breaking news
Savarin gold bonds
-
SGB: కాసుల పంట పండించిన గోల్డ్ బాండ్స్!
సావరిన్ గోల్డ్ బాండ్లు (SGB) బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ అందించే సురక్షితమైన పెట్టుబడి పథకం. ఈ బాండ్ల ద్వారా బంగారం ధర పెరుగుదల వల్ల లాభం పొందడంతో పాటు ప్రతి సంవత్సరం 2.5 శాతం స్థిర వడ్డీ కూడా లభిస్తుంది. అయితే ఇప్పుడు ఆర్బీఐ 2020–21 సిరీస్ XIలో పెట్టుబడి పెట్టిన వారికి గడువు పూర్తికాకముందే.. నిర్ణీత నిబంధనల ప్రకారం బాండ్లను ముందస్తుగా ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించింది.సావరిన్ గోల్డ్ బాండ్లు జారీ అయిన ఐదు సంవత్సరాల తర్వాత నిర్ణీత వడ్డీ చెల్లింపు తేదీల్లో మాత్రమే ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 8, 9 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఆర్బీఐ ఆగస్టు 7 నుంచే ఈ ప్రక్రియను ప్రారంభించింది. ముందస్తు విమోచనం చేసుకునే వారికి ఒక గ్రాము (యూనిట్) ధరను రూ. 14,564గా నిర్ణయించింది. ఈ ధరను ఆగస్టు 4, 5, 6 తేదీలలో 999 స్వచ్ఛత గల బంగారం సగటు ముగింపు ధర ఆధారంగా నిర్ణయించారు. ఇందుకోసం ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) ప్రకటించిన బంగారం ధరలను పరిగణనలోకి తీసుకున్నారు.సావరిన్ గోల్డ్ బాండ్లు విడుదలైన సమయంలో ఆన్లైన్లో గ్రాము ధర రూ. 4,862 మాత్రమే. ప్రస్తుతం అదే యూనిట్‌కు రూ. 14,564 లభిస్తోంది. అంటే ఒక గ్రాముపై రూ. 9,702 లాభం వస్తోంది. దీంతో పెట్టుబడిదారులు దాదాపు 200 శాతం లాభాన్ని పొందుతున్నారు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, ప్రస్తుతం ఆ పెట్టుబడి విలువ సుమారుగా రూ. 3 లక్షలకు చేరుతుందన్నమాట.అంతేకాకుండా.. పెట్టుబడిదారులకు మొత్తం కాలానికి ప్రతి సంవత్సరం 2.5 శాతం స్థిర వడ్డీ కూడా లభిస్తుంది. ఈ వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి పెట్టుబడిదారుడి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. సాధారణంగా సావరిన్ గోల్డ్ బాండ్లకు ఎనిమిది సంవత్సరాల మెచ్యూరిటీ ఉంటుంది. అయితే ఐదు సంవత్సరాలు పూర్తైన తర్వాత నిర్ణీత వడ్డీ చెల్లింపు తేదీల్లో ముందస్తు ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. చివరగా బాండ్‌ను మెచ్యూరిటీ సమయంలో లేదా ముందస్తు విమోచనం చేసుకున్నప్పుడు అసలు పెట్టుబడితో పాటు చివరి వడ్డీ కూడా అందుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆన్లైన్లో బాండ్లు కొనుగోలు చేసిన వారికి గ్రాముకు రూ. 50 తగ్గింపు ఇచ్చారు. దీంతో వారు తక్కువ ధరకు బాండ్లు కొనుగోలు చేసి, ప్రస్తుతం మరింత అధిక లాభాన్ని పొందుతున్నారు.ఇదీ చదవండి: ఇదే జరిగితే.. బంగారం ధరలు మరింత పైకి! -
ఆంధ్రాబ్యాంక్ ద్వారా సావరిన్ గోల్డ్ బాండ్స్
విజయవాడ (వన్‌టౌన్) : భారత రిజర్వు బ్యాంక్ 2016–2017 సంవత్సరానికి ప్రవేశ పెట్టిన నాలుగో సావరిన్ గోల్డ్ బాండ్లను ఆంధ్రాబ్యాంక్ తన అన్ని శాఖల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచుతుందని బ్యాంక్ విజయవాడ జోనల్ మేనేజర్ డి.చంద్రమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27 నుంచి మార్చి మూడో తేదీ వరకూ ఆంధ్రాబ్యాంకుకు చెందిన 2872 శాఖల్లో ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ బాండ్లను దేశీయులైన వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబాలు, ట్రస్టులు, విశ్వవిద్యాలయాలు, ధార్మిక సంస్థలు మాత్రమే కొనుగోలు చేయుటకు అర్హులని తెలిపారు. ఒకటి నుంచి 500 గ్రాముల వరకూ ఈ పథకంలో బాండ్లు కొనుగోలు చేయవచ్చని పేర్కొన్నారు. గ్రాము ఖరీదును రూ.2,893గా , బాండ్ కాలపరిమితిని ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించినట్టు తెలిపారు. ఐదు సంవత్సరాలు దాటిన తరువాత ముందస్తుగా రద్దు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ పథకంలో బంగారాన్ని కొనకుండానే బంగారం మీద పెట్టుబడి పెట్టే సదుపాయాన్ని ప్రజలు పొందుతారని తెలిపారు. బాండ్ నిర్ణీత గడువు ముగిసిన తరువాత ఎవరైతే బాండ్లో పెట్టుబడి పెట్టారో వారు అంతే బంగారపు విలువను రిజర్వుబ్యాంక్ నిర్దేశించిన మార్కెట్ రేటుకు అనుగుణంగా రూపాయల్లో పొందవచ్చని పేర్కొన్నారు. ప్రతి ఆరు మాసాలకొకసారి పెట్టుబడి మీద 2.5శాతం వడ్డీని పొందగలిగే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పించినట్లు పేర్కొన్నారు. పెట్టుబడి కాలవ్యవధిలో బంగారపు ధరల హెచ్చు తగ్గుల నుంచి ఈ పథకం సరైన రక్షణ కల్పిస్తుందని తెలిపారు.


