breaking news
ramky
-
రూ.3,859.81 కోట్లు మొత్తం రుణం చెల్లించిన రాంకీ ఇన్ఫ్రా
రుణదాతలతో పునర్నిర్మాణ నిష్క్రమణ ఒప్పందాన్ని (రీస్ట్రక్చరింగ్ ఎగ్జిట్ అగ్రిమెంట్) అమలు చేసిన అతి కొద్ది భారతీయ కంపెనీల్లో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఒకటిగా నిలిచిందని సంస్థ తెలిపింది. దాంతో తమ కార్పొరేట్ ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిని చేరుకున్నట్లు చెప్పింది. జూన్ 12, 2015న టర్మ్ లోన్లు, వర్కింగ్ క్యాపిటల్ రుణాలు రెండూ కలిపి మొత్తంగా రూ.3,859.81 కోట్ల రుణాన్ని పునర్వ్యవస్థీకరణ ఒప్పందం (ఆర్ఏ) అమలులో భాగంగా పూర్తి చెల్లించాలని నిర్ణయించింది. దాంతో రీస్ట్రక్చర్ చేసిన టర్మ్ లోన్లను జూన్ 2019 నాటికి పూర్తిగా తిరిగి చెల్లించింది.అనంతరం జులై 11, 2025న రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాని రుణదాతలకు అధికారికంగా ఆర్ఈఏను పూర్తిగా అమలు చేసినట్లు ప్రకటించింది. ఫలితంగా అన్ని వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలను ఇప్పుడు రుణదాతలు రెగ్యులర్, స్టాండర్డ్‌గా వర్గీకరించారు. ఇది కంపెనీ స్థిరమైన, మెరుగైన ఆర్థిక నిర్వహణను ప్రతిబింబిస్తుందని సంస్థ పేర్కొంది. ఎటువంటి టర్మ్లోన్లు పెండింగ్ లేకపోవడం, పునర్నిర్మాణ చట్రం నుంచి విజయవంతంగా నిష్క్రమించడంతో రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రెడిట్ రేటింగ్‌లు, అంతర్గత బ్యాంక్ అసెస్మెంట్లను మెరుగుపరచుకుందని తెలిపింది. తద్వారా దాని మొత్తం ఆర్థిక ప్రొఫైల్‌ను బలోపేతం చేసుకుంది.ఇదీ చదవండి: మొన్న రూ.800 కోట్లు.. ఇప్పుడు రూ.1,600 కోట్లురాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ వై.ఆర్. నాగరాజా మాట్లాడుతూ..‘ఆర్ఈఏను అమలు చేయడం కంపెనీ అంకితభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఇది సంస్థ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. వేగంగా విస్తరిస్తున్న పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాల మార్కెట్లో వ్యూహాత్మక లక్ష్యాలను కొనసాగించేందుకు తోడ్పాటు అందిస్తుంది’ అన్నారు. -
రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్లు
-
Alla Dakshayani: దిద్దుబాటు
జీవితంలో దిద్దుబాటు చాలా అవసరం. అక్షరాలను దిద్దుకుంటాం. నడవడిక దిద్దుకుంటాం. మాటను దిద్దుకుంటాం... చేతను దిద్దుకుంటాం. ఇన్నింటిని దిద్దుకోవడం వచ్చిన వాళ్లం... చెదిరిన రూపురేఖల్ని దిద్దుకోలేమా? కాంతి రేఖల కొత్త పొద్దుల్ని చూడలేమా? సూర్యుడు కర్కాటకం నుంచి మకరానికి మారినట్లే... క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలేట్తో పుట్టిన పిల్లలు కూడా మామూలు పిల్లల్లా బతికి బట్టకట్టాలి కదా! అగ్నిప్రమాదానికి గురైన వాళ్లు ముడతలు పడిన చర్మంతో బతుకు సాగించాల్సిన దుస్థితి ఎందుకు? ప్రమాదవశాత్తూ ఎముకలు విరిగి ముఖం రూపురేఖలు మారిపోతే... ఇక జీవితమంతా అద్దంలో ముఖం చూసుకోవడానికి భయపడాల్సిందేనా? వీటన్నింటికీ వైద్యరంగం పరిష్కరిస్తుంది. అయితే ఆ వైద్యం సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంటుంది. ఖర్చుపరంగా ఆకాశమంత ఎత్తులో ఉన్న వైద్యప్రక్రియను అవనికి దించాలంటే పెద్ద మనసు ఉండాలి. అలాంటి సమష్టి కృషిని సమన్వయం చేస్తున్నారు ఆళ్ల