breaking news
National Population Register
-
కరోనా ఎఫెక్ట్ : ఎన్పీఆర్ వాయిదా
లక్నో : కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)కు కరోనా వైరస్ కళ్లెం వేసింది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెబర్‌లో తొలి విడత కార్యక్రమానికి ప్రారంభించాలని భావించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రాణాంతక కరోనా వైరస్ కారణంగా ప్రజా జీవనమంతా స్థంభించిపోవడంతో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్పీఆర్ ప్రక్రియను ఏడాది పాటు వాయిదా వేసింది. జాతీయ జనాభా పట్టిక ప్రక్రియను చేపట్టేందకు ప్రస్తుతం రాష్ట్రంలో సరైన సదుపాయాలు లేనందున 2021 వరకు వాయిదా వేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 2021 ఏప్రిల్ వరకు ఎలాంటి ప్రక్రియను ప్రారంభించలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా ఎన్పీఆర్కు సంబంధించిన తొలివిడత సమాచార సేకరణ 2020 ఏప్రిల్‌లో ప్రారంభమై సెప్టెంబర్‌లో ముగుస్తుందని కేంద్ర కేబినెట్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఎన్పీఆర్ 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 2015లో ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అమలు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం ఎన్పీఆర్ను నవీకరించింది. ఎన్పీఆర్ ప్రక్రియ పూర్తయ్యాక 2021లో జనాభా గణన ఉంటుంది. కాగా ఎన్పీఆర్ను పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. -
దుష్ట ఆలోచనలో భాగమే ఎన్నార్సీ
న్యూఢిల్లీ: జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ) అమలు చేయాలనే నిర్ణయం దేశాన్ని విభజించాలనే దుష్ట ఆలోచనలో భాగమేనని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం దుయ్యబట్టారు. హిందూ రాష్ట్ర విభజన ఎజెండాను ముందుకు తీసుకురావాలన్న ఆర్ఎస్ఎస్–బీజేపీ ప్రణాళికలో భాగంగానే ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్ల అమలు నిర్ణయమని ఆరోపించారు. వీటి వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమయ్యేది ఎవరన్నా ఉన్నారంటే వారు భారత ముస్లింలు మాత్రమేనని అన్నారు. వేరే మతాలను ఎన్నార్సీ కింద మినహాయించి సీఏఏలో చేర్చారని, అయితే ఎన్నార్సీ కింద అక్రమ వలసదారులుగా గుర్తించే ముస్లింలను మాత్రం సీఏఏ నుంచి మినహాయించారని విమర్శించారు. దీంతో భారతీయ ముస్లింలలో భయం, ఆందోళన నెలకొని ఉన్నాయని అన్నారు. ఎన్పీఆర్–2010కి ఎన్పీఆర్–2020కి అసలు పొంతనే లేదని, దీనిని వ్యతిరేకించాలని వ్యాఖ్యానించారు. -
ఎన్పీఆర్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
-
జనాభా లెక్క తేలుస్తారు..
జనాభా లెక్కల సేకరణ కోసం అధికారులు సమాయత్తమవుతున్నారు. వచ్చే సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబరు మధ్యకాలంలో 45 రోజుల్లో నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ తయారీ నిర్వహిస్తారు. 2021 ఫిబ్రవరి 1 నుంచి 28వ తేదీ వరకు పాపులేషన్ ఎన్యుమరేషన్ నిర్వహించి మార్చిలో వివరాలు ప్రకటిస్తారు. సెన్సెస్ కోసం తొలిసారిగా మూడు యాప్‌లు వినియోగించనున్నారు. కచ్చితమైన జనాభా సంఖ్యను తేల్చేందుకు ఆధార్‌తో అనుసంధానించనున్నారు. ఇప్పటికే మాస్టర్ ట్రైనర్లకు డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ ఆపరేషన్స్ అధికారులు శిక్షణ ఇచ్చారు. సాక్షి, కడప: ప్రతి పదేళ్లకు ఓసారి జనాభా లెక్కలు తయారు చేస్తారు. 