breaking news
Rio de Janeiro Olympics
-
ఒలింపిక్స్‌కు సీమా అర్హత
న్యూఢిల్లీ: డిస్కస్ త్రోయర్ సీమా పూనియా రియో డి జనీరో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అమెరికాలో జరుగుతున్న పాట్ యంగ్స్ త్రోయర్స్ క్లాసిక్ టోర్నీలో తను డిస్క్‌ను 62.62మీ. దూరం విసిరి రియో బెర్త్ దక్కించుకుంది. దీంతో 32 ఏళ్ల సీమా ఒలింపిక్స్ అర్హత దూరం 61.00మీ. అధిగమించినట్టయ్యింది. ఈ ఈవెంట్లో తను... 2008 ఒలింపిక్ చాంపియన్ స్టెఫానీ బ్రౌన్‌ను అధిగమించి స్వర్ణం దక్కించుకుంది. 2014 ఆసియా గేమ్స్‌లోనూ విజేతగా నిలిచిన సీమాకిది మూడో (2004, 12) ఒలింపిక్స్. ఇప్పటిదాకా భారత్ నుంచి 19 మంది ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించారు. -
‘రియో’కు ఫిట్‌గా ఉంటా
ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ బెంగళూరు: ప్రతిష్టాత్మక రియో డి జనీరో ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఎలాంటి గాయాల బెడద లేకుండా ఉండాలని స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కోరుకుంటోంది. ప్రస్తుతం గాయాల కారణంగా కొద్ది కాలం నుంచి ఆమె ఎలాంటి టోర్నమెంట్స్ ఆడటం లేదు. తాజాగా జర్మన్ ఓపెన్ నుంచి కూడా ఈ ప్రపంచ రెండో ర్యాంకర్ వైదొలిగింది. ‘లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించాను. అంతా అనుకూలంగా జరిగి ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటే కచ్చితంగా మరో పతకం సాధించాలనుకుంటున్నాను. అందుకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండాలని ఆశిస్తున్నాను. మూడోసారి ఈ క్రీడల్లో పాల్గొంటే అది నాకు గర్వకారణంగా ఉంటుంది’ అని సైనా తెలిపింది. గాయాలతో ఇప్పటికే ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ చాంపియన్‌షిప్, సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి టోర్నీ, దక్షిణాసియా క్రీడల నుంచి సైనా తప్పుకుంది. ఈసారి ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా... ఊహించి చెప్పేందుకు తానేమీ దేవుణ్ణి కానని, పతకం కోసం శాయశక్తులా ప్రయత్నిస్తానని తెలిపింది. సానియా మీర్జా, కిమ్ క్లియ్‌స్టర్స్ లాంటి టెన్నిస్ క్రీడాకారిణులకు పెళ్లి మంచి ప్రేరణగా పనిచేసిందని, అయితే ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ‘వివాహం చేసుకునేందుకు నేనేమీ భయపడటం లేదు. ప్రతీ అమ్మాయికి ఈ దశ వస్తుంది. అది జరిగినప్పుడు జరుగుతుంది. ఫలానా సమయంలోనే జరగాలనేమీ లేదు’ అని 25 ఏళ్ల ఈ హైదరాబాదీ తేల్చింది. -
రియో మస్కట్‌గా పిల్లి
రియో డి జనీరో: 2016లో జరిగే రియో డి జనీరో ఒలింపిక్స్ కోసం పసుపు పచ్చ రంగులో ఉన్న పిల్లిని ఎంపిక చేశారు. బ్రెజిల్‌లోని జంతువుల జీవితాన్ని ఇది ప్రతిబింబిస్తుందని నిర్వాహకులు తెలిపారు. పసుపు రంగు ఆ దేశ జాతీయ రంగుల్లో ఒకటి. అయితే ఈ మస్కట్‌కు ఇంకా పేరు పెట్టలేదు. పోలింగ్ ద్వారా ప్రజలు నిర్ణయించే పేరును వచ్చే ఆదివారం రాత్రి వెల్లడించనున్నారు.