breaking news
Selfie with Modi
-
మోదీతో సెల్ఫీకి రూ.కోటి!
న్యూఢిల్లీ: సందర్భం విదేశీయానమైనా, స్వదేశీయులతో ములాఖత్ అయినా.. సెల్ఫీ దిగనిదే ప్రోగ్రామ్ పూర్తయినట్లు కాదు ప్రధాని నరేంద్ర మోదీకి! సమకాలీన రాజకీయాల్లో సోషల్ మీడియాను అంతగా వినియోగిస్తున్న నాయకుడు మరొకరు లేరంటే అతిశయం కాదు. కానీ.. బిహార్ ఎన్నికలు ప్రారంభం అయినప్పటి నుంచి ఆయన సెల్ఫీలకు దూరంగా ఉంటున్నారు. మోదీలో చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామానికి కారణం ఏమిటి? అని ఆరా తీయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ ఎన్నికల సందర్భంగా 'మోదీతో సెల్ఫీ' (సెల్ఫీ విత్ మోదీ) అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు బీజేపీ నాయకులు. ఢిల్లీలోని అన్ని నియోజకవర్గాల్లో మొత్తం ఏడు విడతలుగా సాగిన ఈ కార్యక్రమంలో.. తాత్కాలిక బూత్ లను, వాటిలో మోదీ వర్చువల్ ఇమేజ్(కాల్పనిక చిత్రం)ను ఏర్పాటు చేశారు. ఆ ఇమేజ్‌తో సెల్ఫీ తీసుకుంటే.. స్వయంగా మోదీనే మన పక్కనున్నట్లు కనిపిస్తుంది. లక్షలాది ఢిల్లీ ప్రజలు మోదీతో సెల్ఫీలు దిగి ఆ గుర్తును భద్రంగా సేవ్ చేసుకున్నారు. కాగా, ఒక్కో విడత.. మోదీ విత్ సెల్ఫీకి రూ. 86.50 లక్షలు వెచ్చించామని, అలా ఈ కార్యక్రమానికి మొత్తం రూ. 1.06 కోట్ల ఖర్చయ్యాయని తేలింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన ఖర్చుల జాబితాలో బీజేపీ పేర్కొంది. అంత ఖర్చయినా ఫర్వాలేదుగానీ ఓట్లు మాత్రం కమలానికి కాకుండా చీపురుకు పడటమే జీర్ణించుకోలేకపోయారు ఆ పార్టీ నేతలు. విఫల ప్రయోగం మళ్లీ ఎందుకని బిహార్ ఎన్నికల ప్రచారంలో సెల్ఫీ ఐడియాను అటకెక్కించారు. అయితే మోదీ తీసుకున్నది విరామం మాత్రమేనని.. నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్న ఇంగ్లాండ్ పర్యటనలో మళ్లీ సెల్ఫీలు చిందిస్తారని ఆశిస్తున్నారు ఆయన అభిమానులు. అన్నట్లు గత ఎన్నికల్లో 'త్రీడీ ప్రచారం' గుర్తుందిగా. ప్రసంగాలను ముందే త్రీడీలో చిత్రీకరించి, ప్రత్యేక స్క్రీన్ లు ఉన్న వాహనాల ద్వారా ఊరూరా ప్రచారం చేసినందుకుగానూ రూ.60 కోట్లు ఖర్చయినట్లు బీజేపీ తెలిపింది. -
మోదీతో సెల్ఫీ తీసుకుంటారా?
-
మోదీతో సెల్ఫీ తీసుకుంటారా?
అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ సరికొత్త వ్యూహాలు పన్నుతోంది. ప్రధాని నరేంద్రమోదీతో సెల్ఫీ తీసుకోడానికి అవకాశం కల్పిస్తామని చెబుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా 2,500 సెల్ఫీ విత్ మోదీ కేంద్రాలను ఢిల్లీలో ఏర్పాటుచేసింది. ఈ కేంద్రాల్లో మోదీ వర్చువల్‌గా కనిపిస్తారు. అంటే.. నిజంగా అక్కడ మోదీ ఉండరు గానీ, ఆయన ఉన్నట్లుగా కనిపిస్తుంది. దాంతో సెల్ఫీ తీసుకోవచ్చు. ఈ తరహా మొదటి కేంద్రాన్ని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించారు. మోదీ పలు సందర్భాల్లో ఎక్కడికక్కడ సెల్ఫీలు తీసుకుంటూ వాటిని ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తుంటారు. ఫిబ్రబరి 7వ తేదీన ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు ఈ అస్త్రం బాగా పనికొస్తుందని బీజేపీ భావిస్తోంది. యువతలో మోదీకి మంచి క్రేజ్ ఉందని, అందువల్ల ఈ సెల్ఫీ ప్రయత్నం బాగానే ఫలిస్తుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేదీ కొన్నిసార్లు రిక్షాల్లో కూడా తిరుగుతున్నారు. రోడ్డుపక్కన టీస్టాళ్లలో చాయ్ తాగుతున్నారు. ఆమె నేరుగా ప్రజలకు అందుబాటులో ఉంటారని, ప్రధాని అయితే అందరికీ దొరకరు కాబట్టి ఇలా సెల్ఫీలు తీయిస్తున్నామని ప్రధాన్ చెప్పారు.