breaking news
owned
-
పాత కారు.. యమా జోరు!!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత ఆటోమొబైల్ మార్కెట్లో కొత్త కార్ల కంటే పాత వాటికే డిమాండ్ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 2018–19లో 33.7 లక్షల కొత్త కార్లు రోడ్డెక్కగా... అదే సమయంలో ఏకంగా 40 లక్షల పాత కార్లు చేతులు మారాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే 2018–19లో కొత్త కార్ల అమ్మకాల వృద్ధి రేటు 2.7 శాతం మాత్రమే. నాలుగేళ్లలో ఇదే తక్కువ వృద్ధి రేటు కూడా!!. అదే పాత కార్ల విషయానికొస్తే... ఈ వృద్ధి 6–7 శాతం మధ్య ఉండటం గమనార్హం. వాల్యూ ఫర్ మనీ.. పాత కారుకు కస్టమర్లు ఆకర్షితులు కావటానికి ప్రధాన కారణం వారు తాము చెల్లించే డబ్బుకు తగ్గ విలువ ఉండాలని ఆశిస్తున్నారని మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్ చెబుతోంది. ‘‘కొత్త కారు కొనాలనుకుంటే... ఆ ధరకే లేదా అంత కంటే తక్కువ ఖరీదుకే ఇంకా పెద్ద కారు వస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో నలుగురు వ్యక్తుల్లో ఒకరు మాత్రమే కొత్త కారు కొంటున్నారు. మిగిలిన ముగ్గురు ప్రీ ఓన్డ్ కారుకు సై అంటున్నారు’’ అని ట్రూబిల్ కో–ఫౌండర్ శుభ్ బన్సాల్ చెప్పారు. ఇప్పుడు భారత్‌లో ప్రీ ఓన్డ్ విభాగంలోనే అధిక విక్రయాల ట్రెండ్ కొనసాగుతోందని చెప్పారు. పాత కార్ల విషయంలో వాల్యూ చూసేవారు 15 శాతం మంది ఉంటున్నారు. తక్కువ కాలానికి వాడి తిరిగి విక్రయించాలని భావించేవారు 23 శాతం కాగా, తక్కువ ధరకు వస్తుంది కాబట్టి కొనుగోలుకు మొగ్గు చూపేవారు 62 శాతం మంది ఉంటున్నారట. తరచూ మారుస్తున్నారు.. దశాబ్దం క్రితం ఒక్కో కస్టమర్ తమ కారును పదేళ్లపాటు అట్టి పెట్టుకునేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యువ కస్టమర్ల సంఖ్య ఎక్కువ కావటంతో 3– 5 ఏళ్లకే కారును మారుస్తున్నారు. మరీ పాత వాహనమైతే సేల్ వాల్యూ రాదు. చాలా సందర్భాల్లో మూడేళ్ల పాతది కొత్త కారు మాదిరిగా ఉంటోందట. దీంతో చాలా మంది కస్టమర్లు పాత కారుకు ఓకే చెబుతున్నారు. మూడేళ్లలోపు తిరిగిన కారును కోరేవారు 27 శాతం, 4–5 ఏళ్లు వాడిన కారును కోరుకునేవారు 45 శాతం మంది ఉన్నారన్నది విక్రయదారుల మాట. 46 శాతం మంది యజమానులు మాత్రం తమ కారును 6–8 ఏళ్లు వాడిన తర్వాతే అమ్ముతున్నారు. 3– 5 ఏళ్లకే కారును విక్రయిస్తున్న వినియోగదార్లు పెద్ద కారు లేదా ఉత్తమ మోడల్‌కు అప్డేట్ అవుతున్నారు. వ్యవస్థీకృత రంగంవైపు.. ప్రీ ఓన్డ్ కార్ల మార్కెట్లో వ్యవస్థీకృత రంగ విభాగ వాటా తక్కువే ఉన్నప్పటికీ క్రమంగా పెరుగుతోంది. 