breaking news
mission raftaar
-
స్పీడ్ పెరిగింది.. ట్రైన్ జర్నీ తగ్గింది!
న్యూఢిల్లీ: ఢిల్లీ- ముంబై మధ్య ప్రయాణించే ప్రయాణికులు మునుపటి కంటే 5గంటలు ముందుగానే తమ గమ్య స్థానానికి చేరుకోవచ్చు. ఎందుకంటే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని గంటకు 130 కిలోమీటర్ల నుంచి 160 కిలోమీటర్లకు పెంచాలని భారత రైల్వే సంస్థ యోచిస్తోంది. వేగాన్ని పెంచడంతో ప్రస్తుతం 15.5 గంటలు ఉన్న ప్రయాణ సమయం 10 గంటలకు తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత, మిషన్ రఫ్తార్లో భాగంగా ముంబై- ఢిల్లీ మధ్యలో నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని, దీంతో ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గుతుందని పశ్చిమ రైల్వే ఒక ట్వీట్లో పేర్కొంది. భారత రైల్వే సంస్థ తన 100 రోజుల కార్యాచరణలో భాగంగా, ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా మార్గాల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించాలని ప్రతిపాదించింది. ఇందుకుగాను ‘మిషన్ రఫ్తార్’ను 2016-17 రైల్వే బడ్జెట్లో మొదటగా ప్రకటించారు. సరుకు రవాణా రైళ్ల సగటు వేగాన్ని రెట్టింపు చేయడం, రానున్న 5 సంవత్సరాలలో నాన్- సబర్బన్ ప్రయాణీకుల రైళ్ల సగటు వేగాన్ని 25 కిలోమీటర్ల మేర పెంచడం ఈ మిషన్ ప్రధాన ఉద్దేశం. 'మిషన్ రఫ్తార్' కింద వేగం పెంచడానికి స్వర్ణ చతుర్భుజితోపాటు ఆరు ప్రధాన మార్గాలైన ఢిల్లీ- ముంబై, ఢిల్లీ- హౌరా, హౌరా- చెన్నై, చెన్నై- ముంబై, ఢిల్లీ- చెన్నై, హౌరా- ముంబైలను లక్ష్యంగా చేసుకొంది. భారత రైల్వే సంస్ధ గుర్తించిన ఈ ఆరు మార్గాలలో 58 శాతం సరుకు రవాణా, 52 శాతం కోచింగ్ ట్రాఫిక్‌ను, 16 శాతం నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. -
రైల్వే ఉద్యోగులకు విదేశాల్లో శిక్షణ
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత వేగంగా నడిచే రైళ్లను ప్రవేశపెట్టే ముందు రైల్వే శాఖ తమ సిబ్బందిని శిక్షణ నిమిత్తం విదేశాలకు పంపిస్తోంది. ‘మిషన్ రాఫ్తార్’లో భాగంగా దాదాపు 500మంది అనుభవమున్న ట్రాఫిక్, ఎలక్ట్రికల్ ఉద్యోగులు చైనా, జపాన్ దేశాలకు వెళ్లనున్నారు. వీరంతా ఇప్పుడున్న గంటకు 120కిలోమీటర్ల వేగంతో నడుస్తున్న రైళ్ల వేగాన్ని గంటకు 200కి.మీ వేగంతో నడిపేలా నైపుణ్యం సాధించనున్నారు. శిక్షణ కాలం జపాన్‌లో రెండు వారాలు, చైనాలో ఇరవై రోజులు. అక్కడ హై స్పీడ్ రైళ్లు నడపడం, నిర్వహణ వంటి అంశాలపై తర్ఫీదు పొందనున్నారు. ఇప్పటికే మొదటి దఫా 40మంది చైనాలో, 20మంది జపాన్‌లో శిక్షణ పూర్తిచేసుకున్నారు. ముఖ్యంగా అత్యంత రద్దీగా ఉండే ఢిల్లీ–హౌరా, ఢిల్లీ–ముంబై వంటి మార్గాల్లో ఈ హైస్పీడ్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని రైల్వే యోచిస్తోంది. హైస్పీడ్ రైళ్లు ఉపయోగించటం వల్ల సమయం ఆదాతో పాటు, ఎక్కువ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.