breaking news
medal tally
-
ఝండూ పవర్
గ్లాస్గో: పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్య పతకంతో బోణీ చేస్తూ కామన్వెల్త్ క్రీడల పతకాల జాబితాలో భారత్ కూడా చేరింది. పురుషుల హెవీ వెయిట్ కేటగిరీలో భారత్‌కు చెందిన ఝండూ కుమార్ కాంస్యం (130.9 పాయింట్లు) సొంతం చేసుకున్నాడు. ఈ పోటిల్లో భారత్‌కు ఇదే తొలి పతకం తన రెండో ప్రయత్నంలో 190 కేజీల బరువెత్తి ఝండూ కుమార్ మూడో స్థానంలో నిలిచాడు. మొదటి ప్రయత్నంలో 181 కేజీల బరువెత్తిన అతను రెండో ప్రయత్నంలో దానిని మరింత మెరుగుపర్చుకున్నాడు. చివరి ప్రయత్నంలో 196 కేజీల కోసం ప్రయత్నించినా అతను విఫలమయ్యాడు. ఈ ఈవెంట్లో రిలువాన్ ఇద్రీస్ (208 కేజీలు; నైజీరియా) స్వర్ణం గెలుచుకోగా, మాథ్యూ హార్డింగ్ (199 కేజీలు; ఇంగ్లండ్)కు రజతం దక్కింది. ఇదే విభాగంలో పోటీ పడిన మరో ఆరుగురు భారత పవర్‌లిఫ్టర్లు పతకం సాధించడంలో విఫలమయ్యారు. పారా పవర్ లిఫ్టింగ్ పురుషుల లైట్ వెయిట్ విభాగంలో భారత్ లిఫ్టర్ అశోక్ కుమార్ నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకున్నాడు. ఇతర ఫలితాలు→ భారత బాక్సర్ సచిన్ సివాచ్ (62 కేజీలు) 4–1తో అహ్మదీ (కెనడా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నాడు. → మహిళల బౌల్స్ పెయిర్ ఈవెంట్లో భారత జోడి రూపా రాణి – పింకీ సింగ్ ‘టైబ్రేకర్’లో టోంగాపై గెలిచింది. → పురుషుల స్విమ్మింగ్ (400 మీ. ఫ్రీస్టయిల్)లో భారత స్విమ్మర్లు ఫైనల్‌కు అర్హత సాధించడంలో విఫలమయ్యారు. దక్షణ్ శశికుమార్ 15వ, ఆర్యన్ 6వ స్థానంతో ముగించారు. → మహిళల 3X3 వీల్ చెయిర్ బాస్కెట్‌బాల్ ఈవెంట్ తొలి మ్యాచ్‌లో భారత్ 1–16 తేడాలో వేల్స్ చేతుల్లో చిత్తుగా ఓడింది. → పురుషుల బౌల్స్ ఈవెంట్ సింగిల్స్‌లో భారత ఆటగాడు పుతుల్ సోనోవాల్ 4–8, 8–9 స్కోరుతో ఇజ్జత్ జుల్కెప్లె (మలేసియా) చేతిలో ఓడాడు. దక్షిణాఫ్రికా స్విమ్మర్ చాడ్ లి క్లోజ్ ఖాతాలో 19వ కామన్వెల్త్ పతకం చేరింది. తద్వారా ఈ పోటీల్లో అత్యధిక పతకాలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. గతంలో ఈ రికార్డు షూటర్లు ఫిల్ ఆడమ్స్, గౌల్ట్ (18 పతకాలు) పేరిట ఉంది.అవమాన కుమార్!!! అతని అసలు పేరు అవినాశ్ కుమార్. అయితే ఐదేళ్ల వయసులో పోలియోబారిన పడి నడుం కిందిభాగం చచ్చుబడిపోయింది. ‘నువ్వు తండ్రికి భారంగా పుట్టావు. అతడి పరువు తీశావు’ అంటూ కొందరు బంధువులు ఝండ్ (అవమానం) అంటూ పిలవడం మొదలుపెట్టారు. చిన్నప్పుడు రికార్డుల్లో కూడా ఇదే పేరు నమోదు కావడంతో చివరకు అసలు పేరు పోయి అతను ఝండూ కుమార్‌గా మారాడు! స్వస్థలం బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లా హర్నౌత్. తండ్రి కూరగాయలు అమ్మగా వచ్చే ఆదాయంతో జీవనం సాగే పరిస్థితుల్లో అతను చిన్నప్పటి నుంచి ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. అయితే కఠోర శ్రమతో, పట్టుదలతో వాటిని అధిగమించాడు. కుటుంబ పోషణకు తాను కూడా కూరగాయాలు అమ్మాడు. ఉదయం 4 గంటలకే 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి హోల్‌సేల్ మార్కెట్లో కూరగాయలు తెచ్చుకొని హర్నౌత్లో ఫుట్‌పాత్‌పై అమ్మడం అతని రోజూవారీ దినచర్య. 4 గంటల వరకు అమ్మకం