breaking news
mythological elements
-
కావేరీ తల్లి కన్నీళ్లపై సినిమా
-
కావేరీ తల్లి కన్నీళ్లపై సినిమా
సాక్షి, న్యూఢిల్లీ : హిందువుల పురాణం ప్రకారం అగస్త్య ముని తన కమండలంలోని నీళ్లను మంత్రించి నేలపై చల్లగా అది ఏరులై, పాయలై తమిళ్, కన్నడ ప్రాంతాల నుంచి ప్రవహించే కావేరీ నదిగా మారుతుంది. ఫల, ఫుష్పాలకు, సకల జీవజాలాన్ని పోషించే తల్లిగా చరిత్రకెక్కుతుంది. అలాంటి తల్లి కోసం నేడు తమిళనాడు, కర్ణాటక ప్రజలు కొట్టుకుంటున్నారు. బక్కచిక్కి శల్యమై తుది శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న కావేరీ తల్లిని రక్షించుకోవాల్సిన బిడ్డలు నేడు తల్లి రక్తం ఆఖరి బొట్లను పంచుకునేందుకు కొట్లాడుతున్నారని ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ వినోద్ ఈశ్వర్ వాపోతున్నారు. ఒకప్పుడు పచ్చటి అభయారణ్యం గుండా ప్రవహించిన కావేరీ ఇప్పుడు ఎడారిగా మారిన ప్రాంతంలోని బీటలు వారిన భూమినికూడా తడపలేక ఎండిపోయిన పంట కాలువలా ప్రవహిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత గురించి తెలియజేస్తూ వినోద్ ఈశ్వర్ ఓ లఘు చిత్రాన్ని దీశారు. దాన్ని గతేడాది ఆగస్టు నెలలోనే పూర్తి చేసినప్పటికీ ఇంతకాలం విడుదల చేయలేదు. కర్ణాటక, తమిళనాడు మధ్య నలుగుతున్న కావేరీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో ఈ సినిమాను విడుదల చేయాల్సిన అవసరం వచ్చిందని భావించిన దర్శకుడు వినోద్ తమళ్, కొడవ, కన్నడ భాషల్లో రెండు రోజుల క్రితం సినిమాను విడుదల చేశారు. ఇప్పుడు ఈ చిత్రం ‘యూట్యూబ్’లో ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోంది. -
పరిశోధన చేసినందుకు..గర్వంగా ఉంది
తెలంగాణ మలిదశ ఉద్యమంలో స్ఫూర్తిగా నిలిచి ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిన ఘనత ‘బతుకమ్మ’కే దక్కుతుంది. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలతో మమేకమైన పండుగ బతుకమ్మ. తెలంగాణ ప్రజల జీవనంలో కలిసిపోయిన ఈ పండుగపై 24ఏళ్ల క్రితమే పరిశోధన చేశారు చేర్యాల మండలం ఆకునూరుకు చెందిన ఉపాధ్యాయుడు తాటికొండ విష్ణుమూర్తి. బతుకమ్మ పండుగపై పరిశోధన చేపట్టిన మొదటి వ్యక్తిగా పేరుగాంచిన ఆయన తన పరిశోధన నేపథ్యాన్ని వివరించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. హన్మకొండ కల్చరల్ : బతుకమ్మతో నా అనుబంధం చిన్నప్పుటి నుంచి ఉంది. బతుకమ్మ పండుగను ఆసక్తిగా గమనించేవాడిని. మా ఇంట్లో బతుకమ్మను నేనే పేర్చేవాడిని. మా అమ్మ బతుకమ్మ పాటలు బాగా పాడుతుంది. ఆ పాటల్లోని సాంఘిక, పౌరాణిక అంశాలు నన్ను ఆకర్షించాయి. అప్పుడే ఈ పండుగకు సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనిపించింది. నేను ఆకునూరులోనే చదువుకున్నా. సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశా. 1985లో డిగ్రీ పూర్తయిన తర్వాత తెలుగుశాఖలో ఎంఏలో చేరి 1987లో పూర్తిచేశాను. అనంతరం ఎల్ఎల్బీ చేశాను. బతుకమ్మపై పరిశోధన 1990లో కాకతీయ యూనివర్సిటీ తెలుగుశాఖలోనే ఎంఫిల్ విద్యార్థిగా చేరాను. ఎంఫిల్ డిసర్టేషన్ పూర్తిచేయాల్సిన సమయంలో అధ్యాపకులను కలిసినప్పుడు ఆచార్య పేర్వారం జగన్నాథం సార్.. నీకు ఏ సాహిత్యమంటే ఇష్టమని నన్ను అడిగారు. నేను జానపద సాహిత్యం అని చెప్పాను. ఆయనకు కూడా అదే ఇష్టం. దీంతో వెంటనే ఆయన బతుకమ్మ పండుగపై పరిశోధన చేయమని సలహా ఇచ్చారు. అలా.. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం.., సార్ చెప్పిన టాపిక్.. ఒకటే అయింది. ఆ సమయంలో అక్కడే ప్రొఫెసర్ జ్యోతి, ఫ్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, ఆచార్య రుక్మిణి ఉన్నారు. జానపద సాహిత్యమంటే క్షేత్ర పర్యటన విస్తృతంగా చేయాల్సి ఉంటుందని జ్యోతి మేడం చెప్పారు. మగాడివి.. మహిళల దగ్గరికి వెళ్లి పాటలు ఎలా సేకరిస్తావయ్యా.. అని కాత్యాయనీ మేడం అన్నారు. కానీ నేను చేయగలనని చెప్పా. అలా బతుకమ్మ టాపిక్ ఓకే అయింది. తీపిగుర్తుగా మిగిలిపోయింది బతుకమ్మపై పరిశోధన మరిచిపోలేని అనుభవాలను మిగిల్చింది. మొదటిసారి పాటలు సేకరించడానికి పోయినప్పుడు పాడేవారు కాదు. వారి అన్నదమ్ములను, తండ్రులను దోస్తీ చేసుకుని వారి ద్వారా పాడమని చెప్పించేది. బచ్చన్నపేటలో నేను టీచర్‌గా పనిచేస్తున్న జయ్యారం గ్రామంలోనే మొదట పాటలు సేకరించాను. మా సొంతూరులో మా అమ్మ జయలక్ష్మి ఎన్నో పాటలు పాడారు. మెట్‌పల్లిలోని గుడిదగ్గర ఎంగిలిపూవు బతుకమ్మ ఆడుతున్న మహిళల పాటలు రికార్డు చేయాలని టేప్‌రికార్డర్‌తో వెళ్లాను. వాళ్లు పాడలేదు. బతుకమ్మ ఆడడం పూర్తయి వారు వెళ్లిపోతున్న సమయంలో అంతకుముందు నేను రికార్డు చేసిన పాటలను వినిపించాను. దీంతో వారుకూడా ముందుకొచ్చి పోటీపడి మరీ పాటలు పాడారు. అక్కడి నుంచి సైకిల్‌పై బొమ్మలమేడిపల్లికి వెళ్లాను. ప్రముఖ సినీరచయిత, గాయకుడు సుద్దాల అశోక్‌తేజ అక్కడే టీచర్‌గా పనిచేసేవారు. ఆ రాత్రి వాళ్లింట్లోనే ఉన్నాను. మరుసటిరోజు ఆయన నన్ను బీడీల కంపెనీకి, హరిజన కాలనీకి తీసుకెళ్లారు. రాత్రి 12గంటల వరకు అక్కడి మహిళలతో పాటలు పాడించారు. అలాగే కోరుట్లలో శ్రీవేంకటేశ్వర భజనమండలి నిర్వహిస్తున్న వెంకట్రాజం సార్ మహిళలను పిలిపించి పాటలు పాడించారు. అలా మెదక్, వరంగల్ , కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లోని 50గ్రామాల్లో తిరిగి 400 పాటలు సేకరించా. వీటిలో 380 పాటలను పరిశోధనకు ఎంచుకున్నాను. పాటల సేకరణ సమయంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. మన సంస్కృతీసంప్రదాయాలు కనుమరుగవుతున్న తీరు కన్పించింది. జయ్యారంలో ఓ అమ్మాయి రెండుగంటలపాటు పాడింది. దీంతో విసుగొచ్చి రికార్డింగ్ ఆపుచేశాను. మా గైడ్ ప్రొఫెసర్ పి.జ్యోతి వద్ద చర్చిస్తున్నప్పుడు ఆమె అదే పాట కావాలని అనడంతో మళ్లీ వెళ్లాను. అప్పటికే ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లిపోయింది. దీంతో వాళ్ల నాన్నను కలిసి విషయం చెప్పి ఆమెను పిలిపించి మళ్లీ పాట రికార్డు చేశాను. మొదటి పుస్తకంగా .. 1991లో ఎంఫిల్ అవార్డు అయింది. బతుకమ్మపై మొదటిసారి పరిశోధన చేసినందుకు గర్వంగా ఉంది. చేర్యాల మిత్రులు బతుకమ్మ పాటల పుస్తకాన్ని ప్రచురించాలని ప్రోత్సహించారు. అప్పుడు ఆచార్య పేర్వారం జగన్నాథం తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌చాన్స్‌లర్‌గా ఉన్నారు. ఆయనే విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక సహకారం అందజేశారు. 1993లో పుస్తకావిష్కరణసభ చేర్యాల మండల పరిషత్ ఆఫీసులో జరిగింది. ముఖ్య అతిథిగా జగన్నాథం సార్, స్థానిక ఎమ్మెల్యే నాగపురి రాజలింగం(ప్రస్తుతం ఎమ్మెల్సీ), ఎంపీ డాక్టర్ పరమేశ్వర్, తెలుగు లెక్చరర్ బాసిరి సాంబశివరావు, ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య, కవి,విమర్శకుడు వేముగంటి నరసింహాచార్యులు, కవితిరునగరి, విద్యావేత్త కృష్ణాజీరావు, లెక్చరర్ అబ్బు రామయ్య(నెహ్రూ యూత్ కోఆర్డినేటర్, నిజామాబాద్) పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ ఇంత వైభవంగా ఉంటుందని ఈ పుస్తకం ద్వారానే తెలిసిందని చాలామంది మెచ్చుకున్నారు. ఆ తర్వాత 1995లో జానపద గిరిజన విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో జానపద విజ్ఞానంపై జాతీయస్థాయి సమావేశం జరిగినప్పుడు ప్రొఫెసర్ బిరుదరాజు రామరాజు బతుకమ్మ పుస్తకాన్ని చూసి ‘నాకోరిక ఇన్నాళ్లకు సఫలమయింది’ అనడం మర్చిపోలేను. ప్రస్తుతం సాక్షిపత్రికలో బతుకమ్మ పండుగపై వస్తున్న కథనాలు బాగుంటున్నాయి.