breaking news
Minister p.narayana
-
కారు అద్దె రూ.2.3 లక్షలు!
* మంత్రి ఓఎస్డీ కారుకు అద్దె చెల్లించేందుకు కార్పొరేషన్ తీర్మానం * ప్రతి నెలా బిల్లు చెల్లించేందుకు నిర్ణయం సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి పి. నారాయణ ఓఎస్డీ వాడుతున్న కారుకు అద్దె చెల్లించడానికి కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఐదు నెలలుగా బకాయి ఉన్న రూ.2,30,800 చెల్లించేందుకు మేయర్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన సోమవారంజరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో తీర్మానించారు. వివరాల్లోకెళితే మంత్రి నారాయణ ఓఎస్డీకి ప్రొటోకాల్ విభాగం ఒక వాహనం ఏర్పాటు చేసింది. కారు అద్దెను ప్రొటోకాల్ నిధుల నుంచి జిల్లా కలెక్టర్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మున్సిపల్ శాఖ మంత్రి ప్రొటోకాల్ కింద వాహనం ఏర్పాటు చేసినందువల్ల కారుకు సంబంధించిన అద్దె మీరే చెల్లించాలని జిల్లా కలెక్టర్ మార్చి 28వ తేదీ కార్పొరేషన్ కమిషనర్‌కు లేఖ రాశారు. ఈ కారు ప్రొటోకాల్ విభాగం ఏర్పాటు చేయాల్సి ఉన్నందువల్ల అద్దె కూడా ఆ విభాగమే చెల్లించాలని అధికారులు మూడు నెలలుగా నిధులు చెల్లించలేదు. అటు అధికారులు, ఇటు పాలక వర్గం మీద ఒత్తిడి తీవ్రం కావడంతో సోమవారం నాటి స్టాండింగ్ కమిటీ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. నవంబరు 2015 నుంచి మార్చి 2016వరకు మంత్రి ఓఎస్డీ ఉపయోగించిన ఏపీ 26 ఎఎం 3389 కారు అద్దె కింద రూ.2,30,800 చెల్లించాలని స్టాండింగ్ కమిటీ అధికారులను ఆదేశించింది. ఇకపై ప్రతి నెలా ఈ కారు అద్దె కార్పొరేషన్ భరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వివాదం నుంచి బయటపడటానికి కార్పొరేషన్ అధికారులు తాము మంత్రి ఓఎస్డీ కారుకు చెల్లిస్తున్న అద్దెను ప్రతి నెతా తమకు వెనక్కు ఇవ్వాలని ప్రొటోకాల్ విభాగానికి లేఖ రాయాలని నిర్ణయించారు. మంత్రి ఓఎస్డీ కారుకు చెల్లించిన అద్దె గోడకు కొట్టిన సున్నం మళ్లీ వెనక్కు వస్తాయా? అని కార్పొరేషన్ అధికారులే చెబుతున్నారు. స్వర్ణభారత్ ట్రస్ట్‌కు 18 సెంట్ల స్థలం రిత్విక్ లేఅవుట్లో కార్పొరేషన్ 18 సెంట్ల స్థలాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి చెందిన స్వర్ణభారత్ ట్రస్ట్‌కు అప్పగించేందుకు స్టాండింగ్ కమిటీలో నిర్ణయించారు. కంటి, దంత వైద్యశాలను నిర్మించి సదరు భవనాన్ని తిరిగి కార్పొరేషన్‌కు అప్పగించనున్నారు. కాగా పైపుల్లేని శివారు ప్రాంతాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్న ట్యాంకర్ల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందంటూ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో పైప్లైన్లను వేయిస్తామని మేయర్ పేర్కొన్నారు. -
‘నారాయణ’పై గరం గరం
జిల్లా వ్యాప్తంగా విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఒంగోలు టౌన్ : నారాయణ విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర మంత్రి పి.నారాయణను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు. గడిచిన 15 నెలల్లో నారాయణ కళాశాలల్లో 11 మంది విద్యార్థులు మృతి చెందినా ప్రభుత్వం స్పందించకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ ఒంగోలు నగర శాఖ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కొత్త కూరగాయల మార్కెట్ మీదుగా నారాయణ దిష్టిబొమ్మతో ప్రదర్శనగా బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మానవహారంగా ఏర్పడి అరగంటపాటు నినాదాలు చేశారు. దీంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. పోలీసులు సర్దిచెప్పి ఆందోళన విరమింపజేశారు. ముందుగా విద్యార్థులను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.కిరణ్, నగర కార్యదర్శి పి.రాంబాబు, ఐద్వా నగర కార్యదర్శి కె.రమాదేవి మాట్లాడుతూ.. నారాయణ విద్యా సంస్థలు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని ధ్వజమెత్తారు. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఒత్తిడి తట్టుకోలేకే కడపలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నారాయణను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు సీహెచ్ వినోద్, నాయకులు చిన్నపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్‌యూ ఆధర్యంలో దిష్టిబొమ్మ దహనం కడప నారాయణ విద్యా సంస్థల్లో ఇద్దరు ఇంటర్ విద్యార్థినుల ఆత్మహత్యకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ పీడీఎస్‌యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌కు సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నారాయణ విద్యా సంస్థల దిష్టిబొమ్మ ద హనం చేశారు. గుర్తింపులేని నారాయణ విద్యా సంస్థలను రద్దు చేయాలని, నారాయణను మంత్రి వర్గం నుంచి తొలగించాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్యామ్, నాయకులు జీవన్, తరుణ్, పీవైఎల్ నాయకుడు నాగరాజు, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో.. ఒంగోలు : కడప నారాయణలో విద్యార్థినుల మృతిని నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవార ం బంద్ నిర్వహించారు. స్థానిక మంగమూరు డొంకలోని ఓ ప్రైవేట్ కళాశాల సిబ్బందికి, ఏబీవీపీ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకుని కళాశాలకు సెలవు ప్రకటించడంతో ఏబీవీపీ విద్యార్థులు వెనుదిరిగారు. ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి విష్ణు మాట్లాడుతూ.. కడపలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారం కారణమని చెప్పడం సిగ్గుచేటన్నారు. సెలవు దినాల్లో సైతం కాలేజీలు నిర్వహించడం వల్లే ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు వంశీ, రాజేష్, సుదీర్, మణి, అన్వేష్, నరసారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, హేమంత్, గణేష్, విజయ్ పాల్గొన్నారు.