తాటి తీయండి!
ఇంట్లో పెద్దలందరూ చిన్నవాళ్లైపోండి.గుర్తుందా...చిన్నప్పడు వేసవికాలంతాటి చెట్టు కింద ముంజెలుకోయించుకోవడం...బొటనవేలిని దూర్చిజుర్రుకుని తినడం...ఆ జ్ఞాపకాల రుచిని ఇప్పుడునెమరు వేసుకోవడం..! అవే తాటి ముంజెలతో ఇక కూరలు, కుర్మాలు, బజ్జీలు, పాయసాలు చేయండి. మళ్లీ బాల్యం లొట్టలేసేలా ‘తాటి’ తీయండి.
తాటిముంజెల పాయసం
కావల్సినవి: కాచినపాలు లేదా కొబ్బరి పాలు – కప్పు; తాటి ముంజెలు – 3; పంచదార – టేబుల్ స్పూన్; బాదం పప్పు పొడి – టీ స్పూన్; యాలకుల పొడి – చిటికెడు; రోజ్ ఎసెన్స్ – తగినంత
తయారీ: తాటిముంజెల పైన పొట్టు తీసి, శుభ్రం చేయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. (కొన్ని ముక్కలు తీసి పక్కన ఉంచాలి) మిక్సర్జార్లో తాటిముంజల ముక్కలు, పంచదార వేసి బ్లెండ్ చేయాలి. పాలు కాచి, చల్లార్చి ముంజెల ముద్దలో పోసి, యాలకుల పొడి, బాదాంపప్పు పొడి, రోజ్ ఎసెన్స్ వేసి ఒకసారి బ్లెండ్ చేయాలి. గిన్నెలో లేదా గ్లాస్లో పోసి మిగిలిన ముంజెల ముక్కలు వేసి కలిపి, ఫ్రిజ్‌లో 2 గంటలు ఉంచి, చల్లగా అందించాలి. ఎక్కువ తీపిని ఇష్టపడేవారు మరికాస్త పంచదారను కలుపుకోవచ్చు.
తమిళంలో నుంగు, కన్నడలో తాటి నింగు, బెంగాల్లో తాల్, మలయాలంలో పాననంగు, ఉర్దూలో ముంజల్.. ఇలా ప్రాంతాన్ని బట్టి తాటి ముంజెలకు పేరుంది. ఏ ప్రాంతంలో ఏ పేరున్నా దీన్ని వండితే మాత్రం అమోఘమైన రుచి. తాటి కల్లు తాగితే మైకం కమ్మేస్తుంది. తాటి ముంజెల వంట తింటే నాలుక మతి పోతుంది. మొత్తానికి ఈ వేసవికి భలే పసందైన విందు అనిపిస్తుంది.
తాటిముంజెల కుర్మా
కావల్సినవి: తాటిముంజెలు – 5; నవ్వుల జీడిపప్పు పేస్ట్ – అర కప్పు; కారం – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; కొత్తిమీర తరుగు – టీ స్పూన్; అల్లం వెలుల్లి›్లపేస్ట్ – టీ స్పూన్; ఉల్లిపాయలు – టొమాటోలు – 2 (పెద్దముక్కలుగా కట్ చేయాలి)
నూనె – టేబుల్ స్పూన్; పెరుగు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూన్; క్యారెట్ తురుము – అర కప్పు; పసుపు – చిటికెడు; పోపుదినుసులు – టీ స్పూన్
తయారీ: ముంజెలలో కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి కలిపి పక్కన ఉంచాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక పోపుదినుసులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేపాలి. దీంట్లో అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి కలపాలి. తర్వాత క్యారెట్, టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. దీంట్లో కొద్దిగా నీళ్లు పోసి కలిపి, ఉడకనివ్వాలి. తర్వాత నువ్వుల జీడిపప్పు పేస్ట్, పెరుగు కలపాలి. ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు వేయాలి. కొద్దిగా కారం, పసుపు, గరం మసాలా, మరి కొద్దిగా నీళ్లు కలపాలి. బాగా ఉడికిన తర్వాత సిద్ధంగా ఉంచుకున్న ముంజలను వేసి కలపాలి. ముదురు ముంజెలు అయితే కొద్దిగా నూనెలో వేయించి కలుపుకోవాలి. మిశ్రమం బాగా ఉడికి చిక్కబడ్డాక కొత్తిమీర వేసి మూత పెట్టాలి. మరో 2 నిమిషాలు ఉంచి దించాలి.
