ఈసారి కూడా ఓడిస్తాం: పాకిస్తాన్‌కు అమెరికా వార్నింగ్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. గ్రూప్-‘ఎ’ నుంచి పాకిస్తాన్- అమెరికా జట్లు మంగళవారం ముఖాముఖి తలపడనున్నాయి. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ ఇందుకు వేదిక.షెడ్యూల్ ప్రకారం పాక్- అమెరికా మధ్య రాత్రి ఏడు గంటలకు మ్యాచ్ ఆరంభమవుతుంది. ఈ నేపథ్యంలో అమెరికా ఆటగాడు మొహమ్మద్ మొహ్సిన్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత ప్రపంచకప్ టోర్నీలో పాక్‌ను తాము ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. ఈసారి కూడా ఓడిస్తాంపాక్తో మ్యాచ్‌కు ముందు మొహమ్మద్ మొహ్సిన్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియాతో గత మ్యాచ్‌లోని సానుకూల అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతాము. ఇక పాకిస్తాన్‌ను ఇప్పటికే ఒకసారి మేము ఓడించాము. కాబట్టి మాకంటే కూడా వారి మీద ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఎందుకంటే ఈ ప్రపంచకప్ టోర్నీలో మేము పెద్దగా కోల్పోయేదీ ఏమీ ఉండదు. ప్రస్తుతం మా ఈ ప్రయాణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తున్నాము. టోర్నీని మేము మెరుగ్గానే ఆరంభించాము. పాకిస్తాన్‌పై మరోసారి గెలుస్తామనే అనుకుంటున్నాం.మా జట్టు నైపుణ్యాలు గల ఆటగాళ్లతో కూడి ఉంది. గతంలో కంటే ఇప్పుడు మరింత పటిష్టంగా ఉంది. అందుకే పాక్‌ను ఓడిస్తామనే నమ్మకం పెరిగింది. గత వరల్డ్‌కప్‌లో వారిపై గెలిచినందుకే ఈ ఆత్మవిశ్వాసం. గత మ్యాచ్ కంటే ఈసారి రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతాము’’ అని మొహ్సిన్ పేర్కొన్నాడు. కాగా మొహ్సిన్ పాక్‌లో పుట్టి పెరిగిన ఆటగాడు కావడం విశేషం.సంచలన విజయం కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ లీగ్ దశలో అమెరికా పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించింది. నాడు డల్లాస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏడు వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా.. అమెరికా కేవలం మూడు వికెట్లే నష్టపోయి 159 పరుగులు సాధించింది.ఫలితంగా మ్యాచ్ టై కాగా సూపర్ ఓవర్ నిర్వహించగా.. పాక్‌పై అమెరికా గెలుపొందింది. దీంతో అమెరికా తొలిసారి సూపర్-8కు చేరగా.. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 7న మొదలైన టీ20 వరల్డ్‌కప్-2026లో సల్మాన్ ఆఘా సారథ్యంలోని పాక్ నెదర్లాండ్స్‌ను ఓడించి బోణీ కొట్టగా.. మొనాంక్ పటేల్ కెప్టెన్సీలోని అమెరికా టీమిండియాకు గట్టిపోటీనిచ్చి ఓటమిపాలైంది. చదవండి: T20 WC 2026: బీసీసీఐ కీలక నిర్ణయం