పన్ను ఎగవేసినందుకు జరిమానా
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను కట్టకుండా మోసం చేసిన కేసులో ఒక ప్రయివేటు సంస్థకు రూ. 8 లక్షలమేర జరిమానా విధిస్తూ స్థానిక కోర్టు తీర్పు చెప్పింది. గడువులోగా ఆదాయ పన్ను విభాగానికి జరిమానా చెల్లించాలని పాలిమర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దేవేంద్ర కుమార్ శర్మ ఆదేశించారు. కాగా, ఈ కంపెనీకి మొదటిసారి 2008-09 ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షలు జరిమానా విధించగా అది చెల్లించలేదు. దీంతో 2009-10, 2010-11 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 లక్షల చొప్పున జరిమానా విధించింది. అంతేకాకుండా ఆదాయ పన్ను శాఖ వివరాల ప్రకారం ఈ సంస్థ 2008-09, 2009-10, 2010-11 సంవత్సరాల్లో వరుసగా రూ. 29.1లక్షలు, రూ. 24.8లక్షలు, రూ.24.6 లక్షల మేర తమ ఉద్యోగులకు జీతాలు తగ్గించిందని తెలిపింది.
ఇచ్చిన సమయంలోగా టీడీఎస్ కింద చెల్లించాల్సిన డబ్బు విషయంలో నిర్లక్ష్యం వహించిందని, ఆ డబ్బును ఇతర ప్రయోజనాలకు వాడుకుందని చెప్పింది. అయితే ఆర్థిక సంక్షోభం వల్ల ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే డబ్బు సరిపోలేదని, అందువల్ల ఆదాయ పన్ను కూడా కట్టలేకపోయామని ఆ సంస్థ తెలిపింది. ఇలాంటి పన్ను ఎగవేతదారులవల్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందని, అది పేదలకు శాపంగా పరిణమిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. కంపెనీలు, వ్యక్తులు పన్ను చెల్లించకపోవడం నానాటికీ పెరిగిపోతుండటంపట్ల ఆందోళన వ్యక్తం చేసింది.