breaking news
revolutionary poet
-
వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లొచ్చు
ముంబై: ఎల్గార్ పరిషత్– మావోయిస్టుల తో సంబంధాల కేసులో అరెస్టయి బెయిల్ మీద బయటికొచ్చిన విప్లవకవి వరవరరావు హైదరాబాద్ వెళ్లేందుకు ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం అనుమతి మంజూరుచేసింది. ఎడమ కంటికి చికిత్స నిమిత్తం డిసెంబర్ 5–11 తేదీల మధ్య హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతినిస్తూ బుధవారం జడ్జి రాజేశ్ కటారియా ఉత్తర్వులిచ్చారు. హైదరాబాద్‌కు వెళ్లాక ఎక్కడ ఉండేది, చిరునామా, ఫోన్ నంబర్, షెడ్యూల్ తదితర సమగ్ర వివరాలను ముందుగానే ముంబైలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు సమర్పించాలని ఆదేశించింది. ప్రయాణ అనుమతిని దుర్వినియోగం చేయొద్దని హెచ్చరించింది. -
విప్లవాగ్ని జ్వలితుడు
తలవంచని విప్లవ కవిగా, పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్నారు వరవరరావు! 1957–2017 మధ్య కాలంలో ఆయన రాసిన సుమారు 50 కవితలను పెంగ్విన్ రాండమ్ హౌస్ ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’ పేరుతో ఆంగ్లంలో ప్రచురించింది. ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం’ వైపు పయనిస్తున్న ‘వరవర’కు తగిన గౌరవం. ‘‘లోకంలో మేధావులనుకుంటున్నవారు సహితం పిరికిపందలుగా ఉంటారు. అలాంటి పిరికి పందలకన్నా మనోధైర్యంతో, దమ్ములతో బతకనేర్వడం అతి అరుదైన లక్షణంగా భావించాలి.’’ – ‘వికీలీక్స్’ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ ప్రపంచ దేశాలపై అమెరికా నిరంతర కుట్రలను బహిర్గతం చేసినందుకు జీవిత మంతా కష్టాలను కాచి వడబోస్తున్న మహాసంపాదకుడు, ప్రపంచ పాత్రికేయ సింహం... జూలియన్ అసాంజ్. అలాంటి ఒక అరుదైన సింహంగా, తలవంచని విప్లవ కవిగా ఈ క్షణం దాకా పెక్కు నిర్బంధాల మధ్యనే ముందుకు సాగుతున్న కవి వరవరరావు! దఫదఫాలుగా దశాబ్దాలకు మించిన జైళ్ల జీవితంలో ఆయనను (1973లో తొలి అరెస్టు మొదలు) 25 కేసులలో కేంద్ర, రాష్ట్ర పాలకులు ఇబ్బందులు పెట్టారు. అలాంటి విప్లవకవి వరవరరావు తెలుగులో 1957–2017 మధ్య కాలంలో రాసిన సుమారు 50 కవితలను ఎంపిక చేసి... కవి, సాహితీ విమర్శకులు, మానవ హక్కుల పరిరక్షణా ఉద్యమాలకు నిరంతరం చేయూతనందిస్తున్న పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్, నవలాకారిణి, కవయిత్రి మీనా కందసామి ఇండియాలోని సుప్రసిద్ధ పెంగ్విన్ రాండమ్ హౌస్ కోరికపై అందజేసిన గ్రంథమే ‘వరవరరావు – ఎ లైఫ్ ఇన్ పొయెట్రీ’! సర్వత్రా ‘సామ్యవాద రంకె’ వినిపించిన వరవరరావు 1972 