తాటిముంజెల పొట్టు కూర
కావల్సినవి: తాటిముంజెల పొట్టు – కప్పు; మునక్కాడ ముక్కలు – 4; పచ్చిమిర్చి – 4; కరివేపాకు – రెమ్మ; పసుపు – చిటికెడు, మినప్పప్పు – టీ స్పూన్; ఎండుమిర్చి – 1; కొత్తిమీర – కొన్ని ఆకులు; వెల్లుల్లి – 4 రెబ్బలు(పలుకులు చేయాలి); జీలకర్ర – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; కారం – తగినంత
తయారీ: కడాయిలో రెండు కప్పుల నీళ్లు, ముంజెల పొట్టు, మునక్కాడలు, పసుపు వేసి, ఉడికించి, వడకట్టాలి. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనెలో జీలకర్ర, మినప పప్పు, ఎండుమిర్చి వేయించాలి. వెల్లుల్లి, కరివేపాకు, పసుపు, ముంజెల పొట్టు, మునక్కాడలు వేసి కలపాలి. దీంట్లో ఉప్పు, కారం చల్లి 5 నిమిషాలుంచి, కొత్తిమీర చల్లి దించాలి.
తాటిముంజెల బజ్జీలు
కావల్సినవి: తాటిముంజెలు – 5; శనగపిండి – అర కప్పు; ఉప్పు – తగినంత; బేకింగ్ సోడా – చిటికెడు; కొత్తిమీర – కొన్ని ఆకులు
తయారీ: పైన పొట్టు తీసి తాటి ముంజెలను శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక్కో ముంజెను రెండుగా ముక్కలు చేయాలి. గిన్నెలో శనగపిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలపాలి. దీంట్లో తగినన్ని నీళ్లు పిండి జారుగా కలుపుకోవాలి. పొయ్యిమీద కడాయి పెట్టి దాంట్లో ముంజెలను వేయించడానికి తగినంత నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధంగా ఉంచిన ముంజెలను శనగపిండిలో ముంచి, వీటిని కాగుతున్న నూనెలో వేసి, రెండువైపులా బంగారు రంగు వచ్చేంతవరకు వేయించాలి. వీటిని టొమాటో సాస్‌తో వేడి వేడిగా వడ్డించాలి.
తాటిముంజెల కొబ్బరి కూర
కావల్సినవి: తాటిముంజెల ముద్ద – కప్పు; కొబ్బరి బోండాంలోని లేత కొబ్బరి – అర కప్పు; నువ్వుల పొడి – టేబుల్ స్పూన్లు; నూనె – 2 టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి ముద్ద – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; ఉల్లిపాయల తరుగు – పావు కప్పు; కసూరి మేథీ – అర టీ స్పూన్; అల్లం–వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; గరం మసాలా – టీ స్పూన్; పసుపు – చిటికెడు; కొత్తిమీర – కొద్దిగా; టొమాటో ముక్కలు – పావు కప్పు; చింతపండు గుజ్జు – టేబుల్ స్పూన్; జీలకర్ర, ఆవాలు– టీ స్పూన్; కరివేపాకు – రెమ్మ
తయారీ: మూకుడులో నూనె పోసి కాగాక జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు వేయించుకోవాలి. పసుపు వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. ఇది కాస్త వేగాక కరివేపాకు, గరం మసాలా, కసూరీ మేథీ కలపాలి. తర్వాత పచ్చిమిర్చి ముద్ద వేసి కలపాలి. టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. టొమాటో మగ్గాక కొబ్బరి ముద్ద వేసి కలపాలి. దీంట్లో నువ్వుల పొడి వేసి, కొద్దిగా నీళ్లు కలపాలి. తాటిముంజెలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలు వేసి కలపాలి. 2 టేబుల్ స్పూన్ల చింతపండు గుజ్జు, ఉప్పు వేసి కలపాలి. కూర పూర్తిగా ఉడికాక కొత్తిమీర వేసి మూతపెట్టి పొయ్యి మీద నుంచి దించాలి.