2021 జనాభా లెక్కల సేకరణకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇప్పటివరకు వివరాల సేకరణ, నమోదు మాన్యువల్‌గానే సాగింది. ఈసారి కొత్తగా మూడు యాప్‌లు వినియోగిస్తున్నారు. కేవలం యాప్‌లనే నమ్ముకుంటే సాంకేతిక అవరోధాలు ఉత్పన్నమైతే మొదటికే మోసం వచ్చే వస్తుంది. అందుకే యాప్‌లతోపాటు మాన్యువల్‌గా కూడా వివరాలు సేకరించి నమోదు చేయనున్నారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం, గుంటూరుజిల్లా నరసరావుపేటలో ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 30 వరకు ప్రయోగాత్మకంగా పాపులేషన్ సెన్సెస్ నిర్వహించారు. సత్ఫలితాలు రావడంతో రాష్ట్రమంతటా నిర్వహించాలని నిర్ణయించారు. అధికారులు వీరే: జన గణన–2021 కార్యక్రమానికి కలెక్టర్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు. ఆయా మున్సిపాలిటీలకు కమిషనర్లు ప్రిన్సిపల్ సెన్సెస్ అధికారులుగా ఉంటారు. ఆర్డీఓలు సబ్ డివిజన్ సెన్సెస్ అధికారులుగా, తహసీల్దార్లు మండల చార్జ్ ఆఫీసర్లుగా, ఎంపీడీఓలు అడిషనల్ చార్జ్ ఆఫీసర్లుగా ఉంటారు. నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ 2020 ఏప్రిల్ నుంచి నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ తయారు చేస్తారు. జనాభా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, వలస తదితర వివరాలు నమోదు చేస్తారు. రెండు తరాల కుటుంబ సభ్యుల వివరాలను ప్రజలు అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. స్వస్థలం ఏదీ? ఎప్పటి నుంచి ఇక్కడ నివాసముంటున్నారు? ఏమి చేస్తున్నారు? తదితర వివరాలు సెన్సెస్ అధికారులకు తెలపాలి. అసోం, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో నేషనల్ రిజిష్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ) తయారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెన్సెస్‌లో భాగంగా తయారు చేయనున్న నేషనల్ పాపులేషన్ రిజిష్టర్ ఇందుకు దోహదపడుతుంది. ఎన్పీఆర్ ఆధారంగానే ఎన్ఆర్సీ రూపొందిస్తారు. దీంతోపాటు హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ కూడా నిర్వహిస్తారు. జిల్లా జనాభా వివరాలు 2011 సెన్సెస్ ప్రకారం జిల్లాలో 28.82 లక్షల జనాభా ఉంది. పురుషులు 14.52 లక్షలు, మహిళలు 14.03 లక్షలు. గ్రామీణ ప్రాంతాల్లో 19.03 లక్షల మంది జనాభా ఉండగా, పట్టణ ప్రాంతాల్లో 9.79 లక్షల మంది ఉన్నారు. సెక్స్ రేషియో పరిశీలిస్తే ప్రతి వెయ్యి మంది పురుషులకు 985 మంది మహిళలు ఉన్నారు. 2001 జనాభా లెక్కల కంటే 10.76 శాతం 2011లో పెరిగారు. త్వరలో శిక్షణ 2021 సెన్సెస్‌లో భాగంగా జిల్లాలో నలుగురు మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇప్పించాము. వీరు జనవరి, ఫిబ్రవరి నెలల్లో జిల్లాలోని 130 మంది ఫీల్డ్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొందిన ఫీల్డ్ ట్రైనర్లు అన్ని మండలాలు, మున్సిపాలిటీల్లోని ఏడు వేల మంది ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు శిక్షణ ఇవ్వనున్నారు. జనాభా లెక్కల సేకరణ కోసం ఇంటింటికి వచ్చే అధికారులకు ఆధార్, పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపుకార్డులు వంటి వివరాలను ప్రజలు సమర్పించి సహకరించాలి. ఇంకా ప్రభుత్వం నుంచి నియమ నిబంధనలు రావాల్సి ఉంది. – వి.తిప్పేస్వామి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్, కడప -
దేశమంతటా పౌర రిజిస్టర్
న్యూఢిల్లీ: 2020 కల్లా జాతీయ ప్రజా రిజిస్టర్(ఎన్పీఆర్)ను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని ఆధారంగానే దేశవ్యాప్త పౌరసత్వ రిజిస్టర్‌ను తయారు చేయనుంది. ఎన్పీఆర్ పూర్తయి, అధికారికంగా ముద్రించాక ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్ఐసీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుంది. అంటే, ఇది అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్నార్సీ)కి అఖిల భారత రూపమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ఈ కార్యక్రమం అస్సాం మినహా దేశవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆ ప్రాంతంలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్న లేదా మరో ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకున్న వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. -