లోనే: ‘దోపిడీకి మతం లేదు, దోపిడీకి కులం లేదు దోపిడీకి భాష లేదు, దోపిడీకి జాతి లేదు దోపిడీకి దేశం లేదు తిరుగుబాటుకూ, విప్లవానికీ సరిహద్దులు లేవు’ అని చాటుతూనే, తనను శత్రువు కలమూ, కాగితమూ ఎందుకు బంధించాయో తెగేసి చెప్తాడు: ‘ప్రజలను సాయుధులను కమ్మన్నందుకు గాదు/ నేనింకా సాయుధుణ్ణి కానందుకు’ అన్నప్పుడు జూలియన్ అసాంజ్ చేసిన హెచ్చరికే జ్ఞాపకం వస్తుంది. అంతేగాదు, ‘వెనక్కి కాదు, ముందుకే’ అన్న కవితలో ‘వరవర’: ‘బానిస సమాజం నుంచి బానిస భావం కూడా లేని కమ్యూనిజం దాకా పయనించే ఈ కత్తుల వంతెన మీద ఎంత దూరం నడిచి వచ్చావు – ఇంకెంత దూరమైనా ముందుకే సాగు’ గాని వెనకడుగు వెయ్యొద్దని ఉద్బోధిస్తాడు! ధనస్వామ్య రక్షకులైన పాలకుల దృష్టిలో ‘ప్రజాస్వా మ్యా’నికి అర్థం లేదని– ‘పార్లమెంటు పులి కూడ /పంజాతోనే పాలిస్తూ సోషలిజం వల్లించుతూనే / ప్రజా రక్తాన్ని తాగేస్తుంద’నీ నాగుబాము పరిపాలనలో / ప్రజల సొమ్ము పుట్ట పాల’వుతున్న చోటు – ‘జలగల్ని పీకేయందే – శాంతి లేదు/ క్రాంతి రాద’ని నిర్మొహమాటంగా ప్రకటిస్తాడు. ‘జీవశక్తి’ అంటే ఏమిటో కవితాత్మకంగా మరో చోట ఇలా స్పష్టం చేస్తాడు: ‘అన్ని రోజులూ కన్నీళ్లవి కావు / అయినా ఆనంద తీరాలు ఎప్పుడూ తెలియకుండా / దుఃఖం లోతెట్లా తెలుస్తుంది? ఆ రోజులూ వస్తాయి / కన్నీళ్లు ఇంద్రధనుస్సులవుతాయి నెత్తురు వెలుగవుతుంది / జ్ఞాపకం చరిత్ర అవుతుంది బాధ ప్రజల గాథ అవుతుంది!’ జైలు జీవితానుభవాన్ని సుదీర్ఘ అనుభవం మీద ఎలా చెప్పాడో! ‘జైలు జీవితమూ అంగ వైకల్యం లాంటిదే నీ కంటితో ఈ ప్రపంచాన్ని చూడలేవు నీ చెవితో వినలేవు, నీ చేయితో స్పృశించలేవు నీ ప్రపంచంలోకి నువ్వు నడవలేవు నీవుగా నీ వాళ్ళతో నువ్వు మాట్లాడలేవు ఎందుకంటే – అనుభూతి సముద్రం పేగు తెగిన అల ఇక్కడ హృదయం!’ ఇప్పటికీ దేశవ్యాపితంగా ప్రజా కార్యకర్తలపైన, పౌరహక్కుల నాయకులపైన యథాతథంగా హింసాకాండ అమలు జరుగుతూనే ఉంది. దానికి ఉదాహరణగా, అనేక రకాలుగా వికలాంగుడైన ప్రజా కార్యకార్త ప్రొఫెసర్ సాయిబాబానే కార్పొరేట్ శక్తుల కన్నా ప్రమాదకరం అన్నట్టుగా పాలకులు వ్యవహ రించడం ఏమాత్రం క్షంతవ్యం గాదు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సాయుధ పోరాట కవి
1944 నుంచి 1952 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక చేత్తో పెన్ను, మరో చేత్తో గన్ను పట్టి తన మాట, ఆట, పాటలతో ఊపిరులూదిన ప్రజాకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. నల్గొండ జిల్లా రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామంలో 1908వ సంవత్సరంలో గుర్రం బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించాడు హనుమంతు. చిన్నప్పటినుంచి నాటకాలు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఒకవైపు పాటలు రాస్తూ, పాడుతూ, ప్రజలను చైతన్యపరుస్తూ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, కవిగా, కళాకారుడిగా, ఉద్యమనేతగా తన కలాన్ని, గళాన్ని వినిపించాడు. నాటి సాయుధపోరాటంలో రజాకార్లు ఊర్లపైబడి ప్రజల ధనమాన ప్రాణాలను దోచుకుపోతుంటే ముసలావిడ ఒక సభలో పలికిన మాటను ‘వెయ్ దెబ్బ’ పాటగా మలిచారు సుద్దాల. అది రజాకార్లను తరిమికొట్టిన పాటే. అలాగే 1946లో ‘పాలబుగ్గల జీతగాడ తలచుకుంటే దు:ఖమొచ్చిందా’ అంటూ సాగే గతం వెట్టిచాకిరిపై యుద్ధారావాన్ని ప్రకటించింది. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభకు రావి నారాయణరెడ్డి సభాధ్యక్షత వహించగా లక్షలాది ప్రజల ఆర్తనాదాలను, తన భావాలకు జోడించి ఉద్యమ వలంటీర్‌గా ప్రజాపోరాటాల్లో గెలిచిన సుద్దాల కలం, గళం 1982 అక్టోబర్ 10న మూగబోయింది. ఆయన స్మృతి చిహ్నంగా ప్రజా ఉద్యమాలకు చిహ్నంగా వారి స్తూపాన్ని పెన్ను ఆకృతిలో నిర్మించారు. వారికి ఇవే ఉద్యమ జోహార్లు! (నేడు సుద్దాల హనుమంతు 36వ వర్ధంతి) -కందుల శివకృష్ణ, పరిశోధకులు, సుద్దాల హనుమంతు సాహిత్యం ‘ మొబైల్ : 99665 07875 -
సారీ.. నో కామెంట్!
విప్లవ కవి వరవరరావుకు ఫోన్ చేసి ‘నేను–నా దైవం’ శీర్షికకు ఇంటర్వ్యూ అడిగినప్పుడు ‘నేనూ దైవమా!!’ అన్నారు. పోనీ... దైవత్వాన్ని ‘నేను–నా విప్లవం’గా మార్చి చెప్పండి అని అడిగాం. లేకపోతే ఆయన దగ్గర్నుంచి ఏం సమాధానం వస్తుందో మాకు తెలుసు. అదేంటంటారా... ‘సారీ.. నో కామెంట్’. ► దేవుణ్ణి నమ్మే కుటుంబంలో పుట్టి, దేవుణ్ణి నమ్మని వారు ఎలా అయ్యారు?! వరవరరావు: యూనివర్సిటీలో చేరే వరకూ దేవుడి ఉనికిపై నాకు ఎలాంటి ఆలోచనలూ లేవు. ఎం.ఎ చేస్తున్నప్పుడు ఎంతోమందిని చదివాను, అలాగే ఎంతో సాహిత్యాన్ని! అందులో గురజాడ, శ్రీశ్రీ, చలం.. వంటి వారెందరో ఉన్నారు. ఆంత్రోపాలజిస్టుల అభిప్రాయాలూ నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. దాంతో ఒక నిశ్చయానికి వచ్చాను. మనిషి దేవుణ్ణి సృష్టించాడు తప్ప, మనిషిని సృష్టించిన దేవుడు లేడని. ► డార్విన్, మార్క్స్ కూడా మీకు తోడైనట్లున్నారు? జీవ పరిణామక్రమంలో ఆది మానవుడు అనంతర మానవుడిగా మారడానికి శ్రమ కారణమైంది. ఆహారాన్వేషణలో, ఆహార ఉత్పత్తిలో భాగంగా మెదడు వృద్ధి చెందింది. అది వికసించింది. ఉత్పత్తికి శ్రమ ఆధారమైంది. డార్విన్ చెప్పిన పరిణామక్రమం, మార్క్స్ ఏంగిల్స్ చెప్పిన శ్రమ ఆధారంగా ప్రాపంచిక దృక్పథాన్ని ఏర్పరచుకున్న వాళ్లలో