ముగించి ఆ తర్వాత జిమ్‌కు వెళ్లడం, ప్రాక్టీస్ చేయడంతోనే పవర్‌లిఫ్టింగ్‌లో అతను రాటుదేలాడు. కాళ్లు లేకపోయినా శారీరక సౌష్టవం పెంచుకోగలననే నమ్మకంతో తన ట్రైసైకిల్‌ను దాదాపు కిలోమీటర్ తోసుకుంటూ జిమ్‌కు వెళ్లి ఝండూ సాధన చేశాడు. అయితే ఆర్థిక సమస్యలు మరింత పెరగడంతో బ్యాటరీ ఈ–రిక్షా నడిపి కొంత ఆదాయం పొందే ప్రయత్నం చేశాడు. గాందీనగర్‌లోని స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సెంటర్లో అవకాశం లభించడంతో అతని జీవితం మారింది. ఏడాది క్రితం 205 కిలోల బరువెత్తి కొత్త జాతీయ రికార్డు సాధించిన ఝండూ ఆ తర్వాత 206 కేజీలతో దానిని సవరించాడు. ప్రపంచ కప్‌లో కాంస్యం, ఆసియా ఓషియానియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన ఝండూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఐదో స్థానంలో నిలిచాడు. -
ఎనిమిదో స్థానంలో భారత్
ఉత్సాహంగా జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో భారతదేశం ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇంచియాన్‌లో జరుగుతున్న ఈ క్రీడల్లో మూడు నాలుగు రోజుల ముందువరకు భారత క్రీడాకారుల ఆటతీరు పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా వరుసపెట్టి స్వర్ణపతకాలు సాధిస్తూ క్రమంగా పతకాల పట్టికలో దేశం స్థానాన్ని పైకి తీసుకొచ్చారు. భారత దేశానికి ఇప్పటివరకు 11 స్వర్ణ పతకాలు, 10 రజత పతకాలు, 36 కాంస్య పతకాలు వచ్చాయి. మొత్తం 57 పతకాలు భారత ఖాతాలో పడ్డాయి. ఉత్తర కొరియా జట్టుకు 11 స్వర్ణాలు వచ్చి మొత్తం 36 పతకాలే ఉన్నా, రజత పతకాలు మాత్రం మనకంటే ఒకటి ఎక్కువగా 11 రావడంతో ఆ దేశం ఏడో స్థానంలో ఉంది. 149 స్వర్ణ పతకాలు, 107 రజత పతకాలు, 81 కాంస్య పతకాలు కలిపి మొత్తం 337 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా, జపాన్ దేశాలు 228, 195 పతకాలతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత జట్టు హాకీ, కబడ్డీ పోటీలలో స్వర్ణపతకాలు సాధించడంతో తన స్థానాన్ని మెరుగు పరుచుకోగలిగింది. -
పతకాల పట్టికలో మూడోస్థానం
ఆసియా క్రీడల్లో భారతదేశం మంచి బోణీ చేసింది. పోటీలు ప్రారంభమైన తొలిరోజే ఒక స్వర్ణం, ఒక రజతంతో మూడో స్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే అగ్రస్థానంలో చైనా ఉండగా, రెండో స్థానంలో కొరియా ఉంది. చైనాకు మూడు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం కలిపి నాలుగు పతకాలు లభించాయి. కొరియాకు ఒక స్వర్ణం, రెండు రజత పతకాలతో మొత్తం మూడు పతకాలు వచ్చాయి. భారత్ ఒక స్వర్ణం, ఒక రజతంతో రెండు పతకాలు సాధించింది. వియత్నాంకు కూడా రెండు పతకాలే వచ్చినా.. వాటిలో ఒక్కటీ స్వర్ణం లేదు. ఒక రజతం, ఒక కాంస్య పతకం మాత్రమే వచ్చాయి. దాంతో భారత్‌కు మూడో స్థానం, వియత్నాంకు నాలుగో స్థానం లభించాయి. వియత్నాం తర్వాతి స్థానంలో ఒక పతకంతో మకావు నిలిచింద. ఈ దేశానికి ఒక రజత పతకం లభించింది. ఈసారి ఆసియా క్రీడల్లో టాప్-5లో నిలవాలన్నది భారత జట్టు లక్ష్యంగా కనిపిస్తోంది. చైనా, కొరియా లాంటి దేశాల నుంచి వచ్చే పోటీని తట్టుకుని మరిన్ని అంశాల్లో పతకాలు కొడితే ఆ లక్ష్యం సాధించడం పెద్ద ఇబ్బంది కాబోదు.


