breaking news
nuclear warheads
-
అణుశక్తి సంపన్న దేశం ఇజ్రాయెల్
టెల్ అవీవ్: ఇరాన్ అణు కేంద్రాలను సర్వనాశనం చేయడం తథ్యమని ఇజ్రాయెల్ పదేపదే చెబుతోంది. భవిష్యత్తులో తమ మనుగడకు ముప్పు వాటిల్లకుండా ఉండాలంటే అణు బాంబు తయారు చేయకుండా ఇరాన్‌ను అడ్డుకోవడం ఒక్కటే మార్గమని అంటోంది. ఇజ్రాయెల్ విజ్ఞప్తి మేరు ఇరాన్‌లోని మూడు ప్రధాన అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. మరోవైపు తన వద్దనున్న అణ్వస్త్రాల గురించి ఇజ్రాయెల్ నోరువిప్పడం లేదు. పశ్చిమాసియాలో అణుబాంబులు కలిగి ఉన్న ఏకైక దేశం ఇజ్రాయెల్ అన్న సంగతి బహిరంగ రహస్యమే. కానీ, దానిపై యూదు పాలకులు మాట్లాడడం గానీ, ఖండించడం గానీ చేయరు. అంతర్జాతీయ అణు నిరాయుధీకరణ ఒప్పందం(ఎన్పీటీ)లో భాగస్వామి కాని ఐదు దేశాల్లో ఇజ్రాయెల్ కూడా ఉంది. దాంతో అణ్వాయుధాలు వదులుకోవాలంటూ ప్రపంచ దేశాలు ఒత్తిడి చేయలేకపోతున్నాయి. ఇజ్రాయెల్ అణుకేంద్రాలను అంతర్జాతీయ నిపుణులు తనిఖీ చేసే అవకాశం కూడా లేదు. ఇరాన్ అణు కార్యక్రమాలపై కఠినంగా వ్యవహరిస్తున్న పశ్చిమ దేశాలు ఇజ్రాయెల్‌ను మాత్రం స్వేచ్ఛగా వదిలేయడం పట్ల అరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం సొంత భద్రత కోసం, శాంతియుత ప్రయోజనాల కోసమే అణు పరీక్షలు చేస్తున్నామని ఇరాన్ చెబుతున్నా పశ్చిమ దేశాలు ఒప్పుకోవడం లేదు. అణ్వస్త్రాలు కలిగిన ఇజ్రాయెల్‌ను ముద్దు చేస్తున్నాయి. 1,110 కిలోల ప్లుటోనియం నిల్వలు ఇజ్రాయెల్ అణు చరిత్ర ఈనాటిది కాదు. 1950వ దశకంలోనే అణ్వాయుధాలపై దృష్టి పెట్టింది. డిమోనా సిటీలో 1958లో నెగెవ్ న్యూక్లియర్ రీసెర్చ్ సెంటర్‌ను ప్రారంభించింది. చుట్టూ శత్రుదేశాలే ఉండడంతో రక్షణ అణుబాంబులు అవసరమని అప్పటి ప్రధానమంత్రి డేవిడ్ బెన్ గురియన్ నిర్ణయించారు. ప్లుటోనియం ఉత్పత్తి జరుగుతున్న నెగెవ్ సెంటర్ గురించి ప్రపంచానికి తెలియనివ్వలేదు. అదొక వ్రస్తాల ఫ్యాక్టరీ అంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. 1970 నాటికి అణు వార్హెడ్లను ప్రయోగించే స్థాయికి ఇజ్రాయెల్ చేరుకుంది. నెగెవ్ సెంటర్లో జరుగుతున్న అణు కార్యకలాపాల సంగతి 1986లో బయటపడింది. అక్కడే పని చేస్తున్న ఓ టెక్నీషియన్ ఈ విషయం బహిర్గతం చేశారు. దాంతో దేశద్రోహం ఆరోపణల కింద ప్రభుత్వం అతడిని 18 ఏళ్లపాటు జైల్లో నిర్బంధించింది. ఇజ్రాయెల్ క్రమంగా అణుశక్తి సంపన్న దేశంగా మారింది. దాదాపు 200 న్యూక్లియర్ వార్హెడ్లు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే 1,110 కిలోల(2,425 పౌండ్లు) ప్లుటోనియం ఇజ్రాయెల్ వద్ద నిల్వ ఉంది. దీంతో 277 అణు బాంబులు తయారు చేయొచ్చు. న్యూక్లియర్ క్రూయిజ్ క్షిపణులను, అణు వార్హెడ్లలను ప్రయోగించే ఆరు జలాంతర్గాములతోపాటు బాలిస్టిక్ మిస్సైళ్లు ఇజ్రాయెల్ వద్ద ఉన్నట్లు సమాచారం. 6,500 కిలోమీటర్ల పరిధి వరకు అణుబాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించగలదు. ఇజ్రాయెల్ అణ్వ్రస్తాల ముప్పును ఎదుర్కొంటున్న ప్రధాన దేశం ఇరాన్. -
2035 కల్లా చైనా చేతిలో... 1,500 అణు వార్‌హెడ్స్!
