హిందువుల పురాణం ప్రకారం అగస్త్య ముని తన కమండలంలోని నీళ్లను మంత్రించి నేలపై చల్లగా అది ఏరులై, పాయలై తమిళ్, కన్నడ ప్రాంతాల నుంచి ప్రవహించే కావేరీ నదిగా మారుతుంది. ఫల, ఫుష్పాలకు, సకల జీవజాలాన్ని పోషించే తల్లిగా చరిత్రకెక్కుతుంది. అలాంటి తల్లి కోసం నేడు తమిళనాడు, కర్ణాటక ప్రజలు కొట్టుకుంటున్నారు. బక్కచిక్కి శల్యమై తుది శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న కావేరీ తల్లిని రక్షించుకోవాల్సిన బిడ్డలు నేడు తల్లి రక్తం ఆఖరి బొట్లను పంచుకునేందుకు కొట్లాడుతున్నారని ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ వినోద్ ఈశ్వర్ వాపోతున్నారు.