breaking news
personality development work
-
అమృత సంధ్య ఇదీ జీవితం
‘నా భార్య నాకు అండగా నిలిచిన తీరు ఏ పెద్ద వాళ్లు చెప్పిన అప్పగింతలోనూ లేదు. బతుకు నావ ఒడిదొడుకులకు లోనయినప్పుడు తనకు తానుగా నాకు తోడు వచ్చింది. నేను ఈ రోజు ఇలా నవ్వుతూ ఉన్నానంటే కారణం మా సంధ్య ప్రోత్సాహం, సహకారమే’ అని ఓ భర్త తన భార్యను ప్రశంసల్లో ముంచెత్తాడు. భార్య గొప్పతనాన్ని చెప్పడానికి ఇష్టపడని మగ ప్రపంచంలో ఈ భర్త మాటలు వినడానికి మగవాళ్లకు ఎలా ఉందో కానీ ఆడవాళ్లు వినసొంపుగా ఆస్వాదిస్తున్నారు. ఆ భర్త కేరళ రాష్ట్రం, పాలక్కాడ్లోని శివకుమార్. నోరూరించే ఉపాధి ఓ పదహారేళ్ల కిందట... శివకుమార్ బీపీఎల్ లో ఉద్యోగం చేసేవాడు. ఆ బీపీఎల్ మూతపడడంతో అతడి ఉద్యోగం పోయింది. కొత్త ఉద్యోగం కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నాడు. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఇంటిని నడపాల్సిన తన బాధ్యతను నిర్వర్తించడంలో విఫలమవుతున్నానేమోననే ఆందోళనను అతడి భార్య సంధ్య పసిగట్టేసింది. ‘ఇల్లు గడవాలంటే ఉద్యోగమే చేయాలా? సొంతంగా మనకు వచ్చిన పని ఏదైనా చేయవచ్చు కదా’ అన్నదామె. శివకుమార్ ముఖంలో ప్రశ్నార్థకానికి బదులుగా ఆమె ‘చిరుతిండ్లు బాగా చేస్తాను. ఆ పనే మనకు అన్నం పెడుతుంది’ అన్నది. ‘మార్కెట్లో కొత్తరకాల స్వీట్లు ఎన్ని రకాలున్నప్పటికీ బాల్యంలో తిన్న రుచి కనిపిస్తే ఎవరికైనా నోరూరుతుంది. అదే మనకు బతుకుదెరువవుతుందని కూడా ఆమె భర్తకు భరోసానిచ్చింది. ప్రయోగాత్మంగా కొన్నింటిని చేసి బంధువులకు, స్నేహితులకు రుచి చూపించారు. వాళ్లు పాస్ మార్కులు వేయడంతో 2005లో అమృత ఫుడ్స్ పేరుతో చిరుతిళ్లను తయారు చేసే పరిశ్రమ మొదలైంది. పదిహేనేళ్లు గడిచేసరికి ఇప్పుడా దంపతులు ఏడాదికి పది లక్షల ఆదాయాన్ని చూడగలుగుతున్నారు. పదిమందికి పైగా ఉద్యోగం కల్పించారు. తమ ఆహార ఉత్పత్తులకు ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ గుర్తింపు కూడా వచ్చింది. వ్యక్తి వికాస పాఠం ఈ ఆధునిక యుగంలో నెలకు లక్షల జీతం తీసుకుంటున్న భార్యాభర్తలు ఎక్కువగానే ఉన్నారు. అంత సౌకర్యవంతమైన జీవితంలో కూడా నాలుగు నెలల పాటు ఉద్యోగంలో మాంద్యం ఏర్పడితే ఆ జీవితాలు తలకిందులవుతున్నాయి. మనోధైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. శివకుమార్, సంధ్య దంపతుల జీవితం ఒక వ్యక్తిత్వ వికాస పాఠం అనే చెప్పాలి. ఉన్నత చదువు చదివిన భర్తతో ‘నాకు తెలిసిన పని, తక్కువ పెట్టుబడితో మన చేతుల శ్రమతో కొత్త వృత్తిని చేపడదా’మని చెప్పడంలో ఓ చొరవ ఉంది. తన చదువుకు తగిన ఉద్యోగం అని బేషజాలకు పోకుండా భార్య ప్రతిపాదనను గౌరవించడంలో అతడి పరిణతి ఉంది. -
సకలం... సుందరం
సుందరకాండ పరమ పవిత్రమైన పఠనీయ గ్రంథం, నిత్య పారాయణ దివ్య చరితం. ఏ సమయంలో ఎవరితో ఏ విధంగా నడచుకోవాలో సోదాహరణంగా, సవివరంగా చెప్పే వ్యక్తిత్వ వికాస విజ్ఞాన భాండాగారం. భగవద్గీత అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చినట్లుగానే, సుందరకాండ అనగానే హనుమంతుడు జ్ఞప్తికి రావడం సహజం. గీత లాగే సుందరకాండ కూడా చక్కటి వ్యక్తిత్వ వికాస గ్రంథం. వాల్మీకి శ్రీమద్రామాయణ రచన ప్రారంభించిన క్రమంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ పూర్తయ్యాయి. తర్వాతి కాండకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచించాడు. కానీ మంచి పేర్లేమీ ఆయనకు తోచలేదు. అప్పుడు ఆయన మనసులో రామభక్తుడైన హనుమంతుడు మెదిలాడు. కొత్తకాండకు హనుమత్కాండ అని పేరు పెడదామనుకున్నాడు. అదే విషయాన్ని హనుమను పిలిచి ఆయనకు చెప్పబోతున్నాడు. ఇంతలో అంజనాదేవి ‘‘మహర్షీ! సుందరుడిని ఒకసారి నా వద్దకు పంపించు’’అని అనడం వాల్మీకికి వినిపించింది. వాల్మీకి మహర్షి ‘‘సుందరా! మీ తల్లిగారు పిలుస్తున్నారు, వెళ్లిరా నాయనా!’’అని చెప్పారు. హనుమకు కూడా ‘‘నాయనా, సుందరా! ఎక్కడున్నావు తండ్రీ’’ అంటున్న తల్లి గొంతు వినిపించింది. వెంటనే హనుమ తన తల్లి వద్దకు వెళ్లి, ‘‘అమ్మా! సుందరుడెవరు?’’ అని అమాయకంగా అడిగాడు. అప్పుడు అంజనాదేవి ‘‘నీకన్నా సుందరుడెవరు నాయనా? బాల్యంలో నువ్వు బాలభానుడిలా సుందరంగా భాసించేవాడివి. అందుకే నేను నీకు సుందరుడనే పేరే పెట్టాను. అయితే ఇంద్రుడు నీ హనువుపై వజ్రాయుధంతో కొట్టడం వల్ల నీకు హనుమంతుడనే పేరు వచ్చింది. మహర్షి రాయబోయే కాండకు నీ పేరు పెట్టడమే బాగుంటుంది. ఎందుకంటే ఆ కాండకు సంబంధించిన వారందరూ సుందరమైన వారే! రాముడు సుందరుడు, ఆయన సతీమణి సీత ఎంతో సుందరమైనది. వారిద్దరికీ సంబంధించిన ఈ కథ సుందరమైనది. ఆ తల్లి నివసించబోయే అశోకవనం కూడా సుందరమైనదే. ఆ కావ్యానికి అనుసంపుటి చేసిన గాయత్రీ మాత ఎంతో సుందరమైనది. అన్నింటికీ మించి ఆ కావ్యరచన సుందరంగా సాగుతోంది కాబట్టి ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టడమే సముచితం’’ అంది అంజనాదేవి. ఈ సంభాషణనంతటినీ ఆలకిస్తున్న వాల్మీకి వెంటనే ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడు. హనుమ గురించి అధికంగా ఉండే సుందరకాండ పరమ పవిత్రమైన పఠనీయ గ్రంథం, నిత్య పారాయణ దివ్య చరితం. ఏ సమయంలో ఎవరితో ఏ విధంగా నడచుకోవాలో సోదాహరణంగా, సవివరంగా చెప్పే వ్యక్తిత్వ వికాస విజ్ఞాన భాండాగారం. భక్తితో పారాయణ చేసిన వారి కోర్కెలను తీర్చే కల్పతరువు. ఈ గ్రంథాన్ని పారాయణ చేయాలంటే నియమాలను పాటించాలేమో అని చాలామంది భయపడతారు. అయితే ఏవైనా ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆశించినప్పుడు నియమాలను పాటించక తప్పదు కానీ, మానసికానందం కోసం పఠించేవారు సర్వకాల సర్వావస్థలలోనూ హాయిగా చదువుకోదగ్గ సద్గ్రంథమిది. నేడు హనుమజ్జయంతి. భక్తి ప్రధానం అని గుర్తుంచుకోండి. ఈ వేళ అయినా ఈ గ్రంథ పారాయణ మొదలు పెట్టండి... ఆధ్యాత్మికానందంలో ఓలలాడండి. - డి.వి.ఆర్.