దాక్షాయణి. బాధితుల జీవితాల్లో కాంతిరేఖలను ప్రసరింపచేయడానికి ఏటా జనవరి నెలలో ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ నిర్వహిన్నారు. ఈ సందర్భంగా ఆమె సాక్షితో పంచుకున్న వివరాలివి. ‘‘ఒకప్పుడు గ్రహణం మొర్రి కేసుల గురించి తరచూ వినేవాళ్లం. కాలక్రమేణా సమాజంలో చైతన్యం పెరిగింది. గర్భస్థ దశలోనే గుర్తించి, పుట్టిన వెంటనే సర్జరీలు చేసి సరి చేసుకునే విధంగా వైద్యరంగం కూడా అభివృద్ధి చెందింది. అయినప్పటికీ మారుమూల గ్రామాల్లో గ్రహణం మొర్రి బాధితులున్నారు. వాళ్లు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే స్థోమత లేని తల్లిదండ్రులు పిల్లల వైకల్యాన్ని సరిచేయలేకపోతున్నారు. ఒక బిడ్డ ఆర్థిక కారణాలతో వైకల్యాన్ని భరించాల్సిన దుస్థితి రావడం దారుణమైన విషయం. అలాగే ఇటీవల అగ్ని ప్రమాద బాధితులు, యాసిడ్ దాడి బాధితులు కూడా పెరుగుతున్నారు. వీటికితోడు వాహన ప్రమాదాల కారణంగా వైకల్యాలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్యల నుంచి ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్లు బయటపడగలుగుతున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకోలేని వాళ్లు బాధితులుగా మిగిలిపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ బాధ్యత చేపట్టాం. నిజానికి ఈ సర్వీస్ మొదలై ఇరవై ఏళ్లు దాటింది. ► ఇద్దరు వైద్యుల చొరవ రెండు వేల సంవత్సరంలో మొదలైన ఈ కార్యక్రమం కోవిడ్ రెండేళ్లు మినహా ఏటా జరుగుతోంది. డాక్టర్ భవానీ ప్రసాద్ అనస్థీషియనిస్ట్, డాక్టర్ సుదర్శన్ రెడ్డి ప్లాస్టిక్ సర్జన్. వీళ్ల ఆలోచనతోనే ఈ సర్వీస్ మొదలైంది. మొదటి ఏడాది హైదరాబాద్‌లోని మహావీర్, మెడ్విన్ హాస్పిటళ్లలో సర్జరీలు నిర్వహించారు. ఆ తర్వాత కిమ్స్, కామినేని హాస్పిటళ్లు సపోర్టు చేశాయి. నార్కెట్ పల్లి, నిజామాబాద్, శ్రీకాకుళంలో క్యాంపులు నిర్వహించారు. గత ఏడాది హైదరాబాద్, సీతారామ్‌బాగ్‌లో డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్‌ను వేదిక చేసుకున్నాం. ఇందుకోసం హాస్పిటల్ వాళ్లు రెండు ఆపరేషన్ థియేటర్లతో హాస్పిటల్‌ను సిద్ధం చేశారు. యూఎస్‌లో స్థిరపడిన ఈ డాక్టర్లు ఏటా 45 రోజులు ఇండియాలో ఉండేటట్లు ప్లాన్ చేసుకున్నారు. అందులో కొంత సమయం ఈ సర్వీస్‌కి కేటాయిస్తున్నారు. యూఎస్‌లోని మెర్సీ మిషన్ వేదికగా వారందిస్తున్న సర్వీస్‌కి హైదరాబాద్‌లో ‘లయన్స్ క్లబ్ – గ్రీన్‌ల్యాండ్స్’ సహకారం అందిస్తోంది. రెండేళ్లుగా మా రాంకీ ఫౌండేషన్ కూడా బాధ్యతలు తీసుకుంది. ఇందుకోసం ఫౌండేషన్ ట్రస్టీగా నేను బోర్డు మెంబర్స్ నుంచి అనుమతి తీసుకుని ఈ కార్యక్రమాలను చేపట్టాను. ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన వాళ్లలో రాయలసీమ జిల్లాలు, నల్గొండ జిల్లా వాళ్లు ఎక్కువగా ఉన్నారు. మా ఈ సర్వీస్‌కి ప్రాంత, భాష, ఆర్థికపరమైన ఆంక్షలు ఏమీ లేవు. పేరు నమోదు చేసుకుని వచ్చి వైద్యం చేయించుకోవడమే. ► ఇది సమష్టి దిద్దుబాటు ఈ సర్వీస్ కోసం ఇద్దరు డాక్టర్లు అమెరికా నుంచి వస్తారు. మరికొంతమంది డాక్టర్లు, ఇతర వైద్యసిబ్బంది మొత్తం ముప్పైమంది స్థానికులు ఈ సర్వీస్‌లో పాల్గొంటారు. ఈ హెల్త్ సర్వీస్‌ను రెండు దశాబ్దాలుగా విజయవంతంగా నిర్వహించడంలో పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మధుకర్ స్వామి, లయన్స్ క్లబ్ విద్యాభూషణ్ సేవలు విశేషమైనవి. