సాక్షి-స్పెల్బీ ప్రిలిమినరీ పరీక్ష విజయవంతం
గుంటూరు ఎడ్యుకేషన్
విద్యార్థుల్లోని ఆంగ్లభాషా నైపుణ్యాలకు పదును పెట్టేందుకు ‘సాక్షి-ఇండియా స్పెల్బీ’ సంయుక్తంగా నిర్వహించిన స్పెల్బీ ప్రిలిమినరీ పరీక్ష విజయవంతమైంది. గుంటూరులోని లక్ష్మీపురం 4వ లైనులో ఉన్న మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్ కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పరీక్షకు జిల్లా నలుమూలల నుంచి వ్యక్తిగతంగా పేర్లు నమోదు చేసుకున్న విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలతోపాటు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం తరలిరావడం విశేషం. 1, 2, 3, 4 కేటగిరీల వారీగా పరీక్షకు హాజరైన విద్యార్థులు, వారి వెంట వచ్చిన తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. కొత్తవారితోపాటు గతంలో ఈ పరీక్ష రాసినవారు సైతం హాజరయ్యూరు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు తమ మనోగతాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు.
పోటీలను ఎదుర్కోగలిగే ఆత్మవిశ్వాసం ఏర్పడింది..
సాక్షి దినపత్రికలో ప్రకటన చూసి స్పెల్బీ పరీక్షకు దరఖాస్తు చేశాను. పరీక్ష ఏవిధంగా ఉంటుందో తెలియకపోయినా ముందుగా ఇచ్చిన మెటీరియల్తో బాగా ప్రిపేరయ్యాను. పరీక్ష రాశాక ఆంగ్లభాషలో మరింతగా రాణించాలనే కోరిక కలిగింది. భవిష్యత్లో ఎక్కడ, ఎలాంటి పోటీ నిర్వహించినా పాల్గొనగలనన్న ఆత్మవిశ్వాసం ఏర్పడింది.
-ఎస్.శ్రావణిసంధ్య, 5వ తరగతి,శ్రీచైతన్య స్కూల్, నరసరావుపేట
మేధకు పదును పెట్టేందుకు దోహదం
స్పెల్బీ పరీక్ష విధానం విద్యార్థుల్లో ఆలోచనాశక్తిని ప్రేరేపించి మేధకు పదును పెట్టే విధంగా ఉంది. ఐక్యూను పెంచి, గ్రామర్ను అభివృద్ధి పరిచేందుకు దోహదం చేస్తుంది. పరీక్ష రాసిన తరువాత ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇలాంటి పోటీలు నిరంతరం నిర్వహిస్తే బాగుంటుంది.
-కె.హర్షవర్ధన్, 8వ తరగతి, నారాయణ స్కూల్, గుంటూరు
ఆంగ్ల భాషలో ప్రతిభ చాటేందుకు ప్రోత్సాహం
సాక్షి-స్పెల్బీ పరీక్ష ఆంగ్ల భాషలో ప్రతిభ చాటేందుకు విద్యార్థులకు ప్రోత్సాహమిస్తోంది. విద్యార్థులు తమ ఆంగ్లభాషా నైపుణ్యాన్ని పరీక్షించుకుని మరింత పదును పెట్టుకునేందుకు పరీక్ష దోహదం చేస్తోంది.
-బి.తేజస్విని, 7వతరగతి, సెయింట్ చార్లెస్ స్కూల్, చిలకలూరిపేట
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కు స్ఫూర్తి
స్పెల్బీ పరీక్ష కేవలం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థుల కోసమేనని కొందరు అపోహపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సైతం నిర్భయంగా పాల్గొని ప్రతిభ చాటేందుకు ఇది చక్కటి వేదిక. మా పాఠశాల ఉపాధ్యాయులు ఆంగ్లభాషలో అద్భుతంగా బోధిస్తున్నారు. స్పెల్బీ పరీక్ష రాయడం ఎంతో ఆనందాన్నిచ్చింది.
-పి.చైతన్య, 9వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, రొంపిచర్ల
విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుంది..
విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించేందుకు సాక్షి-స్పెల్ బీ పరీక్ష ఎంతగానో ఉపయోగపడుతుంది. చదువు పేరుతో ఒత్తిడి తెచ్చే విధానానికి భిన్నంగా ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయడం సాధ్యపడుతుంది. సాక్షి దినపత్రికలో ప్రకటన చూసి మా అమ్మాయితో దరఖాస్తు చేయించాను. పరీక్ష రాశాక తనలో ఎంతో ఉత్సాహం కనిపించింది.
-ఎస్.శిరీష, విద్యార్థిని తల్లి, నరసరావుపేట
విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసే వేదిక
పాఠశాల దశలోనే విద్యార్థుల్లో ఆంగ్లభాషా నైపుణ్యాలను వెలికితీసి పోటీతత్వాన్ని పెంచే మంచి వేదిక ‘సాక్షి-స్పెల్బీ’. మూడేళ్లుగా నిరాటంకంగా కొనసాగుతున్న స్పెల్ బీ పరీక్ష విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆసక్తి రేపుతోంది. గతంలో నిర్వహించిన స్పెల్బీ పరీక్షలో మా పాఠశాల విద్యార్థి లయ రాష్ట్ర స్థాయిలో మూడో స్థానం సాధించింది.
-కేబీ సెబాస్టియన్, ప్రిన్సిపాల్, మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్