breaking news
Rab Ne Bana Di Jodi
-
మ్యాచ్ ఫిక్సింగ్..
దేడ్ కహానీ - రబ్నే బనాదీ జోడీ ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని అనుకున్న రోజుల నుంచి ‘పెళ్లి జరగడం, భూలోకంలో నరకంతో సమానం’ అనుకునే రోజుల దాకా సమాజం చాలా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన జోడీ లాంటి పాత చింతకాయపచ్చడిని కొత్తగా వడ్డించాలనుకోవడం ఒక దుస్సాహసం. దాన్ని షారుక్ లాంటి అగ్రహీరోతో ప్లాన్ చేయడం, అది కూడా ఒక బోరింగ్ భర్త పాత్రలో, ఇంకో దుస్సాహసం. ఒక విచిత్రమైన దర్శకుడి గురించి ముందు మాట్లాడుకుని, తర్వాత సినిమా గురించి మాట్లాడుకుందాం. ‘ఆదిత్య చోప్రా’. ప్రఖ్యాత బాలీవుడ్ దర్శక నిర్మాత యష్‌చోప్రా కొడుకు.1995లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ అని ఒక ప్రేమకథని రాసుకుని షారుక్‌ఖాన్, కాజోల్‌తో జంటగా తీస్తే... ఇరవయ్యొక్క సంవత్సరాలుగా ఇంకా ఆడుతూనే ఉంది ముంబై మరాఠా మాదిర్లో. ఈ మధ్యే సాక్షి టీవీలో వెయ్యి వారాలు పూర్తి చేసుకున్న డీడీఎల్జే సినిమా గురించి అరగంట సేపు చర్చించాం కూడా నేను, మిత్రులు సిరాశ్రీగారు, మహేష్ కత్తిగారు. అంత పెద్ద హిట్ ఇచ్చిన ఏ దర్శకుడైనా 1995 నుంచి ఈ ఇరవయ్యొక్క సంవత్స రాలలో కనీసం 15, 16 సినిమాలు తీసేస్తాడు సునాయాసంగా. కానీ దర్శకుడిగా ఆదిత్య చోప్రా మూడే సినిమాలు తీశాడు. నాలుగోది ఈ ఏడాది తీయబోతున్నాడు. అదే విచిత్రం. ఈలోగా నిర్మాతగా, కథకుడిగా, పంపిణీదారుడిగా రకరకాలుగా ఆక్యుపై అయినా, అతనిలోని దర్శకుడిని సినిమాలు తీయకుండా ఎలా నియంత్రించుకోగలుగుతున్నాడని నాకెప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే, తీసిన సినిమాలు అంత బాగా తీస్తాడు మరి. అవి ‘మొహబ్బతే’ లాగ ఆడకపోయినా, ‘రబ్నే బనాదీ జోడీ’లాగా ఆడినా అతని తీతలో మాత్రం తేడా ఉండదు. ‘తడి’ ఉంటుంది. అది తెర నుంచి మనలోకి నేరుగా ప్రవహిస్తుంది. తడుముతుంది. అలాంటి ఒక భావో ద్వేగాల, అనుభూతుల ప్రయాణమే ‘రబ్నే బనాదీ జోడీ’. ‘పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయి’ అని అనుకున్న రోజుల నుంచి ‘పెళ్లి జరగడం, భూలోకంలో నరకంతో సమానం’ అను కునే రోజుల దాకా సమాజం చాలా మారిపోయింది. అటువంటి పరిస్థితుల్లో దేవుడు చేసిన జోడీ లాంటి పాత చింతకాయ పచ్చడిని కొత్తగా వడ్డించా లనుకోవడం ఒక దుస్సాహసం. దాన్ని షారుక్ లాంటి అగ్రహీరోతో ప్లాన్ చేయడం, అది కూడా ఒక బోరింగ్ భర్త పాత్రలో... ఇంకో దుస్సాహసం. అయినా ఆదిత్య చోప్రా ఈ సినిమా తీయడానికి సాహసించడం వెనుక నాకు కొన్ని కారణాలున్నాయని అనిపించింది. భారతీయ సమాజంలో ఎంత