పొగడ్తల కోసమా దానం? ఎలాంటి దానం గొప్పది! | charity without any profit, thinking that it is my duty is best | Sakshi
Sakshi News home page

పొగడ్తల కోసమా దానం? ఎలాంటి దానం గొప్పది!

Jun 19 2025 1:09 PM | Updated on Jun 19 2025 3:28 PM

charity without any profit, thinking that it is my duty  is best

పవిత్రమపి యత్‌ క్రూరం కర్మ తన్నహి శోభతే
పరోపకారకం శాంతం కర్మ సద్భిః ప్రశస్యతే 

మనం చేసే పని ఎంత పవిత్రమైనదైనా క్రూరంగా ఉంటే మాత్రం రాణించదు. అది శాంతమై, ఇతరులకు ఉపకారం కలిగించేదైతే సజ్జనులు దాన్ని ప్రశంసిస్తారు. పూర్వం ఒక గ్రామంలో వృద్ధ స్నేహితులు ఇద్దరుండేవారు. వాళ్ళిద్దరూ బాగా కలిగిన ధనవంతులే. ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్ళేవారు. ఒకసారి ఊరి బయటకు వారు షికారుకు వెళ్లినప్పుడు వారిని పిచ్చి కుక్క కరిచింది. ఫలితంగా ‘రేబిస్‌ వ్యాధి’ సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. మరణం తప్పదని నిర్ధారణ అయింది.

ఇప్పుడు వాళ్ళకు ఏదో దాన ధర్మాలు చేసుకుంటే మంచిదనీ, కీర్తి ప్రదమనీ అనిపించింది. పిచ్చికుక్కలు మానవజాతికి ప్రమాదకారులు కనుక వాటివల్ల తమ లాగానే ఇతరులు బాధపడకూడదనే సదుద్దేశంతో వారిలో ఒకాయన, తన యావత్తు ఆస్తినీ పిచ్చికుక్కల్ని చంపటానికి ఖర్చు పెట్టాలని వీలునామా రాశాడు. ఇక రెండవ వ్యక్తి, పిచ్చికుక్క కాటువల్ల వచ్చే రోగానికి మంచి మందు కనిపెట్టి దాన్ని రోగులకు ఉచితంగా ఇచ్చి వైద్యం చేయాలంటూ అందుకోసం తన ఆస్తినంతా ఖర్చుపెట్టాలని వీలు నామాలో రాశాడు. ఎలా వుంది, వీరిరువురి దానాల తీరు? ఇద్దరూముందు తరాలవారికై మంచి పనే చేశారు. కాని మొదటాయన చేసిన దానం చాలా క్రూరమైంది. హింసాత్మకం. 

రెండవవాడు చేసింది సున్నితమైంది. జాతికి బాగా ఉపయోగపడేది. ఈరెండవ పద్ధతి దానాన్నే పెద్దలు మెచ్చుకుంటారు. ఇలాగే దానధర్మాల కోసం ధనం బాగా ఖర్చుపెట్టే దాతలున్నారు. బీదలకు అన్న సత్రాలు కట్టిస్తారు. పాఠశాలలు నెలకొల్పుతారు. బావులు, చెరువులు తవ్విస్తారు. దళిత దీన జనాలకై తిండి, వస్త్రాలు, వసతి వంటివెన్నో కల్పిస్తారు. కానీ ఇలాంటివి చేసే వ్యక్తులకెంతో ఓర్పు, జాలి, దయాదాక్షిణ్యా దులుండటం అవసరం. లేకపోతే ఆ దానాల ఫలితాన్నందు కోలేరు. ముఖ్యంగా ‘నేను చేస్తున్నాను’ అనే అహంకారం ఉండ కూడదు. ‘నా గురించి పదిమంది పొగడాలి’ అనే కాంక్ష ఉండ రాదు. ‘దానం చేయటం నా కర్తవ్యం’ అని భావిస్తూ ఫలాపేక్ష రహితంగా చేసే దానం ఉత్తమం. జయ గురుదత్త!

శ్రీ గణపతి సచ్చిదానందస్వామి 

Advertisement
 
Advertisement
Advertisement