breaking news
ministers in queue
-
మంత్రులే క్యూ కట్టిన వేళ...
-
మంత్రులే క్యూ కట్టిన వేళ...
సాధారణంగా మంత్రులను ఎవరైనా కలవాలంటే వాళ్ల పేషీల దగ్గర, ఇళ్ల దగ్గర క్యూలో నిలబడాల్సి ఉంటుంది. కానీ, సోమవారం శంషాబాద్ విమానాశ్రయంలో అరుదైన దృశ్యం కనిపించింది. రియో ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మిటన్ సింగిల్స్ విభాగంలో రజత పతకం సాధించిన పీవీ సింధు, ఆమెను తీర్చిదిద్దిన కోచ్ పుల్లెల గోపీచంద్ ఇద్దరూ బ్రెజిల్ నుంచి వస్తున్నారు. వాళ్లకు స్వాగతం పలికేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురు మంత్రులు క్యూలో నిలబడ్డారు. విమానాశ్రయంలో సాధారణంగా విదేశాల నుంచి వచ్చేవాళ్ల కోసం 'ఇంటర్నేషనల్ అరైవల్స్' ద్వారం ఉంటుంది. సింధు, గోపీ తదితరులను మాత్రం ప్రత్యేకంగా అత్యవసర ద్వారం మీదుగా తీసుకొచ్చారు. సింధు తండ్రి పీవీ రమణ స్వయంగా లోపలకు వెళ్లి.. వాళ్లను తొడ్కొచ్చారు. విమానం దిగిన విషయం, సింధు వస్తున్న విషయం తెలియగానే అప్పటివరకు లాంజ్‌లో కూర్చున్న మంత్రులంతా ఒక్కసారిగా అప్రమత్తమై.. ఆ ద్వారం వెలుపల ఒకరి తర్వాత ఒకరు వరుసగా నిల్చుని చేతుల్లో పూలబొకేలు పట్టుకున్నారు. అత్యంత పటిష్ఠమైన భద్రత నడుమ బయటకు వచ్చిన సింధు అతి కొద్దిమంది ప్రముఖుల నుంచి మాత్రమే బొకేలు తీసుకుంది. సీఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు కూడా ఆమెకు భద్రతావలయం ఏర్పాటుచేసి, ఆమెను త్వరత్వరగా ఓపెన్ టాప్ బస్సు వద్దకు తీసుకెళ్లిపోయారు.