కార్డుపై ఆఫరు... ఇలాగైతే మిస్సవరు
ఆ బ్యాంకు.. ఈ బ్యాంకు.. అని తేడా లేకుండా ఎప్పుడు దేంతో ఏ అవసరం పడుతుందోనని పర్సు నిండుగా క్రెడిట్ కార్డులు నింపుకుంటాం. మన ఇన్‌బాక్సు.. ఆయా కార్డు కంపెనీల ఆఫర్ల ఈ మెయిల్స్‌తో నిండిపోతుంటుంది. పేపర్లలో, హోర్డింగులపైనా రకరకాల డిస్కౌంట్లు రంగు రంగుల్లో ఆకర్షిస్తుంటాయి. కానీ.. వీటన్నింటినీ మనం నిజంగానే పూర్తిగా సద్వినియోగం చేసుకోగలుగుతున్నామా అని ప్రశ్నించుకుంటే లేదనే సమాధానమే వస్తుంది. మనం ఏదైనా కొనేసుకున్న తర్వాత దానిపై ఆఫర్ ఉందని తెలిసి చింతించే సందర్భాలు చాలానే ఉంటాయి. మరి ఇలాంటివి జరగడానికి కారణాలేంటి.. దీనికి పరిష్కారం తెలిపేదే ఈ కథనం.
ఆఫర్లు మిస్సయ్యేదిలా..
ప్యాకేజ్: క్రెడిట్ కార్డు వచ్చినప్పుడు దాంతో పాటే ఇన్ఫర్మేషన్ బుక్లెట్ మొదలైన వాటితో ప్యాకేజ్ కూడా ఉంటుంది. ఇందులో ఒకోసారి గిఫ్ట్ వోచర్లో లేదా ఆఫర్ కూపన్లలాంటివో ఉండొచ్చు. కానీ మనం వాటిని పెద్దగా పట్టించుకోం. కార్డు ఒక్కటీ పర్సులో పెట్టుకుని, మిగతా ప్యాకేజ్ని ఎక్కడో ఒక దగ్గర పడేస్తాం. ఆ తర్వాత ఎప్పుడైనా ఏ పెన్ను కోసమో, ఫైలు కోసమో వెతుక్కుంటున్నప్పుడు గడువు తీరిపోయిన సదరు వోచర్లు, కూపన్లు బైటపడతాయి. మంచి ఆఫర్ మిస్ చేసుకున్నారని వెక్కిరిస్తాయ్.
ఈమెయిల్, వెబ్సైట్: ప్రతి కార్డు కంపెనీ తామందించే ప్రత్యేక ఆఫర్ల గురించి కస్టమర్లకు ఈమెయిల్ పంపిస్తుంటాయి. కానీ, ఇలాంటి ప్రమోషనల్ ఆఫర్లు చాలా మటుకు స్పామ్ ఫోల్డర్లోకి వెళ్లిపోవడమో లేదా ఇతరత్రా మెయిల్స్‌లో కలిసిపోవడమో జరుగుతుంది. దీంతో అవి మన దృష్టికి రావు. ఇక, ఆయా సంస్థలు తమ వెబ్సైట్లలో కూడా ఆఫర్ల గురించి వివరాలు పొందుపరుస్తుంటాయి. అయితే.. రెండో, మూడో కార్డులు ఉన్నాయంటే ప్రతిసారీ అన్ని వెబ్సైట్లలోకి వెళ్లి వాటిపై ఉన్న ఆఫర్లు చూసుకోవాలంటే బద్ధకిస్తుంటాం.
దీని వల్ల కూడా కొన్ని ఆఫర్లు మిస్ అవుతుంటాం. అయితే క్రెడిట్ కార్డు కంపెనీలు పంపే ఆఫర్లన్నీ కూడా మనకు అనువుగా ఉంటాయని చెప్పలేం. వేరే ఎవరికో ఉపయోగపడే ఆఫర్లు మనకు రావడం.. మనకి ఉపయోగపడేవి వేరే ఎవరికో ఇవ్వడమూ జరుగుతాయి.