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ పాలెట్, కాలి ముడుచుకుపోయిన చర్మం, జన్యుపరమైన వైకల్యాలను సరిచేయడం, ప్రమాదవశాత్తూ దవడ, ముక్కు, కాళ్లు, చేతులు విరిగిపోవడం వంటి సమస్యల్లో ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిదిద్దగలిగిన అన్ని సమస్యలకూ వైద్యం అందిస్తున్నాం. కాస్మటిక్ సర్జరీలు ఈ క్యాంప్‌లో చేపట్టడం లేదు. మా సర్వీస్ గురించి వాల్‌పోస్టర్లు, బ్యానర్లతో జిల్లాల్లో ప్రచారం కల్పించాం. వీలైనంత ఎక్కువమంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది నా ఆకాంక్ష’’ అన్నారు దాక్షాయణి. ముఖం మీద ఒత్తైన జుత్తు హయతి అనే ఎనిమిదేళ్ల పాపాయి సమస్య మరీ ప్రత్యేకం. హైపర్ ట్రైకోసిస్... అంటే జుత్తు తల వరకే పరిమితం కాకుండా ముఖం మీదకు పాకుతుంది. తలమీద ఉన్నంత దట్టమైన జుత్తు ఒక చెంప మొత్తం ఉంది. ఆ పాపకు నలుగురిలోకి వెళ్లాలంటే బిడియం. స్కూలుకెళ్లాలంటే భయం. ఆమె సమస్య అంటువ్యాధి కాదని టీచర్లకు తెలిసినప్పటికీ క్లాసులో మిగిలిన పిల్లలతో కలిపి కూర్చోబెడితే వాళ్ల పేరెంట్స్ నుంచి కంప్లయింట్స్ వస్తాయి కాబట్టి హయతిని విడిగా కూర్చోబెట్టేవారు. తరగతి గది, ఇంటి నాలుగ్గోడలు తప్ప మరే ప్రపంచమూ తెలియని స్థితిలో రోజులు గడుస్తున్న హయతి ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మామూలైంది. ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్ మెర్సీ మిషన్స్∙యూఎస్ఏ, సేవా భారతి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్– గ్రీన్ ల్యాండ్స్, రాంకీ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్రీ మెగా ప్లాస్టిక్ సర్జరీ క్యాంప్‌లో ఈ నెల 18వ తేదీ నుంచి స్క్రీనింగ్ జరుగుతుంది. సర్జరీలు 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జరుగుతాయి. ఉచితవైద్యంతోపాటు మందులు, ఆహారం, బస సౌకర్యాలను కూడా కల్పిస్తున్నాం. పేషెంట్ పరిస్థితిని బట్టి కొందరికి సర్జరీ తర్వాత ఫాలోఅప్ కోసం మూడు నుంచి నాలుగు రోజులు బస చేయాల్సి రావచ్చు. గడిచిన డిసెంబర్ 20 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. వైద్యసహాయం అవసరమైన వాళ్లు 78160 79234, 98482 41640 నంబర్లకు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలి. హైదరాబాద్, ఓల్డ్ మల్లేపల్లి, సీతారామ్‌బాగ్‌లోని డాక్టర్ ఈశ్వర్ చందర్ చారిటబుల్ హాస్పిటల్లో వైద్యసహాయం అందిస్తున్నాం. – ఆళ్ల దాక్షాయణి, మేనేజింగ్ ట్రస్టీ, రామ్కీ ఫౌండేషన్ – వాకా మంజులారెడ్డి -
వైజాగ్ వద్ద రామ్కీ ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యావరణ నిర్వహణ సేవల సంస్థ రామ్కీ ఎన్విరో ఇంజనీర్స్.. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పరవాడ వద్ద ఉన్న జేఎన్ ఫార్మాసిటీలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజ్, రామ్కీ ఫార్మా సిటీ ఎండీ పి.పి.