
ప్రపంచం మొత్తమ్మీద ఏ గొడవకైనా రెండే రెండు కారణాలు ఉంటాయిట. మొదటిది నగదు. రెండోది మగువ అంటారు. కించపరచడం ఉద్దేశం కానే కాదు కానీ..మహిళలపై పురుషులకున్న వ్యామోహమనండి, వాంఛ అనండి.. ఇంకోటి అనండి అనేకానేక గొడవలకు కారణమవుతుందన్నది సత్యం.
అసోమ్(అస్సాం) సివిల్ సర్వీసెస్ అధికారి నూపుర్ బోరా విషయమే తీసుకుందాం. అవినీతి ఆరోపణలతో ఆమెపై ఇటీవలే విజిలెన్స్ దాడులు జరిగాయి. సుమారు 92 లక్షల రూపాయల నగదు, రెండు కోట్ల రూపాయల విలువైన నగలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. కేసుకు సంబంధించి నూపుర్ బోరా బాయ్‌ఫ్రెండ్, రెవెన్యూ ఆఫీసర్ సుర్జీత్ డేకాను కూడా విజిలెన్స్ అధికారులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల పోలీస్ రిమాండ్‌కు పంపారు. ఇక్కడితో స్టోరీ ఖతమైపోలేదు. షురూ అయ్యిందని చెప్పాలి. ఎందుకంటే..

నూపుర్‌పై విజిలెన్స్ దాడులు జరగడంలో ముఖ్య పాత్ర ఆమె రెండో మాజీ భర్త. ఆయనిచ్చిన టిప్‌తోనే విజిలెన్స్ వాళ్లు ఆమెపై రెయిడ్ చేశారని తెలుస్తోంది. ఈయనతోపాటు అంతకుముందు ఇంకొకరితో నూపుర్‌కు వివాహం, విడాకులు రెండూ అయ్యాయి. ఆ తరువాత బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది. బోరా పాపంలో ఇప్పుడు అతగాడి వాటాను తేల్చే పనిలో అధికారులు ఉన్నారు.
2019లో అసోమ్ సివిల్ సర్వీసెస్‌లో చేరిన నూపుర్ కార్బీ అంగ్‌లాంగ్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఆ తరువాత బార్పేట, కామ్‌రూప్ జిల్లాల్లో సర్కిల్ ఆఫీసర్‌గానూ సేవలందించారు. సివిల్ సర్వీసెస్‌లోకి చేరే ముందు ఇంగ్లీషు టీచర్‌గా పని చేసిన అనుభవమూ ఉంది.

అవినీతి ఆరోపణలేమిటి?
ప్రభుత్వ భూములను బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వలసదారులకు అక్రమంగా బదిలీ చేసిందన్నది నూపుర్‌పై ఉన్న అనేకానేక ఆరోపణల్లో ఒకటి. భూమికి సంబంధించిన విషయాలను సెటిల్ చేసేందుకు రూ.1500 నుంచి రూ.రెండు లక్షల వరకూ వసూలు చేసేదని చెబుతున్నారు. క్రిషిక్ ముక్తి సమితి అనే స్వచ్ఛంద సంస్థ, ఎమ్మెల్యేల అఖిల్ గొగోయ్ వంటివారు నూపుర్ అవినీతి కార్యకలాపాలపై ఇప్పటికే పలు ఫిర్యాదులు చేశారు కూడా. దీంతో సీఎం హిమంత బిశ్వ శర్మ పర్యవేక్షణలో ఉండే.. సీఎం స్పెషల్ విజిలెన్స్ సెల్ ఆర్నెలుగా నిఘా ఉంచింది. ఆఖరికు ఆకస్మిక తనిఖీలతో అరెస్ట్ చేసింది. నగదు, నగలతోపాటు నూపుర్ అవినీతికి ఆనవాళ్లుగా గౌహతిలో మూడు ఫ్లాట్లు, రెండు ప్లాట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రెండు కోట్ల రూపాయల విలువైన నగల్లో పద్నాలుగు బంగారు గొలుసులు, 15 వజ్రపుటుంగరాలు, మూడు వజ్రాల గాజులు ఉన్నట్లు తెలిసింది. కొసమెరుపు ఏమిటంటే.. నూపుర్ ఇరువురు మాజీ భర్తలు కూడా రెవెన్యూ ఆఫీసర్లే కావడం.