breaking news
proprietary
-
పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్లకు మరోసారి కౌన్సెలింగ్
సాక్షి, అమరావతి: 2023–24 విద్యా సంవత్సరానికి పీజీ మెడికల్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి ఇటీవల నిర్వహించిన రివైజ్డ్ కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటించింది. యాజమాన్య కోటా సీట్ల ప్రవేశాల కోసం మళ్లీ వెబ్ఆప్షన్లు స్వీకరిస్తూ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ పీజీ అర్హత సాధించిన అభ్యర్థులు 24 గంటల్లోగా ఆప్షన్లు నమో దు చేసుకోవాలని సూచించింది. అనివార్య కారణాలతో ఎవరైనా అభ్యర్థులు ఆప్షన్లు నమోదు చేసుకోకపోతే గతంలో నిర్వహించిన కౌన్సెలింగ్‌కు వారు నమోదు చేసుకున్న ఆప్షన్లను పరిగణనలోకి తీసుకుంటామని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పేరిట శాంతీరామ్, జీఎస్ఎల్, మహారాజా కళాశాలల్లో పీజీ సీట్ల పెంపునకు నకిలీ అనుమతులు వెలువడిన నేపథ్యంలో తొలుత నిర్వహించిన కౌన్సెలింగ్‌ను యూనివర్సిటీ రద్దు చేసి, రివైజ్డ్ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఆ తర్వాత రాజమండ్రి జీఎస్ఎల్ కళాశాలలో రేడియో డయగ్నోసిస్‌లో 14 పీజీ సీట్లకు నకిలీ అనుమతులు వెలువడినట్టు ఎన్ఎంసీ మంగళవారం ప్రకటించింది. ఇదే కళాశాలలో ఎమర్జెన్సీ మెడిసిన్‌లో మరో రెండు సీట్లకు నకిలీ అనుమతులు వచ్చినట్లు గురువారం తెలిపింది. దీంతో యాజమాన్య కోటా రివైజ్డ్ ఫేజ్–1 కౌన్సెలింగ్‌ను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వం విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. -
సొంతిల్లు సమకూరాలంటే.. రాజీ పడాల్సిందేనా!
సాక్షి, హైదరాబాద్: విషయం ఏదైనా సరే.. కోరుకున్నవన్నీ దొరక్కపోవచ్చు. ఏదో ఒక విషయంలో రాజీ పడక తప్పదు. ఇళ్ల కొనుగోలుకూ ఇదే సూత్రం వర్తిస్తుంది. బడ్జెట్, చిక్కుల్లేని యాజమాన్య హక్కు, ప్రాంతం, వాస్తు, నీరు, విద్యుత్తు సరఫరా అంశాలు ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే వీటిలో కొన్ని అంశాలు మనం ఆశించినట్లుగా ఉండకపోవచ్చు. అన్నీ మనకు అనుకూలంగా ఉండాలంటే సొంతింటి స్వప్నం ఓ పెద్ద సవాలే అవుతుంది. అలాగనీ ముఖ్యమైన అంశాల్లోనూ రాజీ పడాలని కాదు. ప్రాధాన్యత క్రమంలో ఒకటి, రెండు అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏయే విషయాల్లో రాజీ పడొచ్చు. ఎక్కడ పడకూడదో స్పష్టత ఏర్పర్చుకోవాలి. ప్రాంతమెక్కడ: ఇల్లు కొనాలన్న ఆలోచనలో ఉన్నారా? అది కూడా మాదాపూర్, గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో అనుకుంటున్నారా? ఇక్కడ వీలవ్వకపోతే మియాపూర్, మదీనాగూడ, మణికొండ, ఓయూ కాలనీ తదితర ప్రాంతాల్లో.. కొంచెం తక్కువ ధరలో దొరికే ప్రాంతాలపై దృష్టి పెడతారు. అవునా? ప్రస్తుత రియల్టీ మార్కెట్లో సంపన్నులకే కాదు మధ్యతరగతి, సామాన్యులు.. ఇలా వివిధ వర్గాల వారికి స్థోమతకు తగ్గ బడ్జెట్లో నగరం చుట్టూ గృహసముదాయాలు వస్తున్నాయి. మీరు కొంచెం కసరత్తు చేసి, చుట్టుపక్కల ప్రాంతాల్ని అన్వేషిస్తే చాలు, మీకు అందుబాటు ధరలో ఇళ్లు ఎక్కడ దొరికేది ఇట్టే తెలిసిపోతుంది. సదుపాయాల సంగతేంటి: నిర్మాణాల విషయంలో డెవలపర్ల వ్యూహం మారింది. సకల సదుపాయాలు అందుబాటులో ఉండే విధంగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇల్లు కొనాలన్న నిర్ణయానికొచ్చాక సదుపాయాల సంగతి కూడా ఆలోచించాలి. క్లబ్‌హౌజ్, జిమ్ అవసరమా? వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే ఈ సదుపాయాలు అక్కర్లేదా? అన్నది తేల్చుకోవాలి. జీవనశైలి, బడ్జెట్ తదితర అంశాలు మీ నిర్ణయంపై ప్రభావితం చేస్తాయి. కాబట్టి సదుపాయాల విషయంలో స్పష్టత ఉండాలి. బిల్డర్‌కు మంచి పేరుందా: స్థిరాస్తి కొనేటప్పుడు బిల్డర్ గురించి కూడా ఆరా తీయాలి. మార్కెట్లో పేరున్న బిల్డర్లు నిర్మించే ఇళ్లకే ప్రాధాన్యమివ్వాలి. గతంలో అతను నిర్మించిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తయ్యాయా? నిర్మాణమెలా ఉంది? ఒప్పందం మేరకు కొనుగోలుదారులకు సదుపాయాలు కల్పించాడా? కార్పస్ ఫండ్ బదిలీలో ఇబ్బందులేమైనా సృష్టించాడా? అన్న విషయాల్ని తెలుసుకోవాలి. నిర్మాణాల్లో మంచి చరిత్ర లేని బిల్డర్లకు దూరంగా ఉండటమే మేలు. అలాగనీ మార్కెట్లో పేరున్న బిల్డర్ల ప్రాజెక్టులకే పరిమితం కానక్కర్లేదు. నిర్మాణంలో నాణ్యత పాటించి ఒప్పందానికి కట్టుబడి ఉండేవారిని ఎంచుకోవచ్చు. పరిసరాలెలా ఉన్నాయి: ఇంటి ముందు పచ్చటి తోటతో ఆహ్లాదభరిత వాతావరణం ఉండాలని కొందరు కోరుకుంటారు. మరికొందరేమో ఇలాంటి హంగులు లేకున్నా సర్దుకుపోతారు. బాల్కనీని పచ్చగా, అందంగా అలంకరించుకుంటే గార్డెన్‌కు ధీటుగా ఉంటుందని భావిస్తారు. కాబట్టి ఈ విషయంలో మీ దృక్పథం ఏమిటో నిర్ణయించుకోవాలి.