breaking news
nuclear capable missile
-
చైనా ఎందుకు భయపడుతోంది?
భారతతదేశం తన స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్ఎఫ్సీ) బలగాలకు అగ్ని 5 క్షిపణిని అందిస్తోందన్న సమాచారం తెలిసి చైనా ఒకింత కలవరపడింది. ఎందుకంటే.. దానివల్ల మన దేశానికి చైనా కంటే ఒక అడుగు ఎక్కువ సానుకూలత లభిస్తుంది. అత్యంత శక్తిమంతమైన ఈ క్షిపణిని సోమవారం విజయవంతంగా పరీక్షించారు. దీన్ని ప్రయోగిస్తే నేరుగా బీజింగ్, యూరప్‌లో చాలా ప్రాంతాలను తుత్తునియలు చేయొచ్చు. 5వేల కిలోమీటర్లకు పైగా దూరం పయనించడంతో పాటు 1500 కిలోల పేలోడ్‌ను మోసుకెళ్లడం, అణ్వస్త్ర సామర్థ్యం కూడా కలిగి ఉండటంతో.. ఈ క్షిపణిని చూసి చాలా దేశాలు కనుబొమ్మలు ఎగరేశాయి. భూమ్మీద నుంచి భూ ఉపరితలం మీదకు ప్రయోగించగల ఈ క్షిపణిని నాలుగోసారి కూడా విజయవంతంగా పరీక్షించారు. 17 మీటర్ల పొడవుండి, 50 టన్నుల బరువుండే ఈ క్షిపణి నూటికి నూరుశాతం కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించింది. దీని మరికొన్ని లక్షణాలు చూద్దాం.. ఈ మిసైల్‌లో ఎంఐఆర్‌వి సామర్థ్యం ఉంది. అంటే, ఇది ఒకేసారి పలు రకాల వార్హెడ్లను మోసుకెళ్లి, వేర్వేరు లక్ష్యాలను ఛేదించగలదు. మూడు దశలు ఉండటంతో ఇది అగ్ని మిసైళ్లు అన్నింటిలోకీ చాలా అత్యాధునికమైనది. దీనివల్ల భారతదేశ దీర్ఘశ్రేణి దాడి సామర్థ్యం మరింత పెరుగుతుంది. దీని స్ట్రైక్ రేంజి సుమారు 5500 నుంచి 5800 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే, బీజింగ్ సహా చైనాలోని పలు ప్రధాన నగరాలను సులభంగా చేరుకోగలదు. 2012లో తొలిసారి అగ్ని 5ను పరీక్షించినప్పుడు.. దాని సామర్థ్యాన్ని భారత్ తక్కువ చేసి చూపిస్తోందని, వాస్తవానికి అది 8వేల కిలోమీటర్ల సామర్థ్యంతో యూరప్‌లో 70 శాతాన్ని చేరుకోగలదని చైనా అధికారిక మీడియా పేర్కొంది. అయితే భారతీయ నాయకులు నిజంగా ఆ క్షిపణిని ప్రయోగించగలరా అని కూడా కొందరు చైనా నిపుణులు ఆ సమయంలో అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ క్షిపణిని పూర్తిస్థాయిలో భారత సైన్యానికి అందుబాటులోకి తెస్తే, చైనా కంటే మన దేశానికి కొంత సానుకూలత పెరుగుతుంది. ఇప్పటివరకు ఈ విషయంలో మనం కొంత వెనకబడి ఉన్నాం. చైనా తమవద్ద ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైళ్లు ఉన్నాయని, అవి భారతదేశం మొత్తాన్ని చేరుకోగలవని ఇన్నాళ్లూ చెబుతూ వస్తోంది. -
అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించగల అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి పృథ్వి-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిషాలోని ఓ సైనిక స్థావరం నుంచి దీన్ని వరుసగా రెండు నెలల్లో మూడోసారి విజయవంతంగా పరీక్షించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజి 350 కిలోమీటర్లు. దీన్ని బాలాసోర్ జిల్లాలోని చాందీపూర్ టెస్టురేంజి నుంచి ప్రయోగించారు. ప్రయోగం నూటికి నూరుశాతం విజయవంతం అయ్యిందని ప్రధాన లక్ష్యాలన్నింటినీ ఇది చేరిందని టెస్టు రేంజి డైరెక్టర్ ఎంవీకేవీ ప్రసాద్ తెలిపారు. స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ (ఎస్.ఎఫ్.సి.) ఈ పరీక్షను నిర్వహించిందన్నారు. ఇంతకుముందు అక్టోబర్ 7, 8 తేదీలలో కూడా ఈ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. పూర్తిగా భారత్‌లోనే తయారైన వాటిలో ఇది మొట్టమొదటి బాలిస్టిక్ క్షిపణి. ఇది 500 కిలోల బరువున్న అణు వార్హెడ్లను మోసుకెళ్లగలదు. 483 సెకండ్లలోనే 43.5 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్తుంది. ఇది రాడార్ల కంటిని తప్పించుకుని మరీ వెళ్లి, లక్ష్యాలను కొద్ది మీటర్ల కచ్చితత్వంతో ఛేదించగలదు.