వాషింగ్టన్: అణు పాటవంలో అమెరికాకు దీటుగా నిలవడమే లక్ష్యంగా చైనా 2035కల్లా ఏకంగా 1,500 అణు వార్హెడ్లను సమకూర్చుకోనుందని పెంటగాన్ అంచనా వేసింది. ప్రస్తుతం చైనా వద్ద 400కు పైగా అణు వార్‌హెడ్లున్నాయని అభిప్రాయపడింది. అంతేగాక వచ్చే పదేళ్లలో అణ్వస్త్ర బలగాలను ఆధునీకరించి, విస్తృతం చేసుకోవడంపై డ్రాగన్ కంట్రీ దృష్టి పెట్టిందని అమెరికా కాంగ్రెస్‌కు తాజాగా సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది. ‘‘ఇందుకోసం ఫ్లుటోనియం ఉత్పత్తిని విపరీతంగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లను భారీగా నిర్మించుకుంటోంది. భూ, సముద్ర, గగనతల అణ్వస్త్ర ప్రయోగ వేదికలను వీలైనంతగా పెంచుకోవడంపై విపరీతంగా నిధులు వెచ్చిస్తోంది. 2035కల్లా సైనిక పాటవాన్ని పూర్తిగా ఆధునీకరించడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. దేశీయ, విదేశాంగ విధానాల ద్వారా ప్రపంచ వేదికపై తన బలాన్ని మరింతగా పెంచుకోవడమే చైనా లక్ష్యం. ఇండో పసిఫిక్ సముద్ర జలాల్లో చైనా దూకుడు వెనక కారణమిదే’’ అని వివరించింది. పెంటగాన్ నివేదికను చైనా కొట్టిపారేసింది. -
పాక్‌లోనే అధికంగా అణ్వాయుధాలు
లండన్: భారత్ కన్నా పాకిస్థాన్‌లో అధిక సంఖ్యలో అణు వార్‌హెడ్లున్నాయని స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చీ ఇనిస్టిట్యూట్(సిప్రి) వార్షిక నివేదిక తెలిపింది. పాక్‌లో 110 నుంచి 130, భారత్‌లో 100 నుంచి 120 వార్హెడ్లు ఉన్నట్లు అంచనా. అమెరికా, రష్యా అణ్వాయుధాలు తగ్గించుకుంటున్నాయని.. అణు సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాయని సిప్రి వెల్లడించింది. చైనా కూడా అణ్వాయుధాలు పెంచుకుంటోందని తెలిపింది. -
130 అణ్వాయుధాలతో భారత్‌పై గురి!
వాషింగ్టన్: ఏ క్షణంలోనైనా భారత్‌ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు అమెరికా పరోక్షంగా చెప్పింది. భారత్‌ను నిరోధించేందుకు ఆ దేశం అణ్వాయుధ సామాగ్రిని కుప్పలుగా సమకూర్చుకుంటుందని, కొనగోళ్లు, తయారీ ద్వారా వాటి సంఖ్యను పెంచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని అమెరికా ఓ రిపోర్ట్ లో వెల్లడించింది. ముఖ్యంగా ఇస్లామాబాద్ దాడి నిరోధక కేంద్రంగా రూపుదిద్దుకుంటోందని తెలిపింది. ఒక వేళ పాకిస్థాన్ పై భారత్ సైనిక చర్య తీసుకుంటే దానిని అడ్డుకుని, నిరోధించేందుకు 110 నుంచి 130 వరకు అణ్వాయుధాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఉందని, అంతకంటే ఎక్కువ ఆయుధాలు కూడా ఉండొచ్చని వెల్లడించింది. అమెరికాకు చెందిన కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) అనే సంస్థ ఈ వివరాలను తెలియజేసింది. భారత్‌లో కూడా అణ్వాయుధ సామాగ్రి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆయుధాల విషయంలో రెండు దేశాల మధ్య పోటీ ఏర్పడి అదొక కొత్త సమస్యకు దారి తీయొచ్చని కూడా ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. తాము అణ్వాయుధాలుగల దేశంగా ప్రపంచానికి విశ్వాసం కలిగించేందుకు ఇప్పటికే పలుమార్లు పాకిస్థాన్ తన అణ్వాయుధాల పరీక్షలను నిర్వహించిందని కూడా తెలిపింది.