ఆధునికత బైటకి కనపడినా, లోపల ‘కన్వెన్షనల్ థింకింగ్’ అలాగే గూడు కట్టుకుని పోయి ఉండడం మొదటి కారణం. షారుక్ లాంటి హీరో మీద, తన కాంబినేషన్లో కేవలం 22 కోట్ల బడ్జెట్లో సినిమా అయిపోగలిగే కథ, కథనాలుండడం రెండో కారణం. అంటే, సినిమా అట్టర్ ఫ్లాపయినా తీసినవాళ్లు, కొన్నవాళ్లు నష్టపోరు ఈ బడ్జెట్‌కి. అనుష్కశర్మ లాంటి అందమైన అమ్మాయిని మొదటిసారి హీరోయిన్గా పరిచయం చేస్తున్నాం కాబట్టి, కుర్రకారుని అట్రాక్ట్ చేయగలం అన్న ధీమా ఇంకో కారణం. మొత్తమ్మీద సినిమా రిలీజై, థియేటర్లో కూర్చుంటే... రెండో ‘రాజ్‌కపూర్’ (షారుక్) అదర గొట్టేశాడు. ప్రేక్షకుడికి ఆ పాత్ర ఎక్కడం అన్నదాన్నే నమ్మి సినిమా తీసినట్టు అనిపించింది. సుఖ్వీందర్సింగ్ ‘హాలే హాలే’ అని, రూప్‌కుమార్ రాథోడ్, శ్రేయాఘోషల్ ‘తుఝ్ మే రబ్ దిఖ్తా హై’ అని, సునిధి చౌహాన్, లభ్నూజీ ‘డాన్స్పే ఛాన్స్’ అని పాడే స్తుంటే వాళ్ల మధురమైన గొంతులతో, గమకాలతో, పాత్రల మధ్య మనమూ లీనమైపోయినట్టు ఉంటుంది. సలీమ్-సులేమాన్ మ్యూజిక్‌తో చేసిన మ్యాజిక్ అది. సురేందర్ సాహ్ని నా అన్నవాళ్లు లేని అనాథ. ఓ ఎలక్ట్రిసిటీ ఆఫీస్‌లో చిరుద్యోగి. అతనికి ఒకడే బెస్ట్‌ఫ్రెండ్... బాబీ అని ఒక బార్బరు. చిన్న, మధ్య తరగతి ఇంట్లో నివాసం. సింపుల్ జీవితం. ఓసారి సురేందర్ తనకి చదువు చెప్పిన మాస్టరుగారి కూతురి పెళ్లికెళ్తాడు. ఆ కూతురే తానీని (అనుష్క). చలాకీగా గడగడా మాట్లాడుతూ, ఆడుతూ, పాడుతూ... చూడగానే ప్రేమించేయాలని పించేంత సరదాగా ఉంటుంది. ఆమె సూరిని చూడగానే ‘మీరేనా సూరి, మీవల్ల చిన్నప్పట్నుంచి ఎన్ని తిట్లు తిన్నానో, సూరిలా చదువుకో, సూరిలా మార్కులు తెచ్చుకో, సూరిలా క్రమశిక్షణగా ఉండు అని మా నాన్నగారు రోజూ తిట్టడమే’ అంటుంది. సూరి కళ్లల్లో గర్వం. అంతలోనే ఓ విషాదం. పెళ్లి కొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడన్న వార్త. కూతురి పెళ్లి ఆగిపోవడాన్ని తట్టుకోలేక మాస్టారికి గుండెపోటు వస్తుంది. తాను వెళ్లిపోతే తన కూతురు ఒంటరిగా మిగిలి పోతుందన్న భయంతో, ఆమెకు తోడుగా ఉండమని సురేందర్‌ని కోరతాడు. ఇద్దరినీ ఒక్కటి చేసి కన్నుమూస్తాడు. అప్పుడే అసలు కథ మొదలవుతుంది. జరిగిన విషాదం నుంచి తానీ బయట పడదు. సురేందర్‌ని భర్తగా అంగీకరించదు. దగ్గరవదు. మౌనంగా ఉంటుంది. వండి పెడుతుంది. ఇంటి పనంతా చేస్తుంది. అంతే తప్ప అంతకు మించి ఆమెలో అతడి పట్ల ఏ భావమూ ఉండదు. కానీ సురేందర్ మాత్రం ఆమెను పిచ్చిగా ప్రేమిస్తాడు. మనసులోనే ఆరాధిస్తాడు. ఆమెకు ఎలా దగ్గరవ్వాలా అని చూస్తుంటాడు. అప్పుడే అతడికి ఓ అవకాశం దొరుకుతుంది. తానీ డ్యాన్స