ప్రతి పౌరుడికీ స్మార్ట్ కార్డు
జాతీయ జనాభా పట్టిక ఆధారంగా జారీకి కేంద్రం కసరత్తు సాక్షి, హైదరాబాద్: దేశంలో ప్రతి పౌరుడికీ స్మార్ట్ కార్డు జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. జాతీయ జనాభా పట్టికలోని వివరాల ఆధారంగా ఈ కార్డుల జారీకి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్‌కల్లా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఈ కార్డు బహుళ ప్రయోజనాలున్న గుర్తింపు కార్డుగా ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఈ సర్వే పూర్తయింది. హైదరాబాద్‌లోనూ ఈ సర్వేను మే నెలాఖరులోగా పూర్తి చేయాలని తాజాగా సెన్సస్ రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రణాళిక విభాగాన్ని ఆదేశించింది. జాతీయ జనాభా పట్టిక రూపకల్పనపై గురువారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో ఢిల్లీలో ఒక సదస్సు జరిగింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య ఈ భేటీకి హాజరయ్యారు. సర్వే పూర్తయిన వెంటనే జాతీయ జనాభా పట్టికను రాష్ట్రాల వారీగా ప్రచురించి.. అభ్యంతరాలు, ఫిర్యాదులకు కొంత గడువు ఇస్తారు. వాటిని పరిష్కరించి తుది జాతీయ జనాభా పట్టిక తయారుచేస్తారు. దీని ఆధారంగా నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్ఆర్ఐసీ-భారత పౌరుల పట్టిక)ను రూపొందిస్తారు. ఈ రిజిస్టర్‌లోని వివరాల ఆధారంగా స్మార్ట్‌కార్డులు జారీ చేస్తారు. -
ప్రజలందరికీ జాతీయ గుర్తింపు కార్డులు
హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: అసలైన భారత పౌరులందరి వివరాలతో ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)ను రూపొందిస్తోందని, అందరికీ నిర్దిష్ట గడువులోగా జాతీయ గుర్తింపు కార్డులు(ఎన్ఐసి) అందజేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోకి చొరబాట్లు సాగుతున్నాయన్న వార్తలపై మంగళవారం లోక్‌సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. ‘అసలైన భారతీయులను గుర్తించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సమగ్ర ఎన్పీఆర్ డేటాబేస్ తయారీకి ఎన్పీఆర్, ‘ఆధార్’ కార్డులిచ్చే ప్రత్యేక గుర్తింపు సాధికార సంస్థ(ఉడాయ్) పర స్పర సహకారంతో ఎలా పనిచేయాలో చర్చించడానికి ప్రధాని మోడీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్పీఆర్ ను త్వరలోనే తయారు చేస్తామ’న్నారు. చొరబాట్లను ఆపడానికి అంతర్జాతీయ సరిహద్దులో కంచె నిర్మాణం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, 2003లో సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం.. పౌరులందరి వివరాలను నమోదు చేసి, ఎన్‌ఐసిలను ఇవ్వాల్సి ఉందని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక జవాబిచ్చారు. ఆధార్‌కు, ఎన్ఐసీకి తేడా ఏంటి? ఆధార్ కార్డు ప్రత్యేక గుర్తింపు సంఖ్య మాత్రమే. గుర్తింపు కార్డు కాదు. దీనికి చట్టబద్ధత లేదు. ఈ కార్డుదారులందరి బయోమెట్రిక్(వేలిముద్రలు,కనుపాపలచిత్రాలు) వివరాలు, వంటి సమాచారం ‘ఉడాయ్’ వద్ద ఉంటుంది. జాతీ య గుర్తింపు కార్డు(ఎన్ఐసీ) దేశ పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డు. ఇందులో కార్డుదారు పేరు, ప్రత్యేక జాతీయగుర్తింపు సంఖ్య, బయోమెట్రిక్ సమాచారంతోపాటు పేరు, ఊరు తదితర 16 వివరాలు ఉంటాయి. సంక్షేమ పథాకాల అమలు, సబ్సిడీల మంజూరుకు ఇకపై ఎన్‌ఐసీనే ప్రాతిపదికగా తీసుకునే అవకాశముంది. ఎన్‌ఐసీల రాకతో ఆధార్‌కు కాలం చెల్లినట్లే. జాతీయ భద్రతకు ఎన్ఐసీ ప్రాజెక్టు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు రూ. 50 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధార్ ప్రాజెక్టు కింద గత ఏడాది చివరి నాటికి 50 కోట్ల మంది పేర్లు నమోదు చేయడం తెలిసిందే.


