breaking news
National Monitoring Committee
-
పోలవరంపై విచారణ చేపట్టిన ఎన్హెచ్ఆర్సీ
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు పునరావాస కేసులను పున:సమీక్షించాలని జాతీయ పర్యవేక్షణ కమిటీని (నేషనల్ మానిటరింగ్ కమిటీ) సోమవారం జాతీయ మానవ హక్కుల సంఘం ఆదేశించింది. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణంలో పారదర్శకత లోపించిందని, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని అభిప్రాయపడింది. పునరావాస నష్టపరిహారం ఇవ్వకుండానే.. ప్రజలను ఉన్నపళంగా గ్రామాల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ 2013లో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు (ఎన్హెచ్ఆర్సీ) పెంటపాటి పుల్లారావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన ఎన్హెచ్ఆర్సీ పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోతున్న ప్రజలకు పునరావాసం, నష్ట పరిహారంపై దృష్టి సారించాలని నేషనల్ మానిటరింగ్ కమిటీని ఆదేశించింది. అదేవిధంగా గతంలో పునరావాసంపై మూసివేసిన కేసులను పునఃసమీక్షించాలని సూచించింది. కాగా ఇటీవల ఢిల్లీ హైకోర్టు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. -
జాతీయ పర్యవేక్షణ కమిటీ సమీక్షకు ‘పరిహారం’
పోలవరం ముంపు బాధితులకు ఊరట 2013 చట్టం ప్రకారం ఇవ్వాలన్న అభ్యర్థన పై పరిశీలన గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి జలవనరుల శాఖకు లేఖ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అమలు వివరాలు తెలపాలని సూచన సాక్షి, న్యూఢిలీ: పోలవరం ముంపు బాధితుల పరిహారం వ్యవహారం ‘జాతీయ పర్యవేక్షణ కమిటీ’(నేషనల్ మానిటరింగ్ కమిటీ) సమీక్షకు వెళ్లనుంది. దీంతో ఈ జాతీయ ప్రాజెక్టు వల్ల ముంపు బారిన పడ్డ కుటుంబాల వారికి కొంత ఊరట లభించినట్లైంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధిశాఖ జలవనరుల శాఖకు ఓ లేఖ రాసింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా ఇటీవల ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లో విలీనమైన ఏడు మండలాలతో పాటు పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం మండలం, తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం మండల పరిధిలోని లక్షలాది మంది ప్రజలు తమ భూములు, ఇళ్లు కోల్పోతున్న సంగతి విదితమే. దీనికి సంబంధించి భూసేకరణను 1894 నాటి చట్టం ఆధారంగా చేపట్టారు. అయితే ప్రాజెక్టు ఇంకా నిర్మాణ దశలోనే ఉండడంతో నిర్వాసితుల్లో అధికులు తమ నివాస ప్రాంతాల్లోనే కొనసాగుతున్నారు. వారు భూసేకరణ సవరణ చట్టం 2013 ప్రకారం భౌతికంగా ఆయా ప్రాంతాలను వీడనందున, పరిహారం పొందనందునా కొత్త చట్టపరిధి మేరకు పరిహారానికి అర్హులు. ఆ మేరకు ఇటీవల ఓ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉటంకిస్తూ సామాజిక మానవ హక్కుల ఫోరం అధ్యక్షుడు డాక్టర్ పెంటపాటి పుల్లారావు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని భూవనరుల విభాగానికి అప్పీలు చేశారు. దీనికి స్పందించిన ఈ విభాగం సంయుక్త కార్యదర్శి ప్రభాత్ కుమార్ సారంగి జలవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి బి.రాజేందర్‌కు తాజాగా లేఖ రాస్తూ కొత్త చట్టంలోని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలును సమీక్షించేందుకు ఏర్పాటైన జాతీయ పర్యవేక్షణ కమిటీ ముందుకు ఈ అంశం వెళ్లిందనీ, దీనికి సంబంధించిన ప్యాకేజీ అమలును పరిశీలించి, ప్రస్తుత స్థితిని తెలపాలని కోరుతున్నామని తన లేఖలో పేర్కొన్నారు. ఇది ముంపు బాధితులకు ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. చంద్రబాబు మాట మరిచారుః పెంటపాటి పుల్లారావు ఈ అంశంపై ‘సాక్షి’ ప్రతినిధి పెంటపాటి పుల్లారావును సంప్రదించగా.. చంద్రబాబు చాలాసార్లు పోలవరం వద్దకు వచ్చి తాను సీఎం అయితే ఎకరాకు రూ. 10 లక్షలు పరిహారం ఇస్తామని చెప్పి ఆ మాట మరిచారన్నారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వానిదనీ అన్నీ కేంద్ర నిబంధనల ప్రకారం జరగాలన్నారు. పోలవరం, రామాయంపేట, చేగుంటపల్లి, తోడగుండి, పైడిపాక, ఈస్ట్‌లో దేవీపట్నం, పూడిపల్లి, అంగులూరు, చిన్నరామాయంపేట తదితర గ్రామాల ప్రజల ఆందోళన మేరకు ఇక్కడ ఎకరాకు రూ. 75 వేల నుంచి రూ. 2 లక్షలకు పెంచారనీ, పక్కనే మార్కెట్ ధర ప్రకారం రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షలకు లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వెళ్లినందున కేంద్ర చట్ట ప్రకారమే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అమలుచేయాలని పుల్లారావు డిమాండ్ చేశారు.