నేర్చుకోవాలని ఆశపడుతుంది. అందుకు అతడు అనుమతిస్తాడు. అయితే ఆమెకు దగ్గర కావాలన్న ఆశతో గెటప్ మార్చుకుని, మోడ్రన్ యువకుడిగా తయారయ్యి, రాజ్‌కపూర్ పేరుతో ఆమెకు డ్యాన్స పార్టనర్‌గా ఇన్స్టిట్యూట్లో చేరతాడు. భర్తగా దూరంగా ఉండిపోయినా స్నేహితుడిగా దగ్గరవుతాడు. ఆమె కోసం తనను తాను పూర్తిగా మార్చేసుకుని, ఆమె ఇష్టాలే తన ఇష్టంగా జీవించడం మొదలు పెడతాడు. హీరో వేషాలేసి ఆమెని ఫ్లర్టింగ్ చేసి, ఆమెతో తిట్లు తిని, ఆమెకి మంచి ఫ్రెండై, ఆమెని కాసేపు కన్ఫ్యూజ్ చేసి చివరికి తనతో ప్రేమలో పడేలా చేస్తాడు. లేచిపోదాం అంటాడు. ఇక్కడ్నుంచి ఆమె అంతర్మథనాన్ని ఎంతో అందంగా చిత్రీకరించాడు ఆదిత్య చోప్రా. నిజానికి తానీ అతనితో ప్రేమలో పడదు. పడబోయి ఆగిపోతుంది. స్నేహం దగ్గరే ఫుల్స్టాప్ పెడుతుంది. తన భర్తలో తనకు దేవుడు కనబడుతున్నాడని ముఖమ్మీదే చెప్పేస్తుంది. దాంతో అతడు కాంపిటీషన్ ఫైనల్స్‌కి రాడు. అయినా ఫర్వాలేదు అని ఓటమిని అంగీకరించే సమయంలో ఆమె భర్త ఎంటరవుతాడు. అద్భుతంగా డ్యాన్స చేస్తాడు. ఆ క్రమంలో ఆమెకి అర్థమౌతుంది... తన భర్త, ఆ యువకుడు ఒక్కరేనని. తన ప్రేమ కోసం అతడు మరో వ్యక్తిగా మారి తనకు చేరువయ్యాడని తెలుసుకుంటుంది. కన్నీళ్లతో భర్తకి అంకితమైపోతుంది. భగవంతుడి లీలా వినోదంలో ప్రతి అమ్మాయికీ ఓ రాజ్‌కపూర్ కావాలని ఉంటుంది. తొంభై తొమ్మిది శాతం మందికి సూరిలు దొరుకుతారు. తెగిస్తే విడాకులతో జీవితాలు పాడైపోతాయి. బరి తెగిస్తే రాజ్‌కపూర్‌తో సెటిలైపోయి గుణహీనులౌతారు. సూరిని అర్థం చేసుకునే సంస్కారం ఒకళ్లకో ఇద్దరికో ఉంటుంది. కానీ, ఆ సంస్కారాన్ని బైటకి తెచ్చి నిలబెట్టాల్సిన బాధ్యత మాత్రం సూరిదే అవుతుంది. రాజ్కపూర్లా భార్యని సుఖపెట్టాలని, చేరువ అవ్వాలని కష్టపడే ప్రతి సూరి... భార్య పాలిట హీరో అవుతాడు. ఇది చాలామంది మగాళ్లకి సంసార జీవితంలో భార్యల పట్ల ఉండాల్సిన బాధ్యతల పాఠం. చాలామంది ఆధునిక ,ఆదర్శ వివాహిత స్త్రీలకి భర్త పట్ల ఉండవలసిన దృక్పథాల పాఠం. కమర్షియల్ సినిమాల్లో కుదిరినట్టు సడన్‌గా వేషాలు మార్చి నాటకం ఆడేయడం నిజ జీవితంలో కుదరని పనే అయినా, వేషం స్థానే మనిషి తనవారి కోసం కొంచెం మారినా, 22 శాతం మార్పుకి 180 శాతం సుఖాన్ని, సంతోషాన్ని పొందడం ఖాయమని రబ్నే బనాది జోడీ చూస్తే మనకర్థమౌతుంది. అసలీ సినిమా గురించి చెప్పుకున్నప్పుడు ఆదిత్య గురించి ఎంత చెప్పుకుంటామో... షారుక్ గురించి కూడా అంతే చెప్పుకోవాలి. పాత తరహా దుస్తులు, మీసకట్లు, నూనె పూసిన తల కట్టు... అసలు రొమాంటిక్ హీరో షారుక్ ఇతనేనా అన్నంతగా సూరి పాత్రను ఆకళింపు