ఆమె ఇంట నోట్ల కట్టలు.. కేజీల కొద్దీ బంగారం!!
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అస్సాం సివిల్ సర్వీస్ అధికారిణి నుపూర్ బోరాను సోమవారం అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఆమె నివాసం నుంచి కిలోల కొద్దీ బంగారం, లక్షల రూపాయల విలువున్న నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అంతేకాదు.. ఆ సమయంలో నోట్ల కట్టలను అధికారులు మెషిన్లతో లెక్కిస్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. భారీ అవినీతి ఆరోపణల నడుమ.. చీఫ్‌మినిస్టర్ స్పెషల్ విజిలెన్స్ సెల్ బృందం సోమవారం గువాహతిలోని నుపూర్ బోరా(28) నివాసంలో తనిఖీలు నిర్వహించింది. అయితే అధికారికంగా రూ.92 లక్షలు విలువ చేసే నగదు, కోటి రూపాయల విలువ చేసే నగలను సీజ్ చేశారు. అలాగే.. బార్పేటలో ఉన్న అద్దె నివాసం నుంచి మరో రూ.10 లక్షల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆపై ఆమెను అరెస్ట్ చేసి అవినీతి భాగోతం మీద ప్రశ్నిస్తున్నట్లు ప్రకటించింది. గోలాఘట్‌కు చెందిన నుపుర్ బోరా.. 2019లో అస్సాం సివిల్స్ సర్వీస్‌కు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆమె గోరోయిమరి జిల్లా కంరూప్‌లో సర్కిల్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బోరా తన పదవిలో ఉండగా హిందూ భూములను 'సందేహాస్పద వ్యక్తులకు' డబ్బు కోసం బదిలీ చేశారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అంటున్నారు. ఇక.. నుపూర్ సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురజిత్ డేకాని కూడా అధికారులు విచారణ జరుపుతున్నారు. బార్పేట జిల్లాలో అనేక భూములు అక్రమంగా పొందినట్లు ఆరోపణలు ఈయనపై ఉన్నాయి. నుపూర్ కేసులో తనిఖీలు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం. మరోపక్క.. కేఎంఎస్ఎస్(Krishak Mukti Sangram Samiti) అనే స్థానిక ఉద్యమ సంస్థ ఒకటి కూడా ఆమె అవినీతి భాగోతంపై పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.ఆమెపై వస్తున్న భూ సంబంధిత ఆరోపణల నేపథ్యంలో గత ఆరు నెలలుగా నిఘా ఉంచినట్లు సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బార్పేట రెవెన్యూ సర్కిల్లో ఆమె విధుల్లో ఉన్నప్పుడు లంచం తీసుకుని హిందూ ఆలయాల భూములను ఇతరుల పేరిట బదిలీ చేసినట్లు అబియోగాలు ఉన్నాయి. మైనారిటీల జనాభా అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే ఈ తరహా అవినీతి కార్యకలాపాలు ఎక్కువగా నమోదవుతున్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో తీవ్ర దుమారం చెలరేగింది. అస్సాంలో అవినీతి రహిత పాలన పేరిట సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్‌ను 2021లో హిమంత బిశ్వ శర్మ ప్రారంభించారు.అధికారుల అక్రమ ఆస్తులపై దాడులు, అవినీతి సంబంధిత కేసుల విచారణ, సున్నితమైన భూమి బదిలీ వ్యవహారాలపై నిఘా.. తదితర అంశాలను ఈ విభాగం చూసుకుంటుంది.