breaking news
sachchidananda
-
పొగడ్తల కోసమా దానం? ఎలాంటి దానం గొప్పది!
పవిత్రమపి యత్ క్రూరం కర్మ తన్నహి శోభతేపరోపకారకం శాంతం కర్మ సద్భిః ప్రశస్యతే మనం చేసే పని ఎంత పవిత్రమైనదైనా క్రూరంగా ఉంటే మాత్రం రాణించదు. అది శాంతమై, ఇతరులకు ఉపకారం కలిగించేదైతే సజ్జనులు దాన్ని ప్రశంసిస్తారు. పూర్వం ఒక గ్రామంలో వృద్ధ స్నేహితులు ఇద్దరుండేవారు. వాళ్ళిద్దరూ బాగా కలిగిన ధనవంతులే. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఒకసారి ఊరి బయటకు వారు షికారుకు వెళ్లినప్పుడు వారిని పిచ్చి కుక్క కరిచింది. ఫలితంగా ‘రేబిస్ వ్యాధి’ సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మరణం తప్పదని నిర్ధారణ అయింది.ఇప్పుడు వాళ్ళకు ఏదో దాన ధర్మాలు చేసుకుంటే మంచిదనీ, కీర్తి ప్రదమనీ అనిపించింది. పిచ్చికుక్కలు మానవజాతికి ప్రమాదకారులు కనుక వాటివల్ల తమ లాగానే ఇతరులు బాధపడకూడదనే సదుద్దేశంతో వారిలో ఒకాయన, తన యావత్తు ఆస్తినీ పిచ్చికుక్కల్ని చంపటానికి ఖర్చు పెట్టాలని వీలునామా రాశాడు. ఇక రెండవ వ్యక్తి, పిచ్చికుక్క కాటువల్ల వచ్చే రోగానికి మంచి మందు కనిపెట్టి దాన్ని రోగులకు ఉచితంగా ఇచ్చి వైద్యం చేయాలంటూ అందుకోసం తన ఆస్తినంతా ఖర్చుపెట్టాలని వీలు నామాలో రాశాడు. ఎలా వుంది, వీరిరువురి దానాల తీరు? ఇద్దరూముందు తరాలవారికై మంచి పనే చేశారు. కాని మొదటాయన చేసిన దానం చాలా క్రూరమైంది. హింసాత్మకం. రెండవవాడు చేసింది సున్నితమైంది. జాతికి బాగా ఉపయోగపడేది. ఈరెండవ పద్ధతి దానాన్నే పెద్దలు మెచ్చుకుంటారు. ఇలాగే దానధర్మాల కోసం ధనం బాగా ఖర్చుపెట్టే దాతలున్నారు. బీదలకు అన్న సత్రాలు కట్టిస్తారు. పాఠశాలలు నెలకొల్పుతారు. బావులు, చెరువులు తవ్విస్తారు. దళిత దీన జనాలకై తిండి, వస్త్రాలు, వసతి వంటివెన్నో కల్పిస్తారు. కానీ ఇలాంటివి చేసే వ్యక్తులకెంతో ఓర్పు, జాలి, దయాదాక్షిణ్యా దులుండటం అవసరం. లేకపోతే ఆ దానాల ఫలితాన్నందు కోలేరు. ముఖ్యంగా ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం ఉండ కూడదు. ‘నా గురించి పదిమంది పొగడాలి’ అనే కాంక్ష ఉండ రాదు. ‘దానం చేయటం నా కర్తవ్యం’ అని భావిస్తూ ఫలాపేక్ష రహితంగా చేసే దానం ఉత్తమం. జయ గురుదత్త!శ్రీ గణపతి సచ్చిదానందస్వామి -
దర్శకుడు సచీ కన్నుమూత
మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు సచ్చిదానందన్ (సచీ) కన్నుమూశారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే వ్యవస్థలో సమస్య రావడంతో సచీకి గుండెపోటు వచ్చింది. దీంతో మూడు రోజుల క్రితం త్రిసూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన్ను జాయిన్ చేశారు బంధువులు. కొన్ని గంటలపాటు వెంటిలేటర్‌పై సచీకి చికిత్స జరిగింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. 2007లో వచ్చిన మలయాళ చిత్రం ‘చాక్లెట్’కు సేతుతో కలిసి సచీ కో–రైటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘మేకప్‌మేన్, సీనియర్స్, డబుల్స్’ వంటి చిత్రాలకు సచీ–సేతు రచయితలుగా చేశారు. సచీ ఒక్కరే ‘రన్ బేబీ రన్’, ‘డ్రైవింగ్ లైసెన్స్, ‘అనార్కలి’ (దర్శకత్వం కూడా), ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ (దర్శకత్వం కూడా) చిత్రాలకు కథ అందించారు. ‘అనార్కలి’ (2015) చిత్రంతో సచీ దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. దర్శకుడిగా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ చిత్రం ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పృథ్వీరాజ్ సుకుమారన్, బీజూ మీనన్ నటించిన ఈ చిత్రం తెలుగులో రీమేక్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ హక్కులను దక్కించుకున్నారు. ఈ సినిమా హిందీ రీమేక్ హక్కులను నిర్మాత – నటుడు జాన్ అబ్రహాం సొంతం చేసుకున్నారు. సచీ మృతి పట్ల మలయాళ ఇండస్ట్రీ, ఇతర సినీరంగ ప్రముఖులు కూడా విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. -
రోజూ సూర్య భగవానుడిని పూజించాలి
ప్రొద్దుటూరు కల్చరల్: రోజూ సూర్య భగవానుడిని దర్శించి పూజించడం ద్వారా విటమిన్ డీ లభిస్తుందని, ఆరోగ్యంగా జీవించవచ్చని మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి పేర్కొన్నారు. స్థానిక వైఎంఆర్ కాలనీలోని సత్యనారాయణస్వామి ఆలయంలో బుధవారం రాత్రి శ్రీచక్రపూజ నిర్వహించిన అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా అహం దరిచేరనీయకూడదని, ఇతరులను గౌరవించాలన్నారు. పరీక్షిత్ మహారాజు కథను వివరించారు. ఆలయంలోని సుదర్శన యోగ నరసింహస్వామి ఎంతో మహిమగలవారని, భక్తులు పూజలు నిర్వహిస్తే వారి సమస్యలు తొలగిపోయి కోరికలను నెరవేరుతాయని చెప్పారు. టీవీ, సీరియల్స్ చూడటం వలన మనిషికి జడత్వం లభిస్తుందన్నారు. తాను ప్రొద్దుటూరు పట్టణంలో భిక్ష స్వీకరించానని, ఆనాటి చదువుకున్న జ్ఞాపకాలను భక్తులకు తెలిపారు. ఆధ్యాత్మిక చింతనతో మెలగి, అందరూ సన్మార్గంలో నడవాలన్నారు. ఆంజనేయస్వామి, యోగిరాజ వల్లభ దత్తాత్రేయస్వామి, చాముండేశ్వరిదేవి, కాశీవిశ్వేశ్వరుడు, యోగ నరసింహస్వామిలను సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు సచ్చిదానంద స్వామి ఆశీర్వాదం తీసుకున్నారు.