చేసుకున్నాడు. అంతలోనే రాజ్ కపూర్‌గా తన సహజమైన స్టయిల్‌ను ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నాడు. కాబట్టి ఈ చిత్ర సక్సెస్‌లో ఆదిత్యది సగభాగమైతే, షారుక్‌ది సగభాగం. ఆదిత్య చోప్రాలో ఆదిత్య అనే సగం పేరు నాకున్నందుకు నా తర్వాతి సినిమాల నుంచీ నీలో సగమైనా నేనాలో చిస్తానని కంకణం కట్టుకున్నానయ్యా చోప్రా... థాంక్యూ సో మచ్. - వి.ఎన్.ఆదిత్య, సినీ దర్శకుడు -
సెవన్ ఇయర్స్ రీచ్!
అనుష్కా శర్మ నిర్మొహమాటంగా మాట్లాడతారు. మనసులో ఏది అనిపిస్తే అది చెప్పేస్తారు. అందుకే ఆమెను బాలీవుడ్లో ‘వామ్మో అనుష్కా’ అంటుంటారు. ‘ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే ‘వామ్మో’ అనే ట్యాగా?. అయినా డోంట్ కేర్. నేను ఓపెన్‌గానే మాట్లాడతా’ అంటారీ బ్యూటీ. ‘రబ్ నే బనా దీ జోడి’ చిత్రం ద్వారా ఆమె కథానాయికగా పరిచయమయ్యారు. ఇప్పటికి ఏడేళ్లయ్యింది. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమలో తాను గమనించినవాటిలో ఏడు విషయాలను అనుష్కా శర్మ ఈ విధంగా పంచుకున్నారు. 1> అమ్మాయిలు చూడచక్కగా ఉండాలి. స్వీట్‌గా ప్రవర్తించాలి. మొదటి చూపులోనే ‘ఈ అమ్మాయి మన సరసన నటిస్తే బాగుంటుంది’ అనేలా ఉండాలి. అబ్బాయిలకు ఆ ప్రాబ్లమ్ లేదు. ఎలా ఉన్నా చల్తా. స్వీట్‌గా ప్రవర్తించకపోయినా నో ప్రాబ్లమ్. 2> అబ్బాయిలు ఏ వయసులోనైనా హీరోలుగా చేయొచ్చు. అమ్మాయిలు మాత్రం వయసులో ఉన్నంతవరకే పనికొస్తారు. ఆ తేడా ఏంటో అర్థం కావడంలేదు. బహుశా అమ్మాయిలను ‘సెక్సువల్ ఆబ్జెక్ట్స్’గా చూడటంవల్లే వాళ్లను వయసులో ఉన్నంతవరకే కథానాయికలుగా ఆమోదిస్తారేమో. 3> అవుట్ డోర్ షూటింగ్స్‌కి వెళ్లినప్పుడు కచ్చితంగా అబ్బాయిలకు అన్ని సౌకర్యాలున్న మంచి గది ఇస్తారు. అమ్మాయిలకు అంత సీన్ లేదు. ఎందుకో? 4> అమ్మాయిలు తాము అనుకున్నది ధైర్యంగా చెబితే ఎవరికీ నచ్చదు. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఇలాంటి అమ్మాయిలను ఇష్టపడరు. 5> అర్హతకి తగ్గ పారితోషికం అడిగితే అదో పెద్ద తప్పులా భావిస్తారు. ఏం కథానాయి కలేమైనా ఫూల్సా? వాళ్ల మార్కెట్‌కి తగ్గ పారితోషికం తీసుకోకూడదా? 6> ఒకవేళ నేను కథానాయికగా నటించే సినిమాలో నా పాత్రకన్నా హీరో పాత్రకు తక్కువ ప్రాధాన్యం ఉందనుకోండి.. అప్పుడు ఆ పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. పురుషాధిక్యం ఆ స్థాయిలో ఉంటుంది. 7> నన్నూ, మా అన్నయ్యనూ మా అమ్మా, నాన్న సమానంగానే పెంచారు. తేడా చూపించలేదు. అందుకే, అమ్మాయిలు అణిగి మణిగి ఉండాలనే మాటలు విన్నప్పుడు నాకు వింతగా ఉంటుంది. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తలో ఫీమేల్ యాక్ట్రెస్ అంటే దాదాపు చిన్న చూపు ఉండటం చూసి ఆశ్చర్యపోయేదాన్ని. -