లాల్ కృష్ణ చేతుల మీదుగా బుధవారం ఈ ఫెసిలిటీ ప్రారంభోత్సవం జరిగింది. దక్షిణాదిన అతిపెద్ద ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్లలో ఇది ఒకటని రామ్కీ రిక్ల్లమేషన్, రీసైక్లింగ్ సీఈవో సతీష్ చీటి ఈ సందర్భంగా తెలిపారు. పరిశ్రమలతోపాటు గృహాల నుంచి వచ్చే ప్లాస్టిక్ వ్యర్థాలను అత్యంత నాణ్యమైన రీసైకిల్డ్ ప్లాస్టిక్ గ్రాన్యూల్స్‌గా మారుస్తారు. ఈ గ్రాన్యూల్స్‌ను ప్లాస్టిక్ వస్తువులు, ప్యాకేజింగ్ తయారీకి ఉపయోగిస్తారు. మూడు ఎకరాల విస్తీర్ణంలో నెలకొన్న ఈ కేంద్రం గంటకు ఒక మెట్రిక్ టన్ను ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేయగలదు. విభిన్న అవసరాలకు వినియోగించే విధంగా 51 మైక్రాన్ కంటే మందంగా ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేసే యంత్రాలను సైతం ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. -
‘గ్రేటర్’లో సమ్మె దుమారం
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో గుర్తింపు యూనియన్ జీహెచ్ఎంఈయూ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులు సోమవారం నుంచి చేపట్టిన సమ్మె తీవ్ర దుమారానికి దారి తీస్తోంది. అధికారులు.. ఉద్యోగులంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన తరుణంలో కమిషనర్ చెత్త తరలింపు పనులను రాంకీకి కట్టబెట్టడాన్ని జీహెచ్ఎంఈయూ తప్పు పడుతుండగా.. ఎన్నికల సమయాన్ని ఆసరా చేసుకొని యూనియన్ ఎలాంటి ముందస్తు హెచ్చరిక ల్లేకుండా చెత్త తరలింపు రవాణాను స్తంభింపచేయడాన్ని కమిషనర్ సోమేశ్‌కుమార్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎన్నికల సమయంలో సమ్మెకు దిగిన యూనియన్ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకొని బుధవారం నుంచి యథావిధిగా విధులకు హాజరుకావాలని సూచించారు. లేనిపక్షంలో తీవ్ర చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్మాను ప్రయోగించడమే కాక ఆర్పీ యాక్ట్‌ను ప్రయోగిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా జీహెచ్ఎంఈయూ గుర్తింపును రద్దు చేయాల్సిందిగా లేబర్ కమిషనర్‌కు లేఖ రాయనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, తమ డిమాండ్లు సాధించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మెను ఉపసంహరించేది లేదని జీహెచ్ఎంఈయూ అధ్యక్షుడు యు.గోపాల్ స్పష్టం చేశారు. ఎన్నికల విధుల్లోని వారి విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా కేవలం రవాణా విభాగంలోని వారు మాత్రం ప్రస్తుతం సమ్మెలో పాల్గొంటుండగా.. 30వ తేదీన పోలింగ్ అనంతరం జీహెచ్ఎంసీలోని అన్ని విభాగాల్లోని ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతారని హెచ్చరించారు. ఎక్కడి చెత్త అక్కడే... సోమవారం నుంచి సమ్మెలో ఉన్న కార్మికులు చెత్త తరలింపు పనులు చేయకపోవడంతో గ్రేటర్లో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయి పరిస్థితులు తీవ్ర దుర్భరంగా మారాయి. యూనియన్ ఈ సమయంలో సమ్మెకు దిగడం సమంజసం కాదని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి కూడా అయిన సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణను ప్రైవేటుకిచ్చేందుకు ఇప్పుడు కొత్తగా తాము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. సమ్మె కారణంగా ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణ ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. వార్డుకు ఒక్కో వాహనాన్ని అద్దెకు తీసుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పరిస్థితుల దృష్ట్యా కార్మికులు వెంటనే విధుల్లోకి చేరాలన్నారు. వారితో సంప్రదించాల్సిందిగా స్పెషల్ కమిషనర్ రాహుల్‌బొజ్జా, సీనియర్ అధికారులకు సూచించామన్నారు.