breaking news
Pallevelugu
-
బస్సు బోల్తా : ప్రయాణికులకు గాయాలు
తిరుపతి: చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం రాంభట్లపల్లెలో గురువారం స్టీరింగ్ విరిగి పల్లె వెలుగు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. 108కి సమాచారం ఇచ్చారు. అయితే ఫోన్ చేసి అరగంట అయినా 108 వాహనం రాకపోవడంపై క్షతగాత్రులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందవలసి ఉంది. -
బస్సు చార్జీలకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ బస్సు చార్జీలు పెరిగాయి. పల్లె వెలుగు మినహా మిగతా అన్ని రకాల బస్సు టికెట్ ధరలను 10 శాతం పెంచారు. పేదలు ఎక్కువగా ఆధారపడే పల్లె వెలుగులో మాత్రం పెంపును 5 శాతానికి పరిమితం చేశారు. ఈ కొత్త ధరలు సోమవారం ఉదయం సర్వీసు నుంచి అమలులోకి వస్తాయి. టికెట్ ధరల పెరుగుదలతో ప్రయాణికులపై ఏటా రూ.286 కోట్ల భారం పడనుంది. టికెట్ ధరల పెంపునకు బుధవారమే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. గురువారం ఆర్టీసీ కొత్త ధరలను ప్రకటించింది. సచివాలయంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావుతో కలిసి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి విలేకరులకు చార్జీల వివరాలు వెల్లడించారు. పల్లెవెలుగులో 30 కిలోమీటర్ల వరకు ఒక రూపాయి చొప్పున, 30 కి.మీ. దాటితే రూ.2 చొప్పున ధరలు పెరగనున్నాయి. ఎక్స్‌ప్రెస్‌లో కి.మీ.కు 8 పైసలు, డీలక్స్‌లో 9 పైసలు, సూపర్‌లగ్జరీలో 11 పైసలు, ఇంద్రలో 14 పైసలు, గరుడలో 16 పైసలు, గరుడ ప్లస్‌లో 17 పైసలు పెరిగాయి. సిటీ బస్సు చార్జీలూ పెరిగాయి.. హైదరాబాద్ సిటీ బస్సు టికెట్ల ధరలు కూడా 10 శాతానికి పెంచారు. సిటీ ఆర్డినరీ కనిష్ట టికెట్ ధరను రూ.6 నుంచి రూ.7కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ ధర రూ.7 నుంచి రూ.8కి, మెట్రో డీలక్స్ ధర రూ.8 నుంచి రూ.9కి పెంచారు. స్టాపుల వారీగా కొత్త ధరలను శుక్రవారం ప్రకటించనున్నారు. ఇదే దామాషా ప్రకారం బస్ పాస్ ధరలు కూడా పెరుగుతాయి. కేంద్ర ప్రభుత్వం స్టేజీ క్యారేజీ వాహనాలపై 6 శాతం సర్వీస్ ట్యాక్స్ విధించటంతో ఆర్టీసీ ఇటీవలే ఏసీ బస్సు టికెట్ ధరలను 6 శాతం మేర పెంచింది. అది అమల్లోకి వచ్చి రెండు వారాలు గడవకముందే మళ్లీ ఏసీ బస్సు టికెట్ ధరలు పెరిగాయి. ఆర్టీసీకి రోజుకు రూ.2 కోట్ల నష్టం.. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీకి రూ.701 కోట్ల భారీ నష్టాలు వాటిల్లాయి. ఆర్టీసీ ఆవిర్భవించిన ఎనిమిది దశాబ్దాల్లో ఇదే రికార్డు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నెలలో రూ.10.65 కోట్లు, మే నెలలో రూ.32.20 కోట్లు నష్టా లు వచ్చాయి. ప్రస్తుతం వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఆర్టీసీ రూ.2,275 కోట్ల అప్పు పడింది. ప్రతిరోజు బస్సుల నిర్వహణతో రూ.9కోట్ల ఆదా యం సమకూరుతుండగా.. ఖర్చుల పద్దులో రూ.11 కోట్లు చేరుతున్నాయి. అంటే రోజుకు నికర నష్టం రూ.2 కోట్లు. గత సంవత్సరం నిర్వహణ నష్టమే (ఆపరేషనల్ లాస్) రూ.257 కోట్లుగా తేలింది. ఎప్పుడెప్పుడు ఎంత పెంచారు? చివరిసారిగా 2013 నవంబర్‌లో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం బస్సు చార్జీలను పెంచింది. తెలంగాణ వచ్చిన తర్వాత చార్జీలు పెంచటం ఇదే తొలిసారి. వైఎస్ సీఎంగా ఉన్నంతకాలం బస్సు చార్జీలు పెంచలేదు. ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఆర్టీసీ ఆదాయం పెంచుకోవటంపై వైఎస్ సర్కారు దృష్టి సారించింది. ఆయన మృతి చెందిన తర్వాత రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు వరుసగా నాలుగేళ్లపాటు చార్జీలు పెంచాయి. తప్పని స్థితిలోనే పెంచాం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉండటంతో తప్పని పరిస్థితిలోనే టికెట్ ధరలు పెంచాం. ప్రజలపై పెద్దగా భారం మోపద్దన్న ఉద్దేశంతో కేవలం 10 శాతానికే పెంపును పరిమితం చేశాం. ఈ రూపంలో ఆర్టీసీకి పెరిగే ఆదాయం కేవలం రూ.286 కోట్లే. కర్ణాటక, మహారాష్ట్రలాంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పటికీ తెలంగాణ ఆర్టీసీ చార్జీలే తక్కువగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రం ఏపీలో గత సంవత్సరమే చార్జీలు పెంచినా మనం ఆచితూచి వ్యవహరించాం. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలోనే నష్టాలను అధిగమిస్తామన్న నమ్మకం ఉంది. పేదలు ఆధారపడే పల్లెవెలుగులో నామమాత్రంగా ధరలు పెంచాం. - మహేందర్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి -
శ్రీశైల క్షేత్రానికి మరిన్ని సర్వీసులు
శ్రీశైల మహాక్షేత్రానికి మరిన్ని బస్సు సర్వీసులను కొనసాగిస్తామని ఆత్మకూరు ఆర్టీసీ డిపో నూతన డీఎం హుసేన్ సాహెబ్ అన్నారు. పట్టణంలోని ఆర్టీసీ డిపో కార్యాలయంలో సోమవారం నంద్యాల నుంచి ఆత్మకూరుకు బదిలీపై వచ్చిన ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు డిపో నుంచి గతంలో ఉన్న శ్రీశైలం - బెంగుళూరు, శ్రీశైలం - చెన్నై బస్సులతో పాటు నంద్యాల - శ్రీశైలం, కర్నూలు - శ్రీశైలం బస్సు సర్వీసులతో పాటు అదనంగా మరిన్ని పల్లె వెలుగు బస్సుసర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. -
బాలయ్య 'బస్సులు' ఫ్లాప్
అనంతపురం: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోవడంతో ప్రయాణికుల బాధలు వర్ణాణాతీతం. శనివారం ఏపీ 28 జెడ్ 5181 నంబరు గల పల్లె వెలుగు బస్సు లేపాక్షి సమీపంలోని నవోదయ విద్యాలయం వద్ద ఆగిపోయింది. చెక్‌పోస్టు నుంచి హిందూపురానికి వస్తున్న ఈ బస్సులో సుమారు 50 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో ఆ బస్సు విద్యార్థులు లేపాక్షి దాకా తోసుకువచ్చారు. అక్కడ నుంచి కదిలేందుకు ఆ బస్సు మొరాయించింది. దీంతో విద్యార్థులు మరో బస్సు వచ్చేదాకా వేచి ఉండాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా 15 రోజుల కిందట కల్లూరు గ్రామంలో దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు జెడ్పీ ఛైర్మన్ చమన్ విచ్చేశారు. రాత్రి 10 గంటల సమయంలో హిందూపురం నుంచి కొండూరుకు వేళ్లే ఆర్టీసీ సర్వీసు దర్గా వద్ద ఆగిపోయింది. జెడ్పీ ఛైర్మన్ అంతకుముందే పూజలు నిర్వహించి వెళ్లారు. చమన్ వెళ్లే సమయంలోనే బస్సు ఆగిపోయి ఉంటే ప్రజలు రాత్రివేళ బస్సును తోస్తూ పడే బాధలను ఆయన ప్రత్యక్షంగా చూసేవారని స్థానికులు తెలిపారు. రెండు రోజుల కిందట కూడా నాయనిపల్లి క్రాస్ హిందూపురం నుంచి కొడికొండకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు మొరాయించింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ వారు కాలం చెల్లిన బస్సులు నడపడం వల్లే ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హిందూపురం ఆర్టీసీ డిపోకు కొత్త పల్లె వెలుగు సర్వీసులు, సూపర్ లగ్జరీ బస్సులు అదనంగా వచ్చాయని, వాటిని సంబంధిత అధికారులు కలరింగ్ ఇచ్చారు. వాస్తవంగా పల్లె వెలుగు సర్వీసులన్నీ కాలం చెల్లినవే. వాటికే రంగులు వేయించి కొత్తవంటూ బీరాలు పోతున్న విషయాన్ని ఏం మాయచేశారో అనే శీర్షికతో ఇటీవల సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. అయినా ఆర్టీసీ అధికారులు మాత్రం ఇంకా మార్పు రాలేదు. బాలయ్య ఈ నెల 14న తన నియోజకవర్గమైన హిందూపురంలో 14 కొత్త ఆర్టీసు బస్సులను ప్రారంభించిన సంగతి తెలిసిందే.