2016–17లో వ్యవస్థీకృత రంగం వాటా 15 శాతం ఉంటే 2018– 19 నాటికి 18 శాతానికి చేరింది. వ్యవస్థీకృత రంగ కంపెనీలు ప్రీ ఓన్డ్ కార్ల సేల్స్ కోసం షోరూంలు తెరుస్తున్నాయి. దాదాపు అన్ని సంస్థలూ సొంతంగా ప్రీ ఓన్డ్ కేంద్రాలను ఆపరేట్ చేస్తుండడం విశేషం. సొంత బ్రాండ్ కార్లనేగాక ఏ కంపెనీ కార్లనైనా ఇవి కొనటం, అమ్మటం చేస్తున్నాయి. వ్యవస్థీకృత రంగంలోని ప్రీ ఓన్డ్ కేంద్రాల్లో కార్లకు నాణ్యత పరీక్షలు జరిపి, రిపేర్ చేసి మంచి కండీషన్‌కు తీసుకొచ్చాకే విక్రయిస్తారు. సర్టిఫై చేసి వారంటీతో అమ్ముతారు. కారు కొనేందుకు రుణం సులభంగా వస్తుంది. ఇక కస్టమర్ నుంచి కస్టమర్‌కు జరుగుతున్న వ్యాపారం 32 శాతంగా ఉంది. అవ్యవస్థీకృత రంగం 17 నుంచి 16 శాతానికి తగ్గింది. సెమి– ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ 36 నుంచి 34 శాతంగా ఉంది. ఫైనాన్స్ 17 శాతమే.. పాత కార్ల విక్రయాలు పెరుగుతున్నప్పటికీ కొత్త కార్లతో పోలిస్తే ఫైనాన్స్ లభ్యత తక్కువగా ఉంటోంది. 75 శాతం కొత్త కార్లకు రుణ సదుపాయం లభిస్తే, పాత కార్ల విషయంలో ఇది 17 శాతమే. ఫైనాన్స్ కాస్ట్ ఎక్కువగా ఉండడంతోపాటు వినియోగదారుకు క్రెడిట్ కార్డు లేదా లోన్ హిస్టరీ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. కొత్త కారుపై ఉండే వడ్డీ రేటు కంటే పాత కారుపై వడ్డీ రేటు కస్టమర్, వాహన విలువను బట్టి 2– 5 శాతం ఎక్కువ ఉంటోంది. ఆర్గనైజ్డ్ సెక్టార్లో విక్రయ కంపెనీలు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో చేతులు కలిపి కస్టమర్లకు చేరువ అవుతున్నాయి. సులువుగా రుణం వచ్చేలా చేస్తున్నాయి. మరో విషయమేమంటే అవ్యవస్థీకృత రంగంలో పాత కారుకు విలువ కట్టడం అంత ఈజీ కాదు. ప్రామాణికత లేకపోవడంతో చాలా సందర్భాల్లో బ్రోకర్లదే తుది నిర్ణయంగా ఉంటోంది. కారు మోడల్, తిరిగిన కిలోమీటర్లు, వయసు, రంగు, నగరం కూడా ధరను నిర్ణయిస్తాయి. (సోర్స్–మహీంద్రా ఫస్ట్ చాయిస్ వీల్స్) -
అనుష్క శర్మ కొత్త కారు: ధర వింటే
సాక్షి, ముంబై: వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ కొత్త లగ్జరీకారును సొంతం చేసుకున్నారట. అతి విలాసవంతమైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ (లాంగ్‌వీల్ బేస్) కారును ఖరీదు చేసినట్టు తెలుస్తోంది. ఈ అల్టిమేట్ లగ్జరీ ఎస్యూవీ ధర సుమారు. 4కోట్ల రూపాయలు. సూయి ధాగా, మేడ్ ఇన్ ఇండియా చిత్రాల్లోని నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు అనుష్క. మరోవైపు బాలీవుడ్ సూపర్ స్టార్ షారూక్ ఖాన్‌తో జతగా నటిస్తున్న ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో జీరో సినిమా డిసెంబరు 21న విడుదల కానుంది. అనుష్క ఈ మూవీలో సైంటిస్టుగా ఒక చాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నారు. కాగా ఇటీవల సింగపూర్‌లో మేడం టుస్సాడ్స్ వాక్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను అనుష్క ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. -
ఏయిర్ పోర్టులో బంగారం పట్టివేత
రంగారెడ్డి(శంషాబాద్): రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి టీజీ329 విమానంలో వస్తున్న ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ అధికారులు 400 గ్రా బంగారాన్ని ఆదివారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్‌కు చెందినవాడిగా గుర్తించారు. నిందితుడ్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.