breaking news
narayanareddy murder
-
పాత్రధారి కేఈ.. సూత్రధారి చంద్రబాబు
- టీడీపీకి మనుగడ ఉండదనే నారాయణరెడ్డిని హత్య చేశారు - బాబు జైల్లోపడితేగానీ వ్యవస్థ మారదు: ప్రతిపక్షనేత వైఎస్ జగన్ - వైఎస్సార్సీపీ నాయకులపై అధికార టీడీపీ రాక్షసకాండపై గవర్నర్‌కు ఫిర్యాదు హైదరాబాద్: విపక్ష నాయకులను ప్రలోభాలకు గురిచేస్తూ, మాట వినకుంటే ప్రాణాలు తోడేస్తూ అధికార తెలుగుదేశం రాక్షస పరిపాలన సాగిస్తున్నదని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి చెరకులపాడు నారాయణరెడ్డి హత్యలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిసిన వైఎస్ జగన్.. ఏపీలో జరుగుతోన్న రాక్షసకాండపై ఫిర్యాదుచేశారు. గవర్నర్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు జైలుకు పోతే తప్ప వ్యవస్థ బాగుపడే పరిస్థితి లేదని అన్నారు. ‘నారాయణరెడ్డి హత్యతో ఏపీలో మరోసారి ప్రజాస్వామ్యం హత్యకుగురైంది. పక్కపార్టీ నాయకులను కొనుగోలుచేయడం, ప్రలోభాలకు లొంగకపోతే ప్రాణాలు తీయడం తెలుగుదేశం పార్టీ విధానంగా మారింది. మరోవైపు వివిధ కేసుల్లో దోషులు, నిందితులుగా ఉన్న సొంత పార్టీ వారిని కేసుల నంచి తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 132 జీవోలు జారీచేసింది. నారాయణరెడ్డి బతికుంటే టీడీపీకి మనుగడ ఉండదనే హత్యచేశారు. ఉద్దేశపూర్వకంగా గన్ లైసెన్స్ రెన్యూవల్ చేయలేదు. కర్నూలు జిల్లాలో కేఈ కృష్ణమూర్తి కొడుకు నేతృత్వంలో సాగుతోన్న ఇసుక మాఫియాపై దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించేదాకా నారాయణరెడ్డి పోరాడారు. అందుకే ఆయను అడ్డుతప్పించారు. ఈ హత్యను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చేయిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణంగా సహకరించారు’ అని వైఎస్ జగన్ వివరించారు. పోలీసులు ఆలస్యంగా వచ్చింది అందుకే.. కేఈ కుటుంబం ఇసుక దందాపై పోరాటం నేపథ్యంలో తన ప్రాణాలకు హానీ ఉందని, రక్షణ కల్పించాలని నారాయణరెడ్డి పలుమార్లు పోలీసులను అభ్యర్థించారని వైఎస్ జగన్ గుర్తుచేశారు. సెక్యూరిటీ కల్పించకపోగా, లెసెన్స్ రెన్యూవల్ పేరుతో ఉన్న ఆయుధాన్ని కూడా తీసేసుకుకోవడంలో అర్థమేమిటని ప్రశ్నించారు. నారాయణరెడ్డి ఓ నియోజకవర్గానికి పార్టీ ఇన్చార్జిగా, ఆయన భార్య కర్నూలు డీసీసీబీ చైర్‌పర్సన్‌గా జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నా రక్షణ కల్పించకపోవడం దారుణమని జగన్ అన్నారు. నారాయణరెడ్డి హత్య తరువాత హంతకులను పట్టుకునే విషయంలో కూడా పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరించారని, ఉదయం 9:30కు హత్య జరిగితే, మధ్యాహ్నం 2:30 దాకా పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లకపోవడం, తద్వారా సాక్ష్యాధారాలు చెదిరిపోవాలన్న దురుద్దేశంతోనే పోలీసులు అలా వ్యవహరించారని వైఎస్ జగన్ అన్నారు. గడిచిన మూడున్నరేళ్ల కాలంలో టీడీపీ దారుణాలకు బలైపోయిన వైఎస్సార్సీపీ నేతల జాబితాను గవర్నర్‌కు అందించామని వైఎస్ జగన్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, పలువురు నేతలు కూడా వైఎస్ జగన్ వెంట ఉన్నారు. గవర్నర్ నరసింహన్‌కు వైఎస్ జగన్ సమర్పించిన లేఖ ఇదే... -
పాత్రధారి కేఈ..సూత్రధారి చంద్రబాబు
-
ప్రాణహాని ఉందని చెప్పినా పట్టించుకోలేదు
-
ఫ్యాక్షన్ రాజకీయాలకు ఆజ్యం పోస్తున్న సీఎం
అనంతపురం : రాష్ట్రంలో కొన్నేళ్లుగా సమసిపోయిన ఫ్యాక్షన్ రాజకీయాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తిరిగి ఆజ్యం పోస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ðవైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డి హత్య వెనుక ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. పత్తికొండలో తిరుగులేని నాయకుడిగా ఎదుగుతున్న నారాయణరెడ్డిని రానున్న ఎన్నికల్లో ఎదుర్కోలేక మట్టు పెట్టారన్నారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి కేఈ కృష్ణమూర్తి ఇందుకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లాలో ఇటీవల జరిగిన జంటహత్యల వెనుక గొట్టిపాటి రవికుమార్ ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ఇలాంటి నీచ రాజకీయాలకు తెర తీస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు. -
నారాయణరెడ్డి హత్య దారుణం
రాయదుర్గం : కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయడం దారుణమని రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన రాయదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ పాలనలో ఆకృత్యాలు, హత్యలు, దౌర్జన్యాలు పెచ్చరిల్లాయని ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణరెడ్డిని హత్య చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యర్థుల నుంచి ముప్పు ఉందని, లైసెన్స్డ్ ఆయుధం కొనసాగించాలని నారాయణరెడ్డి అనుమతి కోరినా ఇవ్వకపోవడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో హత్యలకు తెగబడడం సిగ్గుచేటన్నారు. హత్యకు గురైన నారాయణరెడ్డి, ఆయన అనుచరులు సాంబశివారెడ్డి కుటుంబ సభ్యులకు కాపు ప్రగాఢసానుభూతిని ప్రకటించారు. -
నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యే
అనంతపురం : కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిది ప్రభుత్వ హత్యేనని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఆరోపించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఎదుగుతుండడంతో వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతో ఓర్వలేక ప్రభుత్వమే ఈ ఘాతుకానికి ప్రోత్సహించిందంటూ ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హత్యారాజకీయాలకు అండగా నిలుస్తున్నారని ప్రజలు సరైన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నారాయణరెడ్డి హత్యకేసు దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని, అసలు దోషులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.