నేనూ ఒకడిని. ► తర్కాలతో దేవుణ్ణి అందుకోలేమనే వారూ ఉన్నారు కదా! మనిషి పండు తిన్నాడు. గింజలు విసిరేశాడు. అవి పది చెట్లు అయ్యాయి. ఆ పది చెట్ల ఫలాలు వందల చెట్లకు కారణం అయ్యాయి. ఆ క్రమంలోనే మనిషి రుతువులను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు. రోగానికి కారణమేంటి, చావుకు కారణమేంటి? అని జవాబులు వెతకడం మొదలుపెట్టాడు. తనకు అర్థమైనదాన్ని జ్ఞానంగా ఆపాదించుకుని, అర్థంకాని దానిని అలౌకిక శక్తిగా ఊహించుకున్నాడు... ► ... ఒక్క నిమిషం.. అలౌకిక శక్తి అవసరం మనిషికి ఏమిటి? మార్క్స్ ఏమన్నాడంటే... తనను తాను వివరించుకోలేనప్పుడు మనిషి సృష్టించుకున్నదే దైవరూపం అని. సమాజం, వ్యవస్థలు ఎలా మారుతుంటే దేవుని రూపం అలా మారుకుంటూ వచ్చింది. వ్యవసాయంలో ఉన్న మనిషికి రాయి, పశువు, గుర్రం, పాము దేవుళ్లయ్యాయి. ఇవన్నీ వ్యవసాయంతో సంబంధం ఉన్నవి. భూమిని దున్నుతున్నప్పుడు రాయి అడ్డు వస్తే ఆ రాయీ వారికి దేవుడైంది. వాటి మీద శ్లోకాలు కట్టి కీర్తించాడు. ప్రకృతిని ఆరాధించాడు. పంట పండటానికి కారణమైన వరుణుడిని, సూర్యుడిని... పంచభూతాలను దేవుళ్లను చేశాడు. ► మీరూ.. అలా దేవుణ్ణి నమ్మిన కుటుంబాల నుంచే వచ్చారు. అలాంటిది మీ భావనలలో ఇంత వైరుధ్యం ఏమిటి? వరంగల్‌లోని చిన్న పెండ్యాల మా ఊరు. మొదటి నుంచీ మాది రాజకీయ కుటుంబం. నేను పుట్టేనాటికి మా పెద్దన్నయ్యలిద్దరూ రాజకీయాల్లో ఉన్నారు. మా బాపు (నాన్న) వైష్ణవ ఆరాధకుడు. దేవుణ్ణి కొలిచేవాడు. మా ఇంట్లో పెరుమాళ్ల ఇల్లు అని ఒక గది ఉండేది. ఆ పక్కనే వంట గది. పెరుమాళ్ల ఇంట్లో ఏముండేవో మాకు తెలిసేది కాదు. బహుశా! రాగి, ఇత్తడి విగ్రహాలు ఏవో ఉండేవనుకుంటా. ఆ విగ్రహాలు, దీపపు చెమ్మలు శుభ్రంగా కడిగి, తుడిచిచ్చే పని మా అమ్మది. వంటింట్లో నుంచే పెరుమాళ్ల ఇంట్లోని మా బాపుకు అందించేది. ఆయన వాటినందుకొని తలుపులేసుకుని దేవుణ్ణి పూజించుకునేవాడు. మా అమ్మకు పెరుమాళ్ల ఇంట్లోకి పోయి మా బాపుతో కూర్చుని పూజ చేసే అర్హత లేదు! మా ఇళ్లలో పురుషుడు చేసే పూజను స్త్రీ చూస్తే దేవుడికి దృష్టి దోషం కలుగుతుందట. అందుకని మా అమ్మ చూస్తున్నప్పుడు మా బాపు పూజ చేసేవాడు కాదు. అంటే.. ఆమెకు దేవుణ్ణి చూసే అర్హత లేదు. ఆమెకు జ్ఞానార్హత లేదు. అసలు మను ధర్మ శాస్త్ర ప్రకారం దేవుణ్ణి పూజించే అర్హత స్త్రీకి లేదట. ఎంత అన్యాయం? ► ఆ అన్యాయాన్ని మీరు ప్రశ్నించలేదా? అప్పటికి లేదు. నాకు ఎనిమిదేళ్లు వచ్చేసరికి మా బాపు చనిపోయాడు. మా అమ్మకు పూజ చేసే అర్హత లేదంటే ఆయన దృష్టిలో ఆమె పిల్లలమైన మాకూ లేనట్టేగా! పైగా, నేను చెడు నక్షత్రంలో