'అధికార పార్టీ దురాగతాలను సహించం'
విజయవాడ: అధికార టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి మారిన నిడమానూరు సర్పంచ్ పై కావాలనే అధికార పక్ష నాయకులు దాడి చేయించి ఆయన కారు తగులబెట్టారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఆ తర్వాత సీపీ గౌతమ్ సవాంగ్ ను కలిసి ఘటనపై వివరించారు.
టీడీపీలో నుంచి వైఎస్సార్సీపీలోకి మారడాన్ని జీర్ణించుకోలేకే అధికార పార్టీ కార్యకర్తలు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నారని చెప్పారు. అధికార బలంతో దౌర్జన్యాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. బాధిత సర్పంచ్ కోటేశ్వరరావును వైఎస్సార్సీపీ నేతలు పార్థసారధి, సామినేని ఉదయభాను, బొత్స సత్యనారాయణలు పరామర్శించారు.