
1944 నుంచి 1952 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఒక చేత్తో పెన్ను, మరో చేత్తో గన్ను పట్టి తన మాట, ఆట, పాటలతో ఊపిరులూదిన ప్రజాకవి, కళాకారుడు సుద్దాల హనుమంతు. నల్గొండ జిల్లా రామన్నపేట తాలూకా పాలడుగు గ్రామంలో 1908వ సంవత్సరంలో గుర్రం బుచ్చిరాములు, లక్ష్మీనరసమ్మ దంపతులకు 7వ సంతానంగా జన్మించాడు హనుమంతు. చిన్నప్పటినుంచి నాటకాలు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారు. ఒకవైపు పాటలు రాస్తూ, పాడుతూ, ప్రజలను చైతన్యపరుస్తూ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శిగా, కవిగా, కళాకారుడిగా, ఉద్యమనేతగా తన కలాన్ని, గళాన్ని వినిపించాడు.
నాటి సాయుధపోరాటంలో రజాకార్లు ఊర్లపైబడి ప్రజల ధనమాన ప్రాణాలను దోచుకుపోతుంటే ముసలావిడ ఒక సభలో పలికిన మాటను ‘వెయ్ దెబ్బ’ పాటగా మలిచారు సుద్దాల. అది రజాకార్లను తరిమికొట్టిన పాటే. అలాగే 1946లో ‘పాలబుగ్గల జీతగాడ తలచుకుంటే దు:ఖమొచ్చిందా’ అంటూ సాగే గతం వెట్టిచాకిరిపై యుద్ధారావాన్ని ప్రకటించింది. 1944లో భువనగిరిలో జరిగిన 11వ ఆంధ్రమహాసభకు రావి నారాయణరెడ్డి సభాధ్యక్షత వహించగా లక్షలాది ప్రజల ఆర్తనాదాలను, తన భావాలకు జోడించి ఉద్యమ వలంటీర్‌గా ప్రజాపోరాటాల్లో గెలిచిన సుద్దాల కలం, గళం 1982 అక్టోబర్ 10న మూగబోయింది. ఆయన స్మృతి చిహ్నంగా ప్రజా ఉద్యమాలకు చిహ్నంగా వారి స్తూపాన్ని పెన్ను ఆకృతిలో నిర్మించారు. వారికి ఇవే ఉద్యమ జోహార్లు! (నేడు సుద్దాల హనుమంతు 36వ వర్ధంతి)
-కందుల శివకృష్ణ, పరిశోధకులు, సుద్దాల హనుమంతు సాహిత్యం ‘ మొబైల్ : 99665 07875