breaking news
railey
-
సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలి
కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు వేతనాలు ఇవ్వాలని, సమ్మె కాలపు ఒప్పందాలు అమలు చేయాలని గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.శ్రీపతిరావు అన్నారు. గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కోతిరాంపూర్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీపతిరావు మాట్లాడుతూ గతేడాది 44 రోజులపాటు సమ్మె చేసిన ఫలితంగా ప్రభుత్వం ఒప్పుకున్న డిమాండ్లను జీవోలో పెట్టలేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో 63లో పార్ట్‌టైం కార్మికులకు రూ.1623నుంచి రూ. 4వేల వరకు, ఫుల్‌టైం/కంటింజెంట్ కార్మికులకు రూ.2300 నుంచిరూ.5 వేల వరకు పెంచుతూ జీవో విడుదల చేశారని అన్నారు. వేతన చెల్లింపు పరిమితిని మైనర్ పంచాయతీలకు 30 శాతం నుంచి 50 శాతం పెంచారని, దీన్ని మేజర్ పంచాయతీలకూ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. జీవో 63ను సవరించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 7న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో ధర్నాలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.ముత్యంరావు, యూనియన్ కార్యదర్శి బండారి శేఖర్, నాయకులు పులి మల్లేశం, రాజలింగ్, శేఖర్, మల్లేశం, ప్రమోద్, కుమార్, రామానుజం, రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు. -
సిరిసిల్ల జిల్లాకు కదిలిన ప్రజానీకం
పట్టణంలో తీవ్రమైన ఆందోళనలు ప్రధాన రహదారిపై రాస్తారోకో సిరిసిల్ల టౌన్ : సిరిసిల్ల జిల్లా సాధన ఉద్యమం రోజురోజుకు తీవ్రమవుతోంది. శుక్రవారం పట్టణంలో ప్రజాసంఘాలు, న్యాయవాదులు, రాజకీయపార్టీలు, ముస్లింలు నిరసనలను చేపట్టారు. కామారెడ్డి–కరీంనగర్ ప్రధాన రహదారిపై మహాధర్నా, రాస్తారోకో నిర్వహించి ఆటపాటలతో నిరసనలు తెలిపారు. రెండు గంటల పాటు సాగిన రాస్తారోకోతో కిలోమీటర్‌కు పైగా వాహనాలు నిలిచిపోయాయి. కాంగ్రెస్ నాయకుడు మహేందర్ రెడ్డితో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. –సిరిసిల్లను జిల్లాగా ప్రకటించాలంటూ న్యాయవాదుల కోర్టు ముందు రెండో రోజు రిలేదీక్షలు చేపట్టారు. విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, జిల్లా సాధన సమితి నాయకులు దీక్షల్లో పాల్గొంటున్న వారికి సంఘీభావం తెలిపారు. దీక్షల్లో న్యాయవాదులు కోడి లక్ష్మన్, బొంపెల్లి రవీందర్రావు, కళ్యాణ చక్రవర్తి, గుంటుక భువనేశ్వర్, ఆడెపు వేణు, దాసరి శ్రీధర్, మొగిలి రాజు, కటుకం బాలకుమార్‌లు పాల్గొన్నారు. – జిల్లా సాధన కోరుతూ పట్టణంలో ముస్లింలు శాంతిర్యాలీ నిర్వహించారు. ప్రజాభీష్టాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. కార్యక్రమంలో మజీద్ కమిటీ అధ్యక్షుడు షేక్‌యూసుఫ్, ఎండీ.సత్తార్, ఇంతియాజ్, ముస్తాఫా, సర్వర్, రియాస్, రఫీయొద్దీన్, పాల్గొన్నారు. కేటీఆర్ ఇల్లు ముట్టడి.. జిల్లా ఏర్పాటుపై ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా మంత్రి కేటీఆర్ స్పందించడం లేదంటూ ఆయన ఇంటిని బీజేపీ, బీజేవైఎం, ప్రజాసంఘాలు ముట్టడించాయి. రాజకీయ జన్మనిచ్చిన సిరిసిల్లను జిల్లా చేయటంలో విఫలమైతున్న కేటీఆర్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేసారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే ఆ పార్టీ నాయకులు పదవులను పట్టుకుని వేలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపి పట్టణ అధ్యక్షుడు గౌడ వాసు, నాయకులు అన్నల్దాస్ వేణు, వెల్ది చక్రపాణి, చందు, కోడం ఆనంద్‌బాబు, అంజన్న, శ్యాం పాల్గొన్నారు. ఆస్పత్రిలోనూ ఆమరణదీక్ష జిల్లా సాధనకు అంబేద్కర్ చౌరస్తాలో అర్బన్బ్యాంక్ చైర్మన్ గాజుల బాలయ్య, రిక్కుమల్ల మనోజ్ చేపట్టిన ఆమరణ దీక్ష చేపట్టగా శుక్రవారం ఉదయం పోలీసులు వారి దీక్షలను భగ్నం చేశారు. అరోగ్యం క్షీణించడంతో ఇద్దరిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో వారు ఆహారం తీసుకోకుండా మొండి కేయడంతో వైద్యులు ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు.