breaking news
Pending salary
-
జీతం కావాలంటే ఇంటి వచ్చి నా కోరిక తీర్చు..!
‘సార్.. రెండు నెలల నుంచి జీతం ఇవ్వలేదు.. చిన్నపిల్లలతో ఉంటున్నాను..ఇల్లు గడవడం కష్టంగా ఉంది.. ఇప్పుడు అర్జంట్‌గా గ్యాస్ సిలిండర్ విడిపించాలి.. అడ్వాన్స్‌గా అయినా ఓ రెండు వేల రూపాయలు ఇవ్వండి..’ అంటూ శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఓ ఔట్సోర్సింగ్ ఉద్యోగిని పారిశుద్ధ్య నిర్వహణ కాంట్రాక్టర్ వద్ద వేడుకుంది. ‘జీతం కావాలంటే ఇంటి వచ్చి నా కోరిక తీర్చు.. నిన్ను బాగా చూసుకుంటాను..’ అంటూ సదరు కాంట్రాక్టర్ లైంగిక వైధింపులకు దిగాడు.ఆలయం పారిశుద్ధ్య నిర్వహణ విభాగంలో ఇటీవల చోటుచేసుకున్న ఈ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని కొద్ది రోజులుగా బయటకు రాకుండా ఉండేలా అటు కాంట్రాక్టర్ వర్గం, ఇటు కొందరు అధికార సిబ్బంది కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని నేరుగా ఆలయ ఈవో కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్ వద్ద ప్రస్తావించింది. అయినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోవడంతో తోటి ఉద్యోగుల మద్దతుతో శ్రీకాకుళం వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు కారణంగా చర్యలకు వెనుకాడుతున్నట్లు సమాచారం. ఏం జరిగిందంటే.. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో పారిశుద్ధ్య నిర్వహణ టెండర్‌ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక టీడీపీ నేతల జోక్యంతో గోవింద్ అనే వ్యక్తి టెండర్ దక్కించుకున్నాడు. ఆలయ సెక్యూరిటీ విభాగంతో పాటు పారిశుద్ధ్య సిబ్బంది వ్యవహారాలన్నీ ఈ టెండర్‌దారుని పరిధిలోకే వస్తాయి. రెండు నెలల నుంచి సెక్యూరిటీ సిబ్బందికి, పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది (స్వీపర్లు)కి జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ బ్బందులు పెడుతున్నాడంటూ ఆలయ ఈవోకు ఫిర్యాదులు అందాయి. దీంతో సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం ఒక నెల జీతం చెల్లించి మిన్నకుండిపోయాడు. దీంతో స్వీపర్లు మరోసారి ఈవోకు వినతిపత్రం అందజేశారు. అదే సందర్భంలో తాను అడ్వాన్స్ ఇవ్వాలని అడిగితే.. అసభ్యంగా మాట్లాడినట్లుగా బాధితురాలు ఈవోకు రికార్డెడ్ ఎవిడెన్స్‌గా తన బాధను వివరించింది. రాజకీయ జోక్యంతో చర్యలకు దూరం..! స్థానికంగా కూటమి ప్రభుత్వం మద్దతుదారులు, టీడీపీ ముఖ్య కార్యకర్తలు ఏడాది కాలంగా ఆదిత్యాలయ టెండర్లలో జోక్యం చేసుకుని తమ వారిని పెట్టుకుని మేనేజ్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది టెండర్‌ను దక్కించుకున్న గోవింద్ ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలతో పాటు పీఎఫ్ జమ విషయంలోనూ తీవ్ర నిర్లక్ష్యంగా ఉంటున్నట్లు సమాచారం. సిబ్బందిపై లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకున్నాక ఉద్యోగులు ఈవోకు, పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా చర్యలకు వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం. ఇలాంటి ఫిర్యాదులుంటే కచ్చితంగా కాంట్రాక్టర్ టెండర్‌ను రద్దు చేసే అధికారం ఈవోకు ఉన్నా తాత్సారం జరుగుతుండటంపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసభ్యంగా మాట్లాడాడు... రెండు నెలల జీతం కావాలంటే ఇంటికి రా..కోరిక తీర్చు అంటూ కాంట్రాక్టర్ గోవింద్ అసభ్యంగా మాట్లాడారు. ఇదే విషయం ఆలయ ఈవోకు చెప్పాను. ఆయన కాంట్రాక్టర్‌ను పిలిపించి మందలించారు. న్యాయం కోసం తోటి ఉద్యోగులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాం. నాలాంటి బాధితులు ఇంకా ఉన్నారు. కానీ భయంతో నోరు మెదపలేకపోతున్నారు. – బాధితురాలు ఫిర్యాదు అందింది.. పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న గోవింద్‌పై పెండింగ్ జీతాల విషయంతో పాటు ఓ ఉద్యోగినిపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులు వచ్చాయి. వెంటనే పిలిపించి కాంట్రాక్టర్‌ను గట్టిగా మందలించి పంపించాను. ఇలాంటి తప్పుడు పనులు చేసిన వారిని క్షమించేది లేదు. ఇప్పటికే పోలీసులకు బాధితులు ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిసింది. – కె.ఎన్.వి.డి.వి.ప్రసాద్, ఈవో శ్రీకాకుళం: -
పండుగ పూట పస్తులు తప్పవా?
- హోంగార్డు వేతనాలకు బడ్జెట్ లేదట! - జూలైలో 10 రోజుల జీతం పెండింగ్‌లో.. - ఆగస్టులోనూ అందని వేతనం - కష్టాల్లో హోంగార్డులు - దసరా వరకైనా అందేనా? నిజామాబాద్ క్రైం : సివిల్ పోలీసులకు ఏమాత్రం తీసిపోకుండా విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు ఇబ్బందులు తప్పడం లేదు. వేతనాలు అందక వారు అష్టకష్టాలు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే దసరా పండగ ఎలా జరుపుకోవాలని ఆందోళన చెందుతున్నారు. హోంగార్డులకు నెలకు రూ. 9 వేల వేతనం చెల్లిస్తున్నారు. అయితే బడ్జెట్ లేదన్న సాకుతో పూర్తి వేతనాన్ని ఒకేసారి కాకుండా ఇష్టం వచ్చినట్లు ఇస్తున్నారు. దీంతో కుటుంబ పోషణ కూడా భారమవుతోందని పలువురు హోంగార్డులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి అద్దెలు, పిల్లల చదువులు, రేషన్ సామగ్రి, ఇతర ఖర్చులకు అప్పులు చేయాల్సి వస్తోందని పేర్కొంటున్నారు. బడ్జెట్ లేదన్న సాకుతో వేతనాలు ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు. వేతనం పెరిగినా.. జిల్లాలో ప్రస్తుతం 936 మంది హోంగార్డులు పనిచేస్తున్నారు. వారంతా చాలీచాలని వేతనాలతో అనేక ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. ధరల పెరుగుదలతో తమకిస్తున్న రోజుకు రూ. 200 వేతనం సరిపోవడం లేదని, వేతనాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. మూడు నెలల క్రితం వారి వేతనాన్ని రూ. 300లకు పెంచింది. నెలకు రూ. 9 వేల వేతనం వస్తుందని హోంగార్డులు సంతోషించారు. కానీ వేతనం పెరిగినా.. సరిగా అందక వారు ఇబ్బందులు పడుతున్నారు. వేతనాలు చెల్లించారిలా ప్రభుత్వం వద్ద బడ్జెట్ లేకపోవడంతో జూన్ నెల వేతనం రూ. 9వేలకుగాను రూ. 3,900 మాత్రమే చెల్లించింది. జూలైలో జీతం ఇవ్వలేదు. ఆగస్టులో జూన్‌కు సంబంధించిన పెండింగ్ వేతనాన్ని ఇచ్చింది. జూలైకి సంబంధించి 20రోజుల వేతనం రూ. చెల్లించింది. మరో పదిరోజుల వేతనాన్ని పెండింగ్‌లో పెట్టింది. అప్పటినుంచి ఒక్కపైసా ఇవ్వలేదు. గతంలో ఎస్పీగా పనిచేసిన రాజేశ్ కుమార్ తమకు వేతనాలు సక్రమంగా చెల్లించేందుకు చర్యలు తీసుకున్నారని, ఆయన తర్వాత వచ్చినవారు సరైన శ్రద్ధ చూపడం లేదని హోంగార్డులు వాపోతున్నారు. క్రమం తప్పకుండా వేతనాలు చెల్లించాలని కోరుతున్నారు.


