుకు పురోగతిని ట్రాక్ చేసే వీలుంటుంది. -
కేంద్ర మహిళా ఉద్యోగుల కోసం షీ బాక్సు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కేంద్రం ఒక కొత్త ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేసేందుకు ‘షీ–బాక్స్ (సెక్సువల్ హరాస్మెంట్ ఎలక్ట్రానిక్ బాక్సు)’ అనే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తన వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. తొలుత దీన్ని ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే వర్తింపజేస్తున్నామని త్వరలో ప్రైవేట్ మహిళా ఉద్యోగులకు విస్తరిస్తామని ఆ శాఖ మంత్రి మేనకా గాంధీ తెలిపారు. దేశవ్యాప్తంగా లైంగిక వేధింపుల స్వరూపం, తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలో ఒక సర్వే నిర్వహిస్తామని వెల్లడించారు. షీ బాక్సులో వచ్చిన ఫిర్యాదులను అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ఐసీసీ)కి చేరవేస్తామని, ఆ తర్వాత కమిటీ ఫిర్యాదులపై విచారణ చేపడుతుందని మేనకా వివరించారు.


