breaking news
pleaded
-
మాస్కో మారణహోమం.. నేరం ఒప్పుకున్న ఉగ్రవాదులు
మాస్కో: రష్యా రాజధాని మాస్కోలో దాడులకు పాల్పడ్డ నలుగురిలో ముగ్గురు తమ నేరాన్ని ఒప్పుకున్నారు. దాడులకు పాల్పడ్డ అనుమానితుల్ని అరెస్టు చేసిన అనంతరం ఆదివారం(మార్చి 24) వారిని మాస్కోలోని బాస్మనే జిల్లా కోర్టులో హాజరుపరిచారు. సంగీత కచేరిలో కాల్పులు జరిపింది తామేనని ఈ సందర్భంగా ముగ్గురు ఉగ్రవాదులు ఒప్పుకున్నారు. దీంతో.. మొత్తం నలుగురికీ మే 22 వరకు కోర్టు ప్రి ట్రయల్ కస్టడీ విధించింది. కాల్పులకు పాల్పడిన నలుగురు తజికిస్థాన్‌కు చెందినవారని తేల్చారు. కోర్టుకు తీసుకువచ్చినపుడు నలుగురి శరీరాలు గాయాలమయమై రక్తమోడుతున్నాయి. ముఖాలన్నీ ఉబ్బిపోయాయి. ఒక ఉగ్రవాదికి ఏకంగా ఒక చెవే లేకుండా పోయింది. విచారణ సమయంలో పోలీసులు వీరిని తీవ్రంగా హింసించారని మీడియా కథనాలు వెలువడ్డాయి. నలుగురితో పాటు దాడులతో సంబంధం ఉన్న మరో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మార్చి 22 రాత్రి మాస్కో శివార్లలోని ఓ సంగీత కచేరి కార్యక్రమంలో నలుగురు ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 133 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దాడులకు తామే కారణమని ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అయితే దాడులకు ఉక్రెయిన్‌కు లింకు ఉందని, దాడి తర్వాత ఉగ్రవాదులు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయత్నించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోపించారు. ఇదీ చదవండి.. ఉక్రెయిన్‌పై రష్యా మిసైళ్ల వర్షం -
నడిచి వచ్చేందుకు 8 నెలల గడువు కావాలట!
ఓ క్రిమినల్ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావడానికి నిందితుడు అడిగిన గడువును చూసి, హైకోర్టు జడ్జిలే విస్తుపోయారట. చివరికి గడువు లేదు గిడువు లేదు... చట్ట ప్రకారం కోర్టు ముందు హాజరు కావాల్సిందేనంటూ ఆదేశించారు. ఇంతకీ సదరు వ్యక్తి అడిగిన గడువు, దాని కథా కమామిష్షు ఏంటంటే.. 'బాలదీక్ష' అనే తప్పుడు ప్రభుత్వ పథకాన్ని ప్రకటించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలను మభ్య పెట్టి, మోసగించారనే ఆరోపణలపై జైన్ గురువు ఆచార్య కీర్తి యశురిష్వరాజి మహారాజ్ సహా మరో అయిదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. అయితే తమకు కోర్టు ముందు హాజరు కావడానికి ఎనిమిది నెలల గడువు కావాలని జైన్ గురువు తదితరులు గుజరాత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎందుకంటే కోల్‌కతా నుండి అహ్మదాబాద్‌కు నడిచి రావడానికి ఎనిమిది నెలల సమయం పడుతుందంటూ లెక్కలు చెప్పుకొచ్చారు. దీంతో పాటుగా తాను జైన్ మత సంప్రదాయం ప్రకారం వాహనాలను వాడరాదని, కాలి నడకన రావడానికి తనకు ఇంత సమయం పడుతుందని యశురిష్వరాజి సెలవిచ్చారు. తన అనారోగ్య కారణాల రీత్యా గంటకు 10- 12 కి.మీ కంటే ఎక్కువ దూరం నడవలేనని అతడు తన పిటిషన్ లో పేర్కొన్నాడు. సుమారు 2,200 కి.మీ నడిచి కోర్టుకు హాజరు కావాలంటే ఆ మాత్రం సమయం కావాలన్నాడు. ఈ పిటిషన్ చాలా వింతగా, విచిత్రంగా ఉందంటూ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా యశురిష్వరాజి మహారాజ్ పిటిషన్‌ను తిరస్కరించారు. ఒక క్రిమినల్ కేసులో నిందితులుగా ఉన్నారన్న సంగతిని వారు మర్చిపోతున్నారని మండిపడ్డారు. నిర్దేశిత సమయానికి కోర్టుకు హాజరు కావాలని ఆదేశించారు. లేకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.