'నిషా'కు షారూఖ్ ఖాన్ చేయూత
ముంబై: షారూఖ్ ఖాన్ నటించిన 'రబ్ నె బనా ది జోడీ' సినిమా గుర్తుందా? 'మీ జీవితానికి వెలుగునిస్తాం' అనేది ఈ సినిమాకు ఉప శీర్షిక. ఈ టైటిల్‌ను బాలీవుడ్ బాద్ షా నిజం చేశాడు. ఓ చిన్నారి జీవితంలో వెలుగు నింపాడు. లైట్ మాన్ కూతురు చదువు ఆగిపోకుండా చేశాడు. 38 ఏళ్ల మహ్మద్ అజాజ్ షేక్... బాలాజీ టెలి ఫిలిమ్స్‌లో లైట్ మాన్‌గా పనిచేస్తున్నాడు. ఫీజు కట్టకపోవడంతో అతడి 12 ఏళ్ల కూతురు నిషా చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. ఈ విషయం తెలుకున్న షారూఖ్ ఆమె చదువుకు ఐదేళ్ల పాటు సహకారం అందిస్తానని హామీయిచ్చాడు. అజాజ్ భార్య ఓ పోటీలో తాను గెల్చుకున్న బహుమతిని షారూఖ్ చేతులుగా మీదుగా అందుకుంది. తన కూతురు చదువు అజాజ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. ఆగిపోయిన విషయాన్ని షారూఖ్‌కు తెలిపింది. వెంటనే స్పందించిన షారూఖ్.. చిన్నారి చదువుకు చేయూతనిచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాడు. షారూఖ్‌కు అజాజ్ దంపతులు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తన కూతురు మళ్లీ స్కూల్‌కు వెళుతుందని సంతోషం వ్యక్తం చేశారు. -
తెలుగు తెరపై అనుష్కశర్మ?
బాలీవుడ్ అందాలభామ అనుష్కశర్మ తెలుగులో నటించనుందా? అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. ఇటీవలే ఓ అగ్ర నిర్మాత ఈ విషయమై అనుష్కను కలిసినట్లు సమాచారం. కథ, పారితోషికం, పాత్ర నచ్చడంతో అనుష్క కూడా సంతకం చేసేశారని తెలుస్తోంది. అనుష్క నటించబోయే తెలుగు సినిమా గురించి తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ‘రబ్నే బనాదేజోడీ’ చిత్రంతో తొలిసారి బాలీవుడ్ తెరపై మెరిశారు అనుష్కశర్మ. తొలి సినిమాతోనే షారుక్‌ఖాన్‌తో జోడీ కట్టి బాలీవుడ్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. తొలి చిత్రంలో సంప్రదాయబద్ధంగా కనిపించిన ఈ అందాలభామ తర్వాత నటించిన ప్రతి సినిమాలోనూ హాట్‌గా కనిపించారు. తక్కువ సినిమాలతోనే బాలీవుడ్లో హాట్‌బ్యూటీగా పేరు గడించారు. ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘బాంబే వెల్వెట్’, అమీర్‌ఖాన్‌తో ‘పీకే’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారామె. ‘పీకే’ చిత్రంలో అమీర్‌తో ఏడు నిమిషాల ముద్దు సన్నివేశంలో నటిస్తున్నట్లు ఓ వార్త ఇటీవలే హల్చల్ చేసింది కూడా. మరి ఈ బాలీవుడ్ బ్యూటీ టాలీవుడ్లో ఎన్ని సంచలనలకు తెర లేపనుందో వేచి చూడాలి.