పుట్టాను అని, నా వల్ల ఇంటికి అరిష్టం అని నన్ను దేవుడికి పరిచయం చేయాలనుకోలేదేమో ఆయన. ఇక మా అమ్మను ఆయన ఒక పనిముట్టుగానే భావించేవాడు. ఆయన్ని చెడ్డవాడని నేను అనను. మూఢవిశ్వాసాలున్న ఒక సగటు మనిషి ఆయన. మా అమ్మ అన్నీ సిద్ధం చేసి ఉంచితే, దేవుణ్ణి మొక్కుకొని బయటపడి, పది మంది పిల్లలను పోషించడానికి నాలుగు పైసల కోసం పొద్దుటి నుంచి రాత్రి వరకు కష్టపడేవాడే తప్ప ఆయనకైనా దేవుని గురించి ఆలోచించే తీరిక ఉండేదని అనుకోను. కష్టం చేసేటోడికి దేవుణ్ణి గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? లీజర్లీ క్లాస్.. దేవుణ్ణి సృష్టించింది. కష్టం చేసేవాడికి సమస్యలు వస్తే పరిష్కారాలకు దేవుడున్నాడని ఆ వర్గం చెబితే నమ్మిన వారిలో ఆయనా ఒకరు. ► దేవుణ్ని కొందరికే ఎందుకు అలా పరిమితం చేశారు? మా బాల్యంలో వినాయక పూజ బ్రాహ్మణులు, కోమట్లు మాత్రమే చేసేవారు. రేగడి మట్టితో చిన్న బొమ్మ చేసి, పూజించి ఇంటెనెక బావిలో వేసి, కోమట్ల ఇంటి మీద రాళ్లు వేసేవారు. వాళ్ల చేత తిట్లు తింటే మంచి జరుగుతుందనేది మరో మూఢ నమ్మకం. ఇప్పుడు దేవుడు మార్కెట్ అయిపోయాడు. కులాన్ని బట్టి దేవుడు, వర్గాన్ని బట్టి దేవుడు పుట్టుకొచ్చారు. గ్రామదేవతలంతా శూద్రుల దేవుళ్లు. రాముడు, కృష్ణుడు, వినాయకుడు అగ్రకులస్తుల దేవతలు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరి సౌలభ్యాన్ని బట్టి వారు దేవుణ్ణి సృష్టించుకున్నారనే కదా. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ.. ‘మీరు ఎంత అభూత కల్పనలు చేసే ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట మీ భౌతిక జ్ఞానం పనిచేస్తుంది’అని అంటారు. ఉదాహరణకు.. స్వారోచిత మనుసంభవం తీసుకుందాం. ప్రవరుడు అనే ఆయన యజ్ఞయాగాదులు చేసుకునేవాడు. అతడి ఇంటికి ఒక సిద్ధుడు వచ్చాడు. కైలాసగిరి, హిమాలయాలు అన్నీ తిరిగానని చెప్పాడు. ఓ పసరు వల్ల ఇదంతా సాధ్యమన్నాడు. ప్రవరుడు కోరితే అతని పాదాలకు ఆ పసరు రాసాడు. ప్రవరుడు వెంటనే హిమాలయాలకు వెళ్లాడు. తిరిగివద్దామంటే పసరు కరిగిపోయి రాలేక పోయాడు. అప్పుడు రాళ్లపల్లి వారు ఏమంటారంటే– ‘అంత శక్తి గల పసరు అలా ఎలా కరిగిపోయింది?’ అని. అంటే, ఎక్కడో మన ఇంద్రియ జ్ఞానం పనిచేస్తుందన్నమాట. అయితే ఆ ప్రశ్నించే గుణాన్ని అణచివేస్తే తప్ప పాలకులు మనల్ని పరిపాలించలేరు. అణిచివేతకు సరైన ఆయుధం ‘దేవుడు.’ ఈ లోకాన్ని పట్టి పీడిస్తున్నవి రెండే రెండు శక్తులు.. ఒకటి పెట్టుబడి, రెండవది మూఢభక్తి. ► దేవుడి నుంచి రాజకీయాల్లోకి వెళ్లారు! దేవుళ్ల పరిణామ క్రమం అది (నవ్వుతూ). రాజకీయమే కాదు, వ్యాపారం కూడా అయిపోయాడు దేవుడు. అయోధ్యలో బాబ్రీ మసీదు విషయమే తీసుకుందాం. చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే అయోధ్యలో గతంలో ఉన్నది రామ్‌లల్లా అనే దేవుడి గుడి. రామ్‌లల్లా మార్వాడీల దేవుడు. మార్వాడీలు చేసేది వ్యాపారం. ఆ విధంగా చూస్తే రాముడు... వ్యాపారుల దేవుడు అనుకోవాలి. ► సృష్టిలో మీకు ఎక్కడైనా దైవాంశం గోచరిస్తుందా? డిగ్రీలో మాకు సంస్కృతం సబ్జెక్ట్ ఉంది. అక్కడ కొన్ని విషయాలు తెలిశాయి. స్త్రీలు సంస్కృతం చదవకూడదు. మాట్లాడకూడదట. అభిజ్ఞాన శాకుంతలం నాటకంలో దుష్యంతుడు సంస్కృతం మాట్లాడుతాడు. శకుంతల శూద్రులు మాట్లాడే పాళీ భాషలో మాట్లాడుతుంది. అంతెందుకు రామాయణంలో రాముడు సంస్కృతం మాట్లాడతాడు, సీత పాళీ భాష మాట్లాడుతుంది. మా లెక్చరర్ని ఓ ప్రశ్న అడిగాను. ‘అయ్యా! సీత, శకుంతల పాళీ భాష మాట్లాడితే రాముడికి, దుష్యంతుడుకి అర్థం అవుతుంది. వాళ్లు రాజుల కాబట్టి అన్ని భాషలు నేర్చుకొని ఉంటారు. మరి రాముడు, దుష్యంతుడు సంస్కృతం మాట్లాడితే సీతకు, శకుంతలకు ఎలా తెలుస్తుంది?’ అని. ఇది ఇప్పటికీ అర్థం కాదు. నేను పండితులను ఇదే ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పండి. మీరు ఏర్పరచిన నియమాల వల్ల మీరే దేవతగా పూజించే సీతకు సంస్కృతం రావడానికి వీల్లేదు. రుషి దగ్గర పెరిగిన శకుంతలకు సంస్కృతం రావడానికి వీల్లేదు. నస్త్రీ స్వాతంత్య్రమర్హతి.. స్త్రీకి స్వాతంత్య్రం ఉండకూడదన్నారు. ఇది మనువు నిర్దేశించింది. ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా..?’ అనే ద్రౌపది ప్రశ్నకు ఎలాగైతే సమాధానం లేదో.. దీనికీ లేదు. సంస్కృతమంతా ‘డు’ అంతాలే! అంటే మగవాడికి సంబంధించినవే! తర్వాత రాణులు వచ్చి ఉంటారు కానీ, మన సంస్కృతం రాయబడింది రాజుల గురించే! దేవుడికి స్త్రీ అవసరం లేనప్పుడు, స్త్రీకి దేవుడెందుకు? ఈ సృష్టిలో మనిషికి జన్మనిస్తుంది కాబట్టి స్త్రీయే దేవత. ► మీరు స్త్రీ పక్షపాతి అనుకోవచ్చా? అన్యాయాన్ని ప్రశ్నించడం నా నైజం. నాకు ముగ్గురు కూతుళ్లు. ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని వారికి ఎలా చెప్పాలి?! ఈ సాహిత్యాన్నే వారికీ పరిచయం చేశాను. వాళ్లూ మనిషి సృష్టించిన దేవుణ్ణి నమ్మరు. ► చావు పుట్టుకలను దేవుడి నుంచి వేరుచేసి చూడగలమా? చావు పుట్టుకులను వివరించకపోవడం వల్లే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. పంచేంద్రియాలతో ఈ శరీరం రూపు కడుతుంది. ఆత్మ అనేది పెద్ద అబద్దం. మళ్లీ జన్మ ఉంటుందన్నది కూడా అబద్ధం. మనిషి దేవుడు తన కన్నా గొప్పగా ఉండాలనుకున్నాడు. అందుకే దేవుడికి నాలుగు తలలు పెట్టాడు. నాలుగు చేతులు పెట్టాడు. నాకంటే గొప్పవాడైన దేవుడికి నాలాగే ఒక్క తలకాయ ఉంటే ఎట్లా బలవంతుడవుతాడు అనుకున్నాడు. అందుకనే ఆ నాలుగు తలల ఊహ. రాక్షసుడికి నాలుగు కాదు పది తలలు ఉండాలనుకున్నాడు. రావణాసురుడికి పది తలలు పెట్టాడు. వాడిని ఒక్క తల ఉన్న మనిషి ఎలా చంపాడంటే, అవతారం అన్నారు! పక్షి లేకుండా విమానం లేనట్టే, ఒక చేప లేకుండా ఓడ లేనట్టే, ఒక మనిషి లేకుండా దేవుడు లేడు. దేవుడికి ప్రాతిపదిక మనిషే! ► మీరు మావోయిజాన్ని నమ్ముతారు. మావోను మీ దైవం అనుకోవచ్చా? మావోయిజం త్యాగం గురించి చెబుతుంది. ఒక మావోయిస్టు పార్టీ అధ్యక్షుడు ఇంటిని, భార్య బిడ్డలను వదిలేసి అడవుల్లో జీవిస్తాడు. దున్నేవారికే భూమి కావాలి. కష్టం చేసేవాడికే ఫలితం కావాలని పోరాడతాడు. పోరాటం ఎప్పటికీ దైవసంకల్పం కాదు. పరిస్థితుల ప్రోద్బలం. అందుకే నేను మనిషి నమ్ముతాను. మనిషి కోసం కష్టపడే మనిషే దేవుడు. ► కష్టం వచ్చినప్పుడు మీరు ఎవరిని తలచుకుంటారు? మా అమ్మను తలుచుకుంటాను. దైవాలకన్నా గొప్పది అమ్మే! ► ఇప్పుడంటే సరే, మీ చిన్నప్పుడు పండగలు జరపడం, దేవుళ్లను ఆరాధించడం జరగలేదా? మీ పేరులోనే ఒక దేవుడు ఉన్నాడు? మేం ఐదుగురు అన్నదమ్ములం, ఐదుగురు అక్కచెల్లెళ్లు. పదిమందిలో నేను ఆఖరివాడిని. మూలా నక్షత్రంలో పుట్టానని దానికి విరుగుడుగా అళ్వారు స్వాములలో ఒకరిపేరైన వరవరస్వామి పేరు నాకు పెట్టారు మా బాపు. ఆయన పట్వారీ గుమాస్తా. ఆయన కష్టం మా అందరి కడుపు నింపడానికే సరిపోయింది. ఆస్తులు కరిగి పోయాయి. మా మూడో అన్నయ్య టెన్త్ పాసై ఉద్యోగం చేసేవరకూ రెండు పూటలూ గడవని పరిస్థితి. ఇంట్లో రాజకీయ వాతావరణం ఉండేది. తార్కిక సాహిత్యానికి దగ్గరగా ఉండేవాళ్లం. అందుకేనేమో కష్టకాలంలోనూ దేనినీ గుడ్డిగా నమ్మలేదు. పెద్ద పండగ అంటే అంతా సామూహికంగా జరుపుకునే బతుకమ్మ, దసరా పండగే తెలుసు. ఇప్పుడు పండగలను కూడా మార్కెట్ శక్తులే శాసిస్తున్నాయి. – నిర్మలారెడ్డి చిల్కమర్రి -
అనతం శోకం
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు నిర్వహించిన కుమారుడు శరత్ ప్రముఖుల నివాళి బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న ఆకతాయిలు ఈ దుశ్చర్యపై సర్వత్రా నిరసన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కన్నడ సాహితీ దిగ్గజం, జ్ఞాన పీఠ్ ఆవార్డు గ్రహీత ప్రొఫెసర్ ఉడిపి రాజగోపాలాచార్య అనంతమూర్తికి శనివారం సాయంత్రం ఇక్కడ బెంగళూరు విశ్వ విద్యాలయం ఆవరణలోని కళా గ్రామలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. కుమారుడు శరత్ అంత్య సంస్కారాలను పూర్తి చేయడంతో పాటు చితికి నిప్పు పెట్టారు. అంతిమ యాత్రలో అనంతమూర్తి సతీమణి ఎస్తర్ సహా కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కన్నడ, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ఉమాశ్రీ సహా ఇతర మంత్రి వర్గ సహచరులు, సాహితీవేత్తలు, అభిమానులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అంతకు ముందు ఇక్కడి డాలర్స్ కాలనీలోని అనంతమూర్తి నివాసం ‘సురగి’లో రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పార్థివ శరీరాన్ని దర్శించుకున్నారు. ఆ అక్షర యోధునితో తమ సాన్నిహిత్యాన్ని నెమరు వేసుకుని కంట తడి పెట్టారు. వివిధ అవయవాల వైఫల్యంతో పాటు గుండె పోటు రావడంతో శుక్రవారం సాయంత్రం అనంతమూర్తి ఇక్కడి మణిపాల్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే. విప్లవ కవి మూఢాచారాలకు వ్యతిరేకంగా కలం, గళం విప్పిన అనంతమూర్తి విప్లవ కవి అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అభివర్ణించారు. రవీంద్ర కళా క్షేత్రలో పార్థివ శరీరాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. సామాజిక, న్యాయపరమైన అంశాల్లో ఆయన ప్రజల తరఫున పోరాడారని, ఈ విషయంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదని కొనియాడారు. ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నప్పటికీ, తన విధానాన్ని విడనాడలేదని శ్లాఘించారు. 40 ఏళ్లుగా తనకు ఆయనతో స్నేహ సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు. తనకు మార్గదర్శకుడుగా కూడా వ్యవహరించారని తెలిపారు. ఆయన మరణంతో కన్నడ సారస్వత లోకానికి తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకతాయిల దుశ్చర్య అనంతమూర్తి మరణించారని తెలియడంతో మంగళూరు, పరిసరాల్లో కొందరు ఆకతాయిలు బాణాసంచా పేల్చి, సంబరాలు జరుపుకోవడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. ఇది ఆకతాయిల దుశ్చర్య అని కేంద్ర మాజీ మంత్రి ఎస్ఎం కృష్ణ సహా పలువురు ఖండించారు. రవీంద్ర కళా క్షేత్రలో అనంతమూర్తిని అంతిమ దర్శనం చేసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మరణానికి సంతాపం వ్యక్తం చేయడం మన సంస్కృతి అంటూ, సంబరాలు చేసుకోవడం ద్వారా కొందరు తమ వికృత మనస్తత్వాన్ని బహిరంగ పరచుకున్నారని దుయ్యబట్టారు. మాజీ గవర్నర్ రమా జోయిస్ మాట్లాడుతూ టపాకాయలు పేల్చడం క్షంతవ్యం కాదని అన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి ఆర్ అశోక్, అభిప్రాయ భేదాలు సైతం సైద్ధాంతికంగా ఉండాలని పేర్కొన్నారు. టపాకాయలు పేల్చిన ఆకతాయిలను పట్టుకుని దండించాలని సూచించారు.