జస్ట్ మిస్: ఒకోసారి మనం ఏదైనా కొనుక్కున్న తర్వాతో లేదా సర్వీసు పొందిన తర్వాతో దానిపై ఆఫర్ ఉందన్న సంగతి తెలుస్తుంది. ఆఫర్ సమాచారం ఆలస్యంగా అందడమో లేదా అందినా మనం సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనో ఇలాంటివి జరుగుతాయి. దీంతో ఆఫర్ కొద్దిలో మిస్సయ్యిందే అని బాధేస్తుంది.
సరైన సమాచారం లేకపోవడం: హోటల్స్, సూపర్మార్కెట్లు మొదలైన చోట్ల నిర్దిష్ట కార్డులతో బిల్లు కడితే కొంత డిస్కౌంటు లభిస్తుంటుంది. కానీ హోటల్లో వెయిటరో లేదా సూపర్ మార్కెట్ బిల్లింగ్ కౌంటర్లో ఉన్న వారో ఇలాంటి విషయాలు వివరించి చెప్పే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. పోనీ అలాగని బిల్లింగ్ కౌంటరు లైన్లో నుంచుని ఉన్నప్పుడు ఆఫర్ల గురించి ఇంటర్నెట్లో వెతుక్కుంటూ కూర్చునే పరిస్థితి కూడా ఉండదు. ఫలితంగా ఆఫర్ ఉన్నా ఉపయోగించుకోలేము.
మిస్ కాకుండా ఉండాలంటే..
ఇలాంటివన్నీ కూడా మన చేతుల్లో లేని విషయాలు. అయితే, ఆఫర్లు మిస్ కాకుండా చూసుకునేందుకు మన ప్రయత్నంగా చేయతగ్గవి కొన్ని ఉన్నాయి. సరైన సమయంలో సరైన ఆఫర్ గురించి సరైన సమాచారం చేతిలో ఉండటమనేది మంచి షాపింగ్ అనుభూతికి సీక్రెట్ ఫార్ములా. ఇందుకోసం ప్రస్తుతం స్మార్ట్ఫోన్లు, మొబైల్ యాప్స్ అందుబాటులో ఉన్నాయి.
మన క్రెడిట్ కార్డులపై ఉన్న ఆఫర్ల సమాచారాన్నంతటిని క్రోడీకరించి.. మనకు ఉపయోగపడే వాటిని గురించి తెలియజేసే యాప్స్ కూడా ఉన్నాయి. మనం ఉన్న ప్రదేశాన్ని ట్రాక్ చేసి, పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి ఇట్టే తెలియజేస్తాయివి. మరికొన్ని యాప్స్ మరో అడుగు ముందుకేసి... మీ అభిరుచులు, ఖర్చుల తీరుతెన్నులను విశ్లేషించి మీకు అత్యధికంగా ఉపయోగపడే ఆఫర్లను హైలైట్ చేసి చూపిస్తాయి కూడా.
ఉదాహరణకు మీరు మంచి భోజన ప్రియులైతే దగ్గర్లోని రెస్టారెంట్లలో ఆఫర్ల గురించి చెప్పే యాప్‌లు ఉన్నాయి. అలాగే మీరు సినిమాలు ఇష్టపడే వారైతే.. సమీపంలో థియేటర్లలో ఏ క్రెడిట్ కార్డుతో టికెట్ బుక్ చేసుకుంటే ఏ ఆఫరు ఉందో మరికొన్ని యాప్‌లు చెబుతాయి. ఇలా టెక్నాలజీని కాస్త ఇంటె లిజెంట్గా ఉపయోగించుకుంటే.. కార్డుల ప్రయోజనాలను పూర్తిగా పొందే వీలుంటుంది.
- రాహుల్ పారిఖ్
హెడ్, ఆదిత్య బిర్లా,